టి.విశ్వనాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.విశ్వనాథన్
వ్యక్తిగత సమాచారం
జననం(1927-08-13)1927 ఆగస్టు 13
మద్రాసు, తమిళనాడు, భారతదేశం
మరణం2002 సెప్టెంబరు 10(2002-09-10) (వయసు 75)
హార్ట్‌ఫోర్డ్, కనెక్టికట్, అమెరికా
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక వాద్య కళాకారుడు
వాయిద్యాలువేణువు

తంజావూరు విశ్వనాథన్ (13 ఆగష్టు 1927 – 10 సెప్టెంబరు 2002) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు వేణునాదంతో పాటుగా గాత్రంలో కూడా నిష్ణాతుడు.

ఆరంభ జీవితం, నేపథ్యం

[మార్చు]

ఇతడు 1927, ఆగష్టు 13న మద్రాసులో జన్మించాడు. ఇతడు కర్ణాటక సంగీత వీణ విద్వాంసురాలు "వీణ ధనమ్మాళ్" మనుమడు. ఇతని అక్క తంజావూరు బాలసరస్వతి పద్మవిభూషణ్ పురస్కారం పొందిన భరతనాట్య కళాకారిణి.[1] ఇతని అన్న టి.రంగనాథన్ మార్దంగికుడు.[2]

ఇతడు సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించినా తన 8వ యేట చెన్నై నుండి 200 మైళ్ళ దూరంలో ఉన్న తంజావూరు వెళ్ళి అక్కడ టి.ఎన్.స్వామినాథ పిళ్ళై వద్ద గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకున్నాడు. టి.ఎన్.స్వామినాథ పిళ్ళై మద్రాసుకు మకాం మార్చిన తరువాత తన ఇంటికి తిరిగి వచ్చి పిళ్ళై వద్దనే 20 సంవత్సరాలు సంగీత శిక్షణ తీసుకున్నాడు. [1]

వృత్తి

[మార్చు]

ఇతడు తన కుటుంబ సంగీత వారసత్వాన్ని, తన గురువు సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని వేణువును గాత్రానికి అనుగుణంగా, పాట సాహిత్యానికి న్యాయం చేకూర్చేలా పలికించేవాడు. తాను గాత్రంలో శిక్షణ తీసుకోకున్నా కొన్ని సార్లు వేణుగానం చేస్తూనే మధ్యలో వేణువును ఆపి గానం చేసేవాడు. ఇతడు సంగీత కచేరీలు చేయడం మాత్రమే కాకుండా నృత్యాలకు సహకళాకారుడిగా వేణుగానం చేసేవాడు. ఇతడు తన వేణువుతో అనేక కృతులు, కీర్తనలు, పదాలు, జావళీలు, తిల్లానాలు పలికించేవాడు. ఇతడు అనేక మంది విదేశీ శిష్యులకు, మన దేశంలోని వారికి గాత్ర సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. ఒక్క టి.ఆర్.మూర్తికి మాత్రం వేణుగానం నేర్పించాడు.

ఇతడు జాన్ హిగ్గిన్స్ అనే విదేశీయుణ్ణి కర్ణాటక సంగీత వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడానికి బాధ్యత వహించాడు. దక్షిణ భారత సంగీత రసికులు ఆ శిష్యుణ్ణి "హిగ్గిన్స్ భాగవతార్‌"గా అభిమానించారు.[2]

విశ్వనాథన్ 1958లో అమెరికాకు ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్ కోసం వెళ్ళి లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 1958 నుండి 1960 వరకు ఎథ్నోమ్యూజికాలజీ చదివాడు. తరువాత ఇతడు భారతదేశానికి తిరిగి వచ్చి మద్రాసు విశ్వవిద్యాలయంలో సంగీత విభాగానికి 1961 నుండి 1965 వరకు అధిపతిగా పనిచేశాడు. 1966లో ఇతడు అమెరికాలో స్థిరపడ్డాడు. అక్కడ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్‌లో సంగీత అధ్యాపకునిగా పనిచేశాడు.[1]1975లో వెస్లియన్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొంది ఆ విశ్వవిద్యాలయంలో చాలా సంవత్సరాలు అధ్యాపకునిగా పనిచేశాడు. ఇతని శిష్యులలో అనురాధ శ్రీరామ్, టి.ఆర్.మూర్తి, జాన్ హిగ్గిన్స్, డుగ్లాస్ నైట్, డేవిడ్ నెల్సన్ మొదలైన వారున్నారు. ఇతని సోదరి బాలసరస్వతిపై సత్యజిత్‌ ‌రే తీసిన డాక్యుమెంటరీ చిత్రం బాలకు ఇతడు, ఇతని సోదరుడు రంగనాథన్ సంగీతాన్ని అందించారు.[1][3]

ఇతడు కనెక్టికట్ లోని హార్ట్‌ఫోర్డులో 2002 సెప్టెంబరు 10వ తేదీన గుండెపోటుతో మరణించాడు. ఇతనికి భార్య జోసెఫా విశనాథన్, కుమార్తె జయశ్రీ, ఇద్దరు కుమారులు (కుమార్, కేరీ)లు ఉన్నారు.[2]

పురస్కారాలు

[మార్చు]

విశ్వనాథన్ 1978లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"చే కళైమామణి పురస్కారాన్ని పొందాడు. 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందాడు. 1988లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని అందించింది.[4]

1992లో అమెరికా ప్రభుత్వం ఇతనికి "నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్"ను ప్రదానం చేసింది. ఈ ఫెలోషిప్‌ను సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఇతడే.[5] అదే సంవత్సరం "అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడిస్" నుండి రీసెర్చ్ ఫెలోషిప్ లభించింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Govenar, Alan (2001). "T. Viswanathan: Asian American Flute Player (South Indian)". Masters of Traditional Arts: A Biographical Dictionary. Vol. 2. Santa Barbara, CA: ABC-Clio. pp. 645–647. ISBN 1576072401. OCLC 47644303.
  2. 2.0 2.1 2.2 "Tanjore Viswanathan, 75, Indian Musician". The New York Times. 17 September 2002. Retrieved 2 December 2017.
  3. "T. Viswanathan: South Indian Flute Master". www.arts.gov. National Endowment for the Arts. n.d. Retrieved December 14, 2020.
  4. Poursine, Kay (October 2002). "Profile: T Viswanathan (1927 – 2002)". narthaki.com. Retrieved 2 December 2017.
  5. "NEA National Heritage Fellowships 1992". www.arts.gov. National Endowment for the Arts. Archived from the original on June 29, 2020. Retrieved December 14, 2020.

బయటి లింకులు

[మార్చు]