దక్షిణ భారత హిందీ ప్రచార సభ
![]() | |
రకం | సార్వజనిక |
---|---|
స్థాపితం | 1918 |
వ్యవస్థాపకుడు | మహాత్మాగాంధీ |
అధ్యక్షుడు | జస్టిస్ వి.ఎస్.మలిమథ్ |
స్థానం | మద్రాసు, భారతదేశం |
కాంపస్ | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు |
భాష | హిందీ |
జాలగూడు | దక్షిణ భారత హిందీ ప్రచార సభ |
దక్షిణ భారత హిందీ ప్రచార సభ భారతదేశపు దక్షిణాది రాష్ట్రాలలోని ప్రజలలో హిందీ అక్షరాస్యతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ఏర్పాటయిన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఈ సంస్థను మహాత్మా గాంధీ సహకారంలో అనీ బిసెంట్ ప్రారంభించింది. ఈ సంస్థను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా భారత ప్రభుత్వం గుర్తించింది.[1]
చరిత్ర[మార్చు]
దక్షిణాది రాష్ట్రాలలో హిందీ భాషను ప్రచారం చేసే లక్ష్యంతో ఈ సభను 1918లో మద్రాసులో మహాత్మా గాంధీ స్థాపించాడు[2]. జాతీయ సమైక్యత కోసం ఉత్తర, దక్షిణ రాష్ట్రాల ప్రజలను కలపడానికి అత్యధికంగా మాట్లాడే భాష అయిన హిందీ అవసరాన్ని గాంధీజీ గుర్తించాడు. దానికోసం అతడు మద్రాసు కేంద్రంగా ఆనాటి మద్రాసు, బనగానపల్లె, కొచ్చిన్, హైదరాబాదు, మైసూరు, పుదుక్కోటై, సండూరు, ట్రావెన్కోర్ సంస్థానాలలో హిందీ భాష ప్రచారం చేయడానికి దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించాడు. ఈ ఉద్యమాన్ని అనీ బిసెంట్ మద్రాసులోని గోఖలే హాలులో 1918లో ప్రారంభించింది. గాంధీజీ తన తుదిశ్వాస వరకు దక్షిణ భారత హిందీప్రచార సభకు అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈ సభకు మొట్టమొదటి ప్రచారకులుగా గాంధీజీ కుమారుడైన దేవదాస్ గాంధీ వ్యవహరించాడు. మొట్టమొదటి హిందీపాఠాన్ని దేవదాస్ గాంధీయే చెప్పాడు. క్రమంగా హిందీ శిక్షణ పాఠశాలలను ఆంధ్ర తమిళనాడు ప్రాంతాలకు విస్తరించారు. 1919లో 80 విద్యార్థులు ఉన్న ఈ సంస్థ తరువాతి కాలంలో ఆ సంఖ్య వందలకు, వేలకు పెరిగింది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో 7000 మంది భాగస్వాములు 6000 కేంద్రాలలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించి 12 కోట్లమంది ప్రజలకు తన సేవలను అందిస్తున్నది.
1920 వరకు ఈ కార్యాలయం మద్రాసులోని జార్జ్‌టౌన్‌లో ఉంది. ఆ తర్వాత కొంత కాలానికి మైలాపూర్, అక్కడ నుంచి ట్రిప్లికేన్‌కి మారింది. నాటి నుంచి 1936 వరకు ఈ సభ ఆ ప్రాంతంలోనే ఉంది.
1936 లో ఈ శాఖలను విస్తరించి, ఉద్యమ తీవ్రతను పెంచాలని ఉద్యమ నాయకులు భావించారు. అప్పుడే ఈ సభను ట్రిప్లికేన్ నుంచి టి.నగర్, తణికాచలం రోడ్డులోని, ఏడు ఎకరాల విస్తీర్ణంగల ప్రాంతంలోకి తరలించారు. ఈ భవనానికి అబ్దుల్ హమీద్‌ఖాన్ శంకుస్థాపన రాయి వేశాడు. సరిగ్గా 1936 అక్టోబరు 7వ తేదీన ఆ సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.
ఈ సభలో 1922 నుంచి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ స్థాయిలో రాష్ట్రభాష విశారద పరీక్షను నిర్వహించి, 1931లో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా కాలేకర్ ప్రసంగించాడు. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1946లో ఈ సభ రజతోత్సవం చేసుకుంది. ఈ ఉత్సవాలకు గాంధీజీ అధ్యక్షత వహించాడు. గాంధీజీ విచ్చేయడాన్ని చారిత్రాత్మకంగా భావించి, ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం, ఆయన ప్రసంగించిన ప్రాంతంలో గాంధీ మంటపం నిర్మించాలని తలచారు. అనుకున్నట్లుగానే 1963 జూన్ 9 నాటికి గాంధీ మంటప నిర్మాణం పూర్తయింది. ఆ మంటపాన్ని మొరార్జీ దేశాయ్ ప్రారంభించాడు. 'గాంధీ పదవిదాన్' మంటపం నగరంలో ఒక చిహ్నంగా నిలిచింది. గాంధీమహాత్మునికి సంబంధించిన కార్యక్రమాలను, స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నేటికీ ఇక్కడే నిర్వహిస్తున్నారు.
1993లో, దేశప్రధాని, ప్రచార సభ అధ్యక్షులు అయిన పి.వి.నరసింహారావు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను అమృతోత్సవాలుగా న్యూఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా జరిపాడు. 2018లో దక్షిణభారత హిందీ ప్రచార సభ శతసంవత్సరాలు పూర్తి చేసి వజ్రోత్సవాన్ని జరుపుకోనున్నది.
అధ్యక్షులు[మార్చు]
దక్షిణ భారత హిందీ ప్రచార సభకు ఈ క్రింది వ్యక్తులు అధ్యక్షులుగా వ్యవహరించారు[2].
- 1918 - 1948 మహాత్మా గాంధీ
- 1948 - 1965 బాబూ రాజేంద్ర ప్రసాద్
- 1965 - 1966 లాల్ బహదూర్ శాస్త్రి
- 1966 - 1984 ఇందిరా గాంధీ
- 1984 - 1991 రాజీవ్ గాంధీ
- 1991 - 1997 పి.వి.నరసింహారావు
- 1997 - 1998 బి.డి.జెట్టి
- 1998 - 2001 ఆర్.వెంకట్రామన్
- 2001 - 2003 రంగనాథ్ మిశ్రా
- 2003 - 2005 ఎం. మహదేవ్
- 2005 - 2009 ఎం.వి.రాజశేఖరన్
- 2009 - ప్రస్తుతం వి.ఎస్.మలిమథ్
పరీక్షలు[మార్చు]
- పరిచయ
- ప్రాథమిక
- మధ్యమ
- రాష్ట్రభాష
- ప్రవేశిక
- విశారద పూర్వార్థ
- విశారద ఉత్తరర్థ
- ప్రవీణ పూర్వార్థ
- ప్రవీణ ఉత్తరార్థ
వ్యవస్థ[మార్చు]
ఈ సభను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలోని టి.నగర్, తణికాచలం రోడ్డులో ఉంది. ఈ సంస్థ నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు:
- ఆంధ్ర ప్రదేశ్ - హైదరాబాదు
- కర్ణాటక - ధార్వాడ
- కేరళ - ఎర్నాకుళం -
- తమిళనాడు - తిరుచిరాపల్లిలలో ఉన్నాయి.
బయటి లింకులు[మార్చు]
- Official website of the Dakshina Bharat Hindi Prachar Sabha
- ధార్వాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ జాలస్థలి
- కేరళ దక్షిణ భారత హిందీ ప్రచార సభ జాలస్థలి
- తమిళనాడు దక్షిణ భారత హిందీ ప్రచార సభ జాలస్థలి
మూలాలు[మార్చు]
- ↑ "Welcome to Dakshin Bharath Hindi Prachar Sabha | Introduction". www.dbhpscentral.org. Retrieved 2017-04-22.
- ↑ 2.0 2.1 పురాణపండ వైజయంతి (10 September 2015). "హిందీ కోసమే పుట్టి.. భాషను ప్రచారం చేస్తూ." సాక్షి దినపత్రిక. Retrieved 26 April 2018.