తుడుం (వాయిద్యం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుడుం అర్థ గోళాకారంలో వుండి మట్టితో తయారు చేయ బడ్డ వాయిద్యంగా పూర్వం ఉండేది. ప్రస్తుతం ఇనుముతో తయారు చేసిన తుడుం వాడుకలో ఉంది. పైన మేక చర్మాన్ని భిగించి కడతారు. అర్థ గోళం పైభాగం పైన తోలు పట్టీలు చర్మాన్ని బిగించి వుంచుతాయి. తాళ్ళ చుట్టుపైన ఈ వాయిద్యాన్ని వుంచి, వెదురు కొలాలతో ​వాయిస్తారు. ముఖ్యంగా ఆదివాసీ దేవుళ్ళ ఉత్సవాల్లో డెంసా నృత్యాలలో దినిని ఎక్కువగా ఉపయోగిస్తారు. గోండులు, కొలాము, ప్రధాన్స్, తోటి ఆదివాసులు ఈ వాయిద్యాన్ని ఎక్కువగా వాడుతారు.[1]

తయారీ

[మార్చు]

ఆదివాసీ సంస్కృతిలో 'తుడుం' వాద్యం ముఖ్యమైనది. గోండుల దేవగురువు దీనిని 152 మేకులతో నిర్మిస్తాడు. పై భాగాన్ని పశుచర్యంతో మూసివేస్తారు. ఈ వాద్యం నోరు దాని కింద ఆసనం  ఉంటుందని పెద్దలు అంటారు. దీని ప్రాణం దాని కింది భాగంలోనే ఉంటుందని  భావిస్తారు. కాబట్టి పూజచేసేప్పుడు దాని అడుగు భాగాన తిలకం దిద్దుతారు. వాయించేప్పుడు అన్ని చర్మవాద్యాలను వేడితో కాపినట్లే తుడుంని కాపి రెండు కర్ర కోలలతో వాయిస్తారు.[2]

సహవాయిద్యంగా కాలికోమ్

[మార్చు]

ఈ వాద్యం మేలు కొలువు దరువు మోగించడంలో దిట్ట. ఈ వాద్యం వాయించినప్పుడు కాలికోంని సహవాద్యంగా ఊదుతారు. ఈ శబ్దం వల్ల యుద్ధానికి సిద్ధం కండి అని శంఖం విన్న భావన కలుగుతుంది. కాబట్టి తుడుంమోత మోత మోగుతుందని, కాలికోం కూత కూస్తుందని వారు భావిస్తారు. వివిధ రకాల దరువులను పలుకుతూ మంచి శబ్దాలకు తుడుం జీవం పోస్తుంది.[3]

ఆదివాసుల చైతన్యానికి సంకేతం

[మార్చు]

గోండులు పెర్స్ పేన్ పండుగ, దండారి డప్పుల దరువులతో నిర్వహిస్తుంటారు.కొలాములు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం(సట్టి దెయ్యాల్),దండారి,దసరా పండుగలలో మోగిస్తుంటారు. ఆదివాసులకు ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా వస్తుంది. దీనిని డబ్బుతో కొనరు. ఒక పశువు ధరతో, మేకపోతు విలువతో సమానంగా చూస్తారు. దీనిని పురుషవాద్యంగా వారు భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజాకార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసుల చైతన్యానికి 'తుడుం' ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాలు తుడం మోగిస్తుంటారు. వాయుద్యం పేరుతో తుడం దెబ్బ (ఆదివాసీ హక్కుల పోరాట సమితి) సంఘాన్ని ఏర్పాటు చేశారు.

మూలాలు

[మార్చు]
  1. "Telugu News , NavaTelangana , Telangana , TELUGU NEWS , NEWS , TELANGANA NEWS , INDIA | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2022-03-25.
  2. జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర ).
  3. మూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణ. "తెలుగువారి జానపద కళారూపాలు/గిరిజనుల సంగీత వాయిద్యాలు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-03-25.