జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు (పద్యసంకలనం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు (పద్యసంకలనం)
జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు
కృతికర్త: సంకలనం
సంపాదకులు: అంబటి భానుప్రకాశ్, మేడిచర్ల హరినాగభూషణం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): పద్య కవిత్వం
ప్రచురణ: గద్వాల సాహితీ ప్రచురణలు
విడుదల: సెప్టెంబర్, 2019
పేజీలు: 72


జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు 2019, సెప్టెంబర్ నెలలో వచ్చిన పద్య కవిత్వ సంకలన పుస్తకం. ఈ పుస్తకం జోగులాంబ గద్వాల జిల్లాలోని పన్నెండు (12) ముఖ్యమైన పుణ్యక్షేత్రాల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ, పన్నెండు (12) మంది పద్యకవులు ఒక్కో క్షేత్రం గురించి తెలియజేస్తూ పద్య ప్రక్రియలో రచించిగా అంబటి భానుప్రకాశ్, మేడిచర్ల హరినాగభూషణంల సంపాదకత్వంలో వెలువడింది. [1]

పుణ్యక్షేత్రాలు-కవులు

[మార్చు]

ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన పుణ్యక్షేత్రాలు వాటి గురించి రాసిన కవులు

ప్రస్తావించబడిన పుణ్యక్షేత్రాలు వాటి గురించి రాసిన కవులు
పుణ్యక్షేత్రం కవి
అలంపూర్ శ్రీజోగులాంబ అంబటి భానుప్రకాశ్
బీచుపల్లి శ్రీఆంజనేయస్వామి బోడ శంకర్
వేణిసోంపూర్ శ్రీకృష్ణస్వామి ఊర ఈశ్వర్ రెడ్డి
మల్దకల్ శ్రీవేంకటేశ్వరస్వామి తూపురాణి వేంకట కృష్ణమాచార్యులు
పాగుంట శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి భూచంద్ర
గద్వాల శ్రీభూలక్ష్మి చెన్నకేశవస్వామి మేడిచర్ల హరినాగభూషణం
జమ్మిచేడ్ జమ్ములమ్మ నాయుడుగారి జయన్న
చింతరేవుల శ్రీఆంజనేయస్వామి పూదత్తు భాస్కర్
సద్దలోనిపల్లి శ్రీకృష్ణస్వామి వెలుదండ సత్యనారాయణ
రాజోలి శ్రీవైంకుఠ నారాయణ స్వామి తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి
బోరవెల్లి శ్రీబంగారు చెన్నకేశవస్వామి ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్
పూడూరు శ్రీవీరభద్రస్వామి వారణాసి నాగేశ్వరాచారి

వివరాలు

[మార్చు]

ఈ పద్యసంకలనంలొ జోగులాంబ గద్వాల జిల్లాలోని 12 పుణ్యక్షేత్రాలను,వాటి చరిత్ర, వైభవం, అక్కడి దేవతామూర్తులను ప్రస్తావిస్తూ పన్నెండు (12) మంది కవులు పద్యాలు రాశారు. ఒక్కో కవి 11 పద్యాల చొప్పున రాశారు. ఈ కవులలో ఇప్పుడిప్పుడే కవిత్వం రాయడం మొదలుపెట్టిన కవుల నుండి అనేక పుస్తకాలను వెలువరించిన అనుభవం ఉన్న కవులు ఉన్నారు. పద్యరూపంలో కవులు క్షేత్రవైభవాలను స్తుతింపగా, అనిమోని మహేందర్, అంబటి భానుప్రకాశ్‌ క్షేత్ర పరిచయాలను సవివరంగా ఈ గ్రంథంలో తెలియజేశారు.

  • పుస్తకం నుండి కొన్ని ఉదాహరణలు:

 
శక్తి పీఠమై నిలిచిన చండి వీవె
బాలబ్రహ్మేశు నాశీస్సు భాగ్యమిడగ,
ఇటనె తొమ్మిది యాలయా లింపు గులక
దిక్కు నీ వంచు మొక్కరే దీన జనులు

--అంబటి భానుప్రకాశ్

 
దక్షిణ దిశగా పారెడు
నక్షయమగు కృష్ణవేణి యద్భుత తటి పై
రక్షింపగ నిలిచె హనుమ
దక్షిణ ముఖ మందిరమున దయ చెలువారన్

--బోడ శంకర్

 
హంపీ క్షేత్రము నందున
సొంపుగ రథయాత్ర జరుగ చొరగన్ మంటల్
సోంపురమందున గాంచుచు
నింపుగ నట నార్పినావె యెల్లరు జూడన్

--ఊర ఈశ్వర్ రెడ్డి

 
శ్రీలు చెలువార కళ్యాణ లీల విరియ
మల్దకల్లు సుక్షేత్రాన మహితముగను
సంకటమ్ముల బాపు శ్రీ వేంకటేశ
విభుడు కొలువుండే మన కెల్ల శుభము లొసగ

--తూపురాణి వేంకట కృష్ణమాచార్యులు

 
వెలసితివిగ నీవు వేంకటా పురమందు
కొలుచు వారి కెట్టి కొదువ లేక
లక్ష్మి తోడ నిలిచి లాలించుచున్నావు
శరణు శ్రీనివాస కరుణ జూడు

--భూచంద్ర

 
శ్రీకరాకార చిన్మయ చిద్విలాస!
చెంత శ్రీదేవి భూదేవి చేరి కొలువ
నిలను గద్వాల కోటలో వెలసినట్టి
చెన్నకేశవ నిన్నునే సన్నుతింతు

--మేడిచర్ల హరినాభూషణం

 
పుట్టితివి గదా తల్లీ
నట్ట నడుమ యేటి మధ్య నగుపడు నేలన్
పుట్టిని నధిరోహించియు
మెట్టితివి నడిమిటి భూమి మేల్గూర్చుటకై

--

 
చింత రేవులందు చిద్విలాసముతోడ
వెలసియున్న భక్త వత్సలుండు
కోరినంత వేగ కోర్కెలు దీర్చేడి
రామదూత మాకు రక్ష రక్ష

--పూదత్తు భాస్కర్

 
మహిని గద్వాల ప్రాంతాన మలదకల్లు
మండలాన స్వయంభువై మహిమ జూపు
స్వామి తల పైన పూవులు, జమ్మి పత్రి
నుంచ జారినన్ బని ఫలియించు నంట

--డా. వెలుదండ సత్యనారాయణ

 
శ్రీ రమణీయ విగ్రహుడ! చిన్మయరూపుడ! శేష వాహనా!
తారకనామ! చక్రధర! దానవ మర్దిన! దేవ వందితా !
పారము జేర్ప రావె నను భవ్య గుణాత్మక! వాసవానుజా!
వారిజ పత్ర నేత్ర! హరి భక్త పరాయణ! భక్తవత్సలా!
భారము నీదె యంటి నిక పాలన జేయవె బ్రోవవే ననున్

--తురిమెళ్ళ రాధాకృష్ణమూర్తి

 
సర్వమున కాయనే ఘనుడుర్వి సామ
మున్నథర్వవేద స్తుతుండున్ననంతు
డద్వితీయ బోరవెల్ల్యాది విష్ణు
చెన్నకేశవస్వామి లక్ష్మి ధవుండు

--డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్

 
శ్రీ వీరభద్ర దేవుడు
సేవింపగ పూజ్యమౌను శివ యోగంబౌ
నే వేళ నైన భక్తుల
కావగ పూడూరు శుభ్ర కర్ముల నెపుడున్

--వారణాసి నాగేశ్వరాచారి

పుస్తకావిష్కరణ

[మార్చు]

ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 22,2019 రోజు గద్వాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బి.ఎస్. కేశవ్ ఆవిష్కరించాడు.[2] వైద్యం వేంకటేశ్వరాచార్యులు అధ్యక్షత వహించగా,[3] వెల్దండ సత్యనారాయణ పుస్తక సమీక్ష చేశారు.

మూలాలు

[మార్చు]
  1. జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు (పద్యసంకలనం);సం. అంబటి భానుప్రకాశ్, మేడిచర్ల హరినాగభూషణం, గద్వాల సాహితీ ప్రచురణలు, గద్వాల,2019
  2. పూర్వవైభవం తెస్తాం సాక్షి,జోగులాంబ గద్వాల జిల్లా టాబ్లాయిడ్,తేది:23.09.2019[permanent dead link]
  3. సాహితీసేవలకు_తోడ్పాటునిస్తాం-ఆంధ్రజ్యోతి| తేది:23.09.2019[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]