జ్వాలాపురం పురాతత్వ స్థలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జ్వాలాపురం పురాతత్వ స్థలం
జ్వాలాపురం పురాతత్వ స్థలం is located in Andhra Pradesh
జ్వాలాపురం పురాతత్వ స్థలం
Shown within Andhra Pradesh
స్థానంజ్వాలాపురం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రాంతందక్కను పీఠభూమి
నిర్దేశాంకాలు15°19′29.1″N 78°07′55″E / 15.324750°N 78.13194°E / 15.324750; 78.13194
చరిత్ర
పీరియడ్‌లుపాత రాతియుగం, కొత్త రాతియుగం
ఘటనలుటోబా అగ్నిపర్వత విస్ఫోటనం
స్థల గమనికలు
తవకాల తేదీలు2003-2010
పురాతత్వవేత్తలురవి కోరిశెట్టర్, బోర జనార్దన, మైకెల్ పెట్రాగ్లియా

జ్వాలాపురం పురాతత్వ స్థలం, అంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, జ్వాలాపురం గ్రామం వద్ద ఉన్న పురాతత్వ ప్రదేశం. వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆధునిక మానవుల ఆధారాలు ఇక్కడ లభించాయి. 75,000 ఏళ్ళ క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో విరజిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు నదీలోయలో పేరుకు పోయింది. ఈ బూడద పొరకు అడుగున, పైనా కూడా ఆధునిక మానవులు వాడిన పనిముట్లు వేలాదిగా లభించాయి. [1] అగ్నిపర్వత విస్ఫోటనంలో వెదజల్లబడిన బూడిద జుర్రేరు ఆనకట్ట నుండి బనగానపల్లె వరకు నదీ తీరం వెంట 9 కిలోమీటర్ల మేర సగటున 1 మీటరు మందాన పేరుకు పోయింది. జ్వాలాపురం చుట్టుపక్కల, సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి. [2]

తవ్వకాలు, ఆవిష్కరణలు[మార్చు]

జ్వాలాపురం వద్ద 2003 నుండి 2010 వరకు అనేక తవ్వకాలు జరిపారు. వీటిలో రెండూ అషూలియన్ ప్రదేశాలు, 7 మధ్య రాతియుగ ప్రదేశాలు, 5 కొత్త రాతియుగ ప్రదేశాలు, 3 రాక్ షెల్టర్లు బయట పడ్డాయి. వీటికి జ్వాలాపురం పేరుమీద JWP అనే ఆదిపదంతో JWP3,JWP9, JWP17, JWP22 వగైరా అని పేర్లు పెట్టారు. ఈ తవ్వకాల్లో టోబా విస్ఫోటనానికి ముందు దాని తరువాత కూడా ఇక్కడ మానవ ఆవాసాలు ఉండేవనే ఆధారాలు లభించాయి.[3]

JWP3 లో తవ్విన కందకంలో బూడిద పొరకు అడుగున మధ్యరాతియుగానికి చెందిన 215 కళాకృతులు లభించాయి. ఇవి 77,000 సంవత్సరాల క్రితం నాటివని తేలింది. ఇదే కందకంలో బూడిదపొరకు పైన కూడా అలాంటివే 108 కళాకృతులు లభించాయి. JWP21 లో బూడిద పొరకు పైన మధ్యరాతియుగం నాటి 131 కళాకృతులు లభించాయి. ఇవి 38,000 సంవత్సరాల నాటివని కనుగొన్నారు.

JWP22 లో 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 6.5 మీటర్ల లోతు వరకు కందకం తవ్వారు. ఈ కందకంలో బూడిద పొరకు కింద 1628 కళాకృతులు లభించాయి. ఇవి దాదాపు 80,000 సంవత్సరాల నాటివని కనుగొన్నారు. [2]ఈ కళాకృతుల ప్రాచీనతను కనుగొనేందుకు ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ ల్యూమినిసెన్స్ (OSL) డేటింగ్ పద్ధతిని వినియోగించారు.

ఈ ప్రదేశాలన్నీ జుర్రేరు నదికి కుడి వైపున ఉన్నాయి.

రాక్ షెల్టర్లు[మార్చు]

జ్వాలాపురం ప్రాంతంలో 5 చిత్రించిన రాక్ షెల్టర్లను కూడా గుర్తించారు. వీటిలో ఒకటైన JWP9 షెల్టరుపై విపులమైన పరిశీలనలు జరిపారు. ఇది 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు ఉన్న క్వార్ట్జైట్ బోల్డరు. ఇది జుర్రేరు నదికి ఎడమ వైపున బనగానపల్లె రోడ్డుకు పక్కన జుర్రేరు ఆనకట్ట నుండి సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంది. ఈ రాతిపై ఆ కాలంలో నివసించిన మానవులు రంగురాతితో చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. ఎండ కారణంగా ఇవి వెలిసిపోయినప్పటికీ ఏనుగు, మనుషులు తదితర ఆకారాలను గుర్తించారు. [4] ఈ రాతి పాదం వద్ద జరిపిన తవ్వకాల్లో 38,000 సంవత్సరాల నాటి పనిముట్లు, రాతిపూసలు, ఎముకతో చేసిన ఈటె లభించాయి. ఇక్కడ లభించిన వస్తువుల్లో ప్రధానమైనది మనిషి పుర్రె. ఇది 20 వేలు - 12 వేలు సంవత్సరాల క్రితం మధ్య కాలానికి చెందినదిగా లెక్కించారు. వీటితో పాటు ఇక్కడ 2732 జంతు అవశేషాలు, 1644 నత్త గుల్లలు కూడా లభించాయి. [2]

జ్వాలాపురం పురాతత్వ స్థలం లోని వివిధ తవ్వక ప్రదేశాలు

జ్వాలాపురం పురావస్తు పరిశోధనల్లోను తవ్వకాల లోనూ అనేకమంది పాల్గొన్నారు. వారిలో ధార్వాడ లోని కర్ణాటక యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసరు రవి కోరిశెట్టర్, మధ్య ప్రదేశ్, అమర్ కంటక్ లోని ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరైన బోర జనార్దన, ఆస్ట్రేలియా లోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన మైకెల్ పెట్రాగ్లియాలు ప్రముఖులు. వీరు తమ పరిశోధనా ఫలితాలు, తాము కనుగొన్న అంశాల గురించి వివిధ వైజ్ఞానిక పత్రికల్లో ప్రచురించారు. ఈ తవ్వకాల్లో లభించిన కళాకృతులను బళ్ళారి లోని రాబర్ట్ బ్రూస్ ఫూట్ సంగనకల్లు ఆర్కియలాజికల్ మ్యూజియమ్‌లో భద్రపరచారు. [5]

విశ్లేషణ[మార్చు]

జ్వాలాపురం వద్ద లభించిన ఆధారాల వలన కొత్త అంశాలు వెలుగు లోకి వచ్చాయి. టోబా విస్ఫోటనానికి ముందు, ఆ తరువాత కూడా మానవ ఆవాసం కొనసాగడాన్ని బట్టి, ఆ విస్ఫోటనం అనుకున్నంత తీవ్ర స్థాయిలో లేదని అర్థమౌతుంది. విస్ఫోటనానికి ముందు అషూలియన్ పనిముట్లు విస్తారంగా లభించడాన్ని బట్టి, ఆధునిక మానవుడు 77,000 ఏళ్ళకు ముందే ఆఫ్రికా నుండి భారతదేశాన్ని చేరుకున్నాడనీ, టోబా విస్ఫోటనం తరువాత కూడా అతని ఆవాసాలు ఇక్కడ కొనసాగాయనీ తెలుస్తోంది. [6] [1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Mar 12, Jayanthi MadhukarJayanthi Madhukar / Updated:; 2016; Ist, 21:23. "Arrival of the first Indian". Bangalore Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-05. Retrieved 2022-08-05. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 2.2 కోరిసెట్టర్, రవి; బోర, జనార్దన (2014). "Vol. I IV.9. Jwalapuram". రీసెర్చిగేట్.నెట్. Archived from the original on 2022-08-03. Retrieved 2022-08-03.
  3. జింకా, నాగరాజు. "కర్నూలు దగ్గిర రాలిన ఇండోనేషియా అగ్నిపర్వత బూడిద". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2022-08-05. Retrieved 2022-08-05.
  4. Taçon, P; Boivin, N; Hampson, J; Blinkhorn, J; Korisettar, R; Petraglia, M (2015-01-02). "New rock art discoveries in the Kurnool District, Andhra Pradesh, India". Antiquity. 84 (324): 335–350. doi:10.1017/S0003598X00066618 – via Researchgate.net.
  5. Ahiraj, M. (2015-10-07). "Museum attracting global attention". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-08-05. Retrieved 2022-08-05.
  6. Joseph, Tony (2017-09-04). "Who were the first settlers of India?". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2022-08-05. Retrieved 2022-08-05.