థర్డ్‌ ఫ్రంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్నికలు జరగడానికి ఇంకా పదినెలలపైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల కోసం ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడమే కాక, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపియేతర నేతల్ని సంప్రదించడం ప్రారంభించారు. బీహార్, ఒడిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌తో పాటు మన రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ నేతలతో కూడా మాట్లాడారు. మమత వీరిని సంప్రదించారని తెలియగానే అప్రమత్తమైన వామపక్షనేతలు కూడా వివిధ ప్రతిపక్షాల నేతల్ని కూడగట్టుకోవడం మొదలు పెట్టారు. శరద్‌యాదవ్, ములాయంలతో మాట్లాడారు. అసలు ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక జోక్ అని సిపిఐ నేత బర్దన్ కొట్టి పారేశారు. వామపక్షాలు రంగంలోకిదిగిన తర్వాత ములాయం, చంద్రబాబు నాయుడు తదితరులు ఎన్నికల తర్వాత మాత్రమే మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని స్పష్టీకరించారు. ఈ లోపు కాంగ్రెస్ నేతలు కూడా తక్కువేం తినలేదు. ఎన్డీయేనుంచి బయటపడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దరిచేర్చుకున్నారు. బిజెపి మద్దతు ఉపసంహరించుకున్న వెంటనే బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ సర్కార్ పడిపోకుండా కాపాడారు. డిఎంకే యుపిఏ నుంచి బయటపడినప్పటికీ ఆ పార్టీతో కాంగ్రెస్ పూర్తిగా తెగతెంపులు చేసుకోలేదు.

ఇటీవల డిఎంకె అధినేత కరుణానిధి కూతురు కనిమొళి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ సహకరించింది. బిజెపికి మిత్రపక్షాలు తగ్గిపోతుంటే కాంగ్రెస్ ఉన్న మిత్రపక్షాలను నిలుపుకునేందుకు, కొత్తవార్ని చేర్చుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 140-150 సీట్లు తెచ్చుకుంటే చాలు, మిత్రపక్షాల బలంతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేయగలమని కాంగ్రెస్ ధీమా. భారతీయ జనతా పార్టీ మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభంజాన్ని తీసుకువచ్చి, 180 సీట్లకు పైగా తెచ్చుకుంటే మిత్రపక్షాలు వాటంతటికవే తమ మద్దతుకోసం ముందుకు వస్తాయని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా హిందూత్వ ప్రచారం ఒకవైపు, అభివృద్ధి నినాదం మరో వైపు చేపట్టేందుకు వ్యూహరచన చేస్తోంది.

ఎవరు ఎన్ని ప్రచారాలు, ప్రయత్నాలు చేసినా దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెప్పేందుకు పెద్దగా ఆలోచించనక్కర్లేదు. అది కాంగ్రెస్ సారథ్యంలో ఉంటుందా, బిజెపి సారథ్యంలో ఉంటుందా, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో మూడో ఫ్రంట్ సర్కార్ ఏర్పాటు చేస్తుందా, బిజెపి, కాంగ్రెస్‌లతో అవసరం లేకుండా మూడో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయి దెబ్బతింటాయని, అప్పుడు మూడో ఫ్రంట్ సర్కార్ ఏర్పాటు అయ్యే అవకాశం లేకపోలేదని వామపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఎన్నికల తర్వాతే సిద్దాంతాల ప్రాతిపదికగా జరగాలని వారి అభిప్రాయం. విచిత్రమేమంటే దేశంలో తొలుత కాంగ్రెసేతర రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభించిన వారే తర్వాత కాంగ్రెస్ సారథ్యంలో సంకీర్ణ సర్కార్‌కు దోహదం చేశారు. ఇప్పుడు కాంగ్రెసేతర, బిజెపియేతర రాజకీయాల గురించి మాట్లాడుతున్నవారు ఒకప్పుడు బిజెపితో చేతులు కలిపి సర్కార్‌లు ఏర్పాటు చేశారు.

బిజెపి ఉనికిలో లేనప్పుడు కూడా కాంగ్రెసేతర రాజకీయాలను విజయవంతంగా అమలు చేయలేని వారు ఇప్పుడు బిజెపి ఒక పార్టీగా బలపడిన తర్వాత రెండు పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయాలను ఎలా విజయవంతం చేయగలుగుతారు? అన్నదే ప్రధాన ప్రశ్న. అసలు నెహ్ర సారథ్యంలో ఏర్పడిన తొలి ప్రభుత్వమే సంకీర్ణం. ప్రభుత్వానికి జాతీయ స్వభావం ఉండాలని అప్పటి పెద్దలు భావించినందువల్లే అంబేద్కర్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీలు ఇద్దరూ కాంగ్రెస్ సభ్యులు కానప్పటికీ కేంద్రమంత్రులయ్యారు.

నిజానికి కాంగ్రెస్ వ్యతిరేకత అన్నది దేశంలో ఒకానొక ఒక సహజ పరిణామంగా ఏర్పడింది. ఈ సహజ పరిణామాన్ని కాంగ్రెస్ విజయవంతంగా విచ్ఛిన్నం చేయగలిగినందువల్లే తన పబ్బం గడుపుకోగలుగుతోంది. బిజెపి బలం పుంజుకోవడం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ లౌకికవాదాన్ని పాచికగా విసిరి తన వ్యతిరేకులను కూడా తనవైపునకు తిప్పుకోవడం ఒక వ్యూహంగా అవలంబించింది. తాను స్వంతంగా అధికారానికి రాలేనని తెలిసిన తర్వాతే కాంగ్రెస్ ఈ రాజకీయాలను అవలంబించక తప్పలేదు. ఈ క్రమంలో భాగంగా శత్రువులుగా భావించిన పార్టీలను కూడా మిత్రులుగా మార్చుకోవడం, వారి అవసరం తీరిన తర్వాత, లేక వారు బలం కోల్పోయిన తర్వాత వార్ని విసిరి వేయడం, కొత్త మిత్రులను దరిచేర్చుకోవడం పార్టీల బలహీనతను తన బలంగా మార్చుకోవడం కాంగ్రెస్ ఒక కళగా అభ్యసించింది. యుపిఏ తొలి సర్కార్‌లో ఆర్‌జెడి, టిఆర్ఎస్, వామపక్షాలను దరిచేర్చుకుంటే యుపిఏ మలి సర్కార్‌లో వాటి పాత్రే లేదు. వామపక్షాలకు బద్దశత్రువైన తృణమూల్ కాంగ్రెస్‌ను దరి చేర్చుకుని ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత సమాజ్‌వాది పార్టీని చేరదీసింది. ఎస్‌పి, బిఎస్‌పిల బలహీనతలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగిన కాంగ్రెస్ ఇప్పుడు బీహార్‌లో నితీష్‌కు స్నేహ హస్తం చాచింది.

కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు, కాంగ్రెసేతర రాజకీయాల ఆధారంగా ప్రాబల్యం పొందిన పార్టీలు తమ మనుగడ కోసం ఆ విషయం మరిచిపోయినందువల్లే దేశంలో మూడోఫ్రంట్ రాజకీయాలు విజయవంతం కావడం లేదన్న విషయం నిర్వివాదాంశం. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు తమ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ చరిత్ర ప్రాధాన్యతను మర్చిపోయినందువల్లే ఈ పరిణామం ఏర్పడింది. అంతే కాదు, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు కూడా ప్రాంతీయ స్థాయిలో చీలిపోవడం వల్లనే అవి జాతీయ స్థాయిలో కలిసికట్టుగా రాజకీయాలను సాగించలేకపోతున్నాయి.

నిజానికి ప్రాంతాల నేతలను, సమస్యలను, ఆకాంక్షలను ఢిల్లీ స్థాయిలో విస్మరించినందువల్లే కాంగ్రెస్ బలం రోజురోజుకూ తగ్గిపోతున్నదన్న విషయాన్ని కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా విస్మరిస్తున్నాయి. వామపక్షాలకు నిన్నమొన్నటివరకూ కాంగ్రెస్ వ్యతిరేకత ఒక సిద్దాంతమే కాదు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం తప్పనిసరే కాని ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలన్నది శాసించాలంటే ప్రాంతీయ పార్టీలు అవసరార్థ రాజకీయాలను విడనాడి తమ సైద్ధాంతిక, రాజకీయ పునాదిని పటిష్ఠం చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఢిల్లీలో రాష్ట్రాల అస్తిత్వానికి విలువ ఉండదు.

యూపీఏలో లుకలుకలు.....ఎన్డీఏ కోటకు బీటలు........ప్రాంతీయ పార్టీలను ఊరిస్తోన్న ప్రధాని పదవి...... ఇన్నాళ్లు కేంద్రంలో చక్రం తిప్పిన ప్రధాన పార్టీలకు.....తామే కేంద్రంలో ఎందుకు అధికారంలోకి రాకూడదనే ఆలోచన ఊపిరి పోసుకుంటోంది. జాతీయ పార్టీలకు చాలా కాలం క్రితమే కాలం చెల్లడంతో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పాలించాలని తహతహలాడుతున్నాయి. ములాయం, మమత, జయలలిత, పవార్‌, మాయవతి, చంద్రబాబు, నవీన్‌ పట్నాయక్‌, నితీష్‌ ఇలా ప్రాంతీయ శక్తులన్ని 2014లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.