దాస్ కాపిటల్
![]() దాస్ కాపిటల్, వాల్యూమ్ I, మొదటి ఎడిషన్ శీర్షిక పేజీ (1867). వాల్యూమ్ II, వాల్యూమ్ III వరుసగా 1885, 1894 లో ప్రచురించబడ్డాయి. | |
రచయిత(లు) | కార్ల్ మార్క్స్ |
---|---|
మూల శీర్షిక | దాస్ కాపిటల్. కృతిక్ డెర్ పొలిటిస్చెన్ ఓకోనోమీ |
దేశం | జర్మనీ |
భాష | జర్మన్ |
ప్రచురణ సంస్థ | 1867–1894 |
ప్రచురణ కర్త | వెర్లాగ్ వాన్ ఒట్టో మీస్నర్ |
ఆంగ్లంలో ప్రచురించిన తేది | 1887 |
మీడియా రకం | ప్రింట్ |
Text | దాస్ కాపిటల్ at Wikisource |
కాపిటల్: రాజకీయ ఆర్థిక శాస్త్ర విమర్శ లేదా దాస్ కాపిటల్ అని కూడా పిలువబడే ఈ గ్రంథం కార్ల్ మార్క్స్ రాసిన అత్యంత ముఖ్యమైన రచన, మార్క్సియన్ ఆర్థిక శాస్త్రానికి పునాది. ఇది 1867, 1885, ఇంకా 1894లో మూడు సంపుటాలుగా ప్రచురించబడింది. అతని జీవిత రచనల పరాకాష్ట, ఈ గ్రంథంలో, మార్క్స్ పెట్టుబడిదారీ విధానాన్ని తన చారిత్రక భౌతికవాద సిద్ధాంతం ఆధారంగా విశ్లేషించి, విమర్శించాడు. దాస్ కాపిటల్ యొక్క రెండవ, మూడవ సంపుటాలు 1883లో మార్క్స్ మరణానంతరం అతని వ్రాతప్రతుల నుండి ఫ్రెడరిక్ ఏంగెల్స్ చేత పూర్తి చేయబడి ప్రచురించబడ్డాయి.
సాంప్రదాయ రాజకీయ ఆర్థికవేత్తలు ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో రచనలచే ప్రభావితమై, రాజకీయ ఆర్థిక వ్యవస్థపై మార్క్స్ అధ్యయనం 1840లలో ప్రారంభమైంది. వీటిలో 1844 ఆర్థిక, తాత్విక వ్రాతప్రతులు ఇంకా, జర్మన్ ఐడియాలజీ (1846, ఏంగెల్స్ తో కలిసి), అతని చారిత్రక భౌతికవాద సిద్ధాంతానికి పునాది వేశాయి. ఈ సిద్ధాంతం ప్రకారం, ఒక సమాజం యొక్క స్వభావాన్ని రూపొందించే అత్యంత కీలక అంశాలు, దాని ఆర్థిక నిర్మాణం, ముఖ్యంగా ఉత్పత్తి శక్తులు, సంబంధాలు. దాస్ కాపిటల్ పెట్టుబడిదారీ విధానాన్ని ఒక సాధారణ ఆర్థిక మోడల్గా వివరించడానికి బదులు, దాన్ని ఒక చారిత్రక యుగంగా, ఉత్పత్తి పద్ధతిగా పరిశీలిస్తుంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మూలాలు, అభివృద్ధి ఇంకా దాని పతనాన్ని శోధించడానికి ప్రయత్నిస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది చరిత్రాతీతమైనది కాదని, కానీ ఒక నిర్దిష్ట చారిత్రక సందర్భంలో ఉద్భవించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థాపన రూపం అని, ఇది అనివార్యంగా దాని క్షీణతకు, పతనానికి దారితీసే అంతర్గత వైరుధ్యాలను కలిగి ఉందని మార్క్స్ వాదించాడు.
దాస్ క్యాపిటల్ లో పెట్టుబడిదారీ విధానం గురించి మార్క్స్ చేసిన విశ్లేషణకు కేంద్రబిందువు అతని అదనపు విలువ సిద్ధాంతం, పెట్టుబడిదారులు లాభాలను ఆర్జించడానికి కార్మికుల చేత చెయ్యించుకునే చెల్లించని శ్రమ. పెట్టుబడిదారీ మార్కెట్లు ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న సామాజిక సంబంధాలను ఎలా అస్పష్టం చేస్తాయో వివరిస్తూ, అతను 'వస్తు మోహం' (కామోడిటీ ఫెటిషిజం) అనే భావనను కూడా పరిచయం చేశాడు, లాభాల రేటు తగ్గిపోయే ధోరణి కారణంగా పెట్టుబడిదారీ విధానం స్వభావంగానే అస్థిరంగా ఉంటుందని, ఇది పదేపదే ఆర్థిక సంక్షోభాలకు దారితీస్తుందని వాదించాడు. మొదటి సంపుటం ఉత్పత్తి, కార్మిక దోపిడీపై దృష్టి పెడుతుంది. రెండవ సంపుటం మూలధన ప్రసరణ , ఆర్థిక సంక్షోభాలను పరిశీలిస్తుంది. మూడవ సంపుటం ఆర్థిక పక్షాల మధ్య మిగులు విలువ పంపిణీని అన్వేషిస్తుంది. మార్క్స్ ప్రకారం, దాస్ కాపిటల్ అనేది విస్తృతమైన పరిశోధన ఆధారంగా రూపొందించిన శాస్త్రీయ రచన. పెట్టుబడిదారీ వ్యవస్థ, దానిని సమర్థవంతమైనది, స్థిరమైనదని వాదించే బూర్జువా రాజకీయ ఆర్థిక శాస్త్రజ్ఞుల రెండింటికీ ఒక విమర్శ.[1][2]
దాస్ కాపిటల్ ప్రారంభంలో పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించలేదు, కానీ 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో సోషలిస్టు, కార్మిక ఉద్యమాలు విస్తరించడంతో ప్రాముఖ్యత పొందింది. ఈ ఉద్యమాలకు మించి, దాస్ కాపిటల్ ఆర్థిక ఆలోచన, రాజకీయ శాస్త్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 1950కి ముందు ప్రచురించబడిన సాంఘిక శాస్త్రాలలో అత్యధికంగా ఉదహరించబడిన పుస్తకం.[3] మార్క్సిజం విమర్శకులు కూడా కార్మిక గతిశీలత, ఆర్థిక దశలు, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాల అభివృద్ధిలో దాని ప్రాముఖ్యతను గుర్తించారు. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, అసమానత, కార్మిక దోపిడీ విశ్లేషణలలో ఇప్పటికీ పండితులు దాస్ కాపిటల్ ను అనుసరించి, చర్చిస్తున్నారు.
తెలుగు ప్రచురణలు
[మార్చు]- కార్ల్ మార్క్స్ పెట్టుబడి - ఎస్ రామ్మోహన్, ఎ. గాంధీ, బిట్రగుంట రామచంద్రరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.[4]
- మార్క్స్ పెట్టుబడి నేటి సమాజం - తెలుగు అనువాదం: కె. ఉషారాణి (ఆంగ్లం: సి.పి చంద్రశేఖర్), ప్రజాశక్తి.[5]
- కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంధం: పుట్టుక, నిర్మాణం - తెలుగు అనువాదం: సుంకర రామచంద్రరావు (ఆంగ్లం: మార్సెల్లో ముస్టో), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? - ఇ. ఎస్. బ్రహ్మాచారి, విప్లవ రచయితల సంఘం.[6]
- మార్క్స్ రాసిన పెట్టుబడి - తెలుగు అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1985. (ఆంగ్లం: డేవిడ్ స్మిత్, ఫిల్ ఇవాన్స్)[7]
- మార్క్స్ 'కాపిటల్' పరిచయం - రంగనాయకమ్మ.[8]
మూలాలు
[మార్చు]- ↑ "తెలుసుకోదగ్గ పుస్తకం.. దాస్ కాపిటల్ | Best Book: The novel of love and money market | Sakshi". www.sakshi.com. Retrieved 2025-05-06.
- ↑ Veeresh, M. (2025-05-05). "CPM Celebrates Karl Marx's 207th Birth Anniversary, Calls for United Struggles in His Path". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2025-05-06.
- ↑ Green, Elliott (12 May 2016). "What are the most-cited publications in the social sciences (according to Google Scholar)?". LSE Impact Blog. London School of Economics. Archived from the original on 25 December 2018. Retrieved 14 November 2017.
- ↑ "Karl Marx Pettubadi". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2025-05-06.
- ↑ "మార్క్స్ పెట్టుబడి నేటి సమాజం – PRAJASAKTI BOOK HOUSE" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-05-06.
- ↑ "కాపిటల్‌లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు". lit.andhrajyothy.com. Retrieved 2025-05-06.[permanent dead link]
- ↑ "మార్క్స్ రాసిన పెట్టుబడి. | Sundarayya Vignana Kendram". sundarayya.org. Retrieved 2025-05-06.
- ↑ "మార్క్స్ 'కాపిటల్' పరిచయం-1 [Marx 'Capital' Parichayam-…". Goodreads (in ఇంగ్లీష్). Retrieved 2025-05-06.