Jump to content

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(తెలుగు విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
రకంప్రభుత్వ
స్థాపితం1985, డిసెంబరు 2
ఛాన్సలర్సీ.పీ. రాధాకృష్ణన్ (తెలంగాణ గవర్నర్)
వైస్ ఛాన్సలర్వెలుదండ నిత్యానందరావు
స్థానంహైదరాబాదు, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంత
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం
తెలుగు మహాసభలు, వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ 2017

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం.[1] ఇది 1985 డిసెంబరు 2న ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. రాజమండ్రిలో విశ్వవిద్యాలయం శాఖ ఉంది.

ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది. 2022 జూలై 20న విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం జరుపుకుంది.

చరిత్ర

[మార్చు]

అకాడమిల రద్దు

[మార్చు]

1983లో నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత అప్పటికే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, సంగీత నాటక అకాడమి, లలిత కళా అకాడమి, నృత్య అకాడమిల పనితీరుపై నార్ల వెంకటేశ్వరరావుతో ‘ఏక సభ్య సంఘం’ ఏర్పాటు చేయబడింది. అకాడమిలను పరిశీలించిన కమిటీ వాటి రద్దుకు సిఫారసు చేయడంతో ఎన్‌.టి. రామారావు అకాడమిలను రద్దుచేశాడు. దీనికి కళాకారులు, రచయితల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురయింది.

తెలుగు విజ్ఞాన పీఠం ఏర్పాటు

[మార్చు]

దాంతో మేధావులతో, అధికారులతో సమాలోచనలు జరిపి గతంలోని అకాడమిల కార్యక్రమాలన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చేందుకు ‘తెలుగు విజ్ఞాన పీఠం’ పేరుతో ఒక కళాపీఠాన్ని స్థాపించి, నెక్లెస్‌ రోడ్‌లో హుస్సేన్‌సాగర్‌కి ఎదురుగా, ఎన్‌.టి.ఆర్‌. సమాధికి సమీపంలో 1984 ఏప్రిల్‌ 2వ తేదీన ఉగాది రోజున అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసిన స్థలంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరిగే దాకా రవీంద్రభారతి ప్రాంగణంలోని అకాడమిల ‘కళాభవన్‌’, ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని ‘అంతర్జాతీయ తెలుగు సంస్థ’, ‘తెలుగు భాషా సమితి’ లకు చెందిన ‘తెలుగు భవనం’ నుంచి ‘తెలుగు విజ్ఞాన పీఠం’ కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. 1985 మార్చి 13న ఆచార్య తూమాటి దొణప్ప ‘తెలుగు విజ్ఞాన పీఠాని’కి ప్రత్యేకాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.

విశ్వవిద్యాలయంగా మార్పు

[మార్చు]

తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, విజ్ఞానం, జానపద రంగం వంటి బహుముఖీనమైన రంగాలలో సమగ్ర వికాసం కోసం, నిరంతరం బోధన, పరిశోధన, ప్రదర్శన, ప్రచురణ కొనసాగాలని భావించిన ఎన్‌.టి.ఆర్‌., ఆనాటి లోకాయుక్త జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, కొంతమంది వైస్‌ ఛాన్స్‌లర్లను సంప్రదించి, వారి సూచన మేరకు ‘తెలుగు విజ్ఞాన పీఠం’ను ‘తెలుగు విశ్వవిద్యాలయం’గా మార్చాడు.

విశ్వవిద్యాలయ ఏర్పాటు

[మార్చు]

1985 సెప్టెంబరులో ‘తెలుగు విశ్వవిద్యాలయం’ చట్టం రూపొందించబడి, ఆనాటి శాసనసభలో ఆమోదం కూడా పొందింది. ప్రభుత్వ ఉత్తర్వు నెం.494, విద్య (ఉన్నత విద్య) తేదీ నవంబరు 27, 1985 ద్వారా ‘తెలుగు విశ్వవిద్యాలయం’ చట్టపరంగా ప్రకటించబడి, 1985 డిసెంబరు 2వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. తెలుగు విజ్ఞాన పీఠానికి ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఆచార్య తూమాటి దొణప్ప ప్రభుత్వం ‘తెలుగు విశ్వవిద్యాలయాని’కి మొదటి ఉపకులపతిగా నియమించబడ్డాడు.[2]

విభాగాలు, కోర్సులు

[మార్చు]

లలితకళా ప్రాంగణం, హైదరాబాదు

[మార్చు]

‘తెలుగు భవనం’, ‘తెలుగు భాషాసమితి’ భవనాలు ఉన్న స్థలంలోనే విశాలమైన ఖాళీ ప్రదేశంలో విశ్వవిద్యాలయంకోసం ఒకటి ప్లస్‌ ఆరు అంతస్తుల భవనం నిర్మించడానికి 1986 అక్టోబరు 15న శంకుస్థాపన చేశాడు. సంజీవరెడ్డి శంకుస్థాపన చేసిన చోట, ఎన్‌.టి.ఆర్‌ శంకుస్థాపన చేసిన చోట భవనాల నిర్మాణం జరగలేదు. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానంలో భాగంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘తరతరాల తెలుగు జాతి’ పేరుతో ఒక మ్యూజియాన్ని నిర్మించాలనుకున్నారు. ఆ స్థలాన్ని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ‘సరూబాగ్‌’ అని పిలిచేవారు. దానిని తెలుగు విశ్వవిద్యాలయాకి ఇచ్చేశారు.[2]

సామాజిక, ఇతర విజ్ఞానాల పీఠం

ప్రసార, పాత్రికేయ శాఖ, జ్యోతిష, వాస్తు శాఖ

తులనాత్మక అధ్యయన పీఠం

తులనాత్మక అధ్యయన శాఖ, అనువాదాల శాఖ

సాహిత్య పీఠం

తెలుగు సాహిత్య అధ్యయన శాఖ

లలిత కళల పీఠం

సంగీత శాఖ, నాట్య శాఖ, జానపద కళల శాఖ, రంగస్థల కళల శాఖ, శిల్ప, చిత్ర కళల శాఖ, సంస్కృతి మరియ పర్యటన శాఖ

ప్రాంగణాలు

[మార్చు]

హైదరాబాదుతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కూడా విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఏర్పాటు చేయడంకోసం ప్రభుత్వ ఉత్తర్వులు నెం.11 విద్య (ఉన్నత విద్య) 1986 జనవరి 7 ద్వారా రాజమండ్రిలోని బొమ్మూరులో, శ్రీశైలంలో ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. తరువాతి కాలంలో వరంగల్‌లో ‘జానపద గిరిజన విజ్ఞాన పీఠం’ ఏర్పడింది.[2]

నన్నయ ప్రాంగణం, రాజమండ్రి

[మార్చు]
భాషాభివృద్ధి పీఠం

1986 ఏప్రిల్‌ 18 శ్రీరామనవమి రోజున బొమ్మూరు ప్రాంగణానికి ఎన్‌టిఆర్‌ శంకుస్థాపన చేశాడు. భాష అధ్యయన శాఖ, నిఘంటు తయారీ శాఖ

పోతన ప్రాంగణం, పోతన విజ్ఞాన పీఠం వరంగల్

[మార్చు]
జానపద, తెగల సాహిత్య పీఠం

జానపద అధ్యయన శాఖ, తెగల అధ్యయన శాఖ

పాల్కురికి సోమనాథ ప్రాంగణం, శ్రీశైలం

[మార్చు]

1986 ఏప్రిల్‌ 10వ తేదీ ఉగాది రోజున శ్రీశైల ప్రాంగణానికి ఎన్‌టిఆర్‌ శంకుస్థాపన చేశాడు.

చరిత్ర, సంస్కృతి, పురాతత్వ పీఠం

తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర, సంస్కృతి శాఖ, ప్రాచీన శాసన, లిఖిత ఆధారాల శాఖ, పురాతత్వ శాఖ

శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం, కూచిపూడి

[మార్చు]
సిద్ధేంద్ర యోగి కళా పీఠం

కేంద్రాలు

[మార్చు]

కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము

[మార్చు]
విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడింది.

తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. 1986 అక్టోబరు 15న తెలుగు భాషా సమితి విలీనంతో విజ్ఞాన సర్వస్వ కేంద్రము ప్రారంభించబడింది. దీనిని తరువాత కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రముగా పేరు మార్చారు. వివిధ విషయాలలో 38 పైగా సంపుటాలను విడుదలచేయలనే ప్రణాళికలున్నాయి.తెలుగుభాషా సమితి 14 సంపుటాలను ప్రచురించింది. వీటిని ఆధునీకరించేపనిని కొత్త వి తయారుచేసే పనిని ఈ కేంద్రం చేపట్టింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, భారత భారతి, దర్శనములు-మతములు,[3] విశ్వసాహితి,[4] భారతభారతి, జ్యోతిర్విజ్ఞానము, ఆయుర్విజ్ఞానము, తెలుగు సంస్కృతి, నాటక విజ్ఞాన సర్వస్వం (2008) ప్రచురించబడినవి. ఇంగ్లిషులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్ అన్న సంపుటము ముద్రించబడింది. 11వ పంచవర్షప్రణాళికలో భాగంగా పని జరుగుతున్న సంపుటాలు.

  • దేశము-చరిత్ర
  • సిరిసంపదలు
  • తెలుగు జానపద విజ్ఞాన సర్వస్వము
  • సాహిత్య దర్శనము

అంతర్జాతీయ తెలుగు కేంద్రము

[మార్చు]

ఇతర రాష్ట్రాలు, లేక దేశాలలోని తెలుగువారికోసం ఈ కేంద్రం పనిచేస్తుంది.తెలుగు పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకు సహాయం, ఉపాధ్యాయ శిక్షణ, ఆధునిక తెలుగు, కూచిపూడి నాట్యం మొదలైన వాటిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

దూర విద్యాకేంద్రము

[మార్చు]

వివిధ అంశాలలో (తెలుగు, సంస్కృతంభాషలు, జ్యోతిషం, వార్తలు, సంగీతం, సినిమా సంభాషణ...) సర్టిఫికేట్, బిఎ, పిజిడిప్లొమా, ఎమ్ఎ, సర్టిఫికేట్ కోర్సులు

ప్రచురణలు

[మార్చు]

చూడండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలు

అవార్డులు - పురస్కారాలు

[మార్చు]

ఉపకులపతులు

[మార్చు]

విశ్వవిద్యాలయానికి ఉపకులపతులుగా పనిచేసిన వారిలో తూమాటి దోణప్ప, సి.నారాయణరెడ్డి, నాయని కృష్ణకుమారి, ఎన్. గోపి, జి. వి. సుబ్రహ్మణ్యం, ఆవుల మంజులత, అనుమాండ్ల భూమయ్య, కొంకా యాదగిరి (ఇన్‌ఛార్జ్), ఎల్లూరి శివారెడ్డి, ఎస్వీ సత్యనారాయణ,[8] టి.కిషన్‌రావు ఉన్నారు.[9]

ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మెన్ గా పని చేసిన ప్రొ.,వెలుదండ నిత్యానందరావును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ వీసీగా నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వీసీలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేదీ:18 అక్టోబరు 2024 న ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు వర్సిటీ వీసీగా ప్రొ.వి.నిత్యానందరావు మూడేళ్ల పాటు ఉప కులపతి గా పదవిల్లో కొనసాగుతాడు.[10]

రిజిస్ట్రార్

[మార్చు]

విశ్వవిద్యాలయానికి రిజిష్ట్రార్లుగా పనిచేసినవారిలో ఆచార్య టి. గౌరీశంకర్, అలేఖ్య పుంజాల,[11] భట్టు రమేష్[12] ఉన్నారు. 2024, నవంబరు 25న కోట్ల హనుమంతరావు రిజిస్ట్రార్ గా నియమించబడ్డాడు.

స్నాతకోత్సవాలు

[మార్చు]

ఛాన్సలర్‌ హోదాలో ముఖ్యమంత్రిగా ఉండగానే 1989లో రవీంద్రభారతిలో తెలుగు విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం జరిగింది. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆచార్య సి. నారాయణరెడ్డి ఉప కులపతిగా ఉన్నాడు. ఈ స్నాతకోత్సవంలో ధరించే గౌన్లు, టోపీలను బ్రిటిష్‌ కాలం నాటి తరహాలో కాకుండా తెలుగుదనం ఉట్టిపడేలా, తెలుపు ఖద్దరు గుడ్డతో జరీ అంచు పెట్టి గౌన్లు కుట్టించారు. తలపాగాలు, ముట్నూరి కృష్ణారావు తలపాగాను పోలినట్లు, ఎన్‌టిఆరే స్వయంగా కాగితంపై పెన్సిల్‌తో స్కెచ్‌ గీసి తయారు చేయించారు. మొత్తం స్నాతకోత్సవాన్ని తెలుగులోనే నడిపించారు. ఇప్పటికీ గౌన్లు, తలపాగాలు అవే ఉన్నాయి. ఛాన్స్‌లర్‌ని కులాధిపతి అనీ, వైస్‌–ఛాన్స్‌లర్‌ని కులపతి అనీ, రిజిస్ట్రార్‌ని కుల సచివులు అనీ పిలిచేవారు.[2]

గ్రంథాలయాలు

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయానికి శ్రీశైలం, రాజమండ్రి, వరంగల్‌లో మూడు గ్రంథాలయాలు ఉన్నాయి. లైబ్రరీలో తెలుగు భాష, సాహిత్యం, భాషాశాస్త్రం, లలిత కళలు, జ్యోతిష్యం, జర్నలిజం, సంస్కృతి, జానపద కళలు వంటి విషయాలపై వివిధ పుస్తకాలు ఉన్నాయి. 1985లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వవిద్యాలయం గ్రంథాలయం స్థాపించబడింది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్
  2. 2.0 2.1 2.2 2.3 ABN (2023-05-24). "తెలుగు విశ్వవిద్యాలయం: ఎన్‌టిఆర్‌ మానస పుత్రిక". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-23. Retrieved 2023-05-24.
  3. విజ్ఞాన సర్వస్వము సంపుటి 4 దర్శనములు-మతములు
  4. విజ్ఞాన సర్వస్వము సంపుటి 5విశ్వసాహితి
  5. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 4 May 2018.
  6. ఆంధ్రజ్యోతి (15 November 2018). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 15 November 2018. Retrieved 15 November 2018.
  7. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 16 July 2019.
  8. నమస్తే తెలంగాణ, తెలుగుయూనివర్సిటీ. "తెలుగువర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ". Retrieved 27 July 2016.[permanent dead link]
  9. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  10. ABN (2024-10-19). "University: 9 వర్సిటీలకు ఉప కులపతులు". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-19.
  11. వార్త, తెలంగాణ (26 November 2017). "తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య". Archived from the original on 14 మే 2019. Retrieved 2 December 2019.
  12. ఈనాడు, హైదరాబాదు (1 December 2019). "తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రమేష్‌". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2 December 2019. Retrieved 2 December 2019.

బయటి లింకులు

[మార్చు]