Jump to content

తెలుగుదేశం (వారపత్రిక)

వికీపీడియా నుండి
తెలుగుదేశం
రకంరాజకీయ వారపత్రిక
ప్రచురణకర్తసూర్యదేవర రాజ్యలక్ష్మి
సంపాదకులుసూర్యదేవర రాజ్యలక్ష్మి
స్థాపించినదిజూన్ 8, 1948 (1948-06-08)
భాషతెలుగు
కేంద్రంవిజయవాడ (1949 వరకు) హైదరాబాదు (1950 నుండి)

తెలుగుదేశం వారపత్రిక 1948లో ప్రారంభమయ్యింది. మొదటి సంచిక 1948, జూన్ 8వ తేదీన వెలువడింది. సామాజిక ఉద్యమకారిణి సూర్యదేవర రాజ్యలక్ష్మి ఈ పత్రికకు సంపాదకురాలు. ఇది విజయవాడ నుండి ప్రచురింపబడింది.[1] సాలు చందా పది రూపాయలు.

విశేషాలు

[మార్చు]

"తెలంగాణా, రాయలసీమ, సర్కారాంధ్రులు ముగ్గురూ ఐకమత్యమై విశాలాంధ్ర రాష్ట్రము స్థాపించుకుని అభివృద్ధి చెందుడని ప్రబోధించుట ఈ పత్రిక ఆదర్శం. జాతీయ, అంతర్జాతీయ విషయములను కూడ విస్మరించక వెల్లడించి, విమర్శిస్తున్నది. ముఖ్యముగా నైజాము గడబిడల గుట్టుముట్లు బట్టబయలు చేస్తున్నది." అని ఈ పత్రిక గురించి గృహలక్ష్మి వ్యాఖ్యానించింది.[2] హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయ్యాక ఈ పత్రిక 1950లో హైదరాబాదు నుండి వెలువడటం ప్రారంభించింది.[1] ఈ పత్రికపై ఉన్న ఆసక్తితో సూర్యదేవర రాజ్యలక్ష్మి పొలాలు అమ్మి వచ్చిన డబ్బుతో నారాయణగూడ ప్రాంతంలో ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నాయకులైన కొండా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వల్లూరి బసవరాజు, మర్రి చెన్నారెడ్డి మొదలైనవారు ఈ పత్రికకు మద్దతునిచ్చారు.[3] కంచర్ల లక్ష్మారెడ్డి, ఏల్చూరి సుబ్రహ్మణ్యం మొదలైన వారు ఈ పత్రికకు విలేకరులుగా పనిచేశారు.

ఈ పత్రిక గ్రంథాలయోద్యమ వార్తలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక అయినప్పటికీ ప్రజోపయోగం అనుకుంటే కమ్యూనిస్టు కార్యక్రమాలను కూడా దీనిలో ప్రచురించేవారు. ఈ పత్రిక రాజకీయ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ మహిళాలోకం, బాలల కొలువు, మనదేశం, ప్రపంచ ప్రగతి, వార్తావళి, పుస్తక పరిచయం వంటి శీర్షికలను ప్రసిద్ధ రచయితలతో నిర్వహించారు.[3] ఇంకా ఈ పత్రికలో కథలు, వ్యాసాలు కూడా ప్రచురింపబడ్డాయి.

రచనలు

[మార్చు]

ఈ పత్రికలో ప్రచురితమైన కొన్ని రచనలు:

  • ఇంటాయన - ఇంటావిడ (కథానిక)
  • డిటెక్టివ్ సాహిత్యం వ్యర్థం రచయితలు వ్రాయడం మానాలి (వ్యాసం)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 వేములపల్లి సత్యవతి (2 September 2010). "స్వతంత్ర సంగ్రామ సమరసేనాని సూర్యదేవర రాజ్యలక్ష్మి గారు". భూమిక మాసపత్రిక. Retrieved 26 February 2025.
  2. సంపాదకుడు (1 September 1948). "స్వీకారము - సారథి". గృహలక్ష్మి. 17 (7): 445. Retrieved 26 February 2025.
  3. 3.0 3.1 ఎం.జితేందర్ రెడ్డి (28 October 2024). "తెలంగాణలో పత్రికాభివృద్ధి". ఈనాడు దినపత్రిక. Retrieved 26 February 2025.