జొయంతో నాథ్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేజర్ జనరల్ (ఆ తరువాత జనరల్, సైన్యాధ్యక్షుడు) జొయంతో నాథ్ చౌదరి కి సికింద్రాబాదు వద్ద లొంగిపోయి హైదరాబాదు రాజ్యపు సైన్యాన్ని అప్పగిస్తున్న మేజర్ జనరల్ ఎల్ ఎద్రూస్ (ఎడమ వైపు)

జనరల్‌ జొయంతో నాథ్ చౌదరి భారత దేశ 8వ పదాతి దళ సైన్యాధ్యక్షుడు. పద్మ విభూషణ పురస్కార గ్రహీత, హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక అధ్యక్షుడు. ఈయన భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షుడు డబ్ల్యూ.సి.బెనర్జీ మనుమడు. ఈయన తండ్రి అమియ నాథ్ చౌధరీ ప్రఖ్యాత బెంగాలీ బారిష్టరు.

చౌదరి ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఉన్న పబ్నా జిల్లాలోని హరీపూర్ లో 1908, జూన్ 10న సంపన్న బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం కలకత్తా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న సెయింట్ జేవియర్ కళాశాలలో, లండన్లోని హైగేట్ పాఠశాలలో, సాంధర్స్ట్‌లోని రాయల్ మిలటరీ కళాశాలలో కొనసాగింది. సాంధర్స్ట్‌లో ఉన్న కాలంలో ఈయన గుబురు మీసాల వలన "ముచ్చూ" అని ముద్దుపేరు కూడా వచ్చింది.

సాంధర్స్ట్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత సైనికాధికారిగా భారతదేశానికి తిరిగివచ్చి మొదటి బటాలియన్ యొక్క నార్త్ స్టాఫర్డ్‌షైర్ దళంలో 1928 మార్చి 19న బాధ్యతలు చేపట్టాడు. 1929 మార్చి 19 న భారత సైన్యంలో స్థానం పొంది ఏడవ లైట్ కావల్రీ దళంలో చేరాడు. 1930 మే 2న లెఫ్టెనెంట్ గా పదవోన్నతి పొందాడు. 1934లో సుగోర్లో అశ్విక శిక్షణ పాఠశాలలో శిక్షణ పొందాడు. 1937 ఫిబ్రవరి 2న కెప్టెన్ అయ్యాడు. 1939 డిసెంబరు నుండి 1940 జూన్ వరకు క్వెట్టా స్టాఫ్ కళాశాలలో శిక్షణ పొందాడు.

జనరల్ చౌదరి నేతృత్వములో 1948 సెప్టెంబరు 12 భారత సైన్యము హైదరాబాదుపై సైనిక చర్య జరిపి నిజాంను గద్దె దించి హైదరాబాదును భారతదేశములో విలీనము చేసుకొన్నది. సెప్టెంబరు 18న ఆపరేషన్ పోలోను విజయవంతమైనదిగా ప్రకటించి మేజర్ జనరల్ చౌదరిని హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక పాలకునిగా నియమించారు.

జనరల్ చౌదరి 1962 నవంబరు 19 నుండి 1966 జూన్ 7 వరకు పదాతి దళ 8వ సర్వసైన్యాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించాడు. సైన్యంలో 38 సంవత్సరాల విశిష్ట సేవకు గాను జనరల్ చౌదరిని భారత ప్రభుత్వము రెండవ అత్యున్నత పౌరసత్కారమైన పద్మవిభూషణ పురస్కారముతో సత్కరించింది.

భారత సైనికదళము నుండి పదవీ విరమణ చెందిన ఆరు వారాల లోపే ఆయన 1966 జూలై 19న కెనడాలో భారత రాయబారిగా నియమితుడయ్యాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైన్యంలో విశిష్ట సేనానిగానే కాకుండా, జనరల్ చౌదరి రచయితగా, సాహిత్య విమర్శకునిగా కూడా ప్రతిభను కనబరిచారు. ఈయన మిలటరీ నేపథ్యములో రెండు పుస్తకాలు వ్రాయటమే కాకుండా ఒక ప్రముఖ భారతీయ దినపత్రికలో సైనిక వ్యవహారాల ప్రతినిధిగా, సాహితీ విమర్శకునిగా పనిచేశాడు. 1983, జూలై 6న 75 యేళ్ళ వయసులో జనరల్ ఛౌదరి పరమపదించాడు.

బయటి లింకులు[మార్చు]