తిరయాట్టం
తిరయాట్టం (ⓘ) అనేది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న దక్షిణ మలబార్ ప్రాంతంలో ఏటా ప్రదర్శించబడే ఒక ఆచార కళారూపం. ఇది నృత్యం, నటన పద్ధతులు, పాటలు, వాయిద్య సంగీతం, ముఖంపై రంగులు వేయడం, యుద్ధ కళలు, ఆచారాలను కలిపి ప్రదర్శించే ఒక గిరిజన కళారూపం.
చరిత్ర
[మార్చు]చరిత్ర పూర్వ యుగం నాటి సంప్రదాయాలు, ఆచారాల నుండి ఈ కళారూపం ఉద్భవించింది. తిరయాట్టంలోని వింత వేషధారణ, ఆచారాలు ఆ కాలంలోని సామాజిక జీవనానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి.[1] ఈ ప్రాంతంలోని ఇతర ఆచార కళారూపాలైన ఉత్తర మలబార్ 'తెయ్యం', మధ్య కేరళకు చెందిన 'ముడియేట్', ట్రావెన్కోర్లోని 'పడయని', తులునాడులోని 'భూత కోల' వంటి వాటికి తిరయాట్టంతో కొన్ని సారూప్యతలు ఉన్నాయి.
ప్రదర్శన
[మార్చు]
తిరయాట్టం అనేది నృత్యం, నటన పద్ధతులు, పాటలు, వాయిద్య సంగీతం, ముఖంపై రంగులు వేయడం, యుద్ధ కళలు, ఆచారాలను కలిపి ప్రదర్శించే ఒక గిరిజన కళారూపం. దీనిలోని ప్రత్యేకమైన ఆచారాలు, వస్త్రధారణ, కళాత్మక ప్రదర్శనలు తిరయాట్టాన్ని ఇతర కళారూపాల నుండి వేరు చేస్తాయి. కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని గ్రామ పుణ్యక్షేత్రాలలో కావుకల్ (పవిత్ర తోటలు) అని పిలువబడే ప్రాంగణాలలో దీనిని సాధారణంగా ప్రదర్శిస్తారు. ఈ ప్రాంగణాలలో ప్రదర్శించబడే నృత్యానికి చెండ మేళం వంటి సంగీత వాయిద్యాలు, వెచ్చని కాంతిని (కాగడాలు) జతచేస్తారు.[2]
పానన్, చెరుమార్ వంటి ఇతర వర్గాలు కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఇది సాంప్రదాయకంగా పెరుమన్నన్, వన్నన్ వర్గాలచే ప్రదర్శించబడేది. ప్రదర్శనకారుడు సాధారణంగా పారవశ్య స్థితికి చేరుకుని దేవత కదలికలను ఉగ్రంగా ప్రదర్శిస్తాడు, తన హావభావాల ద్వారా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తాడు.[3]
పురుషులు మాత్రమే ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తారు. తిరయాట్టం ప్రదర్శనకారులు వెల్లాట్, తిర, చంతుతిర అనే మూడు రూపాలలో లేదా కోలాలలో దేనినైనా ధరించవచ్చు. వెల్లాట్ కోలం దేవతల బాల్యాన్ని, తిరకోలం యవ్వనాన్ని సూచించగా చంతుతిర పరిణతి చెందిన (పెద్దల) రూపాన్ని సూచిస్తుంది.[4] పౌరాణిక దేవతలు, స్థానిక దేవతలు, విగ్రహాల వివిధ కథలను వీరు ప్రదర్శిస్తారు. వృక్షారాధన, నాగారాధన, ప్రకృతి ఆరాధన, వీరుల ఆరాధన, పర్వత దేవతల భావనలు, స్థానిక దేవతల భావనలు మొదలైన పురాతన ఆచారాలను కూడా తిరయాట్టంలో పాటిస్తారు. ప్రతి కథకు వేర్వేరు తోటమ్స్ (దృశ్యాలు) ఉంటాయి, ప్రతి తోటమ్లో దేవతల పురాణాలు సుదీర్ఘంగా వివరించబడతాయి.
ప్రతి కోలానికి వేరే ముఖం (పెయింటింగ్), నటన కోసం స్క్రిప్ట్ ఉంటాయి. వస్త్రధారణ, అలంకరణకు అవసరమైనవి సహజ పదార్థాలతో తయారు చేస్తారు. దీనికోసం తాటి ఆకులు, వెదురు, పనస చెక్కను వాడుతారు. చెండ, ఇలతాళం, తుడి, పంచాయుధం, కుళల్ వంటి ఇతర సాంప్రదాయ సంగీత వాయిద్యాలను తిరయాట్టంలో వాడుతారు.[5] ప్రదర్శన సమయంలో ప్రత్యేక గీతాలను పాడవచ్చు, కేవలం వేట దృశ్యాల కోసం మాత్రమే వాడే అంచంతడి పాటలు వీటిలో ఒకటి. ప్రాస, గానం వ్యక్తిగత నృత్యకారులను ప్రత్యేకంగా నిలబెడతాయి. నృత్యకారులు నృత్యం చేస్తూ అడుగులు వేస్తారు, సంప్రదాయ యుద్ధ కళారూపమైన కలరిపయట్టును గుర్తుచేసే ప్రతీకాత్మక ఆయుధాలను వాడుతారు. ఉదాహరణకు, కరుమకన్కు ఈటె, కరివిల్లికి విల్లు-బాణం, భగవతికి పల్లి కత్తి, వీరభద్రుడికి వెండి గొడ్డలి, మూర్తికి దండం-కవచం లాంటి ప్రతీకాత్మక ఆయుధాలను ఇస్తారు.[6] కొన్నిసార్లు, తిరకోలాస్ చుటుకాలి అనే ఉల్లాసభరితమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. చుటుకాలి అనేది నృత్యం, యుద్ధ కళల లయబద్ధమైన ప్రదర్శన, ఇక్కడ నర్తకుడు రెండు చేతుల్లో వెలుగుతున్న కాగడాలను పట్టుకుని నృత్యం చేస్తాడు.[7]
ప్రముఖ దేవతలు
[మార్చు]| చిత్రం | దేవత |
|---|---|
| భద్రకాళి | |
| భగవతి | |
| భైరవుడు | |
| గుళికన్ | |
| గురుదేవన్ | |
| కరివిల్లి | |
| కరియతన్ | |
| కులవన్ | |
| కర్ణవర్ | |
| కరుమకన్ | |
| కుట్టిచాతన్ | |
| మూరి కరియన్ | |
| మూర్తి | |
| ముతాషి | |
| నాగకాళి | |
| ఓడకాళి | |
| పూక్కుట్టి | |
| పోట్టన్ | |
| వీరభద్రుడు |
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెయ్యం
- భూత కోల
- యక్షగానం
- కూతు
మూలాలు
[మార్చు]- ↑ G. Venu (1990). Puppetry and lesser known dance traditions of Kerala. Natana Kairali, Research and Performing Centre for Traditional Arts.
- ↑ Thirayattam. State Institute of language, Kerala. ISBN 978-81-200-4294-0.
- ↑ "Thirayattam". Thirayattam. Archived from the original on 22 ఏప్రిల్ 2017. Retrieved 10 September 2015.
- ↑ Gundert, Hermann (2003). Kerala Pazhama:Antiquity of Kerala. International School of Dravidian Linguistics. ISBN 978-8-185-69233-3.
- ↑ Viṣṇunampūtiri, Eṃ. Vi (2012). Folklore: The Identity of Culture. Department of Information & Public Relations, Government of Kerala. p. 127.
- ↑ Sarabhai, Mallika (1994). Performing Arts of Kerala. Mapin Publications. p. 79. ISBN 978-0-944-14222-6.
- ↑ Krishnat P. Padmanabha Menon (1982). History of Kerala: A History of Kerala Written in the Form of Notes on Visscher's Letters from Malabar, Volume 4. Asian Educational Services. p. 378. ISBN 978-8-120-60168-0.