దార్-ఉల్-షిఫా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దార్-ఉల్-షిఫా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉన్న యునానీ ఆసుపత్రి. 1595లో ఐదవ కుతుబ్ షాహీ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా దీనిని నిర్మించాడు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

మూసీ నది తీరానికి సమీపంలో ఇది నిర్మించబడింది. ఉర్దూ భాషలో దారుల్ అంటే ఇల్లు అని, షిఫా అంటే స్వస్థత అని అర్థంకాబట్టి, దీనిని స్వస్థత కేంద్రంగా కూడా పిలుస్తారు. హైదరాబాదు నగర నిర్మాణం ప్రారంభించిన ఐదేళ్ల తరువాత ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయింది. నాలుగు శతాబ్దాల కిందట ప్రపంచంలోనే ప్రసిద్దిపొందిన మూడు ఆసుపత్రుల్లో ఒకటిగా ఇది నిలిచింది.[2]

ఆ కాలంలోని ప్రజలకు యునానీ వైద్యం మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిలో వైద్యం అందించడానికి పర్షియన్ దేశాల నుండి వైద్యులను రప్పించేవారు. 400మంది రోగులకు ఒకేసారి ఉచితంగా మందులు అందించేవారు.

నిర్మాణం

[మార్చు]

ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో ఒక్కో అంతస్తులో 12 గదులు ఉండేవి. ఇన్-పేషెంట్స్ కోసం ఉత్తర దిక్కనున్న ఎత్తైన ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు అంతస్తుల్లో ఎనమిది డబల్ బెడ్ రూంలు నిర్మించబడ్డాయి. అలాగే, ఉత్తరంవైపు ప్రధాన ద్వారం పక్కన ఔట్ పేషెంట్స్ కోసం వార్డును నిర్మించారు.

ఇతర వివరాలు

[మార్చు]

కుతుబ్ షాహీల తరువాత హైదరాబాదు నగరాన్ని నిజాం ప్రభువుల్లో మొదటివాడైన నిజాం ఉల్ ముల్క్ (1762) పాలన వరకు దార్-ఉల్-షిఫా సమర్థవంతంగా నడిచింది. అటుతరువాత, రెండవ నిజాం కాలంలో దార్-ఉల్-షిఫా మూసివేయబడి, నిజాం సంస్థానంలో కలుపబడింది. దీని సమీపంలో అజాఖానా-ఇ-జహ్రా అనే ప్రార్థన మందిరం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, నిపుణ విద్యావార్తలు (20 September 2017). "తానీషా గురువు ఎవరు?". Archived from the original on 5 April 2019. Retrieved 5 April 2019.
  2. దార్-ఉల్-షిఫా, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 46