తెన్నేటి విశ్వనాధం

వికీపీడియా నుండి
(తెన్నేటి విశ్వనాథం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెన్నేటి విశ్వనాధం
Tenneti vishwanatham.jpg
తెన్నేటి విశ్వనాధం గారి వర్ణ చిత్రం
జననం తెన్నేటి విశ్వనాధం
1895
విశాఖపట్నం జిల్లా లక్కవరం
మరణం -1979
వృత్తి విశాఖపట్నం కాంగ్రెస్ కమిటికి అధ్యక్షుడు
ప్రసిద్ధి రాజకీయ నాయకుడు,
స్వాతంత్ర్యపోరాట యోధుడు,
మాజీ న్యాయ, దేవాదాయ మరియు రెవిన్యూ శాఖామంత్రి
రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
విశాఖలో తెన్నేటి ఉద్యానవనం వద్ద శ్రీ తెన్నేటి విశ్వనాధం గారి ప్రతిమ

తెన్నేటి విశ్వనాధం (1895-1979) విశాఖపట్నానికి చెందిన రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ మరియు రెవిన్యూ శాఖామంత్రి. విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొల్పటములో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి.

1895లో విశాఖపట్నం జిల్లా లక్కవరంలో జన్మించిన విశ్వనాథం మద్రాసులో బి. ఎ., ఎం. ఎ. పూర్తి చేసి, ట్రివేండ్రంలో లా పట్టా తీసుకుని విశాఖపట్నంలో ప్రేక్టీస్ చేస్తూ 1926 లో విశాఖపట్నం కాంగ్రెస్ కమిటికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. మహాత్మా గాంధీచే ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమములో చేరి ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఐదు సార్లు జైలుకు వెళ్లాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికైనాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీని వదలి పెట్టి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రజా పార్టీలో చేరేరు. విశ్వనాథం 1951లో మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా కూడా పనిచేశాడు.

ఇంకా చిన్న వయస్సులో ఉన్న రోజులలోనే వారింట అంతా ఆయనని పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టేరుట. ఆయనకి అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదో, లేక చూపించిన పిల్లంటే ఇష్టం లేదో, తెలియదు కాని మొత్తం మీద అప్పట్లో ఆయన పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడ లేదుట. ఈ సందర్భంలోనే ఆయన ఇంట్లో ఎవ్వరితోటీ చెప్పకుండా రంగూన్ వెళ్ళిపోయారుట.

విశ్వనాధం గారు మంచి స్పురద్రూపి, వక్త గానే కాకుండా తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రవేశము ఉన్న వ్యక్తి. విశ్వనాధం గారు విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి చేసిన సేవ వర్ణనాతీతం. ఈయన కాఫీ బోర్డు ప్రెసిడెంటుగా ఉన్న రోజులలోనే అరకు లోయలో కాఫీ తోటలు వేయించటం మొదలు పెట్టేరు. ఈ సేవని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం పురజనులు వారి పురపాలక సంఘం భవనానికి “తెన్నేటి భవన్” అనీ, వారి ఊరులో ఉన్న ఒక పార్కుకి “తెన్నేటి పార్క్” అని పేరు పెట్టుకున్నారు. ఆయన విగ్రహం ఇప్పటికీ జగదాంబా సినిమా హాలు దగ్గర ఉంది.

విశ్వనాధం గారు చెప్పిన మండోదరి కథ.

ఒకానొకప్పుడు, త్రేతాయుగంలో అనుకుంటాను, ఒక మునీంద్రుడు నదిలో స్నానం చేసి, దోసిట్లోకి నీళ్ళు తీసుకుని, అర్ధనిమీలిత నేత్రుడై, సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పిస్తున్నాడుట. ఆదే సమయంలో ఒక డేగ ఒక కప్పని తన కాళ్ళ కింద పట్టుకుని ఎగురుతూ ఉండగా పట్టు సడలి ఆ కప్ప తిన్నగా వచ్చి ఈ మునీంద్రుడి దోసిట్లో ఉన్న నీళ్ళల్లో పడిందిట. కొన ప్రాణంతో గిలగిల కొట్టుకుంటూ ఆ మండూకము నఖర విదారితమైన శరీరంతో గుండెని కరిగించే దృశ్యాన్ని ప్రదర్శించేసరికల్లా మన ముని హృదయం ద్రవించి, స్రవించి విలపించిందిట. ఆ కప్పకి ప్రాణం పోసి బ్రతికించాలనే తలంపు రాగానే తన తపోశక్తిని ధార పోసి కప్ప కంఠంలో అడుగంటుతూన్న ప్రాణాన్ని పునః ప్రతిస్థాపన చెయ్యటానికి విశ్వ ప్రయత్నం చేసేడుట. ఆ సందర్భంలో సాక్షాత్తు ఆ బ్రహ్మ దేవుడే ప్రత్యక్షమై మునితో ఈ విధంగా అన్నాడుట. “మహర్షీ, నువ్వు విశ్వామిత్రుడంతటి తపోధనుడవు. సృష్టికి ప్రతి సృష్టి చెయ్య గల ద్రష్టవు. కాని డేగ గోళ్ళతో చీల్చబడ్డ ఈ కప్ప శరీరం చివికిపోయి శిధిలమై పోయింది. దీనికి ఎన్ని మరమ్మత్తులు చేసినా అతుకుల బొంతలా ఉంటుంది కాని, అందాలీనుతూ రాణించదు. కనుక నీ ఈ ప్రయత్నం విరమించుకో. కావాలంటే నీ తపోశక్తిని ఉపయోగించి, మూడు లోకాల్లోను మెచ్చదగ్గ సర్వాంగ సుందరిని సృష్టించి ఆ సుందరికి ఈ కప్ప బొందెలో ఉన్న ప్రాణాన్ని పొయ్యి.” అని సలహా ఇచ్చేడుట. ఈ సలహా ప్రకారం ఆ మునీంద్రుడు సృష్టించిన సుందరే మండోదరి. పోయే కాలం రాబట్టి అటువంటి త్రిలోక సుందరిని ఇంట్లో పెట్టుకుని రావణుడు సీత కోసం అలమటించేడు. అది వేరే విషయం అనుకొండి.

ఈ కథ చెప్పి విశ్వనాధం గారు, “కథలో కప్పలా కాంగ్రెస్ పార్టీ చివికి శిధిలమై పోయింది. జవహర్‌లాల్ నెహ్రూ ఎంత అవస్థ పడ్డా కొన ఊపిరితో ఉన్న ఈ పార్టీ బాగు పడదు. అందుకనే మేము ప్రజాపార్టీ స్థాపించేం. మీరంతా మాకే ఓటు వెయ్యండి,” అని ఉటంకించేరు.

భారతీయ తపాళా శాఖ తెన్నేటి విశ్వనాథం స్మృత్యర్ధం 2004 నవంబర్ 10వ తేదీన ఐదు రూపాయల తపాళా బిళ్లను పోస్టు మాస్టర్ జనరల్ ఎస్.కె.చక్రబర్తి విడుదల చేశాడు.[1].

మూలాలు[మార్చు]

  1. http://www.thehindubusinessline.com/2004/11/11/stories/2004111103110200.htm