Jump to content

తూము లక్ష్మీనరసింహదాసు

వికీపీడియా నుండి
తూము లక్ష్మీనరసింహదాసు
జననం1790
మరణం1833
తండ్రిఅప్పయ్య
తల్లివెంకమాంబ

భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి తూము లక్ష్మీనరసింహదాసు. భద్రాచల రామదాసు కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది గుంటూరు మండలం. వీరి తండ్రి అప్పయ్య, తాత వెంకటకృష్ణయ్యలు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు.[1]

ఇతడు 1790లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడినది. అందుకోసం పొన్నూరులో పేష్కారుగా పనిచేశాడు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు.

దాసు భారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించాడు. కాలినడకన దాసు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించాడు. మహాభక్తుడైన త్యాగరాజు దాసుని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పాడు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించాడు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కన్పించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహ దాసును భద్రాచలం, పాల్వంచ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందాడు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు వరద రామదాసు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ, వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.

వరద రామదాసుకు క్షయ వ్యాధి సోకింది. నిరంతరం రామనామ స్మరణ చేసుకునే దాసు విజయ సంవత్సరం (1833-34) బాధ్రపద చతుర్థి నాడు రామునిలో లీనమయాడు. అతని భౌతిక కాయాన్ని గోదావరి నదిలో నిమజ్జజం చేయడానికి వెళ్ళిన భక్తుల బృందంతో సహా దేహత్యాగం చేశారు.

ఆయన రచించిన కృతిని ఆలపించిన వారు డాక్టర్ కల్లూరి మురళీకృష్ణ గారు.

చూడగల్గెను రాముని సుందర రూపము

వేడుకలర శ్రీభద్రద్రి విభుని రాఘవ ప్రభుని నేడు

కరకు బంగారు మకుటము మెఱయు కస్తూరి తిలకము

సరసమైన బొమలు కరుణ కురియు కందోయు గలుగు స్వామిని

నీల నీరద దేహము మేలి పసిడి చేలము

చాల భక్తుల బ్రోవ జాలు పదములు గలుగు స్వామిని

ఇందువదనమందు మందహాసము మెఱయగ

అందమైన వెడద యురమునందు ముత్యపు సరులు గలవాని

రత్నమంటపమందు సీతారమణి వామాంకమందు

యత్నముగా మెఱయు మమ్మేలు ఇనకులాంబుధి సోమును రాముని

ఇరుగడల చామరములిడగ వరుస ముత్యాల గొడుగులమర

నరసింహదాసుడెదుట జేయు నాట్యమవధరించు స్వామిని

22, సెప్టెంబర్ 2020, మంగళవారం నాటి ప్రసాద్ అక్కిరాజు గారి సేకరణ

మూలాలు

[మార్చు]
  1. "Tumu Narasimha Dasu (1790-1833) biography". Archived from the original on 2016-07-03. Retrieved 2015-12-25.

ఇతర లింకులు

[మార్చు]