తాత్కాలిక భారత ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాత్కాలిక భారత ప్రభుత్వం

1915–1919
తాత్కాలైక భారత ప్రభుత్వం గుర్తించిన ప్రాదేశిక ప్రాంతం
తాత్కాలైక భారత ప్రభుత్వం గుర్తించిన ప్రాదేశిక ప్రాంతం
స్థాయిప్రవాస ప్రభుత్వం
రాజధానిన్యూ ఢిల్లీ (అని చెప్పుకున్నారు)
ప్రధాన కార్యాలయంకాబూల్, ఆఫ్ఘనిస్తాన్
పిలుచువిధంభారతీయులు
అధ్యక్షుడు 
• 1915–1919
మహేంద్ర ప్రతాప్
ప్రధానమంత్రిc 
• 1915–1919
మౌలానా బర్కతుల్లా
చారిత్రిక కాలంమొదటి ప్రపంచ యుద్ధం · రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలం
• స్థాపన
డిసెంబరు 1 1915
• పతనం
జనవరి 1919
ద్రవ్యంఆఫ్ఘన్ రూపాయి (డీ ఫ్యాక్టో)

భారత తాత్కాలిక ప్రభుత్వం అనేది 1915 డిసెంబరు 1 న కాబూల్‌లో ఏర్పాటైన తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, సెంట్రల్ పవర్స్ దేశాల మద్దతుతో భారత స్వాతంత్ర్య కమిటీ స్థాపించింది. భారత ఉద్యమం కోసం ఆఫ్ఘన్ ఎమీర్, రష్యాకు చెందిన జార్ (ఆ తరువాత బోల్షివిక్కులు), చైనా, జపాన్‌ల మద్దతును సమీకరించడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం. బెర్లిన్ కమిటీ సభ్యులు, జర్మను, టర్కీ ప్రతినిధులూ పాల్గొన్న కాబూల్ సమావేశం ముగింపులో దీన్ని స్థాపించారు. తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షుడిగా మహేంద్ర ప్రతాప్ [1] మౌలానా బర్కతుల్లా ప్రధాన మంత్రిగా, దేవబండీ మౌలావి ఉబైద్ అల్లా సింధీ హోం మంత్రిగా, దేవబండీ మౌలవి బషీర్ యుద్ధ మంత్రిగా, చంపక్రామన్ పిళ్లై విదేశాంగ మంత్రిగా ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిండి. ఈ ప్రభుత్వానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం నుండి అంతర్గతంగా గణనీయమైన మద్దతు లభించింది. అయితే, ఎమీర్ మాత్రం బహిరంగంగా మద్దతు ప్రకటించడానికి నిరాకరించాడు. చివరికి, బ్రిటిష్ ఒత్తిడికి లొంగి 1919 లో ఈ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగవలసి వచ్చింది.

భారత స్వాతంత్ర్యానికి తాత్కాలిక ప్రభుత్వం[మార్చు]

దస్త్రం:Mahendra Pratap and the German Mission.gif
మహేంద్ర ప్రతాప్ (మధ్య) జర్మనీ, టర్కీ ప్రతినిధులతో 1915 కాబూల్‌లో మిషన్ అధిపతిగా. అతని కుడి వైపున కూర్చున్నది వెర్నర్ ఒట్టో వాన్ హెంటిగ్.
పేరు

(జననం -మరణం)

ఫోటోగ్రాఫ్ ఎన్నికైన సంవత్సరం పదవిని స్వీకరించినది పదవీ విరమణ ఉపాధ్యక్షుడు పార్టీ
భారత తాత్కాలిక ప్రభుత్వం
1 మహేంద్ర ప్రతాప్ - 1915 1919 అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బరాకతుల్లా
2 అబ్దుల్ హఫీజ్ మొహమ్మద్ బరాకతుల్లా - 1919 1919 మహేంద్ర ప్రతాప్

నేపథ్యం[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, జర్మనీ, అమెరికాల్లోని భారతీయ జాతీయవాదులు, ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్న భారతీయ విప్లవకారులు, భారతదేశానికి చెందిన పాన్-ఇస్లామిస్టులూ కలిసి జర్మనీ ఆర్థిక సహాయంతో భారత జాతీయోద్యమాన్ని మరింతగా ముందుకు తిసుకువెళ్ళేందుకు ప్రయత్నించారు. బెర్లిన్-ఇండియన్ కమిటీ (1915 తర్వాత ఇది భారత స్వాతంత్ర్య కమిటీగా మారింది) బ్రిటిష్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దాడి చేసేందుకు గిరిజనులను ప్రోత్సహించడం కోసం ఇండో-ఇరానియన్ సరిహద్దు వద్దకు ఒక ఇండో-జర్మన్-టర్కిష్ బృందాన్ని పంపింది. ఈ సమయంలోనే బెర్లిన్ కమిటీ ఖైరీ సోదరులతో (అబ్దుల్ జబ్బర్ ఖైరీ, అబ్దుల్ సత్తార్ ఖైరి) కూడా టచ్‌లో ఉంది. వారు యుద్ధం ప్రారంభ సమయానికి కాన్స్టాంటినోపుల్‌లో స్థిరపడి ఉన్నారు. తరువాత 1917 లో వారు బ్రిటీష్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాశ్మీరు లోను, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ లోనూ గిరిజనులను నడిపించే ప్రణాళికను కైజర్‌ వద్ద ప్రతిపాదించారు. దేవబండీ మౌలానా ఉబైద్ అల్లా సింధీ, మహమూద్ అల్ హసన్ (దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్) నేతృత్వంలోని మరొక బృందం 1915 అక్టోబరులో భారతదేశంలోని గిరిజన ప్రాంతంలో ముస్లిం తిరుగుబాటును ప్రారంభించే ప్రణాళికలతో కాబూల్‌కు వెళ్లారు. ఇందు కోసం, ఆఫ్ఘనిస్తాన్ అమీర్ బ్రిటన్పై యుద్ధం ప్రకటించాలనీ, మహ్మద్ అల్ హసన్ జర్మనీ, టర్కీల సహాయం కోరాలనీ ఉబైద్ అల్లా ప్రతిపాదించాడు. హసన్ హిజాజ్‌కు వెళ్లాడు. ఈలోగా ఉబైద్ అల్లా, అమీర్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోగలిగాడు. కాబూల్‌లో, బ్రిటీష్‌కి వ్యతిరేకంగా ఖలీఫ్ యొక్క " జిహాద్ " లో చేరడానికి టర్కీకి వెళ్ళడానికి ముందుకొచ్చిన కొంతమంది విద్యార్థులను కలిసి ఉబైద్ అల్లా, భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంపై దృష్టి పెట్టడం ద్వారానే పాన్-ఇస్లామిక ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్ళగలమని నిర్ణయించాడు. [2]

మిషన్ టు కాబూల్[మార్చు]

ఉబైద్ అల్లా బృందాన్ని ఇండో-జర్మన్-టర్కిష్ మిషన్ 1915 డిసెంబరులో కాబూల్‌కు కలుసుకుంది. ఆస్కార్ వాన్ నైడర్‌మేయర్ నేతృత్వంలో, రాజా మహేంద్ర ప్రతాప్ నామమాత్రపు నేతృత్వంలోని ఆ బృందంలో కాబూల్‌లోని జర్మనీ దౌత్య ప్రతినిధి అయిన వెర్నర్ ఒట్టో వాన్ హెంటిగ్, బర్కతుల్లా, చంపకరామన్ పిళ్లై, బెర్లిన్ గ్రూపులోని ఇతర ప్రముఖ జాతీయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఈ మిషన్, భారతీయ ఉద్యమ సభ్యులను భారతదేశ సరిహద్దుకు తీసుకురావడంతో పాటు, కైసర్, ఎన్‌వర్ పాషా, ఈజిప్ట్ నుండి స్థానభ్రంశం చెందిన ఖేదీవ్, అబ్బాస్ హిల్మీ లు ప్రతాప్ మిషన్‌కు తెలిపిన మద్దతును తీసుకువచ్చారు. అమీర్‌ను భారతదేశానికి వ్యతిరేకంగా నడవమని ఆహ్వానించారు. మిషన్ యొక్క తక్షణ లక్ష్యాలు - ఆఫ్ఘన్ అమీర్‌ను బ్రిటిష్ ఇండియాపై దండెత్తేందుకు ప్రోత్సహించడం, [3] ఆఫ్ఘనిస్తాన్‌ దేశం గుండా స్వేచ్ఛగా వెళ్ళగలిగే హక్కును ఆఫ్ఘన్ ప్రభుత్వం నుండి పొందడం.

ఆ సమయంలో ప్రతిపాదనలకు అనుకూలత గాని, వ్యతిరేకత గానీ చెప్పేందుకు అమీర్ నిరాకరించినప్పటికీ, అతని సోదరుడు నస్రుల్లా ఖాన్, అతని కుమారులు ఇనాయతుల్లా ఖాన్, అమానుల్లా ఖాన్, మత నాయకులు, గిరిజనులతో సహా అమీర్ యొక్క తక్షణ, సన్నిహిత రాజకీయ, మతపరమైన సలహా బృందాల సభ్యులూ మిషన్ ప్రతిపాదనలకు మద్దతు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లోని అత్యంత ప్రభావవంతమైన వార్తాపత్రిక, సిరాజ్ అల్-అక్బర్‌ కూడా మద్దతు నిచ్చింది. దీని ఎడిటర్ మహమూద్ తార్జీ 1916 ప్రారంభంలో బర్కతుల్లాను అధికారిక ఎడిటర్‌గా తీసుకున్నాడు. ఆ పత్రికలో టార్జీ రాజా మహేంద్ర ప్రతాప్ రాసిన అనేక ఉద్రేకపూరిత కథనాలను వరుస కథనాలుగా ప్రచురించారు. అలాగే బ్రిటిష్ వ్యతిరేక, కేంద్ర రాజ్యాలకు అనుకూల కథనాలు, ప్రచారాలను ప్రచురించారు. 1916 మే నాటికి ఆ పత్రిక కాపీలను అడ్డగించేంత తీవ్రంగా బ్రిటిషు ప్రభుత్వం దాని ప్రచురణలను పరిగణించింది. [3] మరింత కృషి చేసిన తరువాత, 1916 లో కాబూల్‌లో భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించారు.

తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు[మార్చు]

అమీర్ మద్దతుపై ఆశలు దాదాపు లేనప్పటికీ, తమ ఉద్దేశాన్ని, భావనలనూ నొక్కిచెప్పడం కోసం 1916 ప్రారంభంలో భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. రాజా మహేంద్ర ప్రతాప్ అధ్యక్షుడిగా, బర్కతుల్లా ప్రధాన మంత్రిగా, శిబ్‌నాథ్ బెనర్జీ, ఉబైద్ అల్ సింధీ మంత్రులుగా, మౌలవి బషీర్ యుద్ధ మంత్రిగా, చంపకరామన్ పిళ్లై విదేశాంగ మంత్రిగా పదవులు స్వీకరించారు. జారిస్ట్ రష్యా, రిపబ్లికన్ చైనా, జపాన్ నుండి మద్దతు పొందడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. బ్రిటన్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ను ప్రకటిస్తూ గాలిబ్ పాషా నుండి మద్దతు పొందింది.

1917 లో రష్యాలో ఫిబ్రవరి విప్లవం తరువాత, ప్రతాప్ ప్రభుత్వం కొత్త సోవియట్ ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిసింది. 1918 లో, మహేంద్ర ప్రతాప్ బెట్రోలిన్‌లో కైసర్‌ని కలిసాడు. అంతకు ముందు, పెట్రోగ్రాడ్‌లో లియోన్ ట్రాట్స్కీని కూడా కలుసుకున్నాడు. బ్రిటిషు ఇండియాకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అతడు వారిద్దరినీ కోరాడు. బ్రిటిషు వారి ఒత్తిడితో, ఆఫ్ఘన్లు ఈ ప్రభుత్వానికి సహకారం ఉపసంహరించుకున్నారు. దంతో ఈ ప్రభుత్వానికి మూతపడింది. అయితే, ఈ ప్రభుత్వం, ఆ సమయంలో జర్మన్లు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమర్థనలు దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇది ఒక రాజకీయ మార్పుకు దారితీసి, 1919 లో హబీబుల్లా హత్యతో ముగింపుకు చేరింది. మూందు నస్రుల్లాకు ఆ తరువాత అమానుల్లాకు అధికారం బదిలీ అయింది. ఇది మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధానికి దారితీసి చివరికి ఆఫ్ఘనిస్తాన్‌కు స్వాతంత్ర్యం చేకూరింది. [4]

వారు విదేశీ శక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. " (కెర్, పి 305). కాబూల్‌లో, సిరాజ్-ఉల్-అక్బర్ 1916 మే 4 సంచికలో ప్రభుత్వ ఉద్దేశాల గురించి రాజా మహేంద్ర ప్రతాప్ రాసిన వ్యాసం ప్రచురించింది. అందులో అతను ఇలా పేర్కొన్నాడు: “... కైజర్ స్వయంగా నాకు దర్శనమిచ్చాడు. తదనంతరం, ఇంపీరియల్ జర్మన్ ప్రభుత్వంతో భారతదేశం, ఆసియా సమస్యను సరిదిద్దుకుని, వారి నుండి అవసరమైన గుర్తింపును పొందాక, నేను తూర్పు దిశగా ప్రయాణం ప్రారంభించాను. నేను ఈజిప్ట్ ఖేదీవ్‌తో, టర్కీ యువరాజులు, మంత్రులతో, అలాగే ప్రఖ్యాత ఎన్‌వర్ పాషాతో, పవిత్ర ఖలీఫ్, సుల్తాన్-ఉల్-మువాజిమ్‌తో సంప్రదింపులు జరిపాను. నేను భారతదేశపు అంశాన్ని ఒట్టోమన్ ప్రభుత్వంతో చర్చించాను వారి నుండి అవసరమైన గుర్తింపును కూడా అందుకున్నాను. జర్మని టర్కీ అధికారులు, మౌల్వీ బరాకతుల్లా సాహిబ్ నాకు సహాయకంగా నాతో వచ్చారు; వారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు. " బ్రిటిషు వారి ఒత్తిడితో ఆఫ్ఘన్ ప్రభుత్వం తన సహాయాన్ని ఉపసంహరించుకుంది. మిషన్ను మూసివేయించింది

ప్రభావం[మార్చు]

హిందూ -జర్మన్ కుట్ర ద్వారా ఎదురైన ముప్పు భారతదేశంలో రాజకీయ పురోగతిని ప్రభావితం చేసిందని చాలా మంది చరిత్రకారులు సూచించారు. ప్రత్యేకించి, భారతదేశానికి ప్రక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రతాప్ ప్రభుత్వం ఉండటం, బోల్షివిక్ రష్యా నుండి ఎదురౌతుందని భావించిన ముప్పు, బోల్షివిక్ సహాయం కోరుతూ ప్రతాప్ తాత్కాలిక ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు భారతదేశంలో బ్రిటిషు స్థిరత్వానికి గణనీయమైన ముప్పుగా నిర్ధారించబడ్డాయి.

1917 లో మోంటాగు -చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు భారత ఉపఖండంలో మొదటి దశ రాజకీయ సంస్కరణలను ప్రారంభించగా, రౌలట్ కమిటీ (సిడ్నీ రౌలట్, ఇంగ్లీష్ జడ్జి అధ్యక్షతన) అనే "రాజద్రోహ కమిటీ" 1918 లో జర్మనీ, బెర్లిన్ కమిటీ, ప్రతాప్ ప్రభుత్వం (వీరిని ఆఫ్ఘనిస్తాన్‌లో జర్మన్ ఏజెంట్లు అని అభివర్ణించింది), భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్, బెంగాల్‌ల లోని మిలిటెంట్ ఉద్యమాల మధ్య ఉన్న సంబంధాలను అంచనా వేసింది. బోల్షెవిక్ ప్రమేయానికి ఆధారాలేమీ ఈ కమిటీకి కనిపించలేదు. కానీ జర్మనీ లింకు ఖచ్చితంగా ఉందని మాత్రం నిర్ధారించింది. కమిటీ సిఫారసులపై ఆధారపడి బ్రిటిషు ప్రభుత్వం, పంజాబ్, బెంగాల్‌లో ఎదురైన ముప్పుకు ప్రతిస్పందనగా భారత రక్షణ చట్టం 1915 కు పొడిగింపుగా రౌలత్ చట్టాన్ని అమలు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ మిషన్, వేగవంతమైన విప్లవ, ప్రగతిశీల రాజకీయ ప్రక్రియకు, సంస్కరణ ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. ఇది 1919 లో అమీర్ హబీబుల్లా ఖాన్ హత్యకు, నస్రుల్లా ఖాన్ ఖైదుకూ, ఆ తరువాత అమానుల్లా ఖాన్ గద్దెనెక్కడానికీ ఆ వెంటనే మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధానికీ దారితీసింది.

మూలాలు[మార్చు]

  1. "3 surprising facts about Jat King at the centre of AMU row : India, News - India Today". indiatoday.intoday.in. Retrieved 2015-10-29.
  2. "Arbab-e-Ihtemam. p2". Darul Uloom Deoband. Retrieved 2007-11-13.
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Sims-Williams120 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Hughes 2002 474 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు