Jump to content

టిటియాన్

వికీపీడియా నుండి
టిటియాన్
సెల్ఫ్-పోర్ట్రెయిట్, c.1567, మాడ్రిడ్ లోని మ్యూసియో డెల్ ప్రాడోలో భద్రపరచబడింది
బాల్య నామంటిజియానో వెసెల్లియో
జననంc.1488/90
పీవ్ డి కాడోర్, వెనిస్ రిపబ్లిక్
మరణం1576 ఆగస్టు 27(1576-08-27) (వయసు: 87–88)
వెనిస్, వెనిస్ రిపబ్లిక్
ఉద్యమంవెనీషియన్ స్కూల్
చేసిన పనులు
  • బాకస్, అరియాడ్నే
  • వీనస్ ఆఫ్ ఉర్బినో

టిజియానో వెసెల్లియో (Tiziano Vecellio; c.1488/1490[a]  27 ఆగస్టు 1576),[1] ఆంగ్లంలో టిటియాన్ అని పిలుస్తారు. ఇతను ఒక ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ చిత్రకారుడు.[b] పునరుజ్జీవనోద్యమ వెనీషియన్ చిత్రకళలో అత్యంత ముఖ్యమైన కళాకారుడైన ఇతను, బెలూనో సమీపంలోని పీవ్ డి కాడోర్ లో జన్మించాడు.[3]

టిటియాన్ ఇటాలియన్ చిత్రకారులలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి. పోర్ట్రెయిట్‌లు, ల్యాండ్‌స్కేప్ నేపథ్యాలు, పౌరాణిక, మతపరమైన అంశాలలో సమాన నైపుణ్యం కలిగినవాడు. ఇతని చిత్రలేఖన పద్ధతులు, ముఖ్యంగా రంగుల అన్వయం, ఉపయోగం చివరి ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ చిత్రకారులపైనే కాకుండా, భవిష్యత్ తరాల పాశ్చాత్య కళాకారులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి.[4]

ఇతని కెరీర్ ప్రారంభం నుండే విజయవంతమైంది. వెనిస్, దాని ఆధీనంలోని ప్రాంతాల పోషకులు, ఉత్తర ఇటాలియన్ రాకుమారులు, హ్యాబ్స్‌బర్గ్ రాజవంశం, పోప్ వంటి వారు ఇతని చిత్రాల కోసం పోటీ పడ్డారు. గియోర్గియోన్‌తో పాటు ఇతను వెనీషియన్ స్కూల్ ఆఫ్ ఇటాలియన్ పునరుజ్జీవనోద్యమ చిత్రకళకు స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. 1590లో, చిత్రకారుడు, కళా సిద్ధాంతకర్త గియోవన్నీ పాలో లోమాజో, టిటియాన్‌ను "ఇటాలియన్లలోనే కాకుండా ప్రపంచంలోని చిత్రకారులందరిలో చిన్న నక్షత్రాల మధ్య సూర్యుడు" అని వర్ణించాడు.[5]

తన సుదీర్ఘ జీవితంలో, టిటియాన్ కళాత్మక విధానం తీవ్రంగా మారింది, అయినప్పటికీ రంగులపై అతనికి జీవితకాల ఆసక్తి అలాగే ఉంది. ఇతని పరిణత చెందిన కళాఖండాలలో ప్రారంభ చిత్రాలలోని స్పష్టమైన, ప్రకాశవంతమైన రంగులు లేకపోయినప్పటికీ, అవి వాటి స్వేచ్ఛా బ్రష్‌వర్క్, సూక్ష్మమైన టోన్‌లలో విశేషమైనవి, వినూత్నమైనవి.

జీవిత చరిత్ర

[మార్చు]

తొలి సంవత్సరాలు

[మార్చు]
ఎ మ్యాన్ విత్ ఎ క్విల్టెడ్ స్లీవ్, సుమారు 1509, నేషనల్ గ్యాలరీ, లండన్

టిటియాన్ కచ్చితమైన పుట్టిన తేదీ అస్పష్టంగా ఉంది. వృద్ధాప్యంలో స్పెయిన్‌కు చెందిన ఫిలిప్ IIకి రాసిన లేఖలో తాను 1474లో జన్మించానని పేర్కొన్నాడు, కానీ ఇది అసంభవం అనిపిస్తుంది.[6] ఇతర సమకాలీన రచయితలు ఇతని జనన తేదీ 1473, 1482 మధ్య ఉంటుందని అంచనా వేశారు. 20వ శతాబ్దంలో కూడా ఇతను 99 సంవత్సరాల వయస్సులో మరణించాడనే వాదన ఉన్నప్పటికీ, చాలా మంది ఆధునిక పండితులు జనన తేదీ 1488, 1490 మధ్య ఉండే అవకాశం ఉందని నమ్ముతున్నారు.

ఇతను గ్రెగోరియో వెసెల్లియో, లూసియా దంపతుల కుమారుడు. వీరికి సంబంధించిన సమాచారం చాలా తక్కువగా తెలుసు. వెసెల్లియో కుటుంబం వెనిస్ పాలనలో ఉన్న ఆ ప్రాంతంలో స్థిరపడింది. టిటియాన్ తాత కాంటే వెసెల్లియో స్థానిక పరిపాలనలో పలు పదవులు నిర్వహించిన ప్రముఖ నోటరీ. కాంటే కుమారులలో ముగ్గురు నోటరీలు కాగా, గ్రెగోరియో సైనికుడిగా పనిచేశాడు. గ్రెగోరియో కలప వ్యాపారిగా పనిచేస్తూ యజమానుల కోసం కాడోర్ ప్రాంతంలోని గనులను కూడా నిర్వహించాడు.

టిటియాన్‌కు పరిచయం ఉన్న లుడోవికో డోల్స్ ప్రకారం, టిటియాన్‌కు నలుగురు గురువులు ఉన్నారు. మొదటివాడు సెబాస్టియానో జుకాటో, రెండవవాడు జెంటైల్ బెల్లిని, ఆపై అతని సోదరుడు గియోవన్నీ బెల్లిని, చివరిగా గియోర్గియోన్. జుకాటి కుటుంబ కళాకారులు మొజాయిక్ కళలో ప్రసిద్ధి చెందారు. తొమ్మిదేళ్ల వయసులో బాలుడిని తన సోదరుడు ఫ్రాన్సిస్కోతో కలిసి వెనిస్‌కు పంపారని డోల్స్ రాశాడు. జుకాటో వద్ద శిక్షణ తర్వాత, టిటియాన్ కొద్దికాలం జెంటైల్ బెల్లిని స్టూడియోకి మారాడు. 1507లో జెంటైల్ మరణించిన తరువాత, అతను జెంటైల్ తమ్ముడు గియోవన్నీ వద్ద అప్రెంటిస్‌షిప్‌లోకి ప్రవేశించాడు. నగరంలో నివసిస్తున్నప్పుడు, టిటియాన్ గియోవన్నీ పాల్మా డా సెరినాల్టా, లోరెంజో లోట్టో, గియోర్గియోన్ వంటి తన వయస్సు గల యువకుల బృందాన్ని కలుసుకున్నాడు.

1507-1508లో, నగరంలోని జర్మన్ వ్యాపారుల కోసం ఫొండాకో డీ టెడెస్చి గోడలపై ఫ్రెస్కోలు వేయడానికి గియోర్గియోన్ నియమించబడ్డాడు. టిటియాన్, మోర్టో డా ఫెల్ట్రే ప్రాజెక్టులో పనిచేశారు. గియోర్గియోన్ కాలువ వైపు ఉన్న భాగాన్ని 1508లో చిత్రించగా, టిటియాన్ వీధికి పైనున్న భాగాన్ని బహుశా 1509లో చిత్రించాడు. అనేక మంది సమకాలీన విమర్శకులు టిటియాన్ పనిని అత్యంత అద్భుతమైనదిగా గుర్తించారు.

1510లో గియోర్గియోన్ అకాల మరణం తరువాత, టిటియాన్ కొంతకాలం గియోర్గియోనెస్క్ అంశాలను చిత్రించడం కొనసాగించాడు, అయినప్పటికీ అతని శైలి తనదైన సొంత లక్షణాలను అభివృద్ధి చేసుకుంది.

పరిణతి దొరకబుచ్చుకున్న కాలం

[మార్చు]

ఈ కాలంలో (1516-1530) కళాకారుడు తన ప్రారంభ శైలి నుండి బయటపడి, పెద్ద, సంక్లిష్టమైన అంశాలను చేపట్టాడు. 1510లో గియోర్గియోన్, 1516లో గియోవన్నీ బెల్లిని మరణించారు. దాంతో వెనీషియన్ స్కూల్‌లో టిటియాన్‌కు తిరుగులేకుండా పోయింది. అరవై సంవత్సరాల పాటు అతను వెనీషియన్ చిత్రకళలో తిరుగులేని మాస్టర్.

1516లో, వెనిస్ లోని శాంటా మారియా గ్లోరియోసా డీ ఫ్రారీ చర్చిలోని ప్రధాన పీఠం కోసం తన కళాఖండమైన అసంప్షన్ ఆఫ్ ది వర్జిన్ ని పూర్తి చేశాడు. ఇది ఇప్పటికీ అక్కడే ఉంది, ఇది ఇతని అతిపెద్ద సింగిల్ ప్యానెల్. ఇంతకు ముందెన్నడూ ఇటలీలో చూడని విధంగా పెద్ద ఎత్తున వేసిన ఈ రంగుల చిత్రం సంచలనం సృష్టించింది.

చివరగా, టిటియాన్ ఉఫిజిలోని ఫ్లోరా, లౌవ్రేలోని ఉమెన్ విత్ ఏ మిర్రర్ వంటి యువతుల పోర్ట్రెయిట్‌లను ఈ కాలంలోనే రూపొందించాడు. ఈ చిత్రాలకు ఆ కాలపు వేశ్యలను మోడల్‌లుగా ఉపయోగించారని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

చివరి సంవత్సరాలు

[మార్చు]
వీనస్ అండ్ మ్యూజీషియన్, సుమారు 1550. మాడ్రిడ్ లోని మ్యూసియో డెల్ ప్రాడోలో భద్రపరచబడింది.

టిటియాన్ తన జీవితాంతం వరకు కమీషన్లను అంగీకరించడం కొనసాగించాడు. 1540ల మధ్య కాలం నుండి, అతని పని ఎక్కువగా వెనిస్ వెలుపల ఇటాలియన్, యూరోపియన్ పోషకులకు సంబంధించినదిగా ఉండేది. అతను ఎనభైల చివరలో ఉన్నప్పుడు కూడా టిటియాన్ కళాత్మక పనితీరు తగ్గలేదు. స్టూడియోలో సహాయకులతో కలిసి చిత్రాల కాపీలను రూపొందించడం, వాటిని సవరించడం ద్వారా పనిని వేగవంతం చేశాడు.

టిటియాన్ తన చివరి కళాఖండమైన పియెటా ను తన స్వంత సమాధి కోసం ప్రత్యేకంగా రూపొందించాడు. ఇది విషాదకరమైన భావోద్వేగాలను, మరణం పట్ల విచారాన్ని రేకెత్తిస్తుంది. ఇందులో మేరీ మాగ్డలీన్ ఆ దృశ్యాన్ని చూడలేక భయంతో వెనుదిరుగుతుంది.

మరణం

[మార్చు]
వెనిస్‌లోని శాంటా మారియా గ్లోరియోసా డీ ఫ్రారీలో టిటియాన్ సమాధి

వెనిస్‌లో ప్లేగు వ్యాధి ప్రబలుతున్నప్పుడు, టిటియాన్ 27 ఆగస్టు 1576 న మరణించాడు. ఆధునిక పండితుల ఏకాభిప్రాయం ప్రకారం అతను 1488, 1490 మధ్య జన్మించాడు, కాబట్టి అతనికి కనీసం ఎనభై ఆరేళ్లు ఉండి ఉండాలి. ఫ్రారీలోని క్రీస్తు శిలువ బలిపీఠం కింద అతన్ని ఖననం చేశారు. టిటియాన్ మరణించిన కొద్దికాలానికే అతని కుమారుడు, సహాయకుడు అయిన ఒరాజియో కూడా ప్లేగు వ్యాధితో మరణించాడు.

1843లో ఆస్ట్రియా చక్రవర్తి ఫెర్డినాండ్ I టిటియాన్ అసలు ఖననం చేసిన ప్రదేశంలో ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ఆదేశించాడు. 1852 నాటికి ఫ్రాంజ్ జోసెఫ్ పాలనలో ఆంటోనియో కానోవా విద్యార్థి అయిన లుయిగీ జాండోమెనెగీ నేతృత్వంలో ఈ పని పూర్తయింది.

ముద్రణ (Printmaking)

[మార్చు]

టిటియాన్ ఎప్పుడూ స్వయంగా ఎన్‌గ్రేవింగ్ చేయడానికి ప్రయత్నించలేదు, కానీ తన కీర్తిని విస్తరించుకోవడానికి ముద్రణ ప్రాముఖ్యతను బాగా గుర్తించాడు. 1515-1520 కాలంలో అతను ఫారో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోవడాన్ని వర్ణించే అద్భుతమైన ఉడ్‌కట్‌తో సహా అనేక డిజైన్లను రూపొందించాడు. తన చిత్రాలు, డ్రాయింగ్‌ల ఆధారంగా ప్రింట్‌లను ఉత్పత్తి చేసిన డొమెనికో కాంపగ్నోలా, తదితరులతో కలిసి పనిచేశాడు.

వర్గాలు

[మార్చు]
  1. See below; c.1488/1490 is generally accepted despite claims in his lifetime that he was older, Getty Union Artist Name List and Metropolitan Museum of Art timeline, retrieved 11 February 2009 both use c. 1488. See discussion of the issue below and at When Was Titian Born?, which sets out the evidence, and supports 1477. Gould (pp. 264–66) also sets out much of the evidence without coming to a conclusion. Charles Hope in Jaffé, 2003 (p. 11) also discusses the issue, favouring a date "in or just before 1490" as opposed to the much earlier dates, as does Penny (p. 201) "probably in 1490 or a little earlier".
  2. Though the modern Republic of Italy had yet to be established, the Latin equivalent of the term Italian had been in use for natives of the region since antiquity.[2]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు
  1. "Titian (ca. 1485/90?–1576)". Heilbrunn Timeline of Art History. Metropolitan Museum of Art. October 2003. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2011.
  2. Pliny the Younger, Letters 9.23.
  3. Wolf, Norbert (2006). I, Titian. New York and London: Prestel. ISBN 9783791333847.
  4. Fossi, Gloria, Italian Art: Painting, Sculpture, Architecture from the Origins to the Present Day, p. 194. Giunti, 2000. ISBN 88-09-01771-4
  5. Wethey, Harold Edwin (1969). The Paintings of Titian: The Religious Paintings. Vol. 1. Phaidon. p. 2. ISBN 978-0-7148-1393-6.
  6. Cecil Gould, The Sixteenth Century Italian Schools, National Gallery Catalogues, p. 265, London, 1975, ISBN 0-947645-22-5
"https://te.wikipedia.org/w/index.php?title=టిటియాన్&oldid=4882570" నుండి వెలికితీశారు