తిండి పుల్లలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |

- తైవానీయ ప్లాస్టిక్ తిండిపుల్లలు
- చైనీయ పింగాణి తిండిపుల్లలు
- టిబెటన్ వెదురు తిండిపుల్లలు
- వీయత్నామీయ తాటి చెక్క తిండిపుల్లలు
- చదునైన కొరియా స్టేన్లెస్ స్టీల్ తిండిపుల్లలు
- పులుసులు, సూపులు తాగడానికి వాడే కొరియా లోహపు చెంచా
- జపనీయ తాటి చెక్క తిండిపుల్లలు (రెండు జతలు)
- చిన్న పిల్లలు వాడే జపనీయ తిండిపుల్లలు
- (కాగితపు కవర్లో) వాడిపారేసే జపనీయ తిండిపుల్లలు
తిండిపుల్లలు అనేవి మూడు సహస్రాబ్దాలకు పైగా తూర్పు ఆసియాలో, వియత్నాంలో తినడానికి ఉపయోగించబడుతున్న కర్రపుల్లలు. జతలోని రెండు పుల్లలు ఒకే పొడవులో ఉంటాయి. వాటిని వేళ్ళతో పట్టుకుని కదిలిస్తూ, ఆహారాన్ని పట్టుకోవడానికి, తినడానికి ఉపయోగిస్తారు.
వీటి వాడుక చైనాలో మొదలై, తూర్పు ఆసియాలో ఇతర దేశాలకు వ్యాపించింది. ప్రవాస చైనీయులు ఇండోనెషియా, మలేషియా, థాయిదేశం లాంటి ఆగ్నేయ ఆసియా దేశాలకు వలసవెళ్ళి స్థిరపడ్డం వల్ల నూడల్స్ లాంటి చైనీయ వంటకాలను తినడానికి అక్కడ కూడా ప్రజలు బాగా వాడుతారు. చాలా మంది మన భారతీయ భోజనాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే చెంచా, ఫోర్క్ తో కాకుండా చేతితోనే తినవలసిందే అని ఎలా భావిస్తారో, తూర్పు ఆసియా వాళ్ళు అలానే తమ భోజనాన్ని తిండిపుల్లలతోనే తినవలసిందే అని భావిస్తారు. అలానే, పాత కాలంలో తిండిపుల్లలతో తినడం సభ్యతా లక్షణమని తూర్పు ఆసియాలో భావించేవాళ్ళు.

చరిత్ర
[మార్చు]కనీసం షాంగ్ రాజవంశ కాలం (క్రీ.పూ. 1766-1122) నుంచి వాడుకలో ఉన్నాయి. హాన్ రాజవంశ చరిత్రకారుడైన సీమ చ్యెన్ అంతకు ముందు షియా రాజవంశ కాలంలో, అంతకు ముందు కూడా ఉన్న ప్రాచీన ఎర్లిటోవు నాగరిగతలో కూడా తిండిపుల్లలు వాడుకలో ఉండి ఉండొచ్చని సూచించారు, కాని దీన్ని నిర్ధారించడానికి ఆ కాలానికి సంబంధించిన ఆధారాలు కనిపెట్టడం చాలా కష్టం.
అతి పురాతనమైన తిండిపుల్లలు తినడానికి వాడేవాళ్ళు కాదు. వంట చేయడానికి, పొయ్యిలో మంటను తిప్పడానికి, తిండి పెట్టడానికి వంటపాత్రలుగా మాత్రం వాడేవాళ్ళు. దానికి కారణం: హాన్ రాజవంశ కాలానికి ముందు ఉత్తర చైనా, కొరియా, జపానులోని కొన్న ప్రాంతాల్లో కొర్రలు ప్రధానమైన ధాన్యం కావడం. కొర్రలను ఉడికించి అంబలి చేసి చెంచాతో తినేవాళ్ళు.
హాన్ రాజవంశ కాలంలో కొర్రల కంటే బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యం రావడంతో, అధిక మంది అన్నం తినడానికి ఇష్టపడసాగారు. మింగ్ రాజవంశం నాటికి చెంచాకు బదులుగా చైనాలో తిండిపుల్లలను అన్నీ రకాల ఆహారాలను తినడానికి వాడుతున్నారు.