తెల్ల ఆరెచెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజ కొరకు సేకరించుకున్న తెల్ల ఆరెచెట్టు యొక్కచిన్న కొమ్మలు

ఫాబేసి కుటుంబంలోని బాహినియా ప్రజాతి కి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బాహీనియా రెస్ మోసా (Bauhinia racemosa). భారతదేశంలో బీడీ ఆకు చెట్టుగా పిలవబడే ఈ చెట్టు సుమారు 10 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. పుష్పించే పొద రకానికి చెందిన ఈ చెట్టు అరుదైన ఔషద గుణాలను కలిగివుంది. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితిలో (Tropical and Sub Tropical climate) పెరిగే ఈ చెట్టు ఆకురాల్చు తరగతికి (Desiduous) చెందినది.

వివిధ పేర్లు[మార్చు]

ఈ చెట్టు శాస్త్రీయ నామం బాహీనియా రెస్ మోసా. గాస్పర్డ్ బాహిన్ (1560-1624), అతని సోదరుడు జీన్ బాహిన్ (1541-1613) అనే ఇద్దరు ప్రసిద్ధ స్విస్ వృక్షశాస్త్రజ్ఞుల గౌరవార్ధం బాహినియా అనే పేరు వచ్చింది. రెస్ మోసా అనేది ఈ చెట్టు కలిగివున్న పుష్ప గుచ్చ విన్యాసం బట్టి వచ్చింది.

ఈ చెట్టును బీడీ ఆకు చెట్టు (Beedi Leaf Tree), బర్మీస్ సిల్క్ ఆర్కిడ్ అనే పేర్లుతో పిలుస్తారు. తెలుగులో తెల్ల అరె చెట్టు, అడవి యవిసె, మంచరె అని పిలవబడుతున్న ఈ చెట్టుకి భారతదేశంలో వివిధప్రాంతాలలో వివిధ స్థానిక పేర్లున్నాయి. తమిళంలో ఆత్తి (ஆத்தி), మరాఠీలో ఆప్ట (अपटा), కొంకిణిలో ఆప్టో (आप्टो), కన్నడంలో ఆప్త (ಅಪ್ತಾ), అరాలకడుమందార (ಅರಳುಕದುಮನ್ದರ), మలయాళంలో ఆరంపాళి (അരംപാലി), హిందీలో ( कठमूली ), జింజేరి (झिंझेरी), బెంగాల్ లో బన్ రాజ్, ఒరియాలో కాంచన, పంజాబ్ లో కోసుంద్ర, సంస్కృతంలో యమలపత్రక (यमलपत्रक) అని వ్యవహరిస్తారు.

ఆవాసం-విస్తరణ[మార్చు]

భౌగోళికంగా ఉష్ణమండలంలోని ఆగ్నేయాసియా ఆవాస ప్రాంతానికి చెందిన ఈ చెట్లు ప్రధానంగా ఇండో-మలయా ద్వీపకల్ప ప్రాంతంలో విస్తరించి వున్నాయి. ఈ చెట్లు విస్తరించిన ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలు.

a. ఉష్ణమండల ప్రాంతాలు:

భారత ఉపఖండం: భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్

ఇండో- చైనా ప్రాంతం: మైన్మార్, థాయ్ లాండ్, కంబోడియా, వియత్నాం

b. ఉప ఉష్ణమండల ప్రాంతాలు: పాకిస్తాన్, ఉత్తర భారతదేశం, నేపాల్, చైనా

భారతదేశానికి సంబందించినంతవరకూ ఉష్ణమండలంలోను, ఉప ఉష్ణమండలంలోను ఈ చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలోని ఆకురాల్చు అడవులలో ఈ తెల్ల ఆరెచెట్లు కొండదిగువ ప్రాంతాలనుండి 1000 మీటర్ల ఎత్తు వరకూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ చెట్లు పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, మధ్య భారత దేశం, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో విస్తరించి వున్నాయి.

అనుకూల పరిస్థితులు[మార్చు]

అడవులలో తెల్ల ఆరెచెట్లు (బాహీనియా రెస్ మోసా) సహజసిద్ధంగా పెరుగుతాయి. సూర్యరశ్మి ఎక్కువగా వున్నచోట బాగా పెరుగుతాయి. ఈ చెట్లకు సారవంతమైన నేల, తేమను నిలుపుకొనే నేలలు అనుకూలమైనవి. ముఖ్యంగా నీటిని అనుకూలమైన రీతిలో పీల్చుకొనే నేలలు (well drained soils) శ్రేష్ఠమైనవి. అయితే ఈ చెట్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకోగలవు. ఉష్ణమండలానికి చెందినవి కావడంతో ఈ చెట్టు 48 డిగ్రీల మండుటెండను సైతం తట్టుకొని మనగలుగుతాయి. సారహీనమైన నేలలలోను, శిలామయమైన నేలలలోను కూడా ఇవి పెరుగుతాయి.

లక్షణాలు[మార్చు]

1. కాండం[మార్చు]

ఈ చెట్టు కాండం పొట్టిగాను, గరుకుగాను వుంటుంది. బూడిద-గోధుమ రంగుతోను మందంగాను వున్న దీని ముదురు బెరడు లోతైన పగుళ్ళును కలిగి వుండటమే కాక చాలా గరుకుగా (rough) వుంటుంది.

2. ఆకులు[మార్చు]

రెండు తమ్మెల ఆకులు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఈ చెట్ల ఆకు రెండేసి ఆకులు అతుకొన్నట్లు పోలి వుంటుంది. అనగా ఒకే మొదలు నుండి రెండు తమ్మెలు (భాగాలు) బయలుదేరే ఈ ఆకు జంటాకు వలె కనిపిస్తూ విలక్షణంగా వుంటుంది. ఇలా రెండు మొనలతో సగం నుండి విడివడి, రెండు భాగాలుగా చీలి కలుసుకొన్నట్లుగా వున్నఈ ఆకులు ఆకారంలో ఒంటె గిట్టను (camel foot) పోలి వుంటాయి.

ఈ చెట్టు ఆకులు పొడవు కన్నా వెడల్పు ఎక్కువగా వుంటాయి. సాధారణంగా ఆకు పొడవు 6-8 సెం.మీ. వుంటే వెడల్పు మాత్రం 7-9 సెం.మీ వుంటుంది. 9 నుండి 11 దాకా గట్టి ఈనెలు తొడిమ నుంచి ఆకు చివరి భాగం వరకు ప్రాకి వుంటాయి. ఈ చెట్లు వేసవిలో ఆకులను రాలుస్తాయి.

3. పూవులు[మార్చు]

మార్చి-జూన్ నెలల మధ్యలో తెల్ల ఆరె చెట్లు పువ్వులు పూస్తాయి. ఈ చెట్ల పూలు చాలా చిన్నవి. కేవలం 1 సెం.మీ. పొడవు మించి పెరగవు. ఈ పూలు 5-10 సెం.మీ. పొడవైన గుచ్చాలుగా పూస్తాయి. ఈ పుష్ప గుచ్చ విన్యాసం రెస్ మోసా (racemose) అనే రకానికి చెంది వుండటంతో ఈ చెట్టు జాతికి రెస్ మోసా అనే పేరు వచ్చింది. ఈ పూల యొక్క ఆకర్షక పత్రావళి 5 తెల్లని పూరేకులు కలిగివుంటుంది. తెల్లగా వుండే ఈ పూలు సువాసనాభరితంగా వున్నప్పటికీ వీటి రంగులో ఏవిధమైన ప్రత్యేకత కనిపించదు. ఇవి ద్విలింగ పుష్పాలు (కేసరావళి, అండకోశం రెండిటిని కలిగిన పువ్వులు)

4. కాయలు[మార్చు]

డిసెంబర్-జూన్ నెలల మధ్యలో ఈ చెట్లకు కాయలు కాస్తాయి. కాయలు ముదిరేవరకూ అనేక నెలలపాటు చెట్ల పైనే వుంటాయి. చెట్టు కాయలు పొడవుగా, కొద్దిగా వంపుతేలి కొమ్మలనుండి వ్రేలాడుతూ వుంటాయి. సుమారు 8-15 సెం.మీ. పొడవు, 2 సెం.మీ. వెడల్పు కలిగివున్న ఈ కాయలు గట్టిగా ఉబ్బి వుంటాయి. ప్రతీ కాయలోను సుమారుగా 10-15 గింజలు వుంటాయి. పరిపక్వం అయిన కాయ రంగు ఆకుపచ్చరంగు నుండి ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. బాగా సంపీడనానికి లోనైనపుడు ఆ ముదురు కాయలు పగిలి, దానిలోని గింజలు రాలి నేలపై పడతాయి.

5. విత్తనాలు[మార్చు]

సుమారుగా 8 మి.మీ. పొడవు, 6 మి.మీ. వెడల్పుతో అండాకారంలో వున్న దీని విత్తనాలు ముదురు కాఫీ రంగులో నిగ నిగ లాడుతూ వుంటాయి. విత్తనాలు ద్వారా ఈ చెట్లు పరివ్యాప్తి చెందుతాయి. డిసెంబర్-జూన్ నెలల మధ్యకాలంలో విత్తనాలు మొలకెత్తుతాయి.

ప్రజననం (Propagation)[మార్చు]

అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్లను, మంచి ఔషద గుణాలు వున్న కారణంగా సాగు చేయడం ద్వారా కూడా పెంచుతున్నారు. ఈ చెట్లను విత్తనాల ద్వారా ప్రజననం చెందిస్తారు. 12 గంటలపాటు నీటిలో నానబెట్టిన విత్తనాల వలన అంకురోత్పత్తి చాలా వేగవంతం అవుతుంది. 4-10 రోజులకు అంకురోత్పత్తి మొదలై 30 రోజులపాటు కొనసాగుతుంది.

ప్రాముఖ్యత[మార్చు]

విశాలమైదానాలలో పెరిగే ఈ చెట్లు నేలకోత (soil erosion) ను అరికట్టి భూసారాన్ని పరిరక్షించడంలో గణనీయంగా తోడ్పడతాయి.

1. ఔషద ప్రయోజనాలు[మార్చు]

అరుదైన ఔషద జాతికి చెందిన ఈ చెట్టు యొక్క ఆకులు, బెరడు అనేక రకాలైన ఔషద గుణాలను కలిగివుంది. ఈ చెట్ల బెరడు, ఆకులను డయేరియా, డీసెంటరీ, మూత్రాశయ సంబందిత వ్యాదుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ చెట్ల ఆకులనుంచి తయారుచేసిన డికాషన్ ను మలేరియా జ్వరపీడితుల యొక్క తలనొప్పికి ఉపశామనకారిగా వాడతారు. బెరడు నుండి తయారుచేసిన డికాషన్ ను పుండ్లు (ulcers) నివారణకు వాడతారు. లేత బెరడు నుంచి తయారుచేసిన పేస్టు ముద్దను ఉదర సంబందిత వాపులను, కడుపునొప్పిలను తగ్గించడానికి వాడతారు. ఆకులను నూరి తయారుచేసిన పేస్టును నుదిటిపై వత్తడం ద్వారా తలనొప్పని ఉపశమింప చేస్తారు.

మూలికావైద్యంలో భాగంగా గర్భాశయ వాహికల్లో చీముకణాల అవరోధం తొలగించడానికి దేవకాంచనం, ఆరెచెట్టు పువ్వులను రసాన్ని పరగడుపున సేవిస్టారు.

2. పశువైద్య సంబందిత ప్రయోజనాలు[మార్చు]

ఈ చెట్ల ఆకుల రసాన్ని గొర్రెలకు సంక్రమించే అతిసార (డయేరియా) వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.

3. ఆహార ప్రయోజనాలు[మార్చు]

ఈ చెట్ల యొక్క లేత పళ్ళను కూరగాయలవలె తినవచ్చు. వేయించిన విత్తనాలను ఆహారంగా కూడా స్వీకరిస్తారు.

4. ఇతర ఆర్ధిక ప్రయోజనాలు[మార్చు]

పశ్చిమ భారతదేశంలో ఈ చెట్టు ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు. ఈ కారణం వల్లనే ఈ చెట్టుకు బీడీ ఆకు చెట్టు అనే పేరు కూడా వచ్చింది. తాళ్ళు తయారీకు కావలిసిన బలమైన నారను (fibre) ఉత్పత్తి చేయడానికి ఈ చెట్టు బెరడు ఉపయోగపడుతుంది.

నమ్మకాలు & ఆచారాలు[మార్చు]

హిందువులు దసరా ఉత్సవాల సమయంలోను, పెళ్ళిళ్ళ సమయంలోను తెల్ల ఆరెచెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.

చిత్రమాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]