దాసరి కోటిరత్నం
దాసరి కోటిరత్నం (1910 - డిసెంబరు 21, 1972) ప్రముఖ రంగస్థలనటి, తొలితరం తెలుగు సినిమా నటి, చిత్ర నిర్మాత. తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత.
జననం[మార్చు]
కోటిరత్నం, 1910లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జన్మించింది. తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటినుండే కోటిరత్నానికి నటనలో శిక్షణ ఇచ్చాడు. 9వ యేటనే రంగస్థలంలో అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితస్య, బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన్నరంగారావు, లవకుశలో కుశుడు, ప్రహ్లాదలో ప్రహ్లాద మొదలైన పాత్రలు ధరించింది. ఈమె నాటకాలలో నటిస్తూనే రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతంలోకూడా శిక్షణ పొందింది.[1] అద్భుత నటనకు మధుర స్వరం తోడవటంతో మంచి నటీమణిగా పేరుతెచ్చుకున్నది.
దాసరి కోటిరత్నానికి రంగస్థల నటిగా, గాయనిగా ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఈమె తొలి మహిళా నాటకసమాజ స్థాపకురాలు. ఈమె నాటకల్లో స్త్రీ పాత్రలతో పాటు అనేక పురుష పత్రాలు ధరించేది. లవకుశ పాత్రలతో ఆరంభమైన ఆమె నటన రామదాసు, కంసుడు వంటి గంభీరమైన పురుష పాత్రలను కూడా వేసి మెప్పించింది. సావిత్రి నాటకంలో సత్యవంతుడు, సక్కుబాయి నాటకంలో కృష్ణుడు ఆమె ధరించిన పాత్రల్లో ప్రసిద్ధి చెందినవి. ఈమె సతీ అనసూయ, గంగావతరణం మొదలైన నాటకాల్లో నారదుని పాత్ర కూడా పోషించింది. పురుషులకు మాత్రమే పరిమితమైన రోజుల్లో స్వంతంగా నాటక సమాజాన్ని నిర్వహించింది. తల్లి మరణించిన తర్వాత ప్రత్తిపాడును వదిలి తాతగారి ఊరైన నక్కబొక్కల పాడుకు వెళ్ళింది. అక్కడే నాటకసమాజం స్థాపించింది. నక్కబొక్కల పాడు చిన్న పల్లెటూరైనా కోటిరత్నం నాటక సమాజానికి అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. ఈ సమాజం వేసిన నాటకాలు కొన్ని ఐదు సంవత్సరాల పాటు నిరవధికంగా ప్రదర్శించబడ్డాయి. ఐదేళ్ళ తర్వాత మకాం గుంటూరుకు మార్చి అక్కడ నాటక సమాజాన్ని కొనసాగించింది. ఈమె నాటక సమాజంలో పారుపల్లి సుబ్బారావు, తుంగల చలపతిరావు వంటివారు పనిచేసేవారు. ఈమె బృందలో పాతిక మంది దాకా స్త్రీ పాత్ర ఉండేవారని ప్రతీతి. ఎన్నో నాటకాలు అభ్యాసం చేసి, ఊరూరా ప్రదర్శించేవారు. అందరికీ కోటిరత్నం నెలవారీ జీతాలు ఇచ్చేవారు. నాటకాల్లో వచ్చిన పేరుతో ఆమె సినిమాల్లో ప్రవేశింది.
1935లో తన నాటక బృందంతో కలకత్తా వెళ్ళి అక్కడ ఆరోరా ఫిలింస్ కంపెనీలో భాగస్వామిగా, బి.వి.రామానందం, తుంగల చలపతిరావులతో కలిసి భారతలక్ష్మి ఫిలింస్ అనే సంస్థను నెలకొల్పి, 'సతీసక్కుబాయి' చిత్రాన్ని నిర్మించింది. ఇందులో కోటిరత్నం టైటిల్ పాత్రలో సక్కుబాయిగా, తుంగల చలపతిరావు కృష్ణుడిగా నటించారు. టైటిల్ పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆమే కావడం గమనార్హం. 1935లో విడుదలైన ఈ సినిమాకు చారుచంద్ర రాయ్ దర్శకత్వం వహించాడు. అదే కంపెనీ సహకారంతో, అహింద్ర చౌదరి దర్శకత్వంలో కోటిరత్నం 'సతీ అనసూయ' అనే మరో చిత్రాన్ని నిర్మించి, అందులోనూ టైటిల్ పాత్రలో నటించింది. ఇది ఆరోరా ఫిలింస్ పతాకంపైన నిర్మితమై 1935 అక్టోబరు 4న విడుదలైంది.[2] ఆ తరువాత కోటిరత్నం లంకాదహనం, మోహినీ భస్మాసుర, వరవిక్రయం, పాండురంగ విఠల, వరూధిని, పాదుకా పట్టాభిషేకం, గొల్లభామ, బంగారు భూమి, అగ్నిపరీక్ష, చంద్రవంక మొదలైన సినిమాలలో నటించింది.
మరణం[మార్చు]
1958లో ఈమె అనారోగ్యం పాలై గొంతు దెబ్బతినడంతో నటనా అవకాశాలు తగ్గిపోయాయి.[3] తెలుగు సినిమా, నాటక రంగాలలో 45 సంవత్సరాల పాటు విశేషకృషి చేసిన కోటిరత్నం 1972, డిసెంబరు 21 న చిలకలూరిపేటలో మరణించింది.
నటించిన సినిమాలు[మార్చు]
- సక్కుబాయి (సినిమా) (1935)
- సతీ అనసూయ (1935)
- వరవిక్రయము (1939)
- పాదుకా పట్టాభిషేకం (1945)
- వరూధిని (1946)
- గొల్లభామ (1947)
- రాధిక (1947)
మూలాలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా నటీమణులు
- 1972 మరణాలు
- తెలుగు రంగస్థల నటీమణులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- 1910 జననాలు
- గుంటూరు జిల్లా రంగస్థల నటీమణులు
- గుంటూరు జిల్లా సినిమా నటీమణులు
- గుంటూరు జిల్లా సినిమా నిర్మాతలు