Jump to content

ట్రోయ్ సంగ్రామం

వికీపీడియా నుండి
The Burning of Troy (1759/62), oil painting by Johann Georg Trautmann

గ్రీకు పురాణ గాథలలో ప్రసిద్ధికెక్కిన ఈ మహా సంగ్రామానికి, తద్వారా జరిగిన మారణ హోమానికి మూల కారణం ఏరిస్ (Eris) అనే ఒలింపాయన దేవత అని మనం తీర్మానం చెయ్యవచ్చు. (ఏఫ్రొడైటి కొడుకు ఈరోస్ (Eros) హిందువుల మన్మధుడికి పోలిక! ఏరిస్ బంగారు ఏపిల్ పండుని పెళ్లి పందిరిలోకి విసిరిన వ్యక్తి.)

ఒక వివాహ సందర్భంలో ఒలింపియను దేవతల అధినేత అయిన జూస్ ఒక బ్రహ్మండమైన విందు చేస్తాడు. కోరుకుని కొరివితో తలగోక్కోవడం ఎందుకని పేచీకోరు ఏరిస్ ని ఆ విందుకి పిలవలేదు. జరిగిన పరాభవానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న ఏరిస్ పిలవని పేరంటంలా విందుకి రానే వచ్చింది. జూస్ ఆజ్ఞానుసారం హెర్మీస్ ఆమెని లోపలికి రాకుండా అటకాయిస్తాడు. ఏరిస్ తక్కువ తిన్నదా? బయట నుండే బంతి భోజనాల మధ్యకి ఒక బంగారు ఏపిల్ పండుని విసరి వెళ్లిపోతుంది. ఆ పండు మీద “మీలో అందమైన ఆడదానికి ఈ బహుమానం” అని రాసి ఉంటుంది.

విందులో ఉన్న ముగ్గురు దేవతలు - హేరా, ఎథీనా, ఏఫ్రొడైటి - “ఆ పండు నా కోసమే” అంటూ ఎగబడి తగువులాడుకుంటారు. తీర్పు చెప్పమని ముగ్గురూ జూస్ ని అడుగుతారు. ఎటు తీర్పు చెప్పినా ఇబ్బందే అని జూస్ ఈ ముగ్గురికీ హెర్మీస్ ని తోడు ఇచ్చి భూలోకంలో ఉన్న పేరిస్ దగ్గరకి పంపుతాడు. ముగ్గురిలోనూ ఏఫ్రొడైటి అందమైనదని పేరిస్ తీర్పు చెబుతాడు. దానికి బహుమానంగా పేరిస్ ని భూలోక సుందరి హెలెన్ - మెనలావూస్ భార్య - వరించేలా వరం ఇస్తుంది.

హెలెన్ కన్నతల్లి స్పార్టాకి రాణి అయిన లేడా (Leda). హంస రూపంలో జాస్ వచ్చి లేడాని అనుభవించగా హెలెన్ పుట్టిందని ఒక కథనం ఉంది. కనుక హెలెన్ దైవాంశ సంభూతురాలు. స్పార్టాకి రాజైన టిండారియస్ (Tyndareus) హెలెన్ ని తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. హెలెన్ అందాన్ని చూసి ఎంతోమంది రాజులు, ధీరులు ఆమెని చేపట్టటానికి ముందుకి వచ్చేరు. ఒకరి వైపు మొగ్గు చూపితే మరొకరికి కోపం వస్తుందని టిండారియస్ భయపడ్డాడు. చివరికి ఇతకా రాజైన ఒడీసియస్ (Odysseus) తనకి పెనెలొపి (Penelope)ని ఇచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తే ఒక పరిష్కార మార్గం సూచిస్తానన్నాడు. ఆ మార్గం ఏమిటంటే హెలెన్ ఎవ్వరిని పెళ్లి చేసుకున్నా సరే మిగిలిన రాజులంతా ఆ వివాహాన్ని సమర్ధించాలి. అంతా ఒప్పుకున్నారు. అప్పుడు టిండారియస్ తన కోరిక మేరకు హెలెన్ ని మెనలావూస్ (Menelaus) కి ఇచ్చి పెళ్లి చేసేడు.

మెనలావూస్ కి హెలెన్ ని ఇవ్వడంలో రాజకీయం లేకపోలేదు. మెనలావూస్ ధనవంతుడు. అతనికి పెద్ద సైన్యం ఉంది. పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తి. పెళ్లి విషయంలో కూడా తనంత తానుగా ఎగబడలేదు; తన అన్నగారైన అగమేమ్నాన్ (Agamemnon) ద్వారా వర్తమానం పంపేడు. ఈ అగమేమ్నాన్ మరెవరో కాదు; హెలెన్ కి సాక్షాత్తు మరిది. ఎందుకైనా మంచిదని ఈ పెళ్లి జరిగితే ప్రేమదేవత ఏఫ్రొడైటికి వంద గిత్తలు బలి ఇస్తానని మెనలావూస్ మొక్కుకున్నాడు కూడా. ఆ మొక్కు సంగతి మరచిపోయి ఏఫ్రొడైటి ఆగ్రహానికి గురి అవుతాడు; అది వేరే సంగతి!

ట్రోయ్ నగరపు రాయబారి వర్గంలో ఒక వ్యక్తిగా పేరిస్ చొరబడి స్పార్టాలో ప్రవేశిస్తాడు. పేరిస్ రాజప్రాసాదం లోకి ప్రవేశించే లోగా ఏఫ్రొడైటి అందాల పోటీలో తాను పేరిస్ కి ఇచ్చిన వరం నెరవేర్చడానికిగాను ఈరోస్ (Eros) సహాయం కోరుతుంది. ఈరోస్ తన పువ్వుల బాణంతో హెలెన్ లో కామాతురతని రెచ్చగొడతాడు. ఏఫ్రొడైటి ఇచ్చిన వరం ప్రకారం పేరిస్ ని చూడగానే హెలెన్ ప్రేమలో పడుతుంది. హెలెన్ ని వెంటపెట్టుకుని పేరిస్ ట్రోయ్ వెళ్ళిపోతాడు.

హెలెన్ అపహరణ అనే పని ఆ రోజుల్లో కొత్తేమీ కాదు. ఇటువంటి “స్త్రీ గ్రహణాలు” ఆ రోజుల్లో తరచుగా జరిగేవి. మైసినే (Mycenae) నుండి లో (Lo) అపహరణ, ఫినీషియా (Phoenicia) నుండి యూరోపా (Europa) అపహరణ కేవలం రెండు ఉదాహరణలు. కొల్చిస్ (Colchis) నుండి మీద్యా (Medea) ని జేసన్ (Jason) అపహరిస్తాడు. ట్రోయ్ నగరం నుండి హెరాక్లిస్ (హెర్క్యులిస్) రాకుమారి హీషన్ (Hesione)ని అపహరించి ఆమెని టెలామన్ (Telamon) కి కానుకగా ఇస్తాడు. ఈ అపహరణలు జరిగినప్పుడు పర్యవసానంగా అనుకోని విపత్తులు ఏవీ రాకపోవడంతో హెలెన్ ని దొంగిలించడానికి పేరిస్ కి ధైర్యం వచ్చిందని చరిత్రకారుడు హెరొడోటస్ వ్యాఖ్యానిస్తాడు.

హోమర్ చెప్పిన కథనం ప్రకారం మెనలావూస్ తన స్నేహితుడైన ఒడీసియస్ ని వెంటబెట్టుకుని ట్రోయ్ నగరంతో సంప్రదింపులు జరిపి హెలెన్ ని వెనక్కి తెచ్చుకుందామని ప్రయత్నిస్తాడు. ఆ రాయబారం విఫలం అవుతుంది. ఇది సంగ్రామానికి నాంది అవుతుంది.

రాయబారం విఫలం అవడంతో హెలెన్ వివాహాన్ని రక్షిస్తానని మాట ఇచ్చిన ఆగమేమ్నాన్ ని మాట నిలుపుకోమని మెనలావూస్ అడుగుతాడు. అప్పుడు మెసినాయి కి రాజు అయిన ఆగమేమ్నాన్ గ్రీకు యోధులని సమకూర్చుకుని, వెయ్యి పడవల బలగంతో ట్రోయ్ మీదకి దండయాత్ర చేసి, నగరాన్ని ముట్టడించి, నగరాన్ని పదేళ్ళపాటు దిగ్బంధం చేస్తాడు. ఈ ఘోరమైన యుద్ధంలో అఖ్ఖిల్లీస్ (Achilles), ఏజాక్స్ (Ajax) వంటి గ్రీకు యోధులు, హెక్టర్ (Hector), పేరిస్ (Paris) వంటి ట్రోయ్ యోధులు వీరస్వర్గం పొందుతారు.

యుద్ధంలో పేరిస్ మరణించిన తరువాత హెలెన్ అతని అన్నదమ్ముడైన డియఫోబస్ ని పెళ్లి చేసుకుంటుంది. ట్రోయ్ నగరం పతనమైపోయిన తరువాత డియఫోబస్ ని వదిలేసి తిరిగి మెనలావూస్ తో కలిసి స్పార్టా వచ్చేసి శేష జీవితం గడుపుతుంది.

యుద్ధం ముగిసిన తరువాత ఒడీసియస్ (యులిసిస్) తిరుగు ప్రయాణం చేసి ఇతకా చేరుకుందికి పదేళ్లు పడుతుంది. ఈ తిరుగు ప్రయాణంలో ఒడీసియస్ ఎదుర్కున్న సవాళ్ళని హోమర్ తన రెండవ గ్రంథం “ఆడెస్సి” లో వర్ణిస్తాడు. “ఆడెస్సి” రూఢ్యర్థం మహా ప్రస్థానం. “ఇలియాడ్” రూఢ్యర్థం కష్టకాలం.

సా .శ. పూ .1 వ శతాబ్దంలో రోమ్ కి చెందిన కవి వర్జిల్ “ఎనియాడ్” (Aeneid) అనే గ్రంథంలో యుద్ధం ముగిసిన తరువాత కొందరు గ్రీకు యోధులు, ఎనియస్ నేతృత్వంలో సముద్రం దాటుకుని ప్రస్తుతం టునీషియాలో ఉన్న కార్తేజ్ (Carthage) వచ్చి, అక్కడ నుండి ఇటలీ వచ్చి, రోమ్ నగరం స్థాపనకి కారణభూతులు అవుతారని చెబుతాడు.

పాశ్చాత్యులు హోమర్ రాసిన “ఇలియాడ్” (Illiad), “ఆడెస్సి” (Odessy) లతో వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన “ఇలియాడ్,” “ఆడెస్సి” లు రెండింటి కంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! అంతే కాదు; భారతంలో ఆద్యంతం ఒక కథ ఉంది. ఆ కథ వెనుక ఒక బందుకట్టు ఉంది. భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రోయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది. ట్రోయ్ యుద్ధంలో మానవులు దేవతల చేతిలో కేవలం పావులు. భారతం మీద వ్యాఖ్యానాలు చేసిన అనేక పాశ్చాత్యులు గ్రీకు పురాణ గాథల వల్ల ప్రభావితులై గ్రీకు పురాణ కాలపు పట్టకం ద్వారా చూస్తూ చేసేరు తప్ప స్వతంత్రమైన దృక్పథంతో చేసినవారు కారని కొందరి అభిప్రాయం.

ట్రోయ్ సంగ్రామం నిజమా? కల్పనా?

[మార్చు]

మహాభారతం యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రోయ్ సంగ్రామం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? యుద్ధంలో కనిపించే సంఘటనలు, పాత్రలు (మనుష్యులు, దేవతలు) నిజామా? కల్పనా? ఈ యుద్ధం గురించి ఎవ్వరు రాసేరు? ఎప్పుడు రాసేరు? వగైరా, వగైరా!

ఈ యుద్ధం గురించి మనకి ఉన్న ముఖ్యమైన ఆధారాలు గ్రీకు సాహిత్యంలో కనిపిస్తాయి; కానీ ఏ ఒక్క చోట మనకి సాధికారంగా ఆధారాలు కనబడవు. ఈ యుద్ధం నిజంగా జరిగి ఉంటే అది సా. శ పూ. 1194-1184 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చని గ్రీకు శాస్త్రవేత్త ఎరతోస్తనీస్ వేసిన అంచనా నమ్మదగ్గదే అనడానికి అధారాలు కనిపిస్తున్నాయని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అనగా, కంచు యుగపు చివరి దశలో అని మనం చెప్పుకోవచ్చు.

సా. శ. 1870 లో జెర్మని దేశపు పురావస్తు పరిశోధకుడు హైన్రిక్ షులైమన్ ( En:Heinrich Schliemann ) పశ్చిమ టర్కీలో (ట్రోయ్ నగరపు సమీపంలో) జరిపిన తవ్వకాలలో ఒక శిధిలమైన కోట దిబ్బ, దాని చుట్టూ 25 మీటర్ల లోతు వరకు శిధిలమైన భవనాల అవశేషాలు కనిపించేయి. వాటి చుట్టూ 46 ఇతర వాటికలు కనిపించేయి. ఇటీవల జరిపిన మరికొన్ని తవ్వకాలలో కనబడ్డ ఒక పురాతన నగరం హైన్రిక్ షులైమన్ కనుక్కున్న నగరం కంటే పదింతలు పెద్దది అని తెలిసింది. ఈ నగరం ఉన్న ప్రాంతాలలో సా. శ. పూ. 3000 నుండి సా. శ. పూ. 1350 వరకు అవిరామంగా జనావాసాలు ఉండేవని తీర్మానించేరు. అంతేకాదు. సా. శ. పూ. 1180 కి సంబంధించిన స్తరాలలో వేడికి మాడిపోయిన అవశేషాలు, మానవ ఆస్థి పంజరాలు కనిపించడంతో అవి ఎదో యుద్ధానికి సంబంధించినవే అయంటాయని నమ్ముతున్నారు.

ఈ నగరం గురించి, అక్కడ జరిగిన యుద్ధం గురించి, ఆనోటా, ఈనోటా, జానపదులు నోటా 400 సంవత్సరాల తరువాత విన్న కథలని హోమర్ ఇలియడ్, ఆడెస్సి అనే రెండు ఉద్గ్రంథాలలో పొందుపరచి ఉంటాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలియడ్ సంకలనం సా. శ పూ. 750 లోను, ఆడెస్సి సంకలనం సా. శ పూ. 725 లోను పూర్తి అయి ఉంటాయి. ఇలా సంకలించబడ్డ కథల సమాహారం లిఖిత రూపం దాల్చేసరికి మరికొన్ని దశాబ్దాలో, శతాబ్దాలో పట్టి ఉండవచ్చు.

అసలు హోమర్ అనే వ్యక్తి ఉన్నడా అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని గ్రీకు మాండలికాలలో “హోమర్” అంటే గుడ్డివాడు అని అర్థం వస్తుంది కనుక “హోమర్” గుడ్డివాడయి ఉంటాడని కొందరి తీర్మానం. ఎందుకంటే ఆడేస్సి లో ఒక చోట ఒక అంధుడు పాత్ర వచ్చి యుద్ధంలోవిశేషాలని కథల రూపంలో చెబుతాడు. హోమర్ ఈ విధంగా తాను చెబుతున్న కథలో తానే ఒక పాత్రలా వచ్చేడని వీరి అభిప్రాయం. వ్యాసుడు కూడా భారత కథలో అక్కడక్కడ “అతిథి నటుడు” గా వస్తూ ఉండడం గమనార్హం.

ఈ కథని చారిత్రక పరిశోధన కోణం నుండి విశ్లేషించడం కష్టం. ఈ కథలో తారసపడే చాల పాత్రలు దైవాంశ సంభూతులు (demigods) - అనగా దేవతలు, మానవులు కలవగా పుట్టినవారు. ఉదాహరణకి హెలెన్ ఒలింపియను దేవత అయిన జూస్ ఒక హంస రూపంలో వచ్చి మానవ వనిత లేడాని బలవంతం చెయ్యగా పుట్టిన సంతానం. అదే విధంగా హెలెన్ ని పేరిస్ వశపరచుకోడానికి టైటన్ దేవత ఏఫ్రొడైటి ఇచ్చిన వరం కారణభూతం అవుతుంది. ఈ రకం సంఘటనలు నిజ జీవితాలలో జరగడం అనేది మన అనుభవాలకి అతీతం. అలాగే యుద్ధం పది సంవత్సరాలు జరుగుతుంది. కంచు యుగంలో ట్రోయ్ నగరాన్ని పది రోజులు దిగ్బంధం చేసేరంటే నమ్మవచ్చేమోకాని పదేళ్లు కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది.

ఈ సమాచారం అంతటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ట్రోయ్ అనే నగరం ఉండి ఉండవచ్చు. ఆ నగరం వద్ద పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధం జరగడానికి హెలెన్ అనే అందమైన ఆడదానిని పేరిస్ అనే యువకుడు అపహరించడం కారణం అయి ఉండవచ్చు. ఆ యుద్ధంలో గ్రీకు సైనికులు ఒక కొయ్య గుర్రంలో దాగుని దొంగచాటుగా ట్రోయ్ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని నాశనం చేసి ఉండవచ్చు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కావచ్చు. కానీ ఈ కథలో కనిపించే దేవతలు, వారికీ మానవులకి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు మన అనుభవ పరిధిలో నమ్మడానికి వీలు లేనివి. వీటిని కవి కల్పించిన ఉత్ప్రేక్షలు అనే అనుకోవాలి.

ఇలియాడ్

[మార్చు]

హోమర్ రాసిన ఇలియాడ్ లో కథనం గ్రీసు సేనలకి, ట్రోయ్ సేనలకి మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. కవి సాహిత్యాధి దేవత అయిన “మూజ్” ని ప్రార్ధించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన అఖ్ఖిల్లీస్ కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో గ్రంథ రచన ప్రారంభం అవుతుంది.

యుద్ధం మొదలయి తొమ్మిదేళ్లు గడచిన తరువాత గ్రీకు సైన్యం ట్రోయ్ మిత్రరాజ్యం అయిన క్రిసి ని ముట్టడించి లొంగదీసుకుంటుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన ఇద్దరు కన్యలు - క్రిసేయిస్ (En:Chryseis), బ్రెసేయిస్ (En:Briseis) - గ్రీకుల వశం అవుతారు. గ్రీకుల సేనాధిపతి అగమేమ్నాన్ క్రిసేయిస్ ని తనకి దక్కిన బహుమానంగా తీసుకుంటాడు. అఖ్ఖిల్లీస్ బ్రెసేయిస్ ని తీసుకుంటాడు. క్రిసేయిస్ తండ్రి క్రిసెస్ - సాక్షాత్తు ఒలింపాయన దేవుడైన అప్పాలోకి హితుడు - కూతురు బంధ విమోచనకి అగమేమ్నాన్ కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పణంగా పెడతాడు కానీ అగమేమ్నాన్ లొంగడు. తన హితునికి ఎదురవుతున్న పరాజయం చూడగానే అప్పాలోకి కోపం వచ్చి అగమేమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపిస్తాడు.

తమ సేనలు ఎండలలో పిట్టలలా రాలిపోతూ ఉంటే చూసి, కంగారుపడి, అఖ్ఖిల్లీస్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్చస్ (Calchas) అనే దైవజ్ఞుడు లేచి, “ఇదంతా అప్పాలో శాపం వల్ల జరుగుతోంది” అని చెబుతాడు. అప్పుడు అగమేమ్నాన్ - అయిష్టంగానే - క్రిసేయిస్ ని వదలుకుందుకి ఆమోదిస్తాడు; కానీ ఒక మెలిక పెడతాడు. ఏమిటా మెలిక? తాను క్రిసేయిస్ ని వదులుకుంటే ఆ స్థానంలో అఖ్ఖిల్లీస్ తనకి బ్రెసేయిస్ ని ఇచ్చెయ్యాలి! ఈ వంకాయల బేరం విని అఖ్ఖిల్లీస్ కోపోద్రేకుడయి, కత్తి దూసి, అగమేమ్నాన్ తో ద్వంద్వ యుద్ధానికి తయారవుతాడు. ఒక పక్క ట్రోయ్ సేనలు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు ఒలింపాయని దేవత హేరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని ఎథీనాని పంపుతుంది. నెస్టర్ సహాయంతో ఎథీనా చేసిన హితోపదేశం అఖ్ఖిల్లీస్ కోపాన్ని చల్లార్చుతుంది. తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకుంటాడు. అఖ్ఖిల్లీస్ తన కోపం చల్లారక ముందే తన తల్లి అయిన సముద్రపు “జలకన్య” థేటిస్ ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్ నుండి సహాయం అర్థించమని అడుగుతాడు.

ఇది ఇలా ఉండగా అగమేమ్నాన్ క్రిసేయిస్ ని ఆమె తండ్రి దగ్గరకు పంపేసి, బ్రెసేయిస్ ని తన దగ్గరకి రప్పించుకుంటాడు. ఒడీసియస్ తన పడవలో క్రిసేయిస్ ని తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించగా, అతను సంతృప్తి చెందిన వాడై గ్రీకు సైనికులని శాపం నుండి విముక్తి చెయ్యమని అప్పాలోని కోరుకుంటాడు. గ్రీసు కీ ట్రోయ్ కి మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణకి ఒప్పందం జరుగుతుంది.

గ్రీకు సేనలకి, ట్రోయ్ సేనలకి మధ్య యుద్ధం ఆగింది కానీ అఖ్ఖిల్లీస్ కి అగమేమ్నాన్ కీ మధ్య విరోధ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దేవతల రాజైన జూస్ ని కలుసుకోడానికి థేటిస్ కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హేరాకి కోపం వస్తుంది; ఆమె గ్రీకుల పక్షం! కాని థేటిస్ కోరికని కాదనలేకపోయాడు, జూస్. హేరాకి కోపం రానే వచ్చింది. మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ హేరాకి హితోపదేశం చేస్తాడు.

ఈలోగా ట్రోయ్ పక్షం వారు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు జూస్ ట్రోయ్ పక్షం వహించి వారికీ సహాయం చెయ్యడానికి వస్తాడు. జూస్ ట్రోయ్ పక్షం కాయడం, అఖ్ఖిల్లీస్ అస్త్ర సన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కుర్చోవడం వల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోతారు. చాల రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలావుస్ ల మధ్య, హెక్టర్-ఏజాక్స్ ల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రోయ్ సైన్యాలు గ్రీకు సేనా వాహినిని తరిమి కొట్టాయి.

భారత యుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాల వారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఆ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రోయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీసు సేనలు పడవలలో ఎక్కి పారిపోతారు. ఆ హడావిడిలో ఒక కొయ్య గుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రోయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక అభిజ్ఞానం అనుకుంటూ దానిని ఈడుచుకుని పట్టణపు లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్లిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనా వాహిని బయటకి వచ్చి ట్రోయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి పోతారు.

భారత యుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల అహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.

మూలాలు

[మార్చు]