దీవి గోపాలాచార్యులు

వికీపీడియా నుండి
(డి.గోపాలాచార్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డి.గోపాలాచార్యులు
పండిత
జననంఅక్టోబరు 10, 1872
మరణంసెప్టెంబరు 29, 1920
జాతీయతభారతదేశం
వృత్తిఆయుర్వేద వైద్యులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠం పూర్వాధ్యక్షులు, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి

దీవి గోపాలాచార్యులు (అక్టోబరు 10, 1872 - సెప్టెంబరు 29, 1920) వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు, ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు. 1917లో ఆయన అఖిల భారతాయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా ఆయుర్వేద అభివృద్ధికి కృషిచేశారు. వైద్యరత్న, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి బిరుదు పొంది ప్రఖ్యాతిచెందారు.[1] ఆయుర్వేద వైద్యానికి ప్రఖ్యాతిపొందిన గోపాలాచార్యులు దేశవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడంలోనూ, విస్తృతమైన వ్యాప్తికి కృషిచేయడంలోనూ ప్రశస్తిపొందారు. గోపాలాచార్యులు పలు జాతీయ సదస్సుల్లో, కార్యకలాపాల్లో ప్రసంగాలు చేశారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఈయన స్వగ్రామం. కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం (దివిసీమ) లోని భావదేవరపల్లి గ్రామం . అయితే బందరులో 1872, అక్టోబరు 10 న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసానంతరం. 1886 లో తిరుపతి వెళ్ళి మహంతు పాఠశాలలో కొంతకాలం చదివారు. సంస్కృత భాషాధ్యయనం పూర్తి చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఆ సందర్భంలోనే సాటి ప్రజల ఆరోగ్య సమస్యలను అవగాహన చేసుకొని వైద్య పరిశోధనల ల్పట్ల మక్కువ పెంచుకున్నారు. సామాజిక సేవకు ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్య విధానమే ఉత్తమమని నిర్థారణకు వచ్చారు.

పరిశోధనలు[మార్చు]

కర్ణాటక రాష్ట్రం చేరి, మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరి, ఆయుర్వేద వైద్య విద్యార్థిగా విద్యాభ్యాసం చేశారు. ప్రాచీన హిందూ వైద్య శాస్త్రాలలో ప్రధాన విభాగంగా రూపొందింన ఆయుర్వేద వైద్య చికిత్సా శాస్త్రమును ఆపోసన పట్టారు. 1893 లో వైద్య విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని రెండేళ్ళపాటు విస్తృతంగా దేశపర్యటనలు చేశారు. పర్యటనలు చేస్తూనే నగరాలలోని, కుగ్రామాలలోని భిషగ్వర్యులను శుశ్రూషతో సేవించి, వైద్య పరిశోధనలు చేశారు.

ఆయా ప్రాంతములలోని ప్రకృతివనరులను, మూలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ సమయంలో (1894-95) కలరా, ప్లేగు వ్యాధులు దేశమంతా వ్యాపించి ఉన్నాయి. సరైన చికిత్స, ప్రామాణిక మందులు లేక వందలాది మంది మృత్యువాత పడటం చూసిన ఈయన మనసు తల్లడిల్లిపోయింది.

బెంగళూరు లోని ధియోసాఫికల్ సొసైటీ వారి ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చాలాకాలం వైద్య సేవలు అందిస్తూ, ప్రత్యక్ష శాస్త్రానుభవాన్ని సంపాదించారు. 1898-99 లో బెంగళూరు నగరాన్ని కూడా గొప్ప భయంకర ప్లేగు వ్యాధి చుట్టుముట్టింది. ప్రజల్లో భయాందోళనలు నెలకొని హాహాకారాలు చేసారు. ఇదే సమయంలో మైసూరు మహారాజు ఈయనను రాష్ట్ర ఆస్థాన చికిత్సకులుగా నియమించారు.

ప్లేగు మందు ఆవిష్కణ[మార్చు]

ప్లేగు, కలరా వ్యాధుల నిరోధానికి ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించుకొని "శతధౌత ఘృతం" "హైమాది పంక్రమ్‌ (పానకం)" అనే రసాయనాలను సృష్టించి ఔషధ రూపంలో వ్యాధిగ్రస్తులకు అందించారు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు ఒకకూర్చారు.

ఆయుర్వేదాశ్రమము[మార్చు]

తర్వాత కొద్దికాలానికి చెన్నపట్టణం చేరి, శ్రీకన్యకా పరమేశ్వరి ఆయుర్వేద కాలేజి అండ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా, వైద్యులుగా పనిచేశారు. ఇంగ్లీషు రాకున్నా ఎనిమిది భారతీయ భాషలు మీద సాధికారత సంపాదించుకున్నారు. వైద్యులుగా పనిచేస్తున్న సమయంలోనే గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదించుకొని, మద్రాసులోనే ఆయుర్వేదాశ్రమమును నెలకొల్పారు. మరణించేవరకు అక్కడే ఉన్నారు. మద్రాసు ఆయుర్వేద కాలేజీకి కొంతకాలం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఆయుర్వేదాంగ శల్యతంత్రము[2] అనే గ్రంథం రచించారు.

రచనలు[మార్చు]

దేశీయ ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం తీసుకు రావాలనే మహదాశయంతో "ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల"ను ఏర్పాటు చేసి వివిధ భారతీయ భాషలలోని ప్రాచీన గ్రంథాలను సేకరించి, ఎంతో అరుదైన వాటిని అనువదింపజేశారు. ఈ గ్రంథమాల నుంచి దాదాపు 22 అతి ముఖ్యమైన వైద్య శాస్త్ర గ్రంథాలు వెలువడినాయి. వీటిలో మాధవ నిదానం, అర్క ప్రణాళిక, ఆయుర్వేద వైద్య పరిభాష, రస ప్రదీపిక, భేషకల్పం మొదలైన శీర్షికలతో ప్రాచీన హిందు వైద్య గ్రంథాలకు తెలుగులో చక్కని వ్యాఖ్యానాలు జోడించి, వివరించారు.

ఆయుర్వేద వైద్య చికిత్సకు దేశస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అపర ధన్వంతరిగా పేరు సంపాదించారు. ఆధునిక కాలంలో ఆయుర్వేద వైద్య చికిత్సకు పునరుజ్జివం కల్పించారు. యావన్మందికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, వివిధ రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ఎన్నో రకాల మందులను అద్భుత శైలిలో ఆవిస్కరించి, చిరకీర్తిని పొందారు.

వైద్యసేవలకు గుర్తింపు[మార్చు]

ఈయన వైద్య సేవలు గుర్తింపు పొందగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈయనకు అపూర్వమైన ఘన సన్మానాలు చేశారు. నాసిక్ (ప్లేగు వ్యాధితో అట్టుడికి పోయిన పట్టణం) లో "ఆయుర్వేద మార్తాండ", కలకత్తాలో "భిషజ్ఞణి" బిరుదులు అందుకున్నారు (1907), అయిదవ జార్జి బ్రిటీష్ పాలక ప్రభుత్వం తరపున "వైద్యరత్న" బిరుదును అందించి (1913) ప్రతిష్ఠాత్మక గౌరవ మన్ననలు అందించారు.

సేవలు[మార్చు]

ఆయుర్వేద వైద్య జగత్తుకు ప్రచారం కల్పించటానికి అహరహం కష్టించారు. ఈయన జీవితమే భారతదేశ ఆయుర్వేద చరిత్రగా భాసిల్లింది. ఏక సంధాగ్రాహి, అవిశ్రాంత వైద్య పరిశోధకులు కావటంతో 1919 లో "శ్రీ ధన్వంతరి" పక్ష పత్రికను స్థాపించి ఆంధ్ర దేశమంతటా వ్యాపింపజేశారు. ఆయుర్వేద వైద్య ప్రచారానికి అహరహం కష్టిస్తూ తమ సంపాదనంతటినీ వ్యయపరిచారు. "ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్"కు అధ్యక్షులుగా కొద్దికాలం ఉన్నారు. ముఖ్యంగా దక్షిణా పథంలో ఆయుర్వేద వైద్యానికి పునఃప్రాణప్రతిష్ఠ చేసి, యావధ్భారత ఖ్యాతి గాంచిన ఏకైక ఆంధ్రుడు. అయితే, ఈ మాత్రం చారిత్రక గుర్తింపుకు నోచుకోలేదు.

మరణం[మార్చు]

ఆయుర్వేద వైద్య ప్రక్రియలో నూతన ఆవిష్కారాలు చేసిన ఈయన 1920, సెప్టెంబరు 29 న మృతి చెందారు. మైసూర్, మద్రాస్ లలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజీలలో ఆయుర్వేదబోధనకు ప్రత్యేకించి ప్రొఫెసర్ పదవులను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన మహానుభావుడు ఈయన.

సూచికలు[మార్చు]

  1. డి., గోపాలాచార్యులు (1917). అభిభాషణము. చెన్నై. Retrieved 13 March 2015.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  2. గోపాలాచార్యులు, దీవి. ఆయుర్వేదాంగ శల్యతంత్రము.

మూలాలు[మార్చు]

  • గోపాలాచార్యులు, దీవి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 161-2.

మూస:Authority Control