తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆరోగ్య తెలంగాణ నినాదంతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తోంది. ఈ వైద్య కళాశాలన్నీ కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉన్నాయి.

2014 వరకు తెలంగాణలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా... 2023 సెప్టెంబరు నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 26కు చేరింది. చివరి దశగా 2024 కోసం మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయింది. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరుతుంది.[1]

కళాశాలల ఏర్పాటు[మార్చు]

రాష్ట్ర ఏర్పాటుకు ముందు గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ (1959), రిమ్స్‌ ఆదిలాబాద్‌ (2008), నిజామాబాద్‌ (2013) వంటి కళాశాలలు ఉన్నాయి.

4 కళాశాలల ప్రారంభం[మార్చు]

మొదటి విడతలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాల్లో నాలుగు వైద్య కళాశాలలు ఏర్పాటుచేసింది.

8 కళాశాలల ప్రారంభం[మార్చు]

ఎనమిది వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

రెండో విడుతలో 2021లో కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 8 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసింది.[2] ఈ 8 కళాశాలలకు 2022 ఆగస్టు నెలలో నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది.[3] 2022 నవంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు, రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.[4]

9 కళాశాలల ప్రారంభం[మార్చు]

మూడో విడుతలో ఏర్పాటుచేసిన కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లోని 9 కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది. 2023 సెప్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[5][6] ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

మరో 8 కళాశాలలు[మార్చు]

చివరిదశ ప్రభుత్వ వైద్య కళశాలల ఏర్పాటులో భాగంగా జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నారాయణపేట, ములుగు, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల్, నర్సంపేట్ (వరంగల్), యాదాద్రిలో నిర్మించే కాలేజీలకు రూ. 183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్ (మేడ్చల్ మల్కాజ్‌గిరి)కు రూ.182 కోట్లు, నారాయణ్ పేట్, ములుగు, మెదక్‌లోలో నిర్మించే కాలేజీలకు రూ. 180 కోట్ల చొప్పున, మహేశ్వరం మెడిక‌ల్ కాలేజీకి రూ.176 కోట్ల చొప్పున మొత్తం రూ.1,447 కోట్లతో వైద్యారోగ్య శాఖ 2023 సెప్టెంబరు 16న పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.[1]

సీట్ల వివరాలు[మార్చు]

ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ఉండేవి. 2022 నవంబరు నాటికి 2,790 సీట్లకి పెరిగింది. పిజీలో 531 సీట్ల నుండి 1180 సీట్ల వరకు, సూపర్ స్పెషాలిటీలో 70 సీట్ల నుండి 152 సీట్లకు పెరిగాయి.[7] 2023 సెప్టెంబరు నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలలలో 8,515 మెడికల్ సీట్లు ఉన్నాయి.

కేటాయింపు[మార్చు]

వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లలలో 15 శాతం సీట్లు నీట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలిండియా కోటాలో కేటాయించనుండగా, మిగతా 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్ర్ర అభ్యర్థులకు కేటాయించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 వైద్య కళాశాలు, 2,850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేవి. ఈ సీట్లలో కన్వీనర్‌ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో అన్‌ రిజర్వుడు కోటాగా 15 శాతం (280 సీట్లు) కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది.

2014 జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లోని కాంపిటేటివ్‌ అథారిటీ (కన్వీనర్‌) కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ చేయాలని నిర్ణయించింది. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా మిగిలినవి ఈ కళాశాలల్లోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయించేలా తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ 2023 జులై 3న వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు (జీవో నెంబరు 72) జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్‌ 371 డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేసినట్టు పేర్కొన్నది.[8]

కోర్టు తీర్పు[మార్చు]

అయితే దీనిని సవాల్‌ చేస్తూ సుమారు 60 మంది ఏపీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.[9] ఈ పిటిషన్‌పై 2023 జూలై 12న విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం 2023 సెప్టెంబరు 11న తీర్పు వెలువరించింది. ''వైద్య ప్రవేశాలకు సంబంధించిన 2017 నిబంధనలను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సొంత నిధులతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో సీట్లకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 95 వర్తించదనీ, 2014 జూన్‌కు ముందున్న 20 కాలేజీల్లోని సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటా కింద ఉంటాయని, 2014 జూన్‌ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 34 కాలేజీల్లోని సీట్లలో కన్వీనర్‌ కోటాలోని 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఉంటాయని'' పేర్కొంటూ ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.[10]

జాబితా[మార్చు]

తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల జాబితా[11]

  1. గాంధీ వైద్య కళాశాల (1954)
  2. ఉస్మానియా వైద్య కళాశాల (1946)
  3. కాకతీయ వైద్య కళాశాల (1959)
  4. రిమ్స్‌ ఆదిలాబాద్‌ (2008)
  5. నిజామాబాద్‌ వైద్య కళాశాల (2013)
  6. మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల (2016)
  7. సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల (2016)
  8. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల (2018)
  9. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల (2018)
  10. కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  11. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  12. మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  13. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  14. రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  15. వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  16. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  17. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల (2022)
  18. కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  19. కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  20. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  21. భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  22. ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  23. నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  24. సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  25. వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (2023)
  26. జనగాం ప్రభుత్వ వైద్య కళాశాల (2023)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 telugu, NT News (2023-09-17). "8 మెడికల్‌ కాలేజీలకు 1447 కోట్లు". www.ntnews.com. Archived from the original on 2023-09-20. Retrieved 2023-09-25.
  2. "కొత్త మెడికల్‌ కాలేజీల్లో బోధన.. ఫస్టియర్‌ ఎంబీబీఎస్‌ తరగతులు షురూ". Sakshi. 2022-11-14. Archived from the original on 2022-11-13. Retrieved 2022-11-15.
  3. "వైద్య విద్యలో నూతన శకం". EENADU. 2022-11-15. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.
  4. telugu, NT News (2022-11-15). "మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.
  5. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
  6. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.
  7. Telugu, TV9 (2021-09-20). "Telangana Medical Seats: రెండేళ్లలో కొత్తగా 2,400 ఎంబీబీఎస్‌ సీట్లు..తెలంగాణలో మరింత మంది వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశం!". TV9 Telugu. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. telugu, NT News (2023-07-05). "MBBS seats | తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. మెడిసిన్‌లో మొత్తం సీట్లు మనకే". www.ntnews.com. Archived from the original on 2023-07-06. Retrieved 2023-09-21.
  9. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights (2023-07-12). "Medical: వైద్య కళాశాలల్లో తెలంగాణ విద్యార్థులకే 100 శాతం సీట్లపై ప్రభుత్వానికి నోటీసులు". EENADU PRATIBHA. Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
  10. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "Medical Seats: కొత్త‌ వైద్య కళాశాలల్లో సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే". EENADU PRATIBHA. Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
  11. telugu, NT News (2023-09-14). "Medical education | దేశ వైద్యరంగంలో తెలంగాణ నవ చరిత్ర.. రేపు 9 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌.. సాకారమవనున్న జిల్లాకో మెడికల్‌ కాలేజీ". www.ntnews.com. Archived from the original on 2023-09-14. Retrieved 2023-09-27.