దినవర్తమాని
| సంపాదకులు | రెవరెండ్ పీటర్ పెర్సివల్ |
|---|---|
| తరచుదనం | వారపత్రిక |
| ముద్రించిన కాపీలు | 700 |
| స్థాపకులు | రెవరెండ్ పీటర్ పెర్సివల్ |
| మొదటి సంచిక | 1856 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
| భాష | తెలుగు |
క్రైస్తవ మిషనరీలు నడిపిన తెలుగు పత్రికలలో దినవర్తమాని ఒకటి. మద్రాసు లోని ప్రెసిడెన్సీ కాలేజీలో దేశభాషల విభాగంలో ఆచార్యుడుగా పనిచేసిన రెవరెండ్ పీటర్ పర్సివల్ 1856 లో ఈ వారపత్రికను ప్రారంభించాడు. మొదట 1855 లో ఇదే పేరుతో తమిళంలో ఈ పత్రికను ప్రారంభించాడు. తమిళంలో ఆయన రాసిన వాటిని ఆయన సహాయకుడు తెలుగు చేసివాడు. ఈ సహాయకుని పేరు తెలియ రాలేదు. ఆ అనువాదాలలో తప్పులు విరివిగా ఉండేవి. ఈ పత్రిక అప్పటి ప్రభుత్వ ప్రాపకంలో ఉండేది.[1] దినవర్తమాని, హితవాది వంటి పత్రికలు వార్తలతో పాటు సామాజిక, మతపరమైన వార్తల్నీ ప్రచురించేవి. ప్రాధాన్యం మాత్రం వార్తలకే ఉండేది.[2][1] పేరును బట్టి చూస్తే, దినవర్తమాని దినపత్రిక అనిపించవచ్చు గానీ, ఇది వారపత్రిక. ఈ పత్రిక 700 ప్రతులు దాకా అమ్ముడయ్యేది.
పాలకుల పోషణలో, పాలకులకు అనుకూలంగా
[మార్చు]ప్రభుత్వం ఈ పత్రికకు నెలకు 200 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేది. ప్రెస్సు నడుపుకోడానికి ఉచితంగా భవనాన్ని కూడా ఇచ్చింది. దీని గురించి 'తత్త్యబోధిని' 1868 ఏప్రిల్ సంచికలో “దిన వర్తమాని యొక్కటి తప్ప నాంధ్ర మందు వేరొక పత్రికయు లేదు” అని ఉంది. ఈ పత్రిక పాలకులకు అనుకూలంగా ఉండేది. మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడిన నానా సాహెబు గురించిన వార్తను దినవర్తమాని ఇలా రాసింది:[3]
“నానాసాహెబ్ అను పరమ ద్రోహి ఇంక ప్రాణముతో నున్నట్టు ఉత్తర ఇండియా వృత్తాంత పత్రికలు కొన్ని ఉద్దేశముగా దెలియపరచుచున్నవి.. నేపాళ రెసిడంట్ ఉద్యోగస్టుడు తమ చేత కూడిన మట్టుకు అచ్చటచ్చట మనుష్యులను బంపి దీర్హ విచారణ చేయించగా, నా దుర్మార్గుడు చలి జ్వరము చేత చనిపోయెనను వదంతి దృష్టాంతముతో దెలియవచ్చినదిగాని వేరొక వృత్తాంతమును వినబడలేదని గవర్నమెంటు వారికి రిపోర్టు చేసినట్టు ఇంగ్లిష్ మెన్ పత్రికలో కనుపరచి యున్నది."
భాషా శైలి
[మార్చు]ఈ పత్రికను సరళ గ్రాంథిక భాషలో ప్రచురించేవారు. భాషలో నుగాగమాలు, యడాగమాలు విరివిగా కనిపించేవి. ఈ పత్రికలో వచ్చిన ఒక వార్త ఇలా ఉంది:
మిగుల ఘనత వహించిన గవర్నర్జనల్గారు హయిదరాబాదు నిజాం గారిని గౌరవపరచుటకు వారికి నయిట్ పట్టమివ్వబోవుచున్నారు. ఆ యభిప్రాయమును తెలియపరచునట్టి యొక్క పత్రికను రెసిడంటుకు (కర్నల్ డెలిసన్) పంపగా నా దొర క్రమ ప్రకారము తనదు పరివారంతోకూడి నిజాంగారి యొద్దకుబోయి మా పత్రికను ఒప్పగించిరి. వారు దాన్ని మిగులు తృప్తితోనంగీకరించి యా మంగళ వార్తను తెలియపరచుటకు చిహ్నముగా తనదు రాజధానియందు మాత్రము కాకుండా సికిందరాబాదు పొలారమునందును ఫిరంగీలు వేయించిరి.
దినవర్తమాని పత్రికలో భాష వ్యావహారికమని కొందరు చెప్పినప్పటికీ, ఇది సరళ గ్రాంథికమే అనేందుకు పై వార్తను చెప్పుకోవచ్చు.[4]
దీని గురించిన ప్రస్తావన
[మార్చు]1863 ప్రాంతాల్లో మతుకుమల్లి నృసింహకవి రచించిన చెన్నపురీ విలాసం గ్రంథం లోని అంతరాళ పద్ధతి ప్రకరణంలో దినవర్తమాని ప్రస్తానవ ఉంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆరుద్ర (2012). సమగ్ర ఆంధ్ర సాహిత్యం. Vol. 3. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 309.
- ↑ వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. తెలుగు అకాడమీ. p. 13.
- ↑ డా.జె., చెన్నయ్య (2003). తెలుగు దినపత్రికలు భాషాసాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ్ పబ్లికేషన్స్. p. 36.
- ↑ డా.జె., చెన్నయ్య (2010). పత్రికలు – ప్రసార మాధ్యమాలు తెలుగు. హైదరాబాదు: డా.జె.చెన్నయ్య. p. 16.
{{cite book}}: CS1 maint: date and year (link) - ↑ మతుకుమిల్లి, నృసింహకవి (1920). చెన్నపురీ విలాసము. మద్రాసు: మతుకుమల్లి రఘూత్తమరాయశాస్త్రి. p. 53.