Jump to content

టైఫస్

వికీపీడియా నుండి
టైఫస్
ఇతర పేర్లుటైఫస్ జ్వరం
టైఫస్ వల్ల కలిగే దద్దుర్లు
ప్రత్యేకతసంక్రమణం
లక్షణాలుజ్వరం, తలనొప్పి, దద్దుర్లు
సాధారణ ప్రారంభంసంక్రమణకు గురైన 1–2 వారాల తర్వాత
కారణాలుపరాన్నజీవుల ద్వారా వ్యాపించే బాక్టీరియా సంక్రమణ
చికిత్సడాక్సీసైక్లిన్
తరుచుదనముఅరుదుగా

టైఫస్ అనేది అంటువ్యాధుల సమూహం. దీనిని టైఫస్ జ్వరం అని కూడా పిలుస్తారు. టైఫస్ లో అంటువ్యాధి టైఫస్ ( Epidemic typhus ), స్క్రబ్ టైఫస్, మురైన్ టైఫస్ అను రకాలు ఉన్నాయి. సాధారణంగా దీనిలో జ్వరం, తలనొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.[1] సాధారణంగా ఇవి బహిర్గతం అయిన ఒకటి నుండి రెండు వారాల తర్వాత ప్రారంభమవుతాయి.[2] క్రీ. శ. 1528 నుండి టైఫస్ గురించి సమాచారం ఉంది. ఈ పేరు గ్రీకు పదం టుఫోస్ (τύφος) నుండి వచ్చింది, దీని అర్థం మసకబారడం. ఇది వ్యాధి సోకిన వారి మానసిక స్థితిని సూచిస్తుంది.[3] "టైఫాయిడ్" అంటే "టైఫస్ లాంటిది" అని అర్ధం. అయితే టైఫస్, టైఫాయిడ్ జ్వరం వేర్వేరు రకాల బ్యాక్టీరియా వల్ల కలిగే విభిన్న వ్యాధులు.

ఈ వ్యాధులు నిర్దిష్ట రకాల బ్యాక్టీరియా సంక్రమణ వల్ల సంభవిస్తాయి. 'రికెట్సియా ప్రోవాజెకి' వలన ఎపిడెమిక్ టైఫస్ కలుగుతుంది. ఇది 'శరీర పేను' ద్వారా వ్యాపిస్తుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి రకం 'ఓరియంటియా సుట్సుగముషి' కారణంగా (Orientia tsutsugamushi) చిగ్గర్స్ ద్వారా వ్యాపిస్తుంది. మురైన్ టైఫస్ ఫ్లీస్ ద్వారా 'రికెట్సియ టైఫి' కారణంగా వ్యాపిస్తుంది.[1]

'టైఫస్' అనే పదాన్ని ఇతర విశేషణాలూ లేకుండా ప్రస్తావించినప్పుడు సాధారణంగా ఈ వ్యాధినే సూచిస్తారు.

సంకేతాలు, లక్షణాలు

[మార్చు]

అంటువ్యాధి టైఫస్‌ లక్షణాలు:[4] జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు సోకిన ఒకటి నుండి రెండు వారాల తర్వాత అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి.[5] లక్షణాలు ప్రారంభమైన ఐదు నుండి తొమ్మిది రోజుల తర్వాత, దద్దుర్లు సాధారణంగా మొండెం మీద ప్రారంభమై అంత్య భాగాలకు వ్యాపిస్తాయి. ఈ దద్దుర్లు చివరికి శరీరంలోని చాలా భాగాలకు వ్యాపిస్తాయి. ముఖం, అరచేతులు, అరికాళ్ళను వదిలివేస్తాయి. మెనింగోఎన్సెఫాలిటిస్ (meningoencephalitis) సంకేతాలు దద్దురుతో ప్రారంభమై రెండవ లేదా మూడవ వారాల వరకు కొనసాగుతాయి. చికిత్స చేయని కేసులు సాధారణంగా ప్రాణాంతకంగా మారతాయి.[6]

స్క్రబ్ టైఫస్ సంకేతాలు: సోకిన 1 నుండి 2 వారాలలోపు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలలో అధిక జ్వరం, తలనొప్పి, చలి, శోష రస కణుపులు వాపు, కండరాల నొప్పులు, వికారం/వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సంక్రమణ ప్రదేశంలో దద్దుర్లు ఉంటాయి. మచ్చలు శరీరంలో వివిధభాగాలకు విస్తరిస్తాయి. మరింత తీవ్రమైన లక్షణాలు ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలు, మెనింజెస్, గుండెకు హాని కలిగించవచ్చు.[7][8]

కారణాలు

[మార్చు]

అంటువ్యాధి టైఫస్‌ (ఎపిడెమిక్ టైఫస్): 'రికెట్సియా ప్రోవాజెకి' బాక్టీరియా వలన శరీర పేలు ద్వారా వస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వేగంగా వ్యాపిస్తుంది, కాబట్టి వీలైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. అలాగే, పేలకు దూరంగా ఉండాలి.

మురైన్ టైఫస్: మురిన్ టైఫస్ 'రికెట్సియ టైఫి' బాక్టీరియా వలన ఈగ కాటు ద్వారా వస్తుంది. పెంపుడు జంతువులు, అడవి జంతువులూ, ఎలుకలు, ఈగలు లేవని నిర్ధారించుకోవాలి, కీటక వికర్షకాలను ఉపయోగించాలి. లేదా ఇతర వన్యప్రాణులు ఒకరి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.

'స్క్రబ్ టైఫస్: 'ఓరియంటియాసుట్సుగముషి' బాక్టీరియా వలన మానవులపై లేదా ఎలుకలపై ఉండే హార్వెస్ట్ పురుగులు ద్వారా వ్యాపిస్తుంది. స్క్రబ్ టైఫస్ వ్యాక్సిన్ టీకా అభివృద్ధిలో ఉంది. ఇది మైట్స్ వల్ల వస్తుంది, కాబట్టి ఆ ప్రాంతంలో పొదలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం మానుకోవాలి. మైట్స్‌ను దూరంగా ఉంచడానికి కీటక వికర్షిణిని ఉపయోగించాలి. పిల్లలు, పసిపిల్లలకు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరింపజేయాలి, దోమతెరలు వాడాలి.

రోగ నిర్ధారణ

[మార్చు]

అన్ని రకాల టైఫస్‌ లను ప్రయోగశాల పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. సాధారణంగా అన్ని రకాల టైఫస్‌కు 'ఇమ్యునోఫ్లోరోసెన్స్ యాంటీబాడీ' (IFA) పరోక్ష చేస్తారు. స్క్రబ్ టైఫస్‌ను మినహాయించి ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ (IHC) లేదా పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షలతో కూడా దీనిని చేయవచ్చు. స్క్రబ్ టైఫస్‌ను IHC లేదా PCRతో పరీక్షించరు, బదులుగా IFA పరీక్షతో పాటు పరోక్ష ఇమ్యునోపెరాక్సిడేస్ (IIP) పరీక్షలతో నిర్ధారిస్తారు. ఇమ్మ్యూనో క్రోమోటోగ్రఫీ టెస్ట్ (ICT) కూడా నిర్వహిస్తారు.[8]

చికిత్స

[మార్చు]

ప్రస్తుతం వాణిజ్యపరంగా టీకా అందుబాటులో లేదు. వ్యాధిని వ్యాప్తి చేసే జీవులకు దూరంగా ఉండడం వలన నివారించవచ్చు.[9][10][11] యాంటీబయాటిక్స్ మందులు డాక్సీసైక్లిన్ తో చికిత్స చేస్తారు.[2] అంటువ్యాధి టైఫస్ సాధారణంగా పారిశుద్ధ్య పరిస్థితులు సరిగా లేనప్పుడు, రద్దీ ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది.[12] గర్భిణులలో, 60 ఏళ్ళు పై బడినవారిలో ఈ తీవ్రత అధికంగా ఉంటుంది. తొలిదశలో గుర్తిస్తే దానికి అజిత్రోమైసిన్ , డాక్సీ సైక్లిన్ వంటి యాంటిబయోటిక్స్ ఒక వారం వరకు చేసే చికిత్సతో కోలుకుంటారు. లక్షణాలు సకాలంలో గుర్తించకపొతే అన్ని అవయవాల పనితీరు దెబ్బతిని పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది.[8]

వ్యాప్తి

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మంది స్క్రబ్ టైఫస్ బారిన పడుతున్నారు.[8] ఒకప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి సాధారణం అయినప్పటికీ, ఇప్పుడు ఇది చాలా అరుదు[9] ఆగ్నేయ ఆసియా, జపాన్, ఉత్తర ఆస్ట్రేలియాలో స్క్రబ్ టైఫస్ సంభవిస్తుంది.[10] మురైన్ టైఫస్ ప్రపంచంలోని ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో సంభవిస్తుంది.[11]

2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, టైఫస్ వ్యాధి మరణాల రేటు ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి సుమారు ఒకరుగా ఉంది.[13] 20వ శతాబ్దం చివర బురుండి, రువాండా, ఇథియోపియా, అల్జీరియా, దక్షిణ మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి.[14] యునైటెడ్ స్టేట్స్‌లో అంటువ్యాధి టైఫస్‌కు సంబంధించిన అన్ని సందర్భాలు మిసిసిపీ నదికి తూర్పున సంభవించాయి. పెన్సిల్వేనియాలో ఈ సంక్రమణకు మూలం ఎగిరే ఉడుతలు అని తెలిసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లెక్కల ప్రకారం 1976 నుండి 2010 వరకు 47 కేసులను నమోదు చేసింది. అక్టోబర్ 2018లో కాలిఫోర్నియాలోని డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లో ఈగల ద్వారా వ్యాపించే మ్యూరిన్ టైఫస్ వ్యాప్తిని గుర్తించారు.

భారతదేశంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ , హిమాచల ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, సిక్కిం తదితర రాష్ట్రాల్లో వ్యాధిగ్రస్తులు నమోదవుతున్నారు. మొదట్లో గ్రామాలలో ఈ వ్యాధి బారిన పడేవారు, క్రమంగా పట్టణాలలో కూడా కనపడుతున్నారు. గడ్డినేలలు, ఇసుక దిబ్బలపై పడుకున్నప్పుడు వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు.[8]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Typhus Fevers". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 7 March 2017. Archived from the original on 26 March 2017. Retrieved 26 March 2017.
  2. 2.0 2.1 "Information for Health Care Providers". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 7 March 2017. Archived from the original on 27 March 2017. Retrieved 26 March 2017.
  3. Bennett, John E.; Dolin, Raphael; Blaser, Martin J. (2014). Mandell, Douglas, and Bennett's Principles and Practice of Infectious Diseases E-Book (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 2217. ISBN 9780323263733. Archived from the original on 2017-09-10.
  4. Levinson W (2010). Review of Medical Microbiology and Immunology (11th ed.). McGraw Hill. ISBN 9780071700283.
  5. Mullen GR, Durden LA (27 September 2002). Medical and Veterinary Entomology. Academic Press. pp. 58 ff. ISBN 978-0-08-053607-1. Archived from the original on 10 September 2017.
  6. "Herpes Meningoencephalitis". www.hopkinsmedicine.org. 19 November 2019. Retrieved 31 October 2023.
  7. Liu, Xianghong; Zhang, Ye; Zhang, Jun; Lou, Zheng; Xia, Han; Lu, Zhijuan (2021). "The Early Diagnosis of Scrub Typhus by Metagenomic Next-Generation Sequencing". Frontiers in Public Health. 9 755228. Bibcode:2021FrPH....955228L. doi:10.3389/fpubh.2021.755228. ISSN 2296-2565. PMC 8632043. PMID 34858931.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 డా. ఎం.వి., రావు (2026-01-05). "తొలిదశలో గుర్తిస్తే . . చికిత్స వారం రోజులే". ఈనాడు.
  9. 9.0 9.1 "Epidemic Typhus". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 7 March 2017. Archived from the original on 26 March 2017. Retrieved 27 March 2017.
  10. 10.0 10.1 "Scrub Typhus". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 7 March 2017. Archived from the original on 26 March 2017. Retrieved 26 March 2017.
  11. 11.0 11.1 "Murine Typhus". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 26 March 2017. Retrieved 26 March 2017.
  12. "WHO | Typhus". www.who.int. May 1997. Archived from the original on 27 March 2017. Retrieved 26 March 2017.
  13. WHO Statistical Information System (WHOSIS) Archived 21 ఫిబ్రవరి 2010 at the Wayback Machine
  14. Perine PL, Chandler BP, Krause DK, McCardle P, Awoke S, Habte-Gabr E, et al. (May 1992). "A clinico-epidemiological study of epidemic typhus in Africa". Clinical Infectious Diseases. 14 (5): 1149–58. doi:10.1093/clinids/14.5.1149. PMID 1600020.
"https://te.wikipedia.org/w/index.php?title=టైఫస్&oldid=4714169" నుండి వెలికితీశారు