తిరునీలకంఠ నాయనార్
| తిరునీలకంఠ నాయనార్ | |
|---|---|
| జననం | చిదంబరం |
| బిరుదులు/గౌరవాలు | నాయనార్ సాధువు, |
| తత్వం | శైవం, భక్తి |
తిరునీలకంఠ నాయనార్, (వీరిని తిరునీలకంఠ, నీలకంఠన్, తిరునీలకంఠర్ అని కూడా పిలుస్తారు) ఒక నాయనార్ సాధువు. హిందూ మతంలోని శైవం విభాగంలో ఆయనను పూజిస్తారు. సాధారణంగా 63 మంది నాయనార్ల జాబితాలో ఆయనను రెండవ వాడిగా పరిగణిస్తారు.[1]
జీవితం
[మార్చు]తిరునీలకంఠ నాయనార్ జీవితం సెక్కిళార్ (12వ శతాబ్దం) రాసిన తమిళ గ్రంథం పెరియ పురాణంలో వర్ణించబడింది, ఇది 63 మంది నాయనార్ల జీవిత చరిత్రల సంకలనం.[2]
తిరునీలకంఠ నాయనార్ శైవమత పోషకుడైన శివునికి అంకితం చేయబడిన తిల్లా నటరాజ ఆలయానికి ప్రసిద్ధి చెందిన చిదంబరం ప్రాంతానికి చెందినవాడు. ఆయన కుమ్మరులైన కుయవర్ కులంలో జన్మించాడు.[3] మట్టి కుండలు, ఇతర పాత్రలు తయారు చేసేవాడు. ఆయన శివుని పరమ భక్తుడు, శివభక్తులకు మట్టి పాత్రలను ఉచితంగా పంపిణీ చేసేవాడు. ఆయన, ఆయన భార్య ప్రత్యేకించి హాలాహలం విషాన్ని తాగి విశ్వాన్ని రక్షించిన శివుని నీలకంఠ ("నీలిరంగు కంఠం కలవాడు") రూపాన్ని ఆరాధించేవారు.[4][5]
ఒకసారి, తిరునీలకంఠ నాయనార్ ఒక వేశ్యతో ఆనందం పొందాడు. అతను ఇంటికి చేరుకోకముందే ఈ వార్త భార్యకు చేరింది. కోపంతో ఉన్న భార్య తన విధులన్నీ నిర్వర్తించింది కానీ భర్తను తనను తాకనివ్వలేదు. ఆమెను శాంతింపజేయడానికి అతను ప్రేమగా తాకడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె అతని ప్రయత్నాలను తిరస్కరించి, 'మమ్మల్ని (నన్ను) తాకుతావా .... తిరునీలకంఠ' అని అంది. భర్త తనను తాకకూడదని భార్య ఉద్దేశించినప్పటికీ, ఆమె "మమ్మల్ని" అని కూడా అర్థం వచ్చే బహువచన సర్వనామాన్ని ఉపయోగించింది. తిరునీలకంఠ అనేది భర్త లేదా దేవుడు శివుని పేరుగా అన్వయించవచ్చు. సాంప్రదాయకంగా, ఒక హిందూ వివాహిత స్త్రీ తన భర్తను పేరు పెట్టి పిలవదు. ఆమె ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆమె నీలకంఠ దేవుని పేరు మీద మహిళలందరినీ ("మమ్మల్ని") తాకకుండా తనను నిరోధించిందని భర్త అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుండి నాయనార్ తన ఆలోచనలలో కూడా ఏ స్త్రీని తాకనని ప్రతిజ్ఞ చేశాడు.[4][5]
భార్య తిరునీలకంఠ నాయనార్ పట్ల భార్య బాధ్యతలన్నీ నిర్వర్తించినప్పటికీ, వారు ఎన్నడూ ఒకరినొకరు తాకలేదు. ఇంట్లో వేర్వేరు గదుల్లో నివసిస్తూ తిరునీలకంఠుని వ్రతాన్ని రహస్యంగా నెరవేర్చారు. ఆ దంపతులు వృద్ధులయ్యారు.[4][5]
ఒకసారి, శివుడు శైవ యోగి (భిక్షువు) రూపంలో మారువేషంలో వచ్చాడు. తిరునీలకంఠ నాయనార్ ఆయనను స్వాగతించి పూజించాడు. సన్యాసి కోసం తానెమి చేయగలనని వృద్ధ కుమ్మరి అడిగినప్పుడు, సన్యాసి తన "విలువైన" మట్టి బిక్షాపాత్రను ఇచ్చి, తాను తిరిగి వచ్చే వరకు దానిని సురక్షితంగా ఉంచమని కుమ్మరితో చెప్పాడు. యోగి వెళ్లిపోయాడు; తిరునీలకంఠ ఆ పాత్రను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు.[4][5]
చాలా కాలం తర్వాత, యోగి తిరిగి వచ్చి తన భిక్షాపాత్రను అడిగాడు. తిరునీలకంఠ ఆ పాత్రను ఉంచిన చోట వెతికి, ఇల్లంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. శివుడు వాస్తవానికి ఆ భిక్షాపాత్ర అదృశ్యమయ్యేలా చేశాడు. ఆందోళన చెందిన నాయనార్ భిక్షువు ముందు సాష్టాంగపడి, పాత్ర పోయిందని చెప్పి, దానికి బదులుగా కొత్త మట్టి పాత్రను ఇస్తానని ప్రతిపాదించాడు. అయితే, కోపంతో ఉన్న సన్యాసి నిరాకరించి, తన విలువైన పాత్రను కుమ్మరి దొంగిలించాడని ఆరోపించాడు. ఎంతగానో బతిమాలిన మీదట, సన్యాసి తిరునీలకంఠను ఆలయ కోనేరులో మునిగి, తన కొడుకు తలపై చెయ్యి వేసి ప్రమాణం చేయమని ఆదేశించాడు. తనకు సంతానం లేదని కుమ్మరి యోగితో చెప్పినప్పుడు, సన్యాసి అతని భార్య తలపై ప్రమాణం చేసి అలా చేయమని సూచించాడు. కానీ, తన వ్రతం కారణంగా తిరునీలకంఠ అలా చేయడానికి నిరాకరించగా, ఆగ్రహించిన సన్యాసి అక్కడినుండి వెళ్లి న్యాయం కోసం ఆలయ బ్రాహ్మణ పూజారులకు విజ్ఞప్తి చేశాడు.[4][5]
బ్రాహ్మణ న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విని, పవిత్ర కోనేరులో తన నిర్దోషిత్వాన్ని ప్రమాణం చేయాలని కుమ్మరిని ఆదేశించింది. తిరునీలకంఠ, అతని భార్య చెరో వెదురు బొంగు చివర పట్టుకుని ఆలయ కోనేరులోకి ప్రవేశించారు. సన్యాసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుమ్మరి తన భార్య చేయి పట్టుకోవాలని సూచించాడు. చివరగా, కుమ్మరి అప్పటి వరకు ప్రపంచానికి దాచిన తన ప్రైవేట్ జీవితం, తన వ్రతం గురించిన మొత్తం కథను అక్కడున్న బ్రాహ్మణులకు, సన్యాసికి వెల్లడించాడు. వృద్ధ దంపతులు పవిత్ర జలాల్లో మునిగి లేచేసరికి యువ దంపతులుగా బయటకు వచ్చారు. ఆశ్చర్యపోయిన బ్రాహ్మణులు నమ్మశక్యంకాని విధంగా చూశారు. సన్యాసి అదృశ్యమయ్యాడు. ఆకాశంలో, శివుడు తన భార్య పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమై దంపతులను ఆశీర్వదించాడు. దంపతుల భక్తికి, లైంగిక సంయమనానికి సంతోషించిన శివుడు వారిని తన నివాసమైన కైలాసానికి తీసుకువెళ్ళాడు, అక్కడ వారు నిత్య యవ్వనంతో జీవించారని చెబుతారు.[4][5]
స్మరణ
[మార్చు]అత్యంత ప్రముఖ నాయనార్లలో ఒకరైన సుందరార్ (8వ శతాబ్దం) నాయనార్ సాధువుల కీర్తన అయిన తిరుతొండ తొగైలో తిరునీలకంఠ నాయనార్‌ను "ఆశీర్వదించబడిన కుమ్మరి" అని కీర్తించాడు. కీర్తనలో పేర్కొన్న మొదటి నాయనార్, కుల ప్రస్తావన ఉన్న ఏకైక నాయనార్ ఆయనే.[6][7] నాయనార్లను వివరిస్తూ, నంబియాండార్ నంబి (11వ శతాబ్దం) తిరునీలకంఠ నాయనార్ తన భార్యతో లైంగిక సంయమనం పాటించాడని, వృద్ధుడిగా ఉండి "దేవుని దయ" ద్వారా తన భార్యతో కలిసి తిరిగి యవ్వనాన్ని పొందాడని పేర్కొన్నాడు.[8] కాకతీయ రాజు కాకతి గణపతి దేవుని (1199-1260) మంత్రి, గురువు అయిన విశ్వేశ్వర శివ దేశికుడు అని కూడా పిలువబడే శివదేవయ్య రాసిన, ప్రస్తుతం అలభ్యం అయిన తెలుగు శతకం (వందకు పైగా పంక్తులు ఉన్న పద్యం) శివ-దేవాధిమణి శతకము లోని ఒక సూక్తి ప్రకారం, బాల్యంలో సిరియాళుని వలె, యవ్వనంలో సుందరార్ వలె, వృద్ధాప్యంలో గుండయ్య (తిరునీలకంఠ నాయనార్) వలె ఉండాలి; శివునిపై విశ్వాసం లేకపోతే "అతని జన్మ భారం, జీవితం వ్యర్థం" అని చెబుతుంది.[9] గోపాలకృష్ణ భారతి (1810-1896) ఆయన జీవితంపై తిరునీలకంఠ నాయనార్ చరిత్రం అనే చిన్న ఒపెరా రాశాడు.[10]
చంద్రుడు విశాఖ నక్షత్రం (చంద్ర భవనం) ప్రవేశించినప్పుడు, తమిళ నెల అయిన తై (పుష్య మాసం) నెలలో తిరునీలకంఠ నాయనార్‌ను పూజిస్తారు. అతను నమస్కరిస్తున్న చేతులతో (అంజలి ముద్ర చూడండి) చిత్రీకరించబడ్డాడు. 63 మంది నాయనార్లలో భాగంగా అతను సమిష్టి ఆరాధనను అందుకుంటాడు. వారి విగ్రహాలు, అతని పనుల సంక్షిప్త వృత్తాంతాలు తమిళనాడులోని అనేక శివాలయాలలో కనిపిస్తాయి. పండుగలలో వారి చిత్రాలను ఊరేగింపుగా తీసుకువెళతారు.
చిదంబరంలో ప్రధాన నటరాజ ఆలయానికి పశ్చిమాన ఇళమై తీర్థం (యవ్వన కోనేరు) లేదా ఇళమై నాయనార్ తీర్థం (యువ నాయనార్ కోనేరు) లేదా వ్యాఘ్రపాద తీర్థం అని పిలువబడే ఆలయ కోనేరు ఉంది. ఇది శివుడు తిరునీలకంఠ నాయనార్‌ను పరీక్షించిన ప్రదేశంగా నమ్ముతారు. కోనేరు ఒడ్డున శివునికి అంకితం చేయబడిన ఇళమైయాకినార్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని తిరునీలకంఠ నాయనార్ కాలానికి చాలా ముందు భక్తుడు వ్యాఘ్రపాదుడు నిర్మించాడని, దీనిని తిరుప్పులీశ్వరర్ అని కూడా పిలిచేవారని చెబుతారు. తిరునీలకంఠ సంఘటన తరువాత, శివుని రూపాన్ని ఇళమై-యాకినార్ అని పేరు మార్చారు. ఆలయంలో తిరునీలకంఠ నాయనార్, అతని భార్య రత్నసాలైల కోసం ఒక మందిరం ఉంది. తై విశాఖ దినాన్ని తిరునీలకంఠ నాయనార్ భక్తి పరీక్షా దినంగా నమ్ముతారు. ఆలయ కోనేరులో నాయనార్ పరీక్షా కథను ఆచారబద్ధంగా ప్రదర్శించే ఆలయ పండుగ ద్వారా ఈ రోజు గుర్తించబడుతుంది. విడిపోయిన జంటలు లేదా వైవాహిక వివాదాలు ఉన్న జంటలు సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం ఆలయంలో ప్రార్థించాలని సూచిస్తారు.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ Roshen Dalal (2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. p. 281. ISBN 978-0-14-341421-6.
- ↑ "The Puranam of Tirunilakanta Nayanar". T N Ramachandran. Retrieved 21 December 2014.
- ↑ K. Nambi Arooran (1977). Glimpses of Tamil Culture: Based on Periyapuranam. Koodal Publishers. p. 77.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Glimpses of Holy Lives: Every Saint Has a Past …" (PDF). Prabuddha Bharata. Advaita Ashrama: the Ramakrishna Order started by Swami Vivekananda. September 2003. pp. 45–7. Archived from the original (PDF) on 24 December 2014. Retrieved 24 December 2014.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 Swami Sivananda (1999). Sixty-three Nayanar Saints (4 ed.). Sivanandanagar: The Divine Life Society.
- ↑ Poems to Śiva: The Hymns of the Tamil Saints. Motilal Banarsidass. 1991. p. 331. ISBN 978-81-208-0784-6.
- ↑ Rajeshwari Ghose (1 January 1996). The Tyāgarāja Cult in Tamilnāḍu: A Study in Conflict and Accommodation. Motilal Banarsidass. p. 206. ISBN 978-81-208-1391-5.
- ↑ Mor̲appākkam Appācāmi Turai Araṅkacāmi (1990). The Religion and Philosophy of Tēvāram: With Special Reference to Nampi Ārūrar (Sundarar). University of Madras. p. 945.
- ↑ Proceedings and Transactions of the All-India Oriental Conference. 1955. p. 358.
- ↑ Emmie Te Nijenhuis (1974). Indian Music: History and Structure. BRILL. p. 118. ISBN 90-04-03978-3.
- ↑ P. V. Jagadisa Ayyar (1982). South Indian Shrines: Illustrated. Asian Educational Services. p. 209. ISBN 978-81-206-0151-2.
- ↑ "Sri Ilamaiyaakinaar temple". Dinamalar. Retrieved 24 December 2014.