తారక్ నాథ్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తారక్ నాథ్ దాస్
దస్త్రం:Taraknathdas1.jpg
జననం(1884-06-15)1884 జూన్ 15
కాంచ్రపారా, 24 పరగణాలు జిల్లా, బెంగాల్
మరణం1958 డిసెంబరు 22(1958-12-22) (వయసు 74)
న్యూయార్క్ నగరం
జాతీయతబ్రిటిషు భారతదేశ పౌరుడు
జీవిత భాగస్వామిమేరీ కీటింగ్ మోర్స్

 

తారక్ నాథ్ దాస్ (1884 జూన్ 15 - 1958 డిసెంబర్ 22) భారతీయ విప్లవకారుడు, అంతర్జాతీయ స్కాలర్. అతను ఉత్తర అమెరికా పశ్చిమ తీరానికి వలసవెళ్ళిన తొలితరం భారతీయుడు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అనుకూలంగా ఆసియా భారతీయ వలసదారులను కూడదీసి, టాల్‌స్టాయ్‌తో తన ప్రణాళికలను చర్చించాడు. అతను కొలంబియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరుగా పనిచేసాడు. అనేక ఇతర విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసరుగా పనిచేసాడు.

తొలి జీవితం

[మార్చు]

తారక్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, 24 పరగణాల జిల్లా, కాంచ్రాపారా సమీపం లోని మాజుపారా లో జన్మించాడు. ఒక దిగువ-మధ్య-తరగతి కుటుంబానికి చెందిన తండ్రి కాళీమోహన్, కలకత్తా లోని సెంట్రల్ టెలీగ్రాఫ్ కార్యాలయంలో క్లర్కుగా పని చేసేవాడు. రచనలు చెయ్యడంలో తారక్ నైపుణ్యాన్ని గమనించిన అతని ప్రధానోపాధ్యాయుడు, దేశభక్తి అనే అంశంపై వ్యాసరచన పోటీలో పాల్గొనమని ప్రోత్సహించాడు. అతడి వ్యాసపు నాణ్యతను చూసిన న్యాయమూర్తులలో అనుశీలన్ సమితి వ్యవస్థాపకుడు బారిస్టర్ పి. మిట్టర్ ఒకరు. అతడు తన సహచరుడు సతీష్ చంద్ర బసుతో ఆ కుర్రవాడిని సమితి లోకి ఆహ్వానించమని చెప్పాడు. 1901 లో ప్రవేశ పరీక్షలో అధిక మార్కులతో ఉత్తీర్ణుడైన తర్వాత తారక్, యూనివర్సిటీ అధ్యయనాల కోసం కలకత్తా వెళ్లి, ప్రసిద్ధ జనరల్ అసెంబ్లీ ఇన్‌స్టిట్యూషన్‌లో (ఇప్పుడు స్కాటిష్ చర్చి కాలేజీ) ప్రవేశం పొందాడు. అతని రహస్య దేశభక్తి కార్యకలాపాల్లో, అక్క గిరిజ అతనికి పూర్తి మద్దతు నిచ్చింది. 

ప్రస్థానానికి తొలి అడుగులు

[మార్చు]

బెంగాలీల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి, శివాజీతో పాటు, గొప్ప బెంగాలీ హిందూ హీరోలలో ఒకరైన రాజా సీతారామ్ రే సాధించిన విజయాల జ్ఞాపకార్థం ఒక పండుగను జరుపుకోవడాన్ని ప్రవేశపెట్టాడు. 1906 ప్రారంభ నెలల్లో, ప్రాచీన బెంగాల్రాజధాని జెస్సోర్‌లో జరిగిన సీతారాం పండుగకు బాఘా జతిన్ ను అధ్యక్షుడిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన ఒక రహస్య సమావేశంలో తారక్, శిరీష్ చంద్ర సేన్, సత్యేంద్ర సేన్, అధర్ చంద్ర లస్కర్‌తో పాటు, జతిన్ పాల్గొన్నారు. ఆ నలుగురూ, ఒకరి తర్వాత ఒకరు విదేశాలలో ఉన్నత చదువుల కోసం బయలుదేరాల్సి ఉంది. ఈ సమావేశం లక్ష్యం గురించి 1952 లో ఏదో సంభాషణలో భాగంగా, తారక్ దాని గురించి మాట్లాడే వరకు ఏమీ తెలియదు. నిర్దిష్ట ఉన్నత విద్యతో పాటు, వారు సైనిక శిక్షణ, పేలుడు పదార్థాల పరిజ్ఞానాన్ని పొందాలని భావించారు. స్వేచ్ఛను పొందాలనే భారతదేశ నిర్ణయానికి అనుకూలంగా స్వతంత్ర పాశ్చాత్య దేశాల ప్రజలలో సానుభూతి వాతావరణాన్ని సృష్టించాలని వారు ప్రత్యేకంగా అనుకున్నారు. [1]

ఉత్తర అమెరికాలో జీవితం

[మార్చు]

తారక్ బ్రహ్మచారి పేరుతో సన్యాసి వేషం ధరించి, ఉపన్యాస పర్యటన కోసం మద్రాసు వెళ్లాడు. స్వామి వివేకానంద, బిపిన్ చంద్ర పాల్ తరువాత ఈ ప్రాంతంలో తన దేశభక్తి ప్రసంగాల ద్వారా అటువంటి అభిరుచిని పెంచిన వ్యక్తి అతనే. యువ విప్లవకారులలో అతను ప్రత్యేకంగా నీలకంఠ బ్రహ్మచారి, సుబ్రహ్మణ్య శివ, చిదంబరం పిళ్లైలను ప్రేరేపించాడు. 1905 లో అతను బ్రిటిష్ అధికారుల హింస నుండి తప్పించుకోవడానికి జపాన్ వెళ్లాడు. అయితే, జపాను లోని మీజీ ప్రభుత్వం బ్రిటిషు వారితో ఒక ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత విముక్తి ఉద్యమాలను అణిచివేయడం ప్రారంభించింది. [2] 1907 జూలై 16 న, తారక్ సీటెల్ చేరుకున్నాడు. వ్యవసాయ కార్మికుడిగా తన జీవనోపాధిని సంపాదించుకున్న తరువాత, అతను బర్కిలీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని ప్రయోగశాలలో నియమితుడయ్యాడు. ఆ తరువాత అక్కడే విద్యార్థిగా నమోదు చేసుకున్నాడు. అదే సమయంలో, అమెరికన్ సివిల్ అడ్మినిస్ట్రేషనులో అనువాదకుడు, వ్యాఖ్యాతగా అర్హత సాధించాడు. 1908 జనవరిలో వాంకోవర్‌లోని ఇమ్మిగ్రేషన్ విభాగంలో ప్రవేశించాడు. అప్పుడు హిందీ, పంజాబీ, గురుముఖికి ఇమ్మిగ్రేషన్ ఇన్స్పెక్టరుగా, వ్యాఖ్యాతగా నియమించబడిన కలకత్తా పోలీసు సమాచార సేవకు చెందిన విలియం సి. హాప్‌కిన్సన్ (1878-1914) అక్కడికి వచ్చాడు. ఏడు సంవత్సరాల పాటు, ఒక సిక్కు వ్యక్తి చేతిలో హతుడయ్యేంత వరకూ హాప్‌కిన్సన్, తారక్ వంటి విద్యార్థి రాడికల్స్ ఉనికి గురించి భారత ప్రభుత్వానికి వివరణాత్మకమైన, క్రమమైన నివేదికలను పంపేవాడు. అలాగే బ్రిటిషు వారికి అనుకూలంగా ఉంటూ సమాచారం అందిస్తూండే సిక్కు బృందాన్ని (దీనికి బేలా సింగ్ నాయకుడు) పర్యవేక్షించేవాడు. [3]

పాండురంగ ఖంఖోజే ( BG తిలక్ యొక్క దూత) తో కలిసి తారక్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను స్థాపించాడు. బాఘా జతిన్ పంపిన నిధులతో అధార్ లష్కర్ కలకత్తా నుండి వచ్చాడు. వాటితో తారక్ ఫ్రీ హిందూస్థాన్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. అలాగే 1907 అక్టీబరు 31 న కలకత్తా నుండి వచ్చిన గురాన్ డిట్ కుమార్ స్వదేశ్ సేవక్ అనే దాని గుర్ముఖి పత్రికను మొదలుపెట్టాడు. ఫ్రీ హిందూస్థాన్‌ను కాన్స్టాన్స్ బ్రిస్సెండెన్ "కెనడాలో మొదటి దక్షిణ ఆసియా ప్రచురణ, ఉత్తర అమెరికా ఖండంలో వెలువడ్డ తొలి పత్రికల్లో ఒకటి" అని పేర్కొన్నాడు. పేలుడు పదార్థాలలో నిపుణుడైన ప్రొఫెసర్ సురేంద్ర మోహన్ బోస్ వారికి సహాయం చేసాడు. రెగ్యులర్ కరస్పాండెన్స్ ద్వారా, టాల్‌స్టాయ్, హైండ్‌మన్, శ్యామ్‌జీ కృష్ణవర్మ, మేడమ్ కామా వంటి వ్యక్తులు తారక్‌ చేస్తున్న కృషిని ప్రోత్సహించారు. "కమ్యూనిటీ ప్రతినిధి" గా వర్ణించబడిన అతను 1907 లో వాంకోవర్‌లో హిందూస్తానీ అసోసియేషన్‌ను స్థాపించాడు. 

ఆసియా భారతీయ వలసదారుల నుండి లంచాలు తీసుకున్నాడనే ఆరోపణలున్న హాప్‌కిన్సన్ తన ప్రభావాన్ని ఉపయోగించి తారక్‌ను బలిపశువును చేసాడు. ఫలితంగా అతడు 1908 మధ్యలో కెనడా నుండి బహిష్కరించబడ్డాడు. బోస్, కుమార్, చగన్ ఖైరాజ్ వర్మ (హుస్సేన్ రహీమ్ అని కూడా పిలుస్తారు) లకు స్థానిక స్వదేశీయుల విధికి బాధ్యతలను అప్పజెప్పి తారక్, వాంకోవర్ వీడి వెళ్ళి, సీటెల్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు ఉన్న ప్రాంతంపై దృష్టి పెట్టాడు. అతను సీటెల్ చేరుకున్న తరువాత, 1908 జూలై సంచిక నుండి ఫ్రీ హిందూస్తాన్ మరింత బహిరంగంగా బ్రిటీష్ వ్యతిరేకంగా మారింది. తారక్ ఒక నినాదమిచ్చాడు: "అన్ని దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడమంటే మానవత్వానికి సేవ చేయడమే. అది నాగరికత విధి." 1908 లో, తారక్ నార్విచ్ యూనివర్సిటీ, నార్త్‌ఫీల్డ్, వెర్మోంట్‌లో చేరాడు. అన్ని జాతుల విద్యార్థులలో అతని ప్రజాదరణ ఉన్నప్పటికీ, అతని బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ( ఫ్రీ హిందూస్తాన్‌ సంపాదకత్వం వంటివి) కారణంగా అతన్ని ఆ సంస్థ నుండి తొలగించారు. 1909 చివరి నాటికి, అతను సీటెల్‌కు తిరిగి వచ్చాడు. [4]

గదర్ పార్టీని స్థాపించడం

[మార్చు]

1909 సెప్టెంబరు - అక్టోబరు ఫ్రీ హిందూస్తాన్ సంచికలో "సిక్కులకు ఒక సూటి విజ్ఞప్తి" కనిపించింది. స్వదేశ్ సేవక్ లో కూడా దాన్ని ముద్రించారు. వ్యాసం ముగింపులో ఇలా ఉంది: "స్వేచ్ఛా వ్యక్తులు స్వేచ్ఛా దేశాల సంస్థలతో పరిచయం ఏర్పడడంతో కొంతమంది సిక్కులు, తాము ఉత్తర అమెరికా ఖండంలో కార్మికులే అయినప్పటికీ, స్వేచ్ఛ అనే ఆలోచనను స్వీకరించారు. బానిసత్వం ఇచ్చిన పతకాలను తుంగలో తొక్కారు ..." [5] 1912 మార్చిలో ది పంజాబీ పత్రికలో ప్రచురించబడిన ఒక లేఖలో 'పెరుగుతున్న విప్లవ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో భారతీయులను నిర్వహించడానికి ఒక నాయకుడు వచ్చి సహాయం చేయాలని కోరారు. తొలుత వారు కుమార్‌ను ఆఘ్వానించాలని అనుకున్నారు. తరువాత సర్దార్ అజిత్ సింగ్‌ను ఆహ్వానించడం గురించి చర్చించారు. అయితే, తారక్ వచ్చాక, తాను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రోజుల నుండి తెలిసిన లాలా హర్ దయాళ్‌ను ఆహ్వానించమని సూచించాడు. హర్దయాళ్ అతనితో కలిసి పనిచేసి, పసిఫిక్ తీర హిందీ అసోసియేషన్‌ను స్థాపించడానికి అంగీకరించాడు. ఈ అసోసియేషనే గదర్ పార్టీకి మొదటి మూలం. "చాలా మంది నాయకులు ఇతర పార్టీలకు చెందినవారు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. వీరిలో హర్దయాళ్, రాస్ బిహారీ బోస్, బర్కతుల్లా, సేథ్ హుస్సేన్ రహీమ్, తారక్ నాథ్ దాస్, విష్ణు గణేష్ పింగ్లే మొదలైనవారు ఉన్నారు. 1857 సిపాయీల తిరుగుబాటు తరువాత, స్వాతంత్ర్యం కోసం చేసిన మొదటి హింసాత్మక ప్రయత్నం గదర్ తిరుగుబాటు. అనేక వందల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు"అని కుష్వంత్ సింగ్ రాశాడు. [6]

బెర్లిన్ నుండి కాబూల్ దాకా

[మార్చు]

1914 లో తారక్, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెలోగా చేరాడు. తారక్ తన ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆ యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్‌లో చేరినప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్నేషనల్ లాపై పిహెచ్‌డి డిసర్టేషన్ ప్రారంభించాడు. తరువాత అతను వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందాడు. తాను చేసే పనిని మరింత స్వేచ్ఛగా చేసేందుకు వీలుగా, ఆ సంవత్సరంలో అతను అమెరికన్ పౌరసత్వం కూడా పొందాడు. రాబర్ట్ మోర్స్ లావెట్, ఉఫమ్ పోప్, యుసి బర్కిలీలో ఆర్థర్ రైడర్, డేవిడ్ స్టార్ జోర్డాన్, స్టువర్ట్ ఆఫ్ పాలో ఆల్టో ( స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ) వంటి ప్రొఫెసర్ల సహాయంతో, తారక్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను స్థాపించాడు. అమెరికన్ యూనివర్సిటీల ప్రతినిధిగా అంతర్జాతీయ విద్యార్థుల సంఘం ఆయనను ఆహ్వానించింది. అప్పటికే అతనికి ఇండో-జర్మన్ ప్రణాళిక గురించి తెలుసు. 1915 జనవరిలో, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయను బెర్లిన్‌లో కలిశాడు. ఆ సమావేశం కోసం, బర్కతుల్లా, హర్దయాల్ కూడా బెర్లిన్ వచ్చారు. రాజ మహేంద్ర ప్రతాప్ చేసిన కాబూల్ యాత్రలో అతనితో పాటు సాగాలని వారందరూ ఒక సన్నిహిత సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 

1916 ఏప్రిల్లో కాబూల్ లోని షిరాజ్-ఉల్-అక్బర్ కాన్స్టాంటినోపుల్ పత్రికలో తారక్ చేసిన ప్రసంగాన్ని పునర్ముద్రించారు. ఒట్టోమన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడంలో బిజీగా ఉన్న జర్మన్ అధికారుల పనిని, టర్కుల చిత్తశుద్ధిని, ధైర్యాన్నీ ఇది ప్రశంసించింది. యుద్ధాన్ని ప్రకటించినది జర్మనీ, ఆస్ట్రియాలనీ, మిత్రదేశాలు కాదనీ, అలా చేయడానికి కారణం వారి శత్రువులు మానవాళిపై చేసిన క్రూరమైన దురాగతాల నుండి భూమిని శుద్ధి చేయడమేననీ చెప్పాడు. భారతదేశం, ఈజిప్టు, పర్షియా, మొరాకో, ఆఫ్రికా ల్లోని దురదృష్టవంతులైన ప్ర్జజలను ఇంగ్లీషు, ఫ్రెంచి, రష్యన్లు ఆ దేశాలను బలవంతంగా స్వాధీనం చేసుకుని బానిసను చేసుకున్నారనీ, ఆ దేశాల ప్రజలను రక్షించడమే ఈ యుద్ధ ప్రకటన ఉద్దేశమనీ అతడు అన్నాడు. టర్కీ తన దేశాన్ని రక్షించుకోవడం, తన స్వేచ్ఛను కాపాడుకోవడం మాత్రమే కాకుండా, 30 కోట్ల ముస్లింలకు కొత్త జీవితాన్ని అందించడానికి, ఆఫ్ఘన్ దేశాన్ని దృఢంగా స్థాపించడానికి యుద్ధంలోకి ప్రవేశించిందని తారక్ నొక్కిచెప్పాడు. ఇది హిందువులు, ముస్లింలతో కలిసిన 35 కోట్ల భారతీయులకు మద్దతుదారుగా ఉంటుందని చెప్పాడు.

1916 జూలైలో తారక్ కాలిఫోర్నియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను జపనీస్ విస్తరణ, ప్రపంచ రాజకీయాలలో దాని ప్రాముఖ్యతపై విస్తారమైన అధ్యయనం చేసే ప్రాజెక్ట్‌తో జపాన్‌కు బయలుదేరాడు. ఈ అధ్యయనం 1917 లో జపాన్ ఆసియాకు ప్రమాదమా? అనే శీర్షికతో ఒక పుస్తకంగా కనిపించింది. ఈ పుస్తకానికి ముందుమాటను చైనా మాజీ ప్రధాని టాంగ్ షావోయి రాశాడు. రాష్ బిహారీ బోస్, హేరంబలాల్ గుప్తలతో కలిసి అతను మాస్కోకు బయలుదేరబోతూండగా, హిందూ జర్మన్ కుట్ర విచారణలో హాజరు కావాలని తారక్‌ను పిలిచారు. అందరూ శ్వేత జాతీయులే ఉన్న జూరీ అతన్ని "అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడ"ని ఆరోపించింది. అతని అమెరికన్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవాలని, బ్రిటిషు పోలీసులకు అప్పగించాలనీ ప్రతిపాదించబడింది. 1918 ఏప్రిల్ 30 న అతనికి లెవెన్‌వర్త్ ఫెడరల్ జైలులో ఇరవై రెండు నెలల శిక్ష విధించారు. 

విద్యా వృత్తి

[మార్చు]

జైలు నుండి విడుదలైన తరువాత తారక్, తన చిరకాల స్నేహితురాలైన మేరీ కీటింగ్ మోర్స్‌ను పెళ్ళి చేసుకున్నాడు. నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్ పీపుల్ అండ్‌ నేషనల్ ఉమెన్స్ పార్టీలో ఆమె వ్యవస్థాపక సభ్యురాలు. ఆమెతో కలిసి అతను ఐరోపా పర్యటనకు వెళ్లాడు. తన కార్యకలాపాల కోసం మ్యూనిచ్‌ను ప్రధాన కార్యాలయంగా చేసుకున్నాడు. అక్కడే అతను జర్మనీలో ఉన్నత చదువులు చదివిన ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించే ఇండియా ఇనిస్టిట్యూట్‌ను స్థాపించాడు. అతను శ్రీ అరబిందోతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాడు. అంతర్గత ఆధ్యాత్మిక క్రమశిక్షణను అనుసరించాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత తారక్, సంయుక్తంగా కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ ఫెలోగా నియమితుడయ్యాడు. విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించడానికీ, అమెరికాకు ఆసియా దేశాలకూ మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడానికీ, భార్యతో కలిసి 1935 లో తారకనాథ్ దాస్ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు.

తారక్ నాథ్ దాస్ ఫౌండేషన్

[మార్చు]

ప్రస్తుతం, ఈ ఫౌండేషను అమెరికాలో చదువుతున్న భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక సంవత్సరం గ్రాడ్యుయేట్ పనిని పూర్తి చేసిన లేదా పూర్తి చేయబోతున్న వారికి, డిగ్రీ కోసం పని చేస్తున్న వారికి స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తుంది. అక్కడి డజను విశ్వవిద్యాలయాలలో తారక్ నాథ్ దాస్ నిధులు ఉన్నాయి. మేరీ కీటింగే దాస్ ఫండ్ అని పిలువబడే కొలంబియా విశ్వవిద్యాలయంలోని ఫండ్‌లో మాత్రమే గణనీయమైన డబ్బు ఉంది. దాన్నుండి వచ్చే ఆదాయంతో భారతదేశంలో ఉపన్యాసాలు, సమావేశాలకు నిధులు సమకూర్చుతూ ఉంటారు. ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాలు పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ విశ్వవిద్యాలయం , వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా విశ్వవిద్యాలయం, హోవార్డ్ విశ్వవిద్యాలయం, యేల్ విశ్వవిద్యాలయం, చికాగో విశ్వవిద్యాలయం, మిచిగాన్ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం -మాడిసన్, అమెరికన్ విశ్వవిద్యాలయం, మనోవాలోని హవాయి విశ్వవిద్యాలయం,.

మలి జీవితం

[మార్చు]

1947 లో భారత విభజనతో మానసికంగా బాధపడిన వారిలో తారక్ ఒకడు. తన చివరి రోజు వరకు దక్షిణాసియా బాల్కనీకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించాడు. నలభై ఆరు సంవత్సరాల ప్రవాసం తరువాత, 1952 లో వాటుముల్ ఫౌండేషన్ యొక్క విజిటింగ్ ప్రొఫెసర్‌గా తన మాతృభూమిని సందర్శించాడు. అతను కలకత్తాలో వివేకానంద సొసైటీని స్థాపించాడు. 1952 సెప్టెంబరు 9 న, అతను బాఘా జతిన్ అమర వీరుడైన 37 వ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు తలపెట్టిన బహిరంగ సభకు అధ్యక్షత వహించాడు. తన గురువు జతిన్‌దా పాటించిన విలువలను పునరుద్ధరించాలని అతను యువతను కోరాడు. [7] అమెరికాకు తిరిగి వెళ్ళాక, 1958 డిసెంబర్ 22 న 74 సంవత్సరాల వయస్సులో తారక్ మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Sadhak biplabi jatindranath, [abbrev. jatindranath], by Prithwindra Mukherjee, West Bengal State Book Board, 1990, pp. 442–443
  2. Chang, Kornel (2012). American Crossroads : Pacific Connections : The Making of the U.S.-Canadian Borderlands (1). University of California Press. pp. 121–122. ISBN 9780520271692.
  3. James Campbell Ker, Political Trouble in India,[abbrev. Political], 1917, 1973, pp. 247, 251
  4. Political, pp. 119–120, 221–222
  5. Political, pp229-231
  6. Illustrated Weekly of India, 26 February 1961; Ghadar Movement:Ideology, Organisation and Strategy by Harich K. Puri, Guru Nanak Dev University Press, 1983
  7. Anandabazar Patrika, Kolkata, 10 September 1952)