దక్షిణాంధ్ర దారిదీపాలు
| దక్షిణాంధ్ర దారిదీపాలు | |
| కృతికర్త: | |
|---|---|
| సంపాదకులు: | డా. నాగసూరి వేణుగోపాల్ |
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | చరిత్ర |
| ప్రచురణ: | బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ |
| విడుదల: | 2018 |
| పేజీలు: | 660 |
దక్షిణాంధ్ర దారిదీపాలు ఆధునిక మహనీయులు, చారిత్రక శిఖరాలు అనే రెండు భాగాలుగా వున్న గ్రంథంలో పోరాట యోధులు, త్యాగధనులైన 65 మంది ప్రముఖుల జీవనరేఖలున్నాయి. డా. నాగసూరి వేణుగోపాల్ ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించారు.
2018 లో ప్రచురించిన పుస్తకానికి అదనంగా మరికొందరి జీవిత చరిత్రలను జోడించి 2025 లో వెలువరించిన ద్వితీయ ముద్రణ గ్రంథం ఇది. తమిళ రాజ్యంలో ఆంధ్రత్వాన్నీ, ఆంధ్రభాషను ఒక తపఃఫలంగా ఎంచిన తెలుగు ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఒకప్పటితో పోలిస్తే పరిశీలన, పరిశోధన చేసే సమర్థత ఉన్న వ్యక్తుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు పూనుకుని ఇలాంటి సంకలనాలను తీసుకురావడం వేగవంతం చేయడం అవసరంగా భావించాలి.
చారిత్రక అవసరం
[మార్చు]గతంలోంచి అనుభవాలను పంచుకోకపోవడం వలన, చరిత్ర నేర్పుతున్న పాఠాలను పట్టించుకోకపోవడం వలన, మన జీవనగమ్యానికి మూలాలు మన సంస్కృతిలోనూ, దాని చరిత్రలోనూ ఇమిడి ఉన్న వైనాన్ని గమనించకపోవడం వలన మనం నష్టపోయిన భాగమే ఎక్కువ. చరిత్ర రచయితలు తప్పనిసరిగా మాతృదేశ పక్షాన మాతృభాష పక్షాన నిలిచి చరిత్ర వ్రాయాలి. అది వారి ధర్మం కూడా.
పరిశోధన స్థాయిలో కాకపోయినా మామూలుగా చరిత్ర తిరగేసినా ఒక విషయం స్పష్టం అవుతుంది; చరిత్ర వల్ల మనం ఏమీ నేర్చుకోలేదని. స్థూలంగా, ఒక దేశ లేదా ప్రాంతీయ సామూహికానుభవం చరిత్ర. కాలం నడుస్తూంటుంది గానీ చరిత్ర నడవదు. కొందరు వ్యక్తులు చరిత్ర నిర్మిస్తారు. వారి ఉద్దేశ్యం చరిత్ర నిర్మాణం కాదు. ఆ వ్యక్తుల అభ్యుదయ దృక్పథం, నలుదిక్కులా చూడగలిగే వారి ప్రాపంచిక దృష్టి, వారి భావాల స్వచ్ఛత మొదలైన శీల సంపద సమకాలీన సమాజానికి ఆశ్చర్యకరమైన చోదకశక్తిని సమకూరుస్తుంది. అటువంటి వ్యక్తుల జీవనసాఫల్యమే మనం చరిత్రగా భావిస్తాం.
ప్రాచీన, మధ్య యుగాల వరకూ వెళ్లనవసరం లేదు. ఒకటిన్నర శతాబ్ది ఆంధ్రుల చరిత్ర యధాలాపంగా చూసినా రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి తెలుగువారికి తెలుగువారమనే ఆత్మ ప్రత్యయం లేదు. రెండు మనం నాయకులనుకున్న వారి పట్ల అసంతృప్తి, అగౌరవం కలుగుతుంది. మినహాయింపుల గురించి కాదు. బహు నాయకత్వం ఆంధ్రుల కొంపముంచింది. మనం బళ్లారి, చెన్నపట్నం ఎందుకు పోగొట్టుకున్నాం? చెన్నపట్నం కోసం ప్రాణత్యాగం చేసిన అమాయకుడు పొట్టి శ్రీరాములుగారిని చెన్నపట్నం మినహాయించి గౌరవించడం నేర్చుకున్నాం. శిఖరాయమానుడు, బహుశా తెలుగు కర్ణుడు అయిన ప్రకాశంగారిని, రాజగోపాలచారిగారి ఆశీస్సులతో మన నాయకులు మోసం చేశారని విన్నాం. అట్లా చేసిన వారు పెద్దపదవులు అలంకరించారు. ఇవీ, ఇటువంటి అనేక విషయాలు ఈ తరం తెలుగువారికి తెలియవు. వాళ్లకీ విషయాలు ఎవరూ చెప్పలేదు. అదీ తెలుగువారి ప్రత్యేకత.
మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడివడి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన రోజు నుంచి తెలుగునాయకుల కొన్ని విన్యాసాలు వారికి ఏమాత్రం గౌరవప్రదం కావు. మహానాయకులు కొంతమంది ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు కూడా తెలుగువారేనని అనుకోలేకపోయినారు. వ్యక్తిగత రాగద్వేషాలు, సంకుచిత దృష్టీ కారణంగా ఆంధ్రదేశం శాపగ్రస్తమైంది. ఇదంతా ఎందుకు జ్ఞాపకం వస్తుంది? 'దక్షిణాంధ్ర దారిదీపాలు' వ్యాససంకలనం చదివిన తరువాత వీపుకి ముల్లు గుచ్చుకున్నట్టవుతుంది. మన నాయకులు ఆ దారిదీపాల్ని చూడకుండా ఎలా ఉండగలిగారు? వారి వల్ల ఎటువంటి స్ఫూర్తి పొందేరు? ఈ వ్యాసాలు ఈనాటి తమిళనాడులో, ముఖ్యంగా చెన్నపట్నంలో జీవించిన అనేకమంది తెలుగు మహనీయుల కృషి గురించినవి. వారిలో అనేకమంది తమ చిత్తశుద్ధి, త్యాగశీలత వల్ల తమ సమకాలీన సమాజాన్ని ప్రకాశవంతం చేశారు. వారందరూ మనవారే. మరి వారు చెన్నపట్నం ఎందుకు వెళ్లవలసివచ్చింది? అది దక్షిణాంధ్ర గనుక. వారు వెళ్లినది తెలుగువారు స్థాపించిన చెన్నపట్నం గనుక మదరాసు అప్పటికే పెద్ద నగరం గనుక. తమిళ నాయకులకు చెన్నపట్నం మీద ఆశ సన్నగిలి మదురై నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని సమాధానపడ్డారు. కానీ తెలుగు నాయకులు, చెన్నపట్నంలో కొంతమంది తెలుగు పౌరుల సహకారంతో నగరం వారి సొంతం అయింది.
'శ్రీరామపాద సాగర్ ప్రాజెక్టు' పేరుతో పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసిన శొంఠి రామ్మూర్తిగారు, ఆయన శిష్యుడు కె.ఎల్.రావు గారు పని ముగించి నెహ్రూగారి ఆమోదం కోసం చూస్తున్నారు. అప్పటికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. అప్పటివరకూ రామ్మూర్తిగారికి సహకరించిన ఒక తమిళ అధికారి నెహ్రూగారి చెవి గట్టిగానే కొరికాడు. పోలవరం మూలబడింది. ఈ నష్టం పునాదిగా ఆంధ్రరాష్ట్రం ప్రారంభమైంది. కానీ మన తెలుగు నాయకులు, నిత్యం నెహ్రూగారి తేజస్సులో భాసించిన వారెవరూ ఎందుకు ఏమీ చెయ్యలేకపోయినారో ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. ఈ వ్యాసాలు చదివిన ఎవరికైనా ఇటువంటి అనుమానాలే వస్తాయి. దీపధారులై నడిచినవారి అడుగుజాడలు మనకి ఎందుకు కనిపించలేదు? చెన్నపట్నం నగర పౌర, సాంస్కృతిక జీవనాన్ని ఉన్నతీకరించిన మన ప్రాతఃస్మరణీయుల గురించి తెలుసుకుంటున్నప్పుడు వారి పట్ల గౌరవంతో పాటు వారిని మర్చిపోయామనే అపరాధ భావన బాధిస్తుంది. దక్షిణాంధ్రని ఒదులుకున్న తరువాత మనకి శాశ్వతమైన అంగవైకల్యం వంటి దుస్థితి ఏర్పడింది.
ఇదివరకు వచ్చిన సంకలనం ఇప్పుడు విస్తృతం అయింది. వ్యాసకర్తలు, సంపాదకుడు నాగసూరి వేణుగోపాల్ ఈ తరం వారికి చేస్తున్న ఉపకారం ఇది. పార్టీలతో సంబంధం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ తెలుగు భాషా సంస్కృతుల పట్ల ఉండవలసినంత శ్రద్ధ లేదు. ఏ కులం ప్రతినిధి ముఖ్యమంత్రి కావాలన్నది మన రాజకీయ జీవితానికి కీలకంగా మారింది. కావలి సోదరుల గురించి చదువుతున్నప్పుడు గర్వంగా ఉంటుంది. "ఆ ముగ్గురు సోదరులూ పది మంది జీవితాంతం చెయ్యలేని కృషి చేశారు. వారి గురించి ఈనాడు ఎవరికీ తెలియదు. వారు లేకపోతే మెకెంజీ కైఫీయత్తులు లేవు. అసాధారణమైన వారి జీవితాన్ని ఇంగ్లీషులో కూడా గ్రంథస్థం చెయ్యడం అవసరం. ఇంకా మరికొంతమందిని ఎంపిక చేసి వారి గురించి కూడా ఇంగ్లీషులో పుస్తక రూపంలో రావాలి. కావలిసోదరుల పేరుతో ఏలూరులో ఒక సాంస్కృతిక కేంద్రం నిర్మించాలి. పోకల లక్ష్మీనరసుగారి గురించి నాకు తెలీదు. ఆయన చెన్నపట్నంలో స్థిరపడ్డ తెలుగువాడు. అంబేద్కర్ వంటి వ్యక్తి ఆయన వల్ల ప్రభావితుడైనాడు. ఆయన్ని తమిళులు సొంతం చేసుకున్నా తెలుగు పెద్ద లెవరూ అభ్యంతరం చెప్పలేదు. అందరికన్నా, బెంగుళూరు నాగరత్నమ్మగారు మహాతల్లి. ఏం చేస్తే ఆమె రుణం తీర్చుకోగలం? ఇప్పటికైనా ఆమె పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యాధునికమైన రెండు సంగీతశాలలు నిర్మించుకోవాలి. "రాష్ట్రంలో కొత్తగా ఏర్పరుస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయానికి యల్లాప్రగడ సుబ్బారావుగారి పేరు పెట్టుకుని మనని మనం గౌరవించుకోవాలి" అని ముందుమాట రాసిన తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
వీరు ఆధునిక మహనీయులు
[మార్చు]- కావలి వెంకట బొర్రయ్య
- కావలి వెంకట లక్ష్మయ్య
- కావలి వెంకట రామస్వామి
- ఏనుగుల వీరాస్వామయ్య
- వెన్నెలకంటి సుబ్బారావు
- గాజుల లక్ష్మీనర్సుసెట్టి
- అల్లూరి వెంకటాద్రిస్వామి
- వావిళ్ల రామస్వామి శాస్త్రులు
- అయ్యనకోట పార్థసారథి
- పి. సుబ్బరాయలుశెట్టి
- దంపూరు నరసయ్య
- పిట్టి త్యాగరాయంశెట్టి
- తల్లాప్రగడ సుబ్బారావు
- పోకల లక్ష్మీనరసు
- గద్దె రంగయ్యనాయుడు
- కలవల కన్నయ్యశెట్టి
- దీవి గోపాలాచార్యులు
- తంజానగరం తేవప్పెరుమాళ్ళయ్య
- కె.ఎన్.కేసరి
- బెంగళూరు నాగరత్నమ్మ
- ముత్తా వెంకట సుబ్బారావు
- ఆచంట లక్ష్మీపతి
- కారుపల్లి శివరామదాసు
- కుమారస్వామిరాజా
- బొబ్బిలి రాజా
- పాకాల రాజమన్నారు
- మోటూరి సత్యనారాయణ
- పందిరి మల్లికార్జునరావు
- సి.నరసింహం
- కె. ఎస్. కోదండరామయ్య
- కొత్తపల్లి సుబ్బరామయ్య
- కె.వి.స్వామి
- గాలి బాలసుందరరావు
- వై.ఎస్. శాస్త్రి
- కప్పగంతుల సత్యనారాయణ
- ద్వారక - పార్థసారథి దంపతులు
- పమ్మి రామస్వామి సెట్టి
- రావూరి దొరస్వామిశర్మ
- రేడియో భానుమతి
- ధూళిపూడి ఆంజనేయులు
- ఎం.ఎన్. రావు
- బి.ఎస్.ఆర్. కృష్ణ
- పి.వి. రమణయ్యరాజా
- అనకాపుత్తూరు రామలింగం
- ఎం. కె. జగన్నాథరాజా
- అట్లూరి చౌదరాణి
- బి.జె.డబ్ల్యు. పుష్పరాజ్
- పి. శ్రీనివాసన్
- పేరిశెట్ల భాస్కరుడు
- బొల్లినేని మునుస్వామినాయుడు
- పానుగల్లు రాజా
- డా. పి. ముత్తులక్ష్మిరెడ్డి
- పి. వరదరాజులునాయుడు
- సాధు వరదరాజంపంతులు
- ఆచంట రుక్మిణమ్మ(రుక్మిణీ లక్ష్మీపతి)
- జి.డి.నాయుడు
- ఓమాండూరు రామస్వామిరెడ్డి
- వి.యన్. శర్మ
మూలాలు
[మార్చు]- దక్షిణాంధ్ర దారిదీపాలు - డా. నాగసూరి వేణుగోపాల్ ఈ పుస్తకానికి సంపాదకత్వం
