Jump to content

దాజీ భటవాడేకర్

వికీపీడియా నుండి
దాజీ భటవాడేకర్
జననం15 September 1921 (1921-09-15)
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, భారతదేశం
మరణం26 December 2006 (2006-12-27) (aged 85)
చదువువిల్సన్ కళాశాల, ముంబై
వృత్తిరంగస్థల కళాకారుడు, సినిమా నటుడు
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు (1965)
పద్మశ్రీ పురస్కారం (1967)

దాజీ భటవాడేకర్ (కృష్ణచంద్ర మోరేశ్వర్)[1] (1921 సెప్టెంబరు 15 – 2006 డిసెంబరు 26), ఒక భారతీయ రంగస్థల ప్రముఖుడు, చలనచిత్ర, టెలివిజన్ నటుడు. భారతదేశంలో సంస్కృతం, మరాఠీ రంగస్థల పునరుజ్జీవనానికి ఆయన కృషి చేసాడు.[2] 1965లో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు వరించింది.[3] 1967లో ఆయనను భారత ప్రభుత్వం సమాజానికి చేసిన కృషికి నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం అయిన పద్మశ్రీతో సత్కరించింది.[4]

జీవిత చరిత్ర

[మార్చు]

దాజీ భటవాడేకర్ 1921 సెప్టెంబరు 15న అప్పటి బ్రిటిష్ ఇండియా బాంబే ప్రెసిడెన్సీలోని బాంబేలో జన్మించాడు. ఆయన తన పాఠశాల విద్యను బొంబాయిలోని ఆర్య ఎడ్యుకేషన్ సొసైటీలో పొందాడు. ఆయన ముంబైలోని విల్సన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.ఆ తరువాత ముంబై విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసాడు.[5] ఆయన తన కెరీర్‌ను ఆఫీసు ఉద్యోగంతో ప్రారంభించాడు కానీ నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. ముంబైకి చెందిన సాహిత్య సంఘం అయిన ముంబై మరాఠీ సాహిత్య సంఘ్‌తో సంబంధం పెట్టుకున్నాడు.

భటవాడేకర్ అనేక మరాఠీ, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషా నాటకాలలో నటించాడు.దుర్గా ఖోటే వంటి నటులతో, పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండే, హెర్బర్ట్ మార్షల్ వంటి దర్శకులతో చక్కని అనుబంధం కలిగి ఉన్నాడు. అతను ముంబై బ్రాహ్మణ సభలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. అతను 78 విభిన్న పాత్రలను పోషించినట్లు నివేదికలు ఉన్నాయి. ఆయన నటించిన ప్రసిద్ధ నాటకాలలో తోచి ఏక్ సమర్థ్, మిత్ర, హీ తర్ ప్రేమచి ఖరీ గమ్మత్ ఆహే, లగ్నాచి గోష్టా, మక్‌బెత్, తుజా అహే తుజ్‌పాషి వంటివి కొన్ని. అతను విజేత (1982) అనే చిత్రంలో కూడా నటించాడు. అతను దూరదర్శన్ ప్రసారం చేసిన టెలివిజన్ ధారావాహిక బ్యోమకేష్ బక్షి (1993) కోసం మక్డీ కా రాస్ ఎపిసోడ్‌లో నంద్ దులాల్ బాబు, వేణి సన్హర్, ఎపిసోడ్‌లో బేణి మాధవ్ పాత్రలు పోషించాడు.

ఆంగ్లం, సంస్కృత భాషలలో పండితుడైన ఆయన సంస్కృత నాటక రంగంపై ఒక పుస్తకం రాసాడు, ఇందులో సౌందర్యశాస్త్రం (రసం), వ్యక్తీకరణ (అభినయం) పై ప్రాధాన్యత ఉంది. అతను తన 70వ దశకం వరకు తన అధ్యయనాలను కొనసాగించాడు. ఆయన 74 సంవత్సరాల వయస్సులో డాక్టరేట్ పట్టా పొందాడు. అతను నాట్య భూషణ్, కళా గౌరవ్, మహారాష్ట్ర రత్న, నట సామ్రాట్ వంటి అనేక అవార్డులను అందుకున్నాడు. 1965లో, అతను సంస్కృత నాటక రంగానికి చేసిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు. భారత ప్రభుత్వం 1967లో పద్మశ్రీ పౌర పురస్కారంతో ఆయనను సత్కరించింది.

అతను ముంబైలోని చార్ని రోడ్డు వెంబడి ఉన్న భటవాడేకర్ వాడిలోని తన పూర్వీకుల ఇంటిలో నివసించాడు. ముంబై మరాఠీ సాహిత్య సంఘం ఆయన మరణించిన తేదీని, డిసెంబరు 26ని డాక్టర్ దాజీ భటవాడేకర్ స్మారక దినంగా పాటిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Ananda Lal, ed. (2004). The Oxford Companion to Indian Theatre. Oxford University Press. ISBN 9780195644463.
  2. "Times of India". Times of India. 29 May 2001. Retrieved 9 May 2015.
  3. "Sangeet Natak Akademi". Sangeet Natak Akademi. 2015. Archived from the original on 31 March 2016. Retrieved 9 May 2015.
  4. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  5. "Daji Bhatwadekar: Timeless performance". Sify. 23 June 2004. Archived from the original on 24 September 2015. Retrieved 9 May 2015.