టి.దేవేందర్ గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూళ్ళ దేవేందర్ గౌడ్

ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-18) 1953 మార్చి 18 (వయస్సు: 66  సంవత్సరాలు)
రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ మతము
సెప్టెంబర్ 3, 2009నాటికి

రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు, తూళ్ళ దేవేందర్ గౌడ్. విద్యార్థినాయకుడిగా ప్రజాజీవితం ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాల్లో అనేక పదవులను అధిరోహించాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు.[1] కళాశాల దశలోనే విద్యార్థినాయకుడిగా పనిచేసిన అనుభవంతో, ఎన్.టి.రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దేవేందర్ గౌడ్ పాఠశాల విద్య తరువాత ఇంటర్మీడియట్ ధర్మవంత్ కళాశాలలోను, వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ బద్రుకా కళాశాలలో పూర్తిచేశాడు. కళాశాలలో ఉన్నప్పుడే అతడు విద్యార్థి నాయకుడిగా వ్యవహరించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

చదువు పూర్తయ్యాక, ఎన్.టి.రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో ప్రవేశించాడు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనతికాలంలోనే దేవేందర్ గౌడ్ జిల్లాలో ప్రముఖ నేతగా పేరుతెచ్చుకున్నాడు. 1988లో జిల్లాపరిషత్తు ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు ఛైర్మన్ స్థానాన్ని ప్రత్యక్ష ఓటుద్వారా కైవసం చేసుకున్నాడు. పూర్తి ఐదేళ్ళ కాలపరిమితి తరువాత 1994 డిసెంబర్లో తొలిసారిగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పుడే మంత్రిమండలిలో స్థానం కూడా సంపాదించాడు. 1999 అక్టోబర్లో రెండో సారి కూడా భారీ మెజారిటీతో అదే స్థానం నుంచి ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు రాష్ట్ర గృహమంత్రిగా పనిచేసాడు. 2004 ఏప్రిల్లో కూడా మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించాడు.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా[మార్చు]

తెలుగుదేశం పార్టీలో తన తెలంగాణా వాదానికి సరైన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న పార్టీకి మరియు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణాలో పుంజుకొనేందుకు పార్టీ యత్నాలు ఫలిస్తున్న తరుణంలో దేవేందర్ నిష్క్రమణతో పార్టీకి దెబ్బ తగిలింది.[2]. తరువాత దేవేందర్ గౌడ్ "నవ తెలంగాణా పార్టీ" అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.

ప్రజారాజ్యంలో విలీనం[మార్చు]

ఫిబ్రవరి 2009లో తాను స్థాపించిన నవతెలంగాణ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోకసభతో[3] పాటు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ[4] పోటీ చేసి, రెండింటిలోనూ ఓడిపోయాడు.

తెలుగుదేశంలో చేరిక[మార్చు]

2009, ఆగస్టు3న దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీని వీడి ఆగస్టు 6న మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినాడు. తెలుగుదేశం పార్త్టీని వదలివెళ్ళడం చారిత్రక తప్పిదం అని పేర్కొన్నాడు.[5]

మూలాలు[మార్చు]

  1. http://www.goudsinfo.com/famous-Devendergoud.htm
  2. ఈనాడు దినపత్రిక, తేది 24.06.2008
  3. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు
  4. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు
  5. ఈనాడి దినపత్రిక, తేది 07-08-2009