Jump to content

దక్షిణ మలబార్

వికీపీడియా నుండి
దక్షిణ మలబార్
భాఉగోళిక / చారిత్రిక ప్రాంతం
పైనుంచి కిందికి:
కోజికోడ్ మెట్రోపాలిటన్ ప్రాంతం, మలప్పురం మెట్రోపాలిటన్ ప్రాంతం,కున్నత్తూర్‌మేడు నుండి పాలక్కాడ్ నగర దృశ్యం.
దేశం India
రాష్ట్రంకేరళ
ప్రభుత్వం
  ప్రధానభాగంకేరళ ప్రభుత్వం
విస్తీర్ణం
  మొత్తం
7,416 కి.మీ2 (2,863 చ. మై)
జనాభా
 (2011)(సుమారు.)[1]
  మొత్తం
83,68,794
  జనసాంద్రత1,128/కి.మీ2 (2,920/చ. మై.)
భాషలు
  అధికారికమలయాళం
టైమ్ జోన్UTC+5:30 (IST)
PIN
673***, 676***, 678***, 679*** and 680***
ISO 3166 codeIN-KL
వాహన నమోదుKL-08, KL-09, KL-10, KL-11, KL-46, KL-49, KL-50, KL-51, KL-52, KL-53, KL-54, KL-55, KL-57, KL-65, KL-71, KL-75, KL-76, KL-77, KL-84 & KL-85
కేరళ శాసనసభ నియోజకవర్గాలు36[2]

దక్షిణ మలబార్, భారతదేశ నైరుతి తీరంలో, కేరళ లోని ఒక భౌగోళిక ప్రాంతం. కోజికోడ్ జిల్లాలోని కోజికోడ్, తామరస్సేరి తాలూకాలు, మనంతవాడి తాలూకా మినహా వయనాడ్ జిల్లా, మలప్పురం జిల్లా మొత్తం, త్రిస్సూర్ జిల్లాలోని చావక్కాడ్ తాలూకా, చిత్తూరు తాలూకాలోని కొన్ని భాగాలు మినహా పాలక్కాడ్ జిల్లా దక్షిణ మలబార్‌లో భాగం. కొచ్చి నగరంలోని ఫోర్ట్ కొచ్చి ప్రాంతం కూడా చారిత్రికంగా దక్షిణ మలబార్‌కు చెందినది. దక్షిణ మలబార్ అనే పదం పూర్వపు మలబార్ జిల్లాలో కోరపుళ నదికి దక్షిణంగా, త్రిస్సూర్ చావక్కాడ్ ప్రాంతానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది.[3]

బ్రిటిష్ పాలనలో, దక్షిణ మలబార్ ప్రధానంగా కొబ్బరి, మిరియాలు, పెంకుల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచింది.[4] పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీ పాత పరిపాలనా రికార్డుల ప్రకారం, ప్రెసిడెన్సీలో ప్రభుత్వ యాజమాన్యంలోని అత్యంత ముఖ్యమైన తోట 1844లో నాటిన నిలంబూర్‌లోని టేకు తోట అని నమోదైంది.[5] ప్రెసిడెన్సీలో పశ్చిమ మలబార్ తీరంలో ఉన్న రెండు జిల్లాలలో ఒకటిగా దక్షిణ మలబార్‌కు ప్రాముఖ్యత ఉంది. బేపూర్, ఫోర్ట్ కొచ్చిలోని ఓడరేవుల ద్వారా ప్రెసిడెన్సీకి అరేబియా సముద్రం అందుబాటులో ఉంది. దీని కోసమే కేరళ లోని మొదటి రైల్వే లైన్, తిరూర్ నుండి బేపూర్ వరకు వేసారు.

కోజికోడ్, మొత్తం మలబార్‌కు రాజధాని, అతిపెద్ద నగరం, దీని తర్వాత పాలక్కాడ్ వస్తుంది. దక్షిణ మలబార్ ప్రాంతానికి ఉత్తరాన ఉత్తర మలబార్ (కోరపుజ), తూర్పున నీలగిరి కొండ ప్రాంతం, తూర్పున కోయంబత్తూరు, దక్షిణాన కొచ్చిన్, పశ్చిమాన అరేబియా సముద్రాన్ని కలిపే పాలక్కాడ్ కనుమ సరిహద్దులుగా ఉన్నాయి.[6] నెడియిరుప్పు స్వరూపం, ఎరనాడ్, వల్లువనాడ్, పరప్పనాడ్, కవలప్పర, వెట్టతునాడు, నిలంబూర్ రాజ్యం, నెడుంగాడిలు, పాలక్కాడ్ వంటి చారిత్రక ప్రాంతాలన్నీ దక్షిణ మలబార్‌లో ఉన్నాయి. మలబార్ ప్రాంతంలోని మూడు పొడవైన నదులైన భరతప్పుజ, చలియార్, కడలుండి నదులు దక్షిణ మలబార్ గుండా ప్రవహిస్తాయి.

వ్యుత్పత్తి

[మార్చు]

బ్రిటిష్ వారి రాకకు ముందు, విదేశీ వాణిజ్య వర్గాలలో కేరళకు సాధారణ నామంగా మలబార్ అనే పదాన్ని ఉపయోగించేవారు.[7] అంతకుముందు, భారతదేశ నైరుతి తీరంలో కేరళకు ఆనుకొని ఉన్న తుళునాడు, కన్యాకుమారిలు కూడా మలబార్‌లో భాగంగా గానే పరిగణించేవారు.[8][9] మలబార్ ప్రజలను మలబార్లు అని పిలిచేవారు. భారతదేశ నైరుతి తీరం మొత్తాన్ని సూచించడానికి మలబార్ అనే పదాన్ని ఇప్పటికీ తరచుగా ఉపయోగిస్తారు.

6వ శతాబ్దంలో, అరబ్ నావికులు కేరళను ' మలే అని పిలిచేవారు. అయితే, ఈ పేరులోని మొదటి భాగం కాస్మాస్ ఇండికోప్లస్టెస్ యొక్క ' టోపోగ్రఫీ'లో అప్పటికే నమోదై ఉంది. అందులో "మలే" అనే పేరుగల ఒక మిరియాల దుకాణం గురించి ప్రస్తావించబడి ఉంది. దానినుండే మలబార్‌కు ఆ పేరు వచ్చింది. మలబార్ అనే పేరు ద్రావిడ పదం 'మల' (కొండ), పర్షియన్ పదం బార్ (దేశం) ల నుండి వచ్చిందని భావిస్తున్నారు.[7][10]

చారిత్రికంగా, అరబ్ రచయితలు ఈ ప్రదేశాన్ని మాలిబార్, మనిబార్, ములిబార్, మునిబార్ అని రకరకాలుగా పిలిచేవారు. అల్-బెరూని (973–1048) ఈ రాజ్యాన్ని మలబార్ అని పిలిచిన మొదటి రచయిత అయి ఉండాలి.[7] ఇబ్న్ ఖోర్దాద్బే, అల్-బలాధురి వంటి రచయితలు తమ రచనలలో మలబార్ ఓడరేవులను ప్రస్తావించారు.[11]

చరిత్ర

[మార్చు]
ఉరు, కాలికట్‌లోని బేపూర్‌లో నిర్మించిన ఒక రకమైన ఓడ

ప్రాచీన యుగం

[మార్చు]

పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీలో పేర్కొన్నట్లుగా, ముజిరిస్‌కు ఉత్తర దిశలో ఉన్న పురాతన ఓడరేవు టైండిస్, కోజికోడ్ సమీపంలో ఎక్కడో ఉండేది.[12] దాని ఖచ్చితమైన స్థానం వివాదాస్పదంగా ఉంది.[12] పొన్నాని, తానూర్, బేపూర్ – చాలియం – కడలుండి – వల్లిక్కున్ను, కోయిలాండి లలో ఒకటి అయి ఉండవచ్చు.[12] సా.శ. 1వ, 4వ శతాబ్దాల మధ్య సంగమ కాలంలో కోయంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతాన్ని చేరరాజులు పాలించారు. ఇది మలబార్ తీరం, కోరమండల్ తీరం మధ్య ప్రధాన అంతర్గత వాణిజ్య మార్గమైన పాలక్కాడ్ గ్యాప్‌కు తూర్పు ప్రవేశ ద్వారంగా పనిచేసింది.[13]

ప్లినీ ది ఎల్డర్ (సా.శ. 1వ శతాబ్దం), టిండిస్ ఓడరేవు కెప్రోబోటోస్ (చేర రాజవంశం)కు వాయవ్య సరిహద్దులో ఉందని పేర్కొన్నాడు.[14] టిండిస్‌లోని ఓడరేవుకు ఉత్తరాన ఉన్న ఉత్తర మలబార్ ప్రాంతం, సంగం కాలంలో ఎజిమల రాజ్య పాలనలో ఉండేది.[15] పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ ప్రకారం, లిమిరికే అని పిలువబడే ప్రాంతం నౌరా, టిండిస్ వద్ద ప్రారంభమైంది. అయితే, టోలెమీ లిమిరికే ప్రారంభ స్థానంగా టిండిస్‌ను మాత్రమే పేర్కొన్నాడు. ఈ ప్రాంతం బహుశా కన్యాకుమారి వద్ద ముగిసింది; అందువల్ల ఇది సుమారుగా ప్రస్తుత మలబార్ తీరానికి అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రాంతంతో రోమ్ చేసిన వార్షిక వాణిజ్యం విలువ 5,00,00,000 సెస్టర్సెస్‌గా అంచనా వేసారు.[16] లిమిరికే సముద్రపు దొంగల బెడదకు గురయ్యేదని ప్లినీ ది ఎల్డర్ పేర్కొన్నాడు.[17] లిమిరికే మిరియాలకు మూలమని కాస్మాస్ ఇండికోప్లస్టెస్ పేర్కొన్నాడు.[18][19]

తొలి మధ్యయుగాలు

[మార్చు]

తొలి మధ్య యుగాలలో దక్షిణ మలబార్, కొచ్చిన్, పరప్పనాడ్, వెట్టతునాడు (తానూర్), వల్లువనాడ్, నిలంబూర్, నెడుంగడి, పాలక్కాడ్ రాజ్యాలతో సహా అనేక రాజకీయ రంగాలకు నిలయంగా ఉంది.

అరీకోడ్ సమీపంలో దొరికిన కురుమత్తూరు శాసనం సా.శ. 871 నాటిది.[20] సా.శ. 932 నుండి పాత మలయాళంలో వ్రాయబడిన మూడు శాసనాలు త్రిప్రంగోడ్ (తిరునవయ సమీపంలో), కొట్టక్కల్, చలియార్లలో కనుగొన్నారు. చేర రాజవంశానికి చెందిన గోదా రవి పేరును పేర్కొన్నాయి. వీటిలో త్రిప్రంగోడు శాసనం తావనూరు ఒప్పందాన్ని వివరిస్తుంది.[21]

కేరళలోని 64 పురాతన నంబూదిరి గ్రామాలలో ఒకటైన ఎడప్పల్ సమీపంలోని సుకపురంలో, 10వ శతాబ్దానికి చెందిన పాత మలయాళంలో వ్రాయబడిన అనేక శాసనాలు కనుగొనబడ్డాయి. ఎరనాడ్, వల్లువనాడ్ ప్రాంతాల పాలకుల గురించిన వర్ణనలను భాస్కర రవి వర్మన్ (సుమారు సా.శ. 1000) యొక్క యూదు రాగి ఫలకాలలో, వీర రాఘవ చక్రవర్తి (సుమారు సా.శ. 1225) యొక్క వీరరాఘవ రాగి ఫలకాలలో చూడవచ్చు.[22] కోజికోడ్‌లోని ముచుండి మసీదులో, పాత మలయాళం, అరబిక్ భాషల మిశ్రమంలో వ్రాయబడిన 13వ శతాబ్దపు గ్రానైట్ శాసనం, రాజు మసీదుకు ఇచ్చిన దానాన్ని ప్రస్తావిస్తుంది.[23]

పొరుగున ఉన్న వల్లువనాడ్‌లోని వెల్లోడిలు, నెడుంగనాడ్ (ఒట్టపాళం)లోని నెడుంగడిల మాదిరిగానే ఎరనాడ్‌ను, ఎరాడిస్ అని పిలిచే సామంతన్ నాయర్ వంశం పాలించింది. వల్లువనాడ్ పాలకులను ఎరల్‌ప్పాడ్ లేదా ఎరాడి అనే బిరుదుతో పిలుస్తారు. కొలతునాడుకు సామంతుడైన పొలనాడ్ నుండి కాలికట్ ఓడరేవు పట్టణాన్ని ఆక్రమించుకుని ఎరనాడ్ పాలకుడు, తరువాత కాలికట్ జామోరిన్ అయ్యాడు.

కోజికోడ్ ఉత్థానం

[మార్చు]
1320ల ప్రారంభంలో భారతదేశం. ప్రస్తుత కేరళ రాష్ట్రంలో అధిక భాగం కోజికోడ్ జమోరిన్ ప్రభావంలో ఉండేది.

మధ్యయుగాలలో, దక్షిణ మలబార్‌లో కోజికోడ్ (కాలికట్) జమోరిన్ అత్యంత శక్తివంతమైన పాలకుడు. అతని పాలనలో, కోజికోడ్ మలబార్ తీరంలో అతిపెద్ద నగరంగా ఉండేది, దక్షిణ మలబార్ భారత ఉపఖండంలో సముద్ర వాణిజ్యానికి ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా ఉద్భవించింది. ఇది 18వ శతాబ్దం వరకు కొనసాగింది. కోజికోడ్‌లోని ఓడరేవు, విదేశీ వాణిజ్యంపై గుత్తాధిపత్యం కలిగిన అరబ్బులకు, ఆ తర్వాత పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వారికి దక్షిణ భారత తీరానికి ముఖద్వారంగా ఉండేది.[24]

మొదట నెడియిరుప్పు నుండి ఎరనాడ్‌ను పాలించిన జమోరిన్, కోజికోడ్‌లో ఓడరేవును అభివృద్ధి చేసి, సముద్ర వాణిజ్యం కోసం అక్కడికి తరలివెళ్లాడు. 14వ శతాబ్దంలో, కొచ్చిన్ రాజ్యం నియంత్రణలో ఉన్న వల్లూవనాడ్ రాజ్యం నుండి తిరునవాయ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, కోజికోడ్ మధ్య కేరళలోని చాలా భాగాలను జయించింది. కొచ్చిన్ రాజ్య రాజధాని మొదట పెరుంపడప్పులో ఉండేది; అయితే, విలీనం కారణంగా, ఆ రాజ్యం తన రాజధానిని ( c.1405 ) మరింత దక్షిణంగా, మొదట కొడుంగల్లూరుకు, ఆపై కొచ్చికి మార్చవలసి వచ్చింది. 15వ శతాబ్దంలో, కొచ్చిన్ కోజికోడ్‌కు సామంతరాజ్యంగా మారింది. తద్వారా మధ్యయుగ మలబార్ తీరంలో కోజికోడ్ అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది.[25]

1498లో జమోరిన్ సామ్రాజ్యం. ఇది మధ్యయుగాలలో మలయాళం మాట్లాడే ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన రాజ్యం.

వారి పాలన ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, కోజికోడ్ జమోరిన్లు దక్షిణాన కొల్లం (క్విలాన్) నుండి ఉత్తరాన పంతలయినీ కొల్లం (కోయిలాండి) వరకు ఉన్న ప్రాంతాన్ని పాలించారు. కోజికోడ్‌ను ఆరుసార్లు సందర్శించిన ఇబ్న్ బటూటా (1342–1347), ఆ నగరంలోని జీవితం గురించి తొలి సంగ్రహావలోకనాలను అక్షరబద్ధం చేసాడు. అతను కోజికోడ్‌ను "మలబార్ జిల్లాలోని గొప్ప ఓడరేవులలో ఒకటి"గా వర్ణించాడు, ఇక్కడ "ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి వ్యాపారులు కనిపిస్తారు". ఈ ప్రదేశపు రాజు, "రోమ్‌లోని హైదరీ ఫకీర్‌ల వలె తన గడ్డాన్ని షేవ్ చేసుకుంటాడు... ఈ ప్రదేశంలోని ముస్లిం వ్యాపారులలో ఎక్కువ మంది ఎంత ధనవంతులంటే, వారిలో ఒక్కొక్కరు ఇక్కడకు వచ్చిన ఓడల్లోని సరుకు మొత్తాన్నీ కొనుగోలు చేయగలరు. వాటిలాంటి ఇతర ఓడలను కూడా సిద్ధం చేయగలరు" అని కూడా రాశాడు.[26] జెంగ్ హే ఆధ్వర్యంలోని ఇంపీరియల్ చైనీస్ ఫ్లీట్‌లో భాగంగా ఉన్న చైనీస్ నావికుడు మా హువాన్ (1403), ఈ నగరాన్ని ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారులు తరచుగా వచ్చే ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా వర్ణించాడు. ముస్లింల మతపరమైన అవసరాలను తీర్చడానికి నిర్మించిన 20 - 30 మసీదులను, వ్యాపారులు తమ చేతివేళ్లు, కాలివేళ్లను ఉపయోగించి లెక్కించే ప్రత్యేకమైన పద్ధతినీ (ఈనాటికీ అనుసరిస్తున్నారు), మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థనూ అతను గమనించాడు. అబ్దుర్ రజాక్ (1442–43), నికోలో డి' కాంటి (1445), అఫనాసీ నికిటిన్ (1468–74), లుడోవికో డి వర్తెమా (1503–1508), డువార్టే బార్బోసా ఈ నగరాన్ని భారత ఉపఖండంలోని ప్రధాన అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలలో ఒకటి అని వర్ణించారు.[27][28]

1498లో వాస్కో డా గామా కోజికోడ్ చేరుకోవడానికి ప్రయాణించిన మార్గం (నల్ల గీత). ఐరోపా నుండి భారతదేశానికి ఈ సముద్ర మార్గాన్ని కనుగొనడం చివరికి భారత ఉపఖండంలో ఐరోపా వారి వలసరాజ్యానికి దారితీసింది. ఆ సమయంలో, కోజికోడ్ జమోరిన్ పొన్నానిలో నివసించేవారు.

అన్వేషణ యుగంలో, 1498లో పోర్చుగీసు వారు కోజికోడ్‌లోని కప్పాడ్‌కు చేరుకున్నారు. తద్వారా ఐరోపా నుండి దక్షిణ ఆసియాకు ప్రత్యక్ష సముద్ర మార్గాన్ని తెరిచారు. కోజికోడ్ జమోరిన్ నావికాదళానికి అధిపతులైన కుంజాలి మారక్కర్లు, భారత తీరానికి మొదటి నావికా రక్షణను ఏర్పాటు చేసిన ఘనతను పొందారు.[29] 1664 లో మలబార్ డచ్చి వాళ్ళు ఫోర్ట్ కోచీ పురపాలక సంఘాన్ని స్థాపించారు. ఇది భారత ఉపఖండంలో మొదటి పురపాలక సంఘం. 18వ శతాబ్దంలో డచ్ అధికారం బలహీనపడినప్పుడు దీన్ని రద్దు చేసారు.[30] బ్రిటిష్ రాజ్ కింద, కోజికోడ్ మలబార్ జిల్లాకు ప్రధాన కార్యాలయంగా పనిచేసింది; మధ్యయుగ కేరళ తీరంలో ఈ ఓడరేవుకు ఉన్నతమైన ఆర్థిక, రాజకీయ స్థానం ఉండేది. కన్నూర్, కొల్లం, కోచీ వాణిజ్యపరంగా ముఖ్యమైన ద్వితీయ ఓడరేవులుగా ఉండేవి, ఇక్కడ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యాపారులు కూడేవారు.[31]

1930ల మధ్యకాలంలో పొన్నాని నౌకాశ్రయం

దక్షిణ మలబార్, మధ్యయుగ కేరళకు సాంస్కృతిక రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతం మలయాళ సాహిత్యానికి ప్రధాన కేంద్రంగా ఉండేది, ఇప్పటికీ ఉంది. మామంగం ఉత్సవానికి కేంద్రమైన తిరునవాయ, మధ్యయుగాలలో కేరళలో ఇస్లామిక్ అధ్యయనాలకు అతిపెద్ద కేంద్రమైన పొన్నాని, దక్షిణ మలబార్‌లో ఉండేవి. కేరళ ఖగోళశాస్త్ర, గణిత శాస్త్ర పాఠశాల 14వ, 16వ శతాబ్దాల మధ్య వర్ధిల్లింది, ఇది తానూర్ రాజ్యంలో కేంద్రీకృతమై ఉంది.[32] ఖగోళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో, ఈ పాఠశాల త్రికోణమితి ప్రమేయాల శ్రేణి విస్తరణతో సహా అనేక ముఖ్యమైన గణిత భావనలను స్వతంత్రంగా సృష్టించింది.[33][34]

మధ్యయుగాలలో కేరళలోని నంబూదిరి బ్రాహ్మణులకు అత్యున్నత అధిపతిగా పరిగణించబడే అథవనాడ్ యొక్క సామంత రాజులు అజ్వాంచేరి తంప్రక్కల్ కూడా దక్షిణ మలబార్ స్థానికులు.[35] దక్షిణ మలబార్‌లో తుంచత్తు ఎజుతచ్చన్, పూంథానం నంబూదిరి, మెల్పత్తూర్ నారాయణ భట్టతిరి, కుంచన్ నంబియార్, జైనుద్దీన్ మఖ్దూం II వంటి ప్రముఖులు ఉన్నారు.[3]

వలస పాలన కాలం

[మార్చు]
1804 నాటి భారతదేశ మ్యాపు. తలస్సేరి, కోజికోడ్, కొచ్చి లు మాత్రమే ప్రస్తుత కేరళలో ఉన్నట్లు చూపించి ఉన్నాయని గమనించండి.
1951 భారత జనగణనలో మలబార్ జిల్లా
తూర్పు ఎరనాడ్‌లోని నిలంబూర్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టేకు తోట అయిన కొనొలీ ప్లాట్‌ను 1840వ దశకంలో జిల్లా కలెక్టర్ హెచ్.వి. కొనొలీ నాటారు.

18వ శతాబ్దం చివరి దశాబ్దాలలో టిప్పు సుల్తాన్ కేరళ ఉత్తర ప్రాంతాలను ఏకీకృతం చేసాడు. మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో అతని ఓడిపోవడం, తదనంతరం జరిగిన శ్రీరంగపట్నం సంధి తరువాత, టిప్పు రాజ్యంలోని ఈ ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకుంది. ఆంగ్లో-మైసూర్ యుద్ధాల తరువాత, బ్రిటిష్ కాలనీలుగా మారిన మలబార్ తీరంలోని భాగాలను బ్రిటిష్ భారతదేసంలో ఒక జిల్లాగా ఏర్పాటు చేసి, పరిపాలనా సౌలభ్యం కోసం 1793 మార్చి 30న ఉత్తర మలబార్, దక్షిణ మలబార్‌ అని విభజించారు. మలబార్ సాధారణ పరిపాలనా ప్రధాన కార్యాలయం కాలికట్‌లో (దక్షిణ మలబార్) ఉన్నప్పటికీ, దక్షిణ మలబార్ ప్రత్యేక ప్రధాన కార్యాలయం మొగట చెర్పులస్సేరిలో, ఆ తరువాత ఒట్టపాలెంలో ఉండేది.

ప్రారంభంలో మలబార్, బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తరువాత, 1799–1800లో, మలబార్, దక్షిణ కెనరా లను మద్రాస్ ప్రెసిడెన్సీకి బదిలీ చేసారు. కేరళలోని అతి పురాతన రైల్వే లైన్ 1860లలో దక్షిణ మలబార్‌ లోనే వేసారు. 1921లో జరిగిన మలబార్ తిరుగుబాటుకు దక్షిణ మలబారే కేంద్రం. 1956 నవంబరు 1 న ఈ ప్రాంతం భారత రాష్ట్రమైన కేరళలో చేర్చారు.[7]

రాజ కుటుంబాలు

[మార్చు]

పరప్పనాడ్ రాజవంశం ట్రావన్‌కోర్ రాజవంశానికి చెందిన బంధువంశం. ట్రావన్‌కోర్ స్థాపకుడైన మార్తాండ వర్మ పరప్పనాడ్ రాజవంశానికి చెందినవాడు.

లక్ష్మీపురం ప్యాలెస్

[మార్చు]

లక్ష్మీపురం ప్యాలెస్ చంగనస్సేరిలోని పరప్పనాడ్ రాజ కుటుంబాల రాజభవనం. దీన్ని 1811లో మహారాణి అయిల్యం తిరునాల్ గౌరీ లక్ష్మీ బాయి (1791–1815) పాలనలో నిర్మించారు. ఆమె భర్త రాజా రాజా వర్మ కోయిల్ తంపురాన్, అతని కుటుంబ సభ్యులకు కొత్త రాజభవనంగా ఉపయోగపడింది.[36][37][38][39]

రాజా రాజా వర్మ కోయిల్ థంపురాన్ చంగనాస్సేరిలోని కావిల్ భగవతి ఆలయానికి సమీపంలోని పుజావతు పరిసరాల్లోని నీరాజీ ప్యాలెస్‌లో జన్మించాడు. అతను పరప్పనంగడిని పరిపాలించిన పరప్పనాడ్ రాజ కుటుంబంలో[40] భాగం.[41] అతను ట్రావెన్‌కోర్ మహారాజు స్వాతి తిరునాళ్ రామవర్మ తండ్రి.

కిలిమనూర్ ప్యాలస్

ముందు భాగంలో రాజా రవి వర్మ స్టూడియోతో ఆయన జన్మస్థలం

1705 లో పరప్పనాడ్ రాజ వంశానికి చెందిన ఇత్తమ్మర్ రాజా కుమారుడు, ఇద్దరు కుమార్తెలను కిలిమనూరు రాజ గృహంలోకి దత్తత తీసుకున్నారు. ఇత్తమ్మర్ రాజా సోదరి, ఆమె కుమారులైన రామవర్మ, రాఘవ వర్మ, కిలిమనూరులో స్థిరపడ్డారు. దత్తత తీసుకున్న సోదరీమణులను వారు పెళ్ళి చేసుకున్నారు. ట్రావెన్‌కోర్ రాజ్య స్థాపకుడు మార్తాండ వర్మ, రాఘవ వర్మ కుమారుడు. రాఘవ వర్మ మేనల్లుడు రవివర్మ కోయిల్ థంపురాన్, మార్తాండ వర్మ సోదరిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ధర్మరాజ కార్తీక తిరున్నాళ్ రామవర్మగా ప్రసిద్ధి చెందాడు.

1740 లో దేశింగనాడు రాజుకు మద్దతుగా డచ్ దేశస్థుడైన కెప్టెన్ హాకర్ట్ నాయకత్వంలోని సంయుక్త దళం[42] వేనాడ్‌పై దాడి చేసినప్పుడు, కిలిమానూరు నుండి వచ్చిన సైన్యం వారిని ప్రతిఘటించి, ఓడించింది. ఇది ఒక చిన్న విజయమే అయినప్పటికీ, ఒక భారతీయ సైన్యం ఒక ఐరోపా శక్తిని ఓడించడం ఇదే మొదటిసారి. 1753 లో ఈ ఘనతకు గుర్తింపుగా, మార్తాండ వర్మ కిలిమానూరు రాజభవనం నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు పన్నుల నుండి మినహాయింపు ఇచ్చి,[43] వాటికి స్వయంప్రతిపత్తిని మంజూరు చేశాడు.[44] ఈ సమయంలోనే, కుటుంబ దైవమైన శాస్తా లేదా అయ్యప్ప కోసం అయ్యప్ప ఆలయంతో పాటు ప్రస్తుత రాజభవన సముదాయాన్ని నిర్మించారు.[45]

వేలు తంపి దళవా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు ప్లాన్ చేస్తున్నప్పుడు కిలిమానూర్ ప్యాలెస్‌లో సమావేశాలు నిర్వహించేవారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన చివరి యుద్ధానికి వెళ్లే ముందు ఆయన తన ఖడ్గాన్ని ఆ ప్యాలెస్‌లోనే అప్పగించాడు. భారతదేశపు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఈ ఖడ్గాన్ని ప్యాలెస్ నుండి స్వీకరించి, ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉంచారు. ఆ తర్వాత, ఈ ఖడ్గాన్ని త్రివేండ్రంలోని నేపియర్ మ్యూజియంకు తరలించారు.

తిరువళ్ళా సమీపంలోని నెడుంపురం ప్యాలెస్ వల్లువనాడ్ రాజ కుటుంబానికి చెందినది.

భౌగోళికం

[మార్చు]
కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ యొక్క దూరపు దృశ్యం
బియ్యం బ్యాక్‌వాటర్, పొన్నాని

'దక్షిణ మలబార్' అనే పదం పూర్వపు మలబార్ జిల్లాలోని కొరపుళ నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. మధ్య కేరళ ( దక్షిణ త్రిస్సూర్ ప్రాంతం), ఉత్తర మలబార్ ప్రాంతం రెండింటితోనూ దక్షిణ మలబార్‌కు అధిక సాంస్కృతిక సారూప్యత ఉంది.[3]

కేరళలోని ఐదు అతిపెద్ద నదులలో మూడు— భరతపుళ, చాలియార్, కడలుండి —దక్షిణ మలబార్ గుండా ప్రవహిస్తాయి. ఈ ప్రాంతంలో కావేరి నదికి ఉపనది అయిన భవానీ నది వంటి అనేక చిన్న, మధ్య తరహా ఉపనదులు కూడా ఉన్నాయి. భరతపుళ ఉపనదులపై ఆనకట్టలు నిర్మించారు. వీటిలో పరిమాణంలో అతిపెద్దది మలంపుజ ఆనకట్ట. ఘనపరిమాణంలో అతిపెద్దది పరంబికుళం ఆనకట్ట.[46] బియ్యాం బ్యాక్‌వాటర్స్, కొనొలీ కాలువ వంటి కాలువలు, పొన్నాని కోలే చిత్తడి నేలలు కూడా దక్షిణ మలబార్ ప్రాంతంలో ఉన్నాయి.

కేరళలోని పశ్చిమ కనుమలలో అతిపెద్ద పర్వత మార్గమైన పాలక్కాడ్ గ్యాప్, కోయంబత్తూరు నగరం గుండా రోడ్డు మార్గంలో కేరళను తమిళనాడుతో కలుపుతుంది. ఇది దక్షిణ మలబార్‌లో ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని "కేరళ ముఖద్వారం" అని కూడా పిలుస్తారు.

మలబార్ జిల్లాలోని ఎత్తైన శిఖరాలు నీలగిరి పర్వతాల సమీపంలో ఉన్న ఎరనాడ్‌లోని నిలంబూర్ (తూర్పు) ప్రాంతంలో ఉన్నాయి.[3] 2,554 m (8,379 ft)ఆధునిక నిలంబూర్ తాలూకా, ఊటీ తాలూకా సరిహద్దులో ఉన్న 100,000 అడుగుల ఎత్తైన ముకుర్తి శిఖరం, మలబార్ జిల్లాలో అత్యంత ఎత్తైన ప్రదేశం. నేడు, ఇది దక్షిణ భారతదేశంలో ఐదవ ఎత్తైన శిఖరం, అనాముడి (2,696 మీటర్లు), మీసపులిమల (2,651 మీ) తర్వాత ఇది కేరళలో మూడవ ఎత్తైన శిఖరం. ఇది ఇడుక్కి జిల్లా వెలుపల, కేరళలో అత్యంత ఎత్తైన శిఖరం కూడా. అంగింద శిఖరం (2,383 మీ) జిల్లాలో రెండవ ఎత్తైన శిఖరం, వావుల్ మల (2,339 మీ) మూడవ ఎత్తైనది.[3] పశ్చిమ కనుమల ప్రధాన అవిచ్ఛిన్న శ్రేణి మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలోని పల్లపు ప్రాంతంలో అనేక చిన్న ఎగుడుదిగుడు కొండలు ఉన్నాయి.[3]

దక్షిణ మలబార్‌లో గొప్ప జీవవైవిధ్యం ఉంది. ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, కరింపుళ వన్యప్రాణుల అభయారణ్యం, న్యూ అమరమ్బలం రిజర్వ్ ఫారెస్ట్, నెడుంకాయం రెయిన్‌ఫారెస్ట్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అట్టపాడి రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు టేకు తోటలకు కూడా నిలయం. ఆధునిక వయనాడ్, మలప్పురం (చాలియార్ లోయ), పాలక్కాడ్ (అట్టపాడి లోయ) జిల్లాలలోని తూర్పు ప్రాంతాలు—అన్నీ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో భాగం, మైసూరు పీఠభూమికి కొనసాగింపు— కర్ణాటకలోని ప్రక్క జిల్లాలతో పాటు సహజ బంగారు క్షేత్రాలకు ప్రసిద్ధి చెందాయి.[47] దక్షిణ మలబార్ ప్రాంతానికి " కేరళ ధాన్యాగారం" అనే పేరు ఉంది.


బ్రిటిషు రికార్డులలో, తూర్పు ఎరనాడ్ ప్రాంతాన్ని సమిష్టిగా "నీలాంబూర్ లోయ"గా వర్ణించారు.[48] నీలాంబూర్‌లోని చాలియార్ నదీతీరం సహజ బంగారు క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది.[47] చాలియార్ నదీ లోయలో జరిపిన ఖనిజ అన్వేషణల్లో ఇక్కడ 25 లక్షల క్యూబిక్ మీటర్ల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లూ, అందులో ప్రతి ఘన మీటరుకు 0.1 గ్రాముల బంగారం ఉన్నట్లూ గుర్తించారు.[49]

రవాణా

[మార్చు]

రోడ్లు

[మార్చు]
కాలికట్ బస్ స్టేషనులో వోల్వో 8400 బస్సు

జాతీయ రహదారి 66 కోజికోడ్‌ను ఉత్తరాన మంగళూరు, ఉడుపి, గోవా మీదుగా ముంబైకి, దక్షిణాన తిరువనంతపురం సమీపంలోని కొచ్చి, కన్యాకుమారిలకు కలుపుతుంది. ఇది భారతదేశపు దక్షిణపు కొన అయిన కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. జాతీయ రహదారి 766, కోజికోడ్‌ను మైసూరు మీదుగా కర్ణాటకలోని కొల్లేగల్ ద్వారా బెంగళూరుకు కలుపుతుంది. జాతీయ రహదారి 966, కోజికోడ్‌ను మలప్పురం మీదుగా పాలక్కాడ్‌కు, అలాగే ఈ నగరాన్ని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికీ కలుపుతుంది. కోజికోడ్ శివారు ప్రాంతమైన రామనట్టుకర వద్ద ఇది NH 66లో కలుస్తుంది. రాష్ట్ర రహదారులు SH 29, SH 54, SH 68, SH 34 కూడా ఈ నగరం గుండా వెళ్తాయి.

ప్రధానంగా వ్యక్తిగత యజమానులచే నడపబడే బస్సులు, నగరం లోపల, సమీప ప్రాంతాలలో తిరుగుతాయి. నగర బస్సులకు ఆకుపచ్చ రంగు వేస్తారు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) రాష్ట్రంలోని అనేక గమ్యస్థానాలకూ, పొరుగు రాష్ట్రాలకూ బస్సులను నడుపుతుంది. నగరంలో మూడు బస్ స్టాండ్‌లు ఉన్నాయి: శివారు ప్రాంతాలకు, సమీప పట్టణాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు పాలయం బస్ స్టాండ్ నుండి బయలుదేరుతాయి; ప్రక్క జిల్లాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఇందిరా గాంధీ రోడ్డు (మావూర్ రోడ్డు)లోని మోఫుస్సిల్ బస్ స్టాండ్ నుండి బయలుదేరుతాయి; KSRTC బస్సులు ఇందిరా గాంధీ రోడ్డులోని KSRTC బస్ స్టాండ్ నుండి బయలుదేరుతాయి. ఇది కేరళలోనే అతిపెద్ద బస్ స్టాండ్.[50] తామరస్సేరి, తొట్టిల్‌పాలం, తిరువంబడి, వటకరలో కూడా KSRTC డిపోలు ఉన్నాయి.

ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు ముంబై, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, వెల్లూరు, ఎర్నాకులం, త్రివేండ్రం, ఊటీ, మైసూరులకు బస్సు సర్వీసులను నడుపుతారు. ఇవి ప్రధానంగా పాలయం ప్రాంతం నుండి ఇవి నడుస్తాయి. ఎక్కువగా ఇవి రాత్రిపూట సర్వీసులు.

మలప్పురం

[మార్చు]
కుట్టిప్పురం వంతెన, 1953లో నిర్మించబడింది

మలప్పురం జిల్లాలో చక్కటి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లాలో నాలుగు KSRTC స్టేషన్లు ఉన్నాయి.[51] రెండు జాతీయ రహదారులు ( NH 66, NH 966 ), అనేక రాష్ట్ర రహదారులు జిల్లా గుండా వెళ్తాయి. కేరళ PWD 2,680 రహదారులను నిర్వహిస్తుంది. జిల్లాలో 2,305 కిలోమీటర్ల రహదారి ఉండగా, అందులో 2,305 కిలోమీటర్లు జిల్లా రహదారులు, మిగిలిన 375 కిమీ రాష్ట్ర రహదారులు.[52] నడుకని చురం ఘాట్ రోడ్డు మలప్పురాన్ని నీలగిరితో కలుపుతుంది.[53] నడుకని- పరప్పనంగడి రహదారి మలప్పురం జిల్లా తీర ప్రాంతాన్ని తమిళనాడులోని నీలగిరి జిల్లా సరిహద్దులో ఉన్న నడుకాని చురం వద్ద తూర్పు కొండ సరిహద్దుతో, నిలంబూర్ సమీపంలో కలుపుతుంది.[54] జిల్లాలో మొట్టమొదటి ఆధునిక రహదారిని 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ వేశాడు.[55] తిరూర్ నుండి తానూర్, పరప్పనంగడి, వల్లిక్కున్ను మీదుగా చలియం వెళ్లే రహదారిని ఆయన అంచనా వేశాడు.[55] టిప్పు మలప్పురం నుండి తామరస్సేరి వరకు, మలప్పురం నుండి పశ్చిమ కనుమల వరకు, ఫెరోక్ నుండి తిరురంగడి మీదుగా కొట్టక్కల్ వరకు, కొట్టక్కల్ నుండి అంగడిపురం వరకు రహదారులకు ప్రణాళికలు వేసాడు.[56]

పాలక్కాడ్

[మార్చు]
పాలక్కాడ్‌లోని చంద్రనగర్ రౌండ్‌అబౌట్ రాత్రి దృశ్యం

పాలక్కాడ్‌లో మధ్యస్థాయి రహదారుల నెట్‌వర్క్ ఉంది. ఇది జాతీయ రహదారి 544 ( సేలంఎర్నాకులం ), జాతీయ రహదారి 966 లకు అనుసంధానించబడి ఉంది, ఇది పాలక్కాడ్‌లో ప్రారంభమై కోజికోడ్‌లోని రామనట్టుకర వద్ద NH 66 లో కలుస్తుంది.[57] మరో ముఖ్యమైన రహదారి పాలక్కాడ్–పొన్నాని రహదారి, ఇది NH 544, NH 66 లను కలుపుతుంది.పాలక్కాడ్‌లో నాలుగు బస్ స్టేషన్లు ఉన్నాయి: KSRTC టెర్మినల్ పాలక్కాడ్, మూడు ప్రైవేట్ బస్ స్టాండ్‌లు (స్టేడియం బస్ స్టాండ్, మున్సిపల్ బస్ స్టాండ్, టౌన్ బస్ స్టాండ్). పాలక్కాడ్ KSRTC డిపో జిల్లాలో ఉన్న ఏకైక డిపో, కానీ తిరువనంతపురం తర్వాత రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రెండవ KSRTC డిపో ఇది.[58] స్టేడియం బస్ స్టాండ్ నగరంలో అతిపెద్ద ప్రైవేట్ బస్ స్టాండ్,, ఇది నగర శివారు ప్రాంతాలకు, త్రిస్సూర్, పొల్లాచి వంటి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సేవలను అందిస్తుంది. కోజికోడ్, మన్నార్‌కాడ్, చెర్పులస్సేరి, కొంగాడ్, శ్రీకృష్ణపురం, కడంపళిపురంలకు మున్సిపల్ స్టాండ్ నుండి సర్వీసులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు ( ఒట్టపాలెం, షోరనూర్, పట్టాంబి, గురువాయూర్ వైపు) బస్సులు టౌన్ స్టాండ్ నుండి ప్రారంభమవుతాయి.2012లో స్టేషన్‌లో సా స్కానర్లు, సీసీటీవీలు, వాహన స్కానర్లతో కూడిన సమీకృత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.[59] స్టేషన్ 125వ వార్షికోత్సవాన్ని 2 జనవరి 2013న జరుపుకున్నారు.[60]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

కోజికోడ్

[మార్చు]

కేరళ ప్రభుత్వ సంస్థ అయిన సైబర్‌పార్క్, కేరళలోని మలబార్ ప్రాంతంలో ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమలలో పెట్టుబడుల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం రెండు ఐటీ పార్కులను నిర్మించి, నిర్వహించి, పర్యవేక్షించాలని యోచిస్తోంది. ఇది రాష్ట్రంలో మూడవ ఐటీ హబ్‌గా ఉంటుంది, మొత్తం 100,000 ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది.[61][62] ఇతర ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులలో బిర్లా ఐటీ పార్క్ (మావూర్‌లో), మలేషియన్ శాటిలైట్ సిటీ (కినాలూర్‌లో) ఉన్నాయి, ఇక్కడ కిన్‌ఫ్రా 160-hectare (400-acre) పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.2012లో కోజికోడ్‌కు "సిటీ ఆఫ్ స్కల్ప్చర్స్" (" Shilpa Nagaram " అనే ట్యాగ్ ఇవ్వబడింది. నగరం చుట్టూ ఉన్న వాస్తు శిల్పాల కారణంగా.[63][64]

వంటలు

[మార్చు]
పతిరి, వరిపిండితో చేసిన రొట్టె
"కల్లుమ్మక్కాయ నీరచాతు" లేదా అరిక్కడుక్క
కోజికోడ్, పొన్నాని లలో "హల్వాలు"

శతాబ్దాల సముద్ర వాణిజ్యం కారణంగా దక్షిణ మలబార్‌ వంటకాల్లో సాంప్రదాయిక కేరళ వంటకాలతో పాటు, పర్షియన్, యెమెనీస్ అరబ్ ఆహార సంస్కృతులు మిళితమై బహుళ సంస్కృతుల వంటకాలు లభిస్తాయి.[65] అనేక రకాల శాకాహార, మాంసాహార వంటకాలు లభిస్తాయి. బియ్యపు పిండితో చేసే ఒక రకమైన అట్టు అయిన పతిరి, దక్షిణ మలబార్ అంతటా ఒక ప్రధాన ఆహారం, సాధారణ అల్పాహారం. పతిరి రకాలలో నెయ్యితో చేసిన నేయ్‌పతిరి, కాల్చకుండా వేయించిన పొరిచ పతిరి, చేప కూరతో నింపిన మీన్ పతిరి, గొడ్డు మాంసం కూరతో నింపిన ఇరచి పతిరి ఉన్నాయి.[65] కల్లుమ్మక్కాయ (మస్సెల్స్ ) కూర, ఇరచి పుట్టు (ఇరచి అంటే "మాంసం"), పరోటాలు,[65] నెయ్యి అన్నం మరికొన్ని ప్రత్యేకతలు. దక్షిణ మలబార్ వంటకాలకు మసాలాలు ఒక ప్రత్యేకత— నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలను విరివిగా ఉపయోగిస్తారు. శాకాహార వంటకాలలో అరటి ఆకుపై వడ్డించే సాంప్రదాయ భోజనమైన సద్య కూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "District Census Handbooks of Kerala - 2011". censusindia.gov.in. Retrieved 26 July 2020.
  2. "Limits of assembly constituencies of Kerala" (PDF). Keralaassembly.org. Retrieved 26 July 2020.
  3. 1 2 3 4 5 6 Logan, William (2010). Malabar Manual (Volume-I). New Delhi: Asian Educational Services. ISBN 9788120604476.
  4. Pamela Nightingale, ‘Jonathan Duncan (bap. 1756, d. 1811)’, Oxford Dictionary of National Biography, Oxford University Press, 2004; online edn, May 2009
  5. Boag, GT (1933). The Madras Presidency (1881-1931) (PDF). Madras: Government of Madras. p. 63. Archived from the original (PDF) on 2021-06-09. Retrieved 2026-07-03.
  6. Government of Madras (1953). 1951 Census Handbook- Malabar District (PDF). Madras Government Press.
  7. 1 2 3 4 Sreedhara Menon, A. (January 2007). Kerala Charitram. Kottayam: DC Books. ISBN 9788126415885. Retrieved 19 July 2020.{{cite book}}: CS1 maint: date and year (link)
  8. J. Sturrock (1894). "Madras District Manuals - South Canara (Volume-I)". Madras Government Press.
  9. V. Nagam Aiya (1906). The Travancore State Manual. Travancore Government Press.
  10. Logan, William (1887). Malabar Manual, Vol. 1. Servants of Knowledge. Superintendent, Government Press (Madras). p. 1.
  11. Mohammad, K.M. "Arab relations with Malabar Coast from 9th to 16th centuries" Proceedings of the Indian History Congress. Vol. 60 (1999), pp. 226–34.
  12. 1 2 3 Menon, A. Sreedhara (2007). A Survey of Kerala History. DC Books. ISBN 9788126415786.
  13. Subramanian, T. S (28 January 2007). "Roman connection in Tamil Nadu". The Hindu. Archived from the original on 19 September 2013. Retrieved 28 October 2011.
  14. Gurukkal, R., & Whittaker, D. (2001). In search of Muziris. Journal of Roman Archaeology, 14, 334-350.
  15. A. Shreedhara Menon, A Survey of Kerala History
  16. According to Pliny the Elder, goods from India were sold in the Empire at 100 times their original purchase price. See
  17. Bostock, John (1855). "26 (Voyages to India)". Pliny the Elder, The Natural History. London: Taylor and Francis.
  18. Indicopleustes, Cosmas (1897). Christian Topography. 11. United Kingdom: The Tertullian Project. pp. 358–373.
  19. Das, Santosh Kumar (2006). The Economic History of Ancient India. Genesis Publishing Pvt Ltd. p. 301.
  20. Veluthat, Kesavan (1 June 2018). "History and historiography in constituting a region: The case of Kerala". Studies in People's History. 5 (1): 13–31.
  21. Narayanan, M. G. S. Perumals of Kerala: Brahmin Oligarchy and Ritual Monarchy Perumāḷs of Kerala. Thrissur (Kerala): CosmoBooks, 2013. 438-42.
  22. "History of Malappuram" (PDF). censusindia.gov.in. Retrieved 17 April 2020.
  23. M. G. S. Narayanan. "Kozhikkodinte Katha". Malayalam/Essays. Mathrubhumi Books. Second Edition (2017) ISBN 978-81-8267-114-0
  24. Sreedhara Menon, A. (January 2007). Kerala Charitram. Kottayam: DC Books. ISBN 978-81-264-1588-5. Retrieved 19 July 2020.{{cite book}}: CS1 maint: date and year (link)
  25. Sreedhara Menon, A. (2007). A Survey of Kerala History. Kottayam: DC Books. ISBN 9788126415786.
  26. Ibn Battuta, H. A. R. Gibb (1994). The Travels of Ibn Battuta A.D 1325-1354. Vol. IV. London.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  27. Varthema, Ludovico di, The Travels of Ludovico di Varthema, A.D.1503–08, translated from the original 1510 Italian ed. by John Winter Jones, Hakluyt Society, London
  28. Gangadharan. M., The Land of Malabar: The Book of Barbosa (2000), Vol II, M.G University, Kottayam.
  29. Singh, Arun Kumar (11 February 2017). "Give Indian Navy its due". The Asian Age. Retrieved 23 January 2021.
  30. M K Sunil Kumar (26 September 2017). "50 years on, Kochi still has a long way to go". The Times of India. Retrieved 1 June 2021.
  31. The Portuguese, Indian Ocean and European Bridgeheads 1500–1800. Festschrift in Honour of Prof. K. S. Mathew (2001). Edited by: Pius Malekandathil and T. Jamal Mohammed. Fundacoa Oriente. Institute for Research in Social Sciences and Humanities of MESHAR (Kerala)
  32. Roy, Ranjan (1990). "Discovery of the Series Formula for π by Leibniz, Gregory, and Nilakantha". Mathematics Magazine. 63 (5): 291–306. doi:10.2307/2690896. JSTOR 2690896.
  33. Roy, Ranjan (1990). "Discovery of the Series Formula for π by Leibniz, Gregory, and Nilakantha". Mathematics Magazine. 63 (5): 291–306. doi:10.2307/2690896. JSTOR 2690896.
  34. Pingree, David (1992), "Hellenophilia versus the History of Science", Isis, 83 (4): 554–63, Bibcode:1992Isis...83..554P, doi:10.1086/356288, JSTOR 234257, S2CID 68570164, One example I can give you relates to the Indian Mādhava's demonstration, in about 1400 A.D., of the infinite power series of trigonometrical functions using geometrical and algebraic arguments. When this was first described in English by Charles Whish, in the 1830s, it was heralded as the Indians' discovery of the calculus. This claim and Mādhava's achievements were ignored by Western historians, presumably at first because they could not admit that an Indian discovered the calculus, but later because no one read anymore the Transactions of the Royal Asiatic Society, in which Whish's article was published. The matter resurfaced in the 1950s, and now we have the Sanskrit texts properly edited, and we understand the clever way that Mādhava derived the series without the calculus, but many historians still find it impossible to conceive of the problem and its solution in terms of anything other than the calculus and proclaim that the calculus is what Mādhava found. In this case, the elegance and brilliance of Mādhava's mathematics are being distorted as they are buried under the current mathematical solution to a problem to which he discovered an alternate and powerful solution.
  35. Leelakrishnan, Alamkode (17 June 2019). "അമ്പതിന്റെ നിറവില്‍ മലപ്പുറം; മലപ്പുറത്തിന്റെ മാനവിക മഹാപൈതൃകം". Mathrubhumi. Archived from the original on 7 May 2021. Retrieved 21 February 2021.
  36. The Travancore State Manual Vol 1 to 4; Publisher : Kerala Council for Historical Research; ISBN 8185499268; year : 1996; Pages: 2500; Author:T.
  37. Encyclopedia of Tourism Resources in India; Author: Dr. Manohar Sajnani, Published in 2001, Published by: Kalpaz Publications; Address: C-30, Satyawati Nagar, Phase-III, Ashok Vihar, Delhi-110052, ISBN 81-7835-014-9 (set), ISBN 81-7835-018-1 (Vol II)
  38. History of Travancore from the Earliest Times - P. Shungoonny Menon - ISBN 8120601696 - Published By: Asian Educational Services
  39. Lennox Raphael Eyvindr, ed. (2012). Visakham Thirunal. p. 168. ISBN 978-6139120642.
  40. Visakham Thirunal - Editor: Lennox Raphael Eyvindr - ISBN 9786139120642
  41. P. Shungoonny Menon - A HISTORY OF TRAVANCORE - First edition: 1878, New edition: 1983, Page 130, 131 - ISBN 978-8170200406
  42. The forces were from Kochi, Thekkumkoor, Deshinganad (present kollam) and Purakkad who had enmity towards Marthanda Varma
  43. Most of the area under the present Kilimanoor and Pazhayakunnummel panchayats.
  44. Although under his kingdom
  45. It is also said[by whom?] Shaastha and Ayyappa are different
  46. "Fact sheet on Indian dams at Diehardindian.com". Archived from the original on 13 December 2006.
  47. 1 2 "Minerals Resources". Dmg.kerala.gov.in. Retrieved 27 November 2021.
  48. 1951 census handbook - Malabar district (PDF). Chennai: Government of Madras. 1953. p. 1.
  49. "Physical divisions of Malappuram" (PDF). censusindia.gov.in. pp. 21–22.
  50. "Kozhikode Bus Stand : KSRTC Bus Station and Shopping Complex Calicut | Kozhikode". Archived from the original on 18 June 2018. Retrieved 18 June 2018.
  51. "KSRTC stations of Malappuram". keralartc.com. Archived from the original on 2021-06-04. Retrieved 2026-07-03.
  52. "Length of PWD Roads in Malappuram". kerenvis.nic.in. Retrieved 19 April 2020.
  53. "നാടുകാണിച്ചുരം വിളിക്കുന്നു, അപൂര്‍വകാഴ്ചകളുമായി". Mathrubhumi. 25 June 2019. Archived from the original on 28 November 2020. Retrieved 1 March 2021.
  54. "നാടുകാണി–പരപ്പനങ്ങാടി റോഡ് ടാറിങ് തുടങ്ങി; വീതികൂട്ടലും ഓടനിർമാണവും പിന്നീട്". Manorama Online. 12 February 2020.
  55. 1 2 "ആ ചൂളംവിളി പിന്നെയും പിന്നെയും..." Mathrubhumi. 17 June 2019. Archived from the original on 30 November 2020. Retrieved 19 December 2020.
  56. M. K. Devassy (1965). 1961 Census Handbook- Kozhikode District (PDF). Directorate of Census Operations, Kerala and The Union Territory of Laccadive, Minicoy, and Amindivi Islands.
  57. "National Highways and their lengths" Archived 6 సెప్టెంబరు 2012 at the Wayback Machine.
  58. "KSRTC Depots". 2011-03-14. Archived from the original on 14 March 2011. Retrieved 2022-09-06.
  59. Staff Reporter (25 November 2012). "50 CCTVs at railway station". Thehindu.com. Retrieved 27 November 2021.
  60. Staff Reporter (11 October 2012). "Kozhikode rail station to celebrate anniversary". Thehindu.com. Retrieved 27 November 2021.
  61. "Kozhikode - Cyber Park Kerala". Cyberparkkerala.org. Retrieved 22 June 2019.
  62. "Kozhikode Cyberpark to take off next year". Archived from the original on 12 February 2010.
  63. "'Shilpa Nagaram' on June 7". The Hindu. Chennai, India. 4 June 2012.
  64. "Kozhikode is 'Shilpa Nagaram'". The Hindu. Chennai, India. 8 June 2012.
  65. 1 2 3 Sabhnani, Dhara Vora (June 14, 2019). "Straight from the Malabar Coast". The Hindu. Retrieved January 26, 2021.