Jump to content

డి. కె. అరుణ

వికీపీడియా నుండి
డి. కె. అరుణ
డి. కె. అరుణ


పార్లమెంట్ సభ్యురాలు (లోక్ సభ)
పదవీ కాలం
2024-ప్రస్తుతం
నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-04) 1960 మే 4 (వయసు 64)
ధన్వాడ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు చిట్టెం నర్సిరెడ్డి
జీవిత భాగస్వామి డీకే భరతసింహారెడ్డి
బంధువులు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి (సోదరుడు), చిట్టెం పర్ణికారెడ్డి (మేనకోడలు)
సంతానం ముగ్గురు కుమార్తెలు
నివాసం గద్వాల
మతం హిందూ, రెడ్డి
వెబ్‌సైటు www.dkaruna.com

డి.కె.అరుణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, రాష్ట్ర మాజీ మంత్రి. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. 2009 శాసనసభ ఎన్నికల నంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళానేతగా పేరు సంపాదించింది. పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రాజకీయాలలో పేరుపొందినవే. తండ్రి, సోదరుడు ఇదివరకు మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, మామ, భర్త గద్వాల నుంచి ఎన్నికైనారు. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి, గద్వాల అసెంబ్లీకి రెండు సార్లు ఓడిపోయిననూ 2004లో తొలిసారి గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టగా మళ్ళీ 2009లో రెండో సారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా[1] నియమించబడింది.13 మే 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజక వర్గం నుండి ప్రాతి నిధ్యం వహిస్తుంది.

బాల్యం, కుటుంబం

[మార్చు]

డి.కె.అరుణ 1960, మే 4న నారాయణపేట జిల్లా ధన్వాడలో జన్మించింది.[2] తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యుడిగా ఉంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నారాయణపేటలో నక్సలైట్ల కాల్పులకు గురై మరణించాడు. సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో ప్రవేశించాడు. భర్త డి. కె. భరతసింహారెడ్డి, మామ డి. కె. సత్యారెడ్డిలు కూడా పేరుపొందిన రాజకీయనేతలు. వీరిరువురూ గతంలో గద్వాల నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

డి.కె.అరుణ 1996లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో 3700 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[4] 1998లో కాంగ్రెస్ తరఫున అదే స్థానంలో పోటీచేసి మళ్ళీ పరాజయం పొందింది. ఆ అనంతరం 1999లో గద్వాల శాసనసభ స్థానంలో పోటీచేసి టిడిపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో ఓడిపోయింది. 2004లో కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించింది.[5] 2004లో అరుణకు జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం. సమాజ్‌వాదీ పార్టీ తరఫున గెలిచిననూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగింది. దీనితో 2007 ఫిబ్రవరిలో సామాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది.[6] 2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినది.[7] గద్వాల మండల అధ్యక్షుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈమెకు వరుసకు అల్లుడు కావడం గమనార్హం. 2009 ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరఫున ఇద్దరికి స్థానం లభించగా డి.కె.అరుణకు చిన్నతరహా పరిశ్రమలు, చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖా మంత్రిపదవి లభించింది.ఆమె 2014లో గద్వాలలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైంది.[8]

డికె అరుణ 2019 మార్చి 19న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[9][10] ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. డీకే అరుణ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా 2020 సెప్టెంబరు 27న నియమితురాలైంది.[11]

2024లో 18వ.లోక్ సభ మహబూబ్ నగర్ లోక్ సభ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డి.కె.అరుణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వంశీచంద్ రెడ్డి పై 4,వేల 500 మెజారిటీ ఓట్ల తో గెలుపొందాడు.[12]

వివాదం

[మార్చు]

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ డీకే అరుణ హైకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ జరపిన హైకోర్టు 2023 ఆగస్టు 24న తప్పుడు సమాచారం ఇచ్చిన కృష్ణ మోహన్‌ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించి, పిటిషనర్‌ డీకే అరుణకు పిటిషన్‌ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.[13][14]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
  2. Eenadu (25 October 2023). "ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  3. Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-13. Retrieved 2009-05-26.
  5. Eenadu (26 October 2023). "అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-04. Retrieved 2009-05-26.
  7. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  8. EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  9. Sakshi (20 March 2019). "బీజేపీలో చేరిన డీకే అరుణ". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  10. 10TV (20 March 2019). "బీజేపీలో చేరిన డీకే అరుణ: మహబూబ్‌నగర్ నుంచి పోటీ!" (in telugu). Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  11. Mana Telangana (26 September 2020). "బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డికె అరుణ". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  12. "D K Aruna". Samayam Telugu. Retrieved 2024-06-05.
  13. Andhra Jyothy (25 August 2023). "ఎమ్మెల్యే బండ్ల ఎన్నిక చెల్లదు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  14. A. B. P. Desam (24 August 2023). "గద్వాల ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత - ఎమ్మెల్యేగా డీకే అరుణ !". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.

బయటి లింకులు

[మార్చు]