తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
తాడేపల్లి is located in Andhra Pradesh
తాడేపల్లి
తాడేపల్లి
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 16°28′49″N 80°37′08″E / 16.480326°N 80.618764°E / 16.480326; 80.618764
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి జ్యోతి
జనాభా (2011)
 - మొత్తం 3,998
 - పురుషుల సంఖ్య 1,950
 - స్త్రీల సంఖ్య 2,048
 - గృహాల సంఖ్య 1,022
పిన్ కోడ్ 520012
ఎస్.టి.డి కోడ్ 0866

తాడేపల్లి, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన విజయవాడ గ్రామీణ నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1022 ఇళ్లతో, 3998 జనాభాతో 753 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1950, ఆడవారి సంఖ్య 2048. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 936 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 651. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589209. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [1] [2].దీనిని కొత్తూరు తాడేపల్లి (కె.తాడేపల్లి) అని కూడా అంటారు.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[3]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం[మార్చు]

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

పైడిపాడు 5 కి.మీ, పాతపాడు 6 కి.మీ, అంబాపురం 6 కి.మీ, ఏలప్రోలు 7 కి.మీ, రాయనపాడు 7 కి.మీ

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

తాడెపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. విజయవాడ, ఎ.పి.ఎస్.ఆర్టీ.సి పెద్ద రోడ్డురవాణా సౌకర్యం గల పెద్ద కూడలి. సమీపరైల్వేస్టేషన్; రాయనపాడు, కొండపల్లి, విజయవాడ 8 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల విజయవాడలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

పాఠశాలలు[మార్చు]

 1. శ్రీ షణ్ముఖ వేదవిద్యాలయం:- ఈ పాఠశాలలో కృష్ణయజుర్వేదం, స్మార్తం కోర్సులు ఉచితంగా బోధించెదరు. ఉచిత వసతి భోజనసౌకర్యాలు కల్పించెదరు. ఈ పాఠశాలలో ప్రవేశం కోరే విద్యార్థుల కనీస వయస్సు 9 సంవత్సరాలు ఉండవలెను.
 2. అలిగినేని పెద ముత్తయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.
 3. సి.యస్.సి, ఎం.పి.పి అనుబడే రెండు ప్రభుత్వ పాఠశాలలు.
 4. సెయింట్ బెనెడిక్స్ అనుబడే ప్రైవేట్ పాఠశాల.
 5. గ్రామం ఒక జిల్లా పరిషత్ హై స్కూల్, ఒక మిషనరీ హై స్కూల్, రెండు ప్రాథమిక పాఠశాలలు బాలుర, బాలికలు విద్యా అవసరాలు తీర్చటానికి. ఉన్నత విద్య కోసం నివాసితులు విజయవాడకు వెళ్ళాలి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

తాడెపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

వడ్డీవాగు[మార్చు]

ఈ వాగులో పూడికతీత పనులను 2017,జూన్-18న ప్రారంభించారు. దీనితోపాటు కొత్తచెరువు కళింగు నుండి కవులూరు కళింగు వరకు కాలువలో పూడికను, గుర్రపుడెక్కను తొలగించెదరు. సుమారు ఆరున్నర లక్షల రూపాల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టినారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

 • ఈ గ్రామ పంచాయతీకి 2013జూలైలో జరిగిన ఎన్నికలలో ఇస్తావతు జ్యోతి సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా దొంతగాని వెంకటేశ్వరరావు ఎన్నికైనాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

 • శ్రీ భవానీశంకరస్వామివారి ఆలయం: తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణోత్సవాలలో భాగంగా, సుందర హనుమాన్ ధార్మిక పరిసత్తు ఆధ్వర్యంలో, 2017, ఏప్రిల్-23వతేదీ ఆదివారంనాడు, ఈ ఆలయంలో, శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేసారు.
 • ఆంజనేయ స్వామి ఆలయం
 • కాళి మాత ఆలయం
 • రామాలయాలు -3

శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం:

ఆంజనేయస్వామి - కేవలం ఈ పేరు పలికినంతలోనే పసివారి నుంచి పండు ముసలివారి హృదయాలు సైతం ఉత్తేజపూరితాలవుతాయి. నూతనోత్సాహం పెల్లుబుకుతుంది. మాటలకందని ఓ దివ్యతేజస్సు నిద్రిస్తున్న జీవచైతన్యాన్ని మేల్కొలిపి, మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తుంది. అభద్రతాభావం తొలగి, కొండంత అండ మనచెంతనే ఉందన్న ధైర్యం కలుగుతుంది. ఇలా ఉచ్చారణ మాత్రంగానే తన భక్తులను వెన్నంటిఉండి కాపాడుకునే వీరాంజనేయస్వామి ప్రతిగ్రామంలోను, ప్రతి వాడలోను అనేక రూపాలలో కొలువై ఉండి, అడుగడుగునా దర్శనమిస్తుంటారు. ఇలా, భక్తులు ఆరాధించే అనేక రూపాలలో పంచముఖ వీరాంజనేయ రూపం విశేషమైంది. ఈ అవతారంలో స్వామి మ¬గ్రరూపంలో దర్శనమిస్తారు.

పంచముఖ వీరాంజనేయస్వామి ఆలయాలు మనకు బహుతక్కువగా కనిపిస్తాయి. అటువంటి ఉత్తమక్షేత్రాల్లో మనకు అత్యంత చేరువలో ఉన్న ఆలయం కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ బడబానల పంచముఖ వీరాంజనేయస్వామి వారి ఆలయం. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయాన్ని చూడగానే మనకు ఆధ్యాత్మిక భావన కలిగి, లోనికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనే తలంపు కలుగుతుంది. సకల భక్తజనుల మనోభీష్టాలను సిద్ధింపజేయటం వలన 'సిద్ధక్షేత్రం'గాను, భవిష్యత్‌ బ్రహ్మ కొలువైఉండడం వల్ల 'బ్రహ్మక్షేత్రం'గాను కొత్తూరు తాడేపల్లిలోని శ్రీబడబానల పంచముఖ వీరాంజనేయస్వామివారి దేవస్థానం విశేషఖ్యాతి పొందింది.

ఈ ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. తమ చిన్ననాటి నుంచి శాస్త్రిగారు పంచముఖ హనుమదుపాసనలో స్వామిని సేవించేవారు. ఎన్నో జన్మల తపస్సు ఫలించి, ఈ జన్మలో స్వామి వారి సాక్షాద్దర్శన భాగ్యాన్ని పొందారు. అంతేకాదు, స్వామితో నిత్యం నేరుగా సంభాషించే అద్భుతవరసిద్ధిని కూడా పొందిన దివ్యతపశ్శక్తి సంపన్నులు శ్రీశాస్త్రిగారు. అనుక్షణం స్వామి వారి దివ్య మంత్రోపాసన తప్ప అన్యమెరుగని అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన నేపథ్యం వారిది. స్వామివారి ఆదేశానుసారం శ్రీ శాస్త్రిగారు సా.శ.1957వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించి, అదే సంవత్సరంలో అనగా హేవిళంబి నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి, శుక్రవారం (ది.24.05.1957) హనుమజ్జయంతి పర్వదినాన శ్రీ బడబానల పంచముఖ వీరాంజనేయస్వామివారి మూలవిరాట్‌ను ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఆలయంలో అర్చన, నిత్య ధూప దీప నైవేద్యాది కార్యక్రమాలను శాస్త్రిగారు తామే స్వయంగా నిర్వహించేవారు.

తొలుత, అతి చిన్నగా కేవలం గర్భగుడి మాత్రమే కలిగిన ఈ ఆలయానికి క్రమంగా దాతల సహకారంతో ముఖమండపం నిర్మించడం జరిగింది. స్వామివారి ఆదేశానుసారం క్రమంగా ఆలయంలో వక్రతుండ మహాగణపతి స్వామి, దుర్గాదేవి, కాళీమాత, భవానీ శంకరస్వామి, పట్టాభిరామచంద్రమూర్తి, పంచముఖ లక్ష్మీగణపతి స్వామివార్ల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి, ఆలయాన్ని సకల దేవతాశక్తి కేంద్రంగా తీర్చిదిద్దారు. నిత్యకార్యక్రమాలతో పాటుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శాస్త్రిగారు. అనేక యజ్ఞయాగాది క్రతువులను కూడా నిర్వహించారు. శ్రీరామయజ్ఞం, శ్రీ శివయజ్ఞం, కోటి గాయత్రీ యజ్ఞం, కోటి కుంకుమార్చన, శ్రీమద్రామాయణ హవన జ్ఞానయజ్ఞం, కొన్ని వందలసార్లు సుందరకాండ హవన జ్ఞానయజ్ఞాలు, శ్రీయాగం వాటిలో ముఖ్యమైనవి.

భక్తుల సమస్యలను శాస్త్రిగారు స్వయంగా స్వామివారికి నివేదించి, వారికి తరుణోపాయాలను సమాధానంగా చెప్పేవారు. ఈవిధంగా స్వామిని ఆశ్రయించిన ఎందరో వివాహార్థులు, సంతానార్థులు, విద్యార్థులు, దీర్ఘవ్యాధిపీడితులు, దుష్టగ్రహ పీడితులు.. ఎందరో వారివారి బాధల నుంచి విముక్తి పొంది, స్వామిని సేవించుకుంటూ జన్మచరితార్థం చేసుకుంటున్నారు. తమ జీవన సర్వస్వాన్ని హనుమత్సేవకే అంకితం చేసిన శాస్త్రిగారి భక్తికి మెచ్చిన స్వామివారు శాస్త్రిగారికి ఇలా వరమిచ్చారు - 'నేను ఈ క్షేత్రంలో 500ల సంవత్సరాలు నిలబడి ఉండి, సకల భక్తజనుల మనోరథాలు నెరవేరుస్తానని రామపాద సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధికెక్కుతుంది.' ఈవిధమైన దివ్యవరాన్ని పొందిన శ్రీ యోగానంద వీర ధీర సుందర హనుమచ్ఛాస్త్రిగారు (శాస్త్రిగారి దీక్షానామం) ధన్యజీవులై 1988వ సం||లో హనుమత్సాయుజ్యాన్ని చేరుకున్నారు.

శాస్త్రిగారి అనంతరం ఆలయ నిర్వాహణాబాధ్యతను వారి జ్యేష్ఠకుమారుడు శ్రీ కప్పగంతు లక్ష్మీనారాయణ తండ్రి చూపిన మార్గంలో చేపట్టారు. వీరి ఆధ్వర్యంలో ఆలయానికి 1994వ సం||లో శిఖర, ధ్వజస్తంభ నిర్మాణము, ప్రతిష్ఠలు 'బ్రహ్మయజ్ఞం పేరుతో అత్యంత వైభవంగా జరిగాయి. వీరి ఆధ్వర్యంలోనే ది.05.04.2004 నుంచి ది.25.04.2004 వరకు 21 రోజుల పాటు విశ్వమానవ కల్యాణమనే సంకల్పంతో శతహనుమచ్చండీ యాగ పూర్వక అతిరుద్రీయ మహాయాగం' అత్యంత వైభవంగా జరిగింది. ఈ యాగంలో ప్రధాన విశేషం ఏమిటంటే.. ఇంతవరకు ఎక్కడాలేని విధంగా 11 అడుగుల ఎత్తులో మృత్తిక, సైకతం, 108 రకాల ఓషధులతో దివ్యలింగాన్ని నిర్మించి, అర్చించడం. ఈ స్వామి నామధేయం 'ఓషధీశ్వరుడు'. ఈ స్వామికి అతిరుద్రసంఖ్యలో అనగా 14,641 నమకాలు, 1331 చమకాలతో అత్యంత వైభవంగా అభిషేకార్చనాది కార్యక్రమాలు జరిగాయి. ఈ యాగంలో మరో విశేషం - హనుచ్చండీ¬మం. ఈ హోమాన్ని ఇంతవరకు ఎవరూ చేసి ఉండలేదు. శాస్త్రిగారి ఉపదేశానుసారం లక్ష్మీనారాయణగారు ఈ హోమాన్ని నిర్వహించారు.

ఆలయ చరిత్రలో మరో ప్రధాన ఘట్టం.. అష్టోత్తర శతకుండ శ్రీమద్రామాయణ శ్లోకహవన పూర్వక శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు. ది.13.01.2008 నుంచి 28.01.2008 వరకు అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ పట్టాభిషేక మ¬త్సవాలు మొత్తం పరగణాలోనే చారిత్రక ఘట్టంగా నిలిచాయి. నభూతో అన్నరీతిలో జరిగిన ఈ మహాయాగంలో చండీ, రుద్ర ¬మాలు, శ్రీచక్ర నవావరణార్చన, అరుణ¬మం, మహావిద్యపారాయణ, గణపతి ¬మం వంటి అర్చనాది కైంకర్యాలెన్నో జరిగాయి. వీటితోపాటు విశేష కార్యక్రమాలు 108 మంది కన్యలకు కుమారీ పూజ, 108 మంది బ్రహ్మచారులకు అర్చన, 108 మంది సువాసినులకు అర్చన కన్నులపండువగా జరిగాయి. మొత్తం 108 యజ్ఞకుండాల్లో సంపూర్ణ శ్రీమద్రామాయణ శ్లోకహవనం జరిగింది. చివరిరోజున శ్రీరామచంద్రమూర్తికి పుణ్యనదీజలాలు, సముద్రజలాలతో అభిషేకం జరిపి, సువర్ణకిరీట ధారణ చేశారు.  

పర్వదినాల్లో, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. శ్రీరామకల్యాణం, నరసింహజయంతి, హనుమజ్జయంతి, గురుపూర్ణిమ, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, దత్తజయంతి, భీష్మఏకాదశి, మహాశివరాత్రి.. ఇలా ప్రతి పర్వదినాన ఆయా పూజలు పూర్తిగా స్మార్తశైవాగమ విధిగా జరుపుతారు. పర్వదినాల్లో చండీహోమం, గణపతిహోమం, సుందరకాండహవనం, సువాసినీ పూజ, దంపతీ పూజ, మహారుద్రాభిషేకం వంటి అర్చనలు, హోమాలు కూడా నిర్వహిస్తారు.

ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవం హనుజ్జయంతి. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి మొదలు ద్వాదశి వరకు త్రయాహ్నిక దీక్షా విధానంగా మూడురోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజున శ్రీ ఆంజనేయస్వామివారి మూలవిరాట్‌కు వివిధరకాల జలాలతో, సుగంధ ద్రవ్యాలతో, ఫలరసాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. అనంతరం విశేషంగా నాగవల్లీదళార్చన, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్సవాల్లో రెండో రోజున 'హనుమద్వ్రతము' జరుగుతుంది. ఇది విశేషఫలప్రథమైన వ్రతము. మూడోరోజున సుందరకాండ¬మం, శ్రీసువర్చలా హనుమత్కల్యాణము జరుగుతాయి. వీటితో పాటు లక్ష మల్లెపూల అర్చన, విశేష సంపుటితో కదలీఅర్చన కూడా జరుగుతాయి. గ్రామస్తులతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి అధికసంఖ్యలో వస్తుంటారు. ఈ క్షేత్రంపై గ్రామస్తుల విశ్వాసం ఎంతప్రగాఢమైనదంటే.. గ్రామంలో జరిగిన ప్రతి వివాహం తర్వాత నూతన వధూవరులను ముందుగా స్వామికోవెలకు తీసుకువచ్చి, మ్రొక్కులు చెల్లించుకుంటారు. స్వామి చల్లని చూపుపై గ్రామస్తుల విశ్వాసానికి ఇంతకన్నా వేరొక ఉదాహరణ అవసరమా?

ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీపంచముఖ లక్ష్మీగణపతి స్వామి మహాశక్తివంతమైన మూర్తి. విగ్రహరూపంలో కొలువై ఉండి, నిత్యార్చనలు అందుకుంటున్న ఇటువంటి మూర్తి ఆంధ్రరాష్ట్రంలో వేరెక్కడా లేదు. వివాహార్థులు ఈ స్వామికి మ్రొక్కుకుని కల్యాణప్రాప్తి పొందుతారు. అత్యంత అరుదైన లక్షణం మరొకటి ఈ ఆలయ విశిష్టలక్షణంగా మనకు కనిపిస్తుంది. అదేమిటంటే.. ఆలయంలో జరిగే అర్చనాది కైంకర్యాల మొదలు యజ్ఞయాగాది క్రతువుల వరకు ఏ ఒక్కచోటా ఆర్థికపరమైన అంశాల వివాదాలకు తావులేకపోవడం. అన్ని అర్చనలు, క్రతువులు ఏవిధమైన స్థిర, చరాస్తి లేకుండా కేవలం స్వామివారి అనుగ్రహంతో, భక్తుల సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా పూర్తిగా భారతీయ ఆధ్యాత్మిక, వైదిక, సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా మహావైభవంగా ఇక్కడ జరుగుతాయి. సర్వమూ తానే అయిన స్వామి కొండంత అండగా మన ప్రక్కన ఉండగా, కొరతకు తావెక్కడ ఉంటుంది? ఇలా అనేకానేక ప్రత్యేకతలతో తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, భక్తుల కోరికలు తీరుస్తూ, ఆస్తిక జన కల్పవృక్షంగా శ్రీపంచముఖ వీరాంజనేయస్వామివారి ఆలయం భక్తకోటి నీరాజనాలందుకుంటోంది.

వందే గురుపరంపరామ్‌[మార్చు]

బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు శ్రీ ప్రమోద నామ సంవత్సర పుష్య శుద్ధ విదియ మంగళవారానికి సరియగు తేదీ 1930 డిసెంబరు 23వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ కప్పగంతు సత్యనారాయణ, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. విజయవాడకు సమీపంలోని మైలవరం వీరి జన్మస్థానం. తమ పూర్వికుల నుంచి వీరికి వచ్చిన వారసత్వ సంపద - అచంచలమైన దైవభక్తి. బాల్యం నుంచి శాస్త్రిగారిలో దైవభక్తి మెండుగా ఉండేది. వెల్లటూరు గ్రామంలోని తమ మేనమామ గారి ఇంటివద్ద ఉంటూ, 5వ తరగతి వరకు పాఠశాల విద్యాభ్యాసం చేశారు. గర్భాష్టకంలో ఉపనయన సంస్కారం పూర్తయిన తర్వాత, మేనమామ అయిన బ్రహ్మశ్రీ గుంటూరు విశ్వనాథ అవధాన్లు గారి ఇంటి వద్ద ఉంటూ, వారి వద్దనే కృష్ణయజుర్వేదం, ఆగమశాస్త్రం అధ్యయనం చేశారు. తర్వాత ఆగిరిపల్లిలోని సంస్కృత పాఠశాలలో బ్రహ్మశ్రీ కొల్లూరు సోమశేఖరశాస్త్రిగారి వద్ద తర్కం, సంస్కృతం అధ్యయనం చేశారు.

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 16వ యేట విశ్వనాథ అవధాన్లుగారు శాస్త్రిగారి పంచముఖ హనుమన్మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. అదేసందర్భంలో మాతామహులు బ్రహ్మశ్రీ గుంటూరు వెంకట్రామశర్మగారు దేవతార్చనను, శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుపుకున్న శ్రీసీతారామస్వామివార్ల విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ ఘట్టం శాస్త్రిగారి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. నాటి నుంచి శాస్త్రిగారు నిరంతరం స్వామివారి దివ్యమంత్రాన్ని ఉపాసన చేయటం ప్రారంభించారు. భవిష్యత్తులో స్వామివారి సాక్షాద్దర్శన భాగ్యం పొందడానికి అవసరమైన సాధన ఇక్కడ నుంచే ప్రారంభమైంది. తమ 18వ యేట శాస్త్రిగారు బ్రహ్మశ్రీ చిట్టా లక్ష్మీనారాయణ, శ్రీమతి మహాలక్ష్మి దంపతుల ద్వితీయ పుత్రిక శకుంతలను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు.

స్వామివారి మంత్రోపదేశం పొందిన నాటి నుంచి శాస్త్రిగారు పంచముఖ హనుమదుపాసన చేయడం ప్రారంభించారు. రాగి రేకు మీద ఆంజనేయస్వామివారి ప్రతిమను చెక్కించి, ఆ మూర్తికే నిత్య ధూప, దీప నైవేద్యాలు సమర్పించేవారు. హనుజ్జయంతి ఉత్సవాలను కూడా తమ ఇంట్లోనే నిర్వహించేవారు. ఈ క్రమంలో శాస్త్రిగారు అనుష్ఠానం, నిత్యార్చన నిర్వహిస్తున్న రెండవ సంవత్సరం నుంచి ఆంజనేయస్వామి వారు శాస్త్రిగారి ఒంటిపై ఆవహించి ఉండి, మాట్లాడేవారు. అనుష్ఠానం ప్రారంభించిన రెండవ సంవత్సరంలోనే ఇటువంటి అద్భుత సిద్ధిని పొందగలగటం శాస్త్రిగారి పురాకృత సుకృతానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈవిధంగా హనుమన్మహామంత్ర అనుష్ఠానం చేసుకుంటూ, పౌరాణిక వృత్తి నిర్వహిస్తూ శాస్త్రిగారు జీవనం సాగించేవారు. కొంతకాలానికి అనగా ఉపాసన ప్రారంభించిన నాలుగవ సంవత్సరంలో కొత్తూరు-తాడేపల్లి గ్రామంలో శాస్త్రిగారు హనుజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుండగా, స్వామివారు శాస్త్రిగారి ఒంటిపైకి వచ్చి, ఆ గ్రామంలో ఆలయాన్ని నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. అప్పటికి శాస్త్రిగారి వయస్సు కేవలం 25 సం||లు మాత్రమే. మరుసటి హనుమజ్జయంతి నాటికి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ చేయవలసిందిగా స్వామివారే స్వయంగా స్థల నిర్ణయం, ముహూర్త నిర్ణయం చేశారు.

కొత్తూరు - తాడేపల్లి గ్రామంలోని ప్రధాన రహదారికి ఆనుకొని విశాలమైన ప్రాంగణం ఉంది. గ్రామానికి ఇది ప్రధాన కూడలి. ఈ ప్రాంగణంలోనే భవానీ శంకరస్వామివారి దేవస్థానం ఉంది. దేవస్థానం, ప్రాంగణం రెండూ శ్రీ లఖంరాజు రామభద్రరాజు గారి నిర్వహణలో ఉండేవి. శాస్త్రిగారు ఆలయనిర్మాణానికి అవసరమైన స్థలానికై రామభద్రరాజుగారిని సంప్రదించగా, వారు భవానీ శంకరస్వామివారి దేవస్థానం ఉత్తరభాగంలోని స్థలాన్ని కేటాయించి, అందులో ఆలయనిర్మాణం చేసుకోవడానికి శాస్త్రిగారికి వాగ్రూపంగా అనుమతి ఇచ్చారు. ఈవిధంగా ఆలయ నిర్మాణానికి తగిన స్థలం సమకూరింది. విగ్రహం తయారు చేయించడానికి అవసరమైన ద్రవ్యాన్ని విజయవాడ వాస్తవ్యులైన శ్రీ బసవరాజు ప్రభాకర వేణుగోపాలరావు అందజేశారు. ఆ ధనంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని గంగాధర శిల్పశాలలో శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామివారి విగ్రహం తయారుచేయించారు.

ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠ తదితర ఖర్చులకై ద్రవ్యాన్ని సేకరించడానికి కొత్తూరు-తాడేపల్లి గ్రామంలోని 108 ఇళ్ళలో వెదురుబుట్టలు ఉంచి, వాటిలో ఆ ఇంటివారు రోజుకు మూడు గుప్పెళ్ళ చొప్పున మొత్తం 40 రోజుల పాటు బియ్యాన్ని వేసేట్లు ఏర్పాటుచేశారు. ఇలా ప్రోగుచేయగా వచ్చిన 5 బస్తాల బియ్యాన్ని విక్రయించి, ఆ ధనాన్ని ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠల కోసం వినియోగించారు. సా.శ.1957వ సంవత్సరం మే, 24వ తేదీ అనగా హేవిళంబి నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి, శుక్రవారం హనుమజ్జయంతి పర్వదినాన శ్రీశ్రీశ్రీ సర్వతోముఖ బడబానల ప్రచండ ప్రతాప పంచముఖ వీరాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి కీ.శే. బ్రహ్మశ్రీ గుంటూరు విశ్వనాథ అవధాన్లు గారు బ్రహ్మత్వం వహించగా, కీ.శే. బ్రహ్మశ్రీ గుంటూరు రాధాకృష్ణశర్మగారు, కీ.శే. బ్రహ్మశ్రీ కంభంపాటి మాధవశర్మగారు మంత్రానుష్ఠానాది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్ఠ చేసేనాటికి ఆలయానికి కేవలం గర్భగుడి, తాటాకు పైకప్పు మాత్రమే ఉండేవి. తర్వాత ఒక సంవత్సరానికి గర్భాలయానికి సిమెంటుతో పైకప్పు వేశారు. కొంతకాలానికి గర్భాలయానికి ముందు 15 అడుగుల వరకు ముఖమండపం నిర్మించి, రేకులతో పైకప్పు వేశారు. ఆ తర్వాత 1976లో మంటపాన్ని 50 అడుగుల వరకు విస్తరించి, సిమెంటుతో శ్లాబు వేశారు. ఈవిధంగా ఆలయ నిర్మాణం, ముఖమండప నిర్మాణం, విస్తరణ స్వామివారి ఆదేశంతో, దాతల సహకారంతో జరిగాయి. ఆలయం నిర్మించిన నాటి నుంచి నిత్యార్చనలు, ఉత్సవాలతో సహా ధూప, దీప, నైవేద్యాది కార్యక్రమాలను శాస్త్రిగారే స్వయంగా నిర్వహించేవారు. ఈవిధంగా ఆలయాన్ని నిర్వహించడంలో శాస్త్రిగారికి వారి సోదరులు కోటేశ్వరశర్మగారు, గురుమూర్తిగారు, సీతారామాంజనేయశర్మగారు ఎంతగానో సహకరించారు.

స్వామివారి మూలవిరాట్‌ను ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారి ఆదేశానుసారం ఆలయంలో క్రమంగా వక్రతుండ మహాగణపతి, భవానీశంకరస్వామి, పట్టాభిరామస్వామి, దుర్గాదేవి, కాళీమాత, గాయత్రీదేవి, పంచముఖ లక్ష్మీగణపతిస్వామివార్ల విగ్రహాలను, శ్రీచక్రాన్ని శాస్త్రిగారు ప్రతిష్ఠించారు. అనేక యజ్ఞయాగాది క్రతువులను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

కొంతకాలానికి ఉపాసన ఫలించి, స్వామివారితో నిత్యం నేరుగా సంభాషించే వరసిద్ధిని శాస్త్రిగారు పొందారు. నిత్యం మహానివేదన అనంతరం ఘంటానాదం చేయగానే స్వామివారు శాస్త్రిగారితో సంభాషించేవారు. ఈ సందర్భంలో శాస్త్రిగారు భక్తుల సమస్యలను స్వామివారికి నివేదించి, వారు సూచించిన తరుణోపాయాలను భక్తులకు తెలియజేసేవారు. తొలుత ఈవిధంగా, కేవలం స్వామివారి కంఠస్వరాన్ని మాత్రమే వినగలిగిన శాస్త్రిగారు కాలక్రమంలో తమ పుణ్యవిశేషం చేత స్వామివారి సాక్షాద్దర్శన భాగ్యాన్ని పొందారు. పరిపూర్ణత పొందిన భక్తితత్త్వానికి ఇంతకన్నా వేరొక నిదర్శనం అవసరం లేదు. చర్మచక్షువులతో చిన్మయానంద స్వరూపుని దర్శించిన అపరమార్కండేయులు శ్రీశాస్త్రిగారు.


ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామం మామిడి తోటలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో వరి పంటలు, మొక్కజొన్న పంటలు, ప్రత్తి పంటలు కూడా బాగా పండుతాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం ఉంది. జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • కప్పగంతు రామకృష్ణ:డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ స్వస్థలం విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామం. గణితం, తెలుగు, జర్నలిజం, మనస్తత్వశాస్త్రాల్లో ఎం.ఎ; ఎం.ఈడి., 'గణితంలో సహపాఠ్యకార్యక్రమాలు' అనే అంశంపై ఎం.ఫిల్‌, 'కృష్ణాజిల్లా పత్రికా రంగం' అనే అంశంపై పిహెచ్‌.డి చేశారు. వృత్తిరీత్యా విజయవాడ, గాంధీనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి బీఈడీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రామకృష్ణ పిహెచ్‌.డి థీసిన్‌ను బి.ఎ (తెలుగు) విద్యార్థులకు రిఫరెన్స్‌ బుక్‌గా యు.జి.సి. ప్రకటించింది.

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన వేములకొండ సాయితిలక్ అను విద్యార్థి, చదరంగం పోటీలలో విశేష ప్రతిభ కనబరచుచున్నాడు. ఇతడు ఇటీవల మచిలీపట్నంలో "స్టూడెంట్ ఒలింపిక్" ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో తన సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనాడు. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారపూడిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో గూడా రాణించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

తాడెపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 79 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 96 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 6 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 64 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 22 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 84 హెక్టార్లు
 • బంజరు భూమి: 97 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 295 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 274 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 203 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

తాడెపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 48 హెక్టార్లు
 • చెరువులు: 112 హెక్టార్లు
 • వాటర్‌షెడ్ కింద: 42 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

తాడెపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మామిడి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4103. ఇందులో పురుషుల సంఖ్య 2064, స్త్రీల సంఖ్య 2039, గ్రామంలో నివాస గృహాలు 975 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.

వెలుపలి లింకులు[మార్చు]

తాడేపల్లి పేరుతో ఒక మండలం/గ్రామం, విజయవాడకు దగ్గరలో కృష్ణా నదికి అవతలివైపు, గుంటూరు జిల్లాలో ఉంది.