తోప్పూరు యుద్ధం
| తోప్పూరు యుద్ధం | |||||||
|---|---|---|---|---|---|---|---|
| |||||||
| ప్రత్యర్థులు | |||||||
| జగ్గ రాయలు వర్గం | రఘునాథ నాయకుని వర్గం | ||||||
| సేనాపతులు, నాయకులు | |||||||
| జగ్గ రాయలు † | రఘునాథ నాయకుడు రామదేవ రాయలు యాచమ నాయుడు | ||||||
| ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
| భారీ నష్టం | భారీ నష్టం | ||||||
తోప్పూరు యుద్ధం 1616 చివరలో వాస్తవ విజయనగర చక్రవర్తి జగ్గ రాయలు, రామదేవ రాయల మధ్య జరిగింది. పతనావస్థలో ఉన్న విజయనగర సామ్రాజ్యానికి ఈ యుద్ధం తీవ్ర నష్టం కలిగించింది. విజయనగర సామ్రాజ్య సింహాసనం కోసం హక్కుదారుల మధ్య జరిగిన అంతర్యుద్ధం ఇది. జగ్గ రాయలు తన మేనల్లుడి తరఫున శ్రీరంగ అధికారాన్ని సవాలు చేశాడు.
నేపథ్యం
[మార్చు]విజయనగర సామ్రాజ్య పాలకుడు, అరవీటి వంశానికి చెందిన వెంకటపతి రాయలు ప్రత్యక్ష వారసులు లేకుండా మరణించాడు. కాబట్టి అతను తన మేనల్లుడు రెండవ శ్రీరంగను వారసుడిగా ప్రకటించాడు. కానీ వెంకటపతి రాణి బాయమ్మ సింహాసనాన్ని అధిష్టించడానికి చెంగ రాయలు అనే బ్రాహ్మణ బాలుడిని దత్తత తీసుకుంది. ఆమె ఆశయం సామ్రాజ్యంలో అంతర్యుద్ధానికి దారితీసింది. బాయమ్మ సోదరుడు గొబ్బూరి జగ్గ రాయలు రాజును, అతని మొత్తం కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. అతని ఒక కుమారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రూరమైన హత్య రాజదర్బారులో, ఇతర నాయక సేనానులలో ఆగ్రహం తెప్పించింది. సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు వెలుగోటి యాచమ నాయకుడు తిరుగుబాటు చేసి రెండవ శ్రీరంగ కుమారుడైన రామదేవ రాయలకు మద్దతు ఇచ్చాడు.[మూలం అవసరం]
ప్రదేశం
[మార్చు]యుద్ధం జరిగిన ప్రదేశాన్ని చాలా మంది చరిత్రకారులు తోప్పూరు అని పేర్కొన్నారు, ఇది కావేరి నది ఒడ్డున కల్లణై (గ్రాండ్ ఆనకట్) కు ఒక మైలు దూరంలో ఉంది, ఇదే ప్రస్తుత తోగూర్.[2]
యుద్ధం
[మార్చు]కుంభకోణంలో రామదేవ రాయలు ఉన్నాడని తన వర్గాల ద్వారా తెలుసుకున్న జగ్గ రాయలు అతన్ని అంతం చేయాలనుకున్నాడు. తదుపరి రాజును నిర్ణయించే చట్టబద్ధత తనకు ఉందని నమ్మించడం ద్వారా అతను సెంజి, మదురై పాలకుల మద్దతు పొందాడు. అతను తన మిత్రపక్షాలతో కలిసి కుంభకోణం వైపు కదిలాడు. ఈ పరిణామంతో కాబోయే రాజును రక్షించడానికి రఘునాథ నాయకుడు కుంభకోణం వైపు పరుగెత్తాడు. మార్గమధ్యంలో అతను రాత్రికి పలమనేరిలో బస చేశాడు.[3]
మరుసటి రోజు నళ నామ సంవత్సర ఆషాడ శుద్ధ పంచమి నాడు, యాచమ నాయకుని మద్దతుతో రఘునాథ నాయకుడు వీరప్ప నాయకుడు (మదురై రాజ్యం), జగ్గ రాయలు, వరదప్ప నాయకుడు (సెంజి రాజ్యం) సైన్యాలను ఎదుర్కొన్నాడు.
తెల్లవారుజామున యుద్ధభూమిలో రఘునాథుడు తన ఫిరంగులను పేల్చాలని ఆదేశించాడు, దానికి మదురై ఫిరంగులు కూడా దీటుగా బదులిచ్చాయి. 90 నిమిషాలకు పైగా పనిచేయడంతో ఫిరంగులు వేడెక్కి ఆగిపోయాయి. ఇరువైపులా గణనీయంగా ప్రాణనష్టం జరిగింది. శత్రువుపై దాడి చేయడానికి తన పదాతిదళం వెనుక రహస్యంగా దాచిన అశ్వికదళాన్ని రఘునాథుడు ఆదేశించాడు. దీనివల్ల శత్రు శ్రేణులలో భయాందోళనలు నెలకొన్నాయి, వీరప్ప నాయకుడు తన సేనానులతో సహా యుద్ధభూమి నుండి వైదొలిగాడు. మదురై పదాతిదళాన్ని చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారు. రెండవ దశలో వెనక్కి తగ్గుతున్న తంజావూరు అశ్వికదళం స్థానంలో తంజావూరు పదాతిదళం చేరడంతో మదురై పదాతిదళం పారిపోయింది.
తర్వాత జగ్గ రాయలు తన సైన్యంతో గర్జిస్తూ యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. జగ్గ యుద్ధ జెండాను చూసిన రఘునాథ నాయకుడు ఉద్రేకానికి గురై తన ఏనుగుపై ముందుకు సాగాడు. తన శత్రువుపై బాణాల వర్షం కురిపించాలని ఆదేశించాడు. జగ్గను చంపాలన్న తన రాజు శపథాన్ని నెరవేర్చడానికి, తంజావూరు వీరులలో ఒకరు తన సర్వశక్తులొడ్డి జగ్గ వైపు ఈటెను విసిరాడు. అది జగ్గ కవచాన్ని చీల్చుకుని వెళ్లి అతని మరణానికి దారితీసింది. జగ్గ సైన్యాలు పూర్తిగా యుద్ధం నుండి పారిపోయాయి.
ఆ తర్వాత వీరప్ప సెంజి సైన్యాలతో కలిసి యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. తంజావూరు సైన్యాలకు ఉపశమనం కలిగించడానికి యాచమ తన సైన్యాలతో కలిసి రంగంలోకి దిగాడు. అతను మదురై, సెంజి సైన్యాలను చెదరగొట్టాడు. శత్రు దళాలు శాశ్వతంగా యుద్ధం నుండి వైదొలిగాయి. సాయంత్రానికి రఘునాథ నాయకుడు, యాచమ నాయకుడు ఘన విజయం సాధించారు.
పరిణామాలు
[మార్చు]ఈ యుద్ధంలో రఘునాథ నాయకుని వర్గం విజయం సాధించింది, 13 సంవత్సరాల వయసున్న రెండవ శ్రీరంగ కుమారుడు రామదేవ రాయలు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.[4]
నెమ్మదిగా కోలుకుంటున్న విజయనగర సామ్రాజ్యం పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి ఈ యుద్ధమే కారణం. ఈ అంతర్యుద్ధం విజయనగర సామ్రాజ్యానికి తీవ్రమైన సమస్యలను తెచ్చిపెట్టింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Vriddhagirisan 1942, p. 69.
- ↑ Srinivasachari, C. S. (1943). History of Gingee and Its Rulers (2nd ed.). The Annamalai University. p. 135.
- ↑ Nayaka, Vijayaraghava (5 May 1951). Raghunathanayalabhyudayamu Diwipada Kavi. Madras: Rathnam Press.
- ↑ 4.0 4.1 R, Sathianathaier (2 July 1956). "Tamilaham in the 17th Century" (PDF).
ఆధారాలు
[మార్చు]- Rao, V. N. Hari. "Thiruvarangam - History". History Of Srirangam Temple. Archived from the original on 30 September 2007. Retrieved 23 August 2019 – via thiruvarangam.com.
- Rao, Velcheru Narayana, David Shulman, Sanjay Subrahmanyam. Symbols of substance : court and state in Nayaka period Tamilnadu (Delhi; Oxford : Oxford University Press, 1998); xix, 349 p., [16] p. of plates : ill., maps; 22 cm.; Oxford India paperbacks; Includes bibliographical references and index; ISBN 0-19-564399-2.
- Sathianathaier, R. History of the Nayaks of Madura [microform] by R. Sathyanatha Aiyar; edited for the University, with introduction and notes by S. Krishnaswami Aiyangar ([Madras] : Oxford University Press, 1924); see also ([London] : H. Milford, Oxford university press, 1924); xvi, 403 p.; 21 cm.; SAMP early 20th-century Indian books project item 10819.
- K.A. Nilakanta Sastry, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, OUP, (Reprinted 2002) ISBN 0-19-560686-8.
- Vriddhagirisan, V. (1942). The Nayaks of Tanjore. Annamalai University.