తార్కాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీమతి తార్కాడ్

శ్రీమతి తార్కాడ్ పూర్తిపేరు శ్రీమతి తారాబాయి సదాశివ తార్కాడ్ . ఆమెను 'శ్రీమతి మేనేజర్ 'అని అందరూ పిలిచేవారు . కారణం, ఆమె భర్త సదాశివ తార్కాడ్ బొంబాయిలో ఒక మిల్లులో మేనేజర్ గా పనిచేసేవాడు . ఆమె మరిది అయిన ఆర్ . ఏ . తార్కాడ్ బాబా భక్తుడు . అతని ద్వారానే శ్రీమతి తార్కాడ్ కు బాబా గురించి తెలిసింది .

ఒకసారి తార్కాడ్ దంపతులు పసిపాపకు తీవ్రంగా జబ్బు చేసింది . ఎన్ని వైద్యాలు చేసినా ఉపకరించలేదు . అప్పుడామె మనస్సులో బాబాకు నమస్కరించి, "బాబా మీరు నిజంగా మహాత్ములైతే మా పాప జబ్బు తగ్గాలి . అప్పుడు మేమంతా కలిసి మీ దర్శనానికి శిరిడీ వస్తాము "అని మొక్కుకున్నది . కొద్దిరోజులలోనే ఆ బిడ్డ ఆరోగ్యం చక్కబడింది . వెంటనే ఆ కుటుంబం బాబాను దర్శించారు.

తార్కాడ్ దంపతులు సాయిని దర్శించేనాటికి శిరిడీ దీపాలు గూడా లేని అతి చిన్న గ్రామం . ఒకరోజు రాత్రి శ్రీమతి తార్కాడ్ చీకట్లో ఒక వీధి వెంట నడుస్తూ ఉంది. ఎందుకో ఒకచోట ఆమెకు నిలబడి పోవాలనిపించింది అక్కడే ఉండిపోయింది . ఎంతసేపయినా ఆమెకు అక్కడి నుంచి కదలాలనిపించలేదు . ఇంతలో ఒక వ్యక్తి దీపం తీసుకుని అటుగా వస్తూ ఉన్నాడు . ఆ దీపపు వెలుతురులో తన ఎదురుగా పాము ఉండడం గ్రహించి ఆమె ఆశ్చర్యపోయింది . ఆమె ఒక్క అడుగు ముందుకు వేసినా ఎంతో ప్రమాదం . బాబా తన మనస్సులో నుంచే తనను రక్షించారని ఆమెకు అర్ధమైంది . అందరి మనస్సులలో ఆయనే కదా ఉండేది.

శ్రీమతి తార్కాడ్ కు కుష్టు రోగులంటేఅసహ్యం . ఒకరోజు ఆమె బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా ఒక కుష్టు రోగి మసీదు ప్రవేశించాడు . అతడిని చూడగానే ఆమెకు ఎంతో అసహ్యమేసింది . వెంటనే బాబా ఆ కుష్టు రోగిని తమ దగ్గరకు రమ్మన్నారు . అతని దగ్గర ఉన్న మూట తెరచి అందులోంచి ఒక పాలకోవా బిళ్ళ తీశారు . దానిని తీసుకుని కొంచెం తానూ తిని మిగిలినది ప్రసాదంగా ఆమెకు ఇచ్చారు . తనలో ఆ కుష్టు రోగి పట్ల ఉన్న అసహ్యాన్ని తొలగించడానికే బాబా అలా చేశారని ఆమెకు అర్ధమైంది . ఆమె భక్తితో సాయి ప్రసాదం తీసుకున్నది . ఏ జీవిని అసహ్యించు కోకుండా దానిలో భగవంతుడిని చూడడమెలాగో బాబా ఆమెకు నేర్పించారు . మనమూ అందరిలో, అన్నింటిలో బాబాయే ఉన్నారని గుర్తుపెట్టుకుని ఏ జీవినీ, ఎవ్వరినీ అసహ్యింఛు కోకూడదు .

ఒకసారి శ్రీమతి తార్కాడ్ కు కళ్ళు నొప్పి చేసి నీరుకారుతూ ఉన్నాయి . ఆమె బాబా దర్శనానికి వెళ్లి ఆయనకు నమస్కరించి అక్కడ కూర్చున్నది . ఆ క్షణమే ఆమెకు కళ్ళ జబ్బు తగ్గిపోయింది . కానీ బాబా కళ్ళ వెంట నీరు కారసాగాయి . అలా తమ భక్తురాలి బాధను కరుణతో తామనుభవించారు .

మరొకసారి ఆమెకు చాలాకాలం పార్శ్వపు నోపి వచ్చింది . ఎన్ని మందులు వాడినా ఆ బాధ తగ్గలేదు . ఆ బాధ భరించలేక ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది . బాబా సన్నిధిలో మరణిస్తే మేలని తలచి తన భర్తతో కలిసీ శిరిడీ బయలుదేరింది . దారిలో గోదావరి నది మీదుగా శిరిడీ చేరాలి . గోదావరి నది చూడగానే ఆమెకు ఆ పుణ్యనదిలో స్నానం చేయాలనిపించింది . అంత చల్లటి నీటిలో స్నానం చేసినప్పటికీ ఆమెకు బాధ ఎక్కువ కాలేదు . సరికదా, ఆ క్షణం నుంచి ఆమెకు ఏ బాధాలేదు . అలా బాబా తమ వద్దకు ఆమె రాకమునుపే ఆమె బాధ తొలగించారు .

సదాశివ తార్కాడ్ మిల్లు మేనేజరుగా పనిచేస్తూ ఉండేవాడు . ఒకసారి అతనిని ఉద్యోగం తొలగించడం వల్ల చాలాకాలం నిరుద్యోగిగా ఉండవలసి వచ్చింది . ఆ సమస్య తొలగించుకోడానికే ఆ దంపతులు బాబా సన్నిధికి చేరారు . ఎంతకాలమైనా బాబా అతని ఉద్యోగం గురించి మాట్లాడనే లేదు . ఒకరోజు తాత్యాపాటిల్ మొ ॥ న వారు అహ్మద్ నగర్ కు వినోదం కోసం బయలుదేరుతూ ఉన్నారు . సదాశివ్ తార్కాడ్ ను గూడా వారితో అహ్మద్ నగర్ వెళ్లి అటునుంచి పూణే వెళ్ళమన్నారు బాబా . బాబా ఆదేశం తార్కాడ్ కు అర్ధం కాలేదు . అయినా బాబా మాట కాదనలేక వారందరితో కలిసి బయలుదేరి అటు నుంచే పూణే వెళ్ళాడు . అక్కడ పూణేలో ఒక మిల్లులో పనివారు సమ్మె చేస్తూ ఉన్నారు . సదాశివ తార్కాడ్ కు పనివారితో వ్యవహరించడంలో ఎంతో సమర్ధుడని మంచి పేరుంది . తమ మిల్లులో సమ్మె చేస్తున్న పనివారితో వ్యవహరించడానికి తార్కాడ్ ను పిలిపించాలని వారందరూ అతనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు . సరిగ్గా సమయానికి అతడు పూణే చేరాడు . అతడికక్కడ మంచి ఉద్యోగం లభించింది . బాబా ఎందుకు పూణే వెళ్లమన్నారో సదాశివ్ కు అర్ధమైంది .

అలా బాబా తమ భక్తులకు మాత్రమేగాక, వారి కుటుంబ సభ్యులకు కూడా శ్రేయస్సును ప్రసాదిస్తారు . వారి లౌకికమైన కష్టాలను, కోరికలనూ తీర్చడమే గాక తమ లీలల ద్వారా భక్తి విశ్వాసాలను కలిగించి వారిలోని దుర్గుణాలను తొలగించి సద్గుణాలను పెంపొందిస్తారు . వారిచ్చే శిక్షణలో మంచి విద్యార్థులమై ఉండడమే మనం చేయవలసినది .

"https://te.wikipedia.org/w/index.php?title=తార్కాడ్&oldid=1974838" నుండి వెలికితీశారు