ది గ్రేప్స్ ఆఫ్ రాత్ (నవల)
మొదటి ముద్రణ కవరు పేజీ | |
| రచయిత(లు) | జాన్ స్టెయిన్‌బెక్ |
|---|---|
| దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
| భాష | ఇంగ్లీషు |
| శైలి | నవల |
| ప్రచురణ కర్త | ది వైకింగ్ ప్రెస్ - జేమ్స్ లాయిడ్ |
ప్రచురించిన తేది | ఏప్రిల్ 14, 1939[1] |
| పుటలు | 464 |
| OCLC | 289946 |
| 813.52 | |
ది గ్రేప్స్ ఆఫ్ రాత్ (ఆంగ్లం: *The Grapes of Wrath*) అమెరికన్ రచయిత జాన్ స్టెయిన్‌బెక్ రచించిన నవల. ఇది 1939లో ప్రచురించబడింది. అమెరికాలోని మహా మాంద్యం, డస్ట్ బౌల్ కాలంలో రైతు కుటుంబాలు ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక కష్టాలను చిత్రించిన ఈ నవల, 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన అమెరికన్ సాహిత్య కృతులలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఈ నవలకు 1940లో పులిట్జర్ బహుమానం లభించింది. అనంతరం స్టెయిన్‌బెక్‌కు 1962లో లభించిన నోబెల్ సాహిత్య బహుమతికి ఈ రచన ప్రధాన కారణాలలో ఒకటిగా భావించబడింది.
నేపథ్యం
[మార్చు]1936/37 ప్రాంతంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంభవించిన గ్రేట్ డిప్రెషన్ కరవు సందర్భంగా కళ్ళముందు జరిగిన విషాదచరిత్రనే స్టెయిన్‌బెక్ ఈ నవలారూపంలో గ్రంథస్థం చేశాడు.
ఓక్లహామా రాష్ట్రంలో రైతులు ఆయేడు సంభవించిన క్షామ పరిస్థితుల్లో కొత్తగా పంటలు పెట్టలేరు. ఆ ఏడు అసాధారణంగా వీచిన ఎర్రధూళి, వడగాలుల్లో (Dust bowl) కాపుకొచ్చిన పంటలు నాశనమయ్యాయి. వ్యవసాయ ఖర్చులకోసం బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు తీర్చలేక పోవడంచేత, బ్యాంకులు రైతుల వ్యవసాయ పొలాలను, క్షేత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. అమెరికాలో అప్పుడప్పుడే కార్పొరేట్ వ్యవసాయం ప్రవేశిస్తోంది. స్థానిక పత్రికల్లో కాలిఫోర్నియా పండ్లతోటల్లో, వ్యవసాయ క్షేత్రాలలో గిట్టుబాటు అయ్యే కూలీ పనులున్నాయని ప్రకటనలు చూచి, కుటుంబాలకు కుటుంబాలే ఆ రాష్ట్రానికి వలసపోతారు.
జాతీయ రహదారి నంబరు 66 మీద మోటారు వాహనాలలో వేలమంది కూలీలుగా మారిన రైతుల కుటుంబాలు కాలిఫోర్నియా చేరే సమయానికి అక్కడి కార్పొరేట్ పండ్ల తోటల యజమానులు కూలీ రేట్లు పూర్తిగా తగ్గించి వేస్తారు. రైతులు ఆ సంకట పరిస్థితుల్లో మళ్ళీ స్వస్థలాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. స్వచ్ఛంద సంస్థలు, ఫెడరల్ ప్రభుత్వం గంజికేంద్రాలు, వలస కార్మికులు తలదాచుకోడానికి తాత్కాలిక షెల్టర్‌లు నెలకొల్పి ఆదుకొంటాయి.
ఈ చరిత్రను, ప్రజల అనుభవాలను, సంఘటనలను స్టెయిన్ బెక్ నవలగా చిత్రించాడు. రైతులతో చేసిన వ్యక్తిగత ఇంటర్వూలు, తాను విన్న విషాద గాథలు, ఈ రచనను వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటట్లు చేసింది.
కథ సారాంశం
[మార్చు]టామ్ జోడ్ కుటుంబం పొట్ట చేతబట్టుకొని ఓక్లహామా రాష్ట్రానికి బతుకుదెరువు కోసం వెళ్ళడమే నవలలోని కథ. టామ్ జోడ్ ఆత్మరక్షణలో హత్యానేరం కింద శిక్షించబడి, పెరోల్ మీద తన ఊరికి కాలినడకన బయలుదేరుతాడు. దారిలో కేసి అనే మతప్రచారకుడుగా పనిచేసిన వ్యక్తి కలుస్తాడు. ఊరికి వెళితే ఊరంతా ఖాళీ అయి ఉంటుంది. తన కుటుంబం పెదనాయన వాళ్ళ ఊరికి వెళ్ళినట్లు తెలుసుకొని, సహచరుడితో ఆక్కడికి వెళతాడు. తన కుటుంబం కాలిఫోర్నియా ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటుంది. పాత డొక్కు సిడాన్ వాహనంలో పిల్లాపీచులతో, ముసలీముతకలతో జోడ్ కుటుంబంతో పాటు టామ్ జోడ్, అతని ప్రీస్టు మిత్రుడు కూడా బయల్దేరారు. పొట్టకూటి కోసం వెళుతున్న వలసలో మెదట్లోనే కుటుంబ పెద్ద తాతయ్య చనిపోతాడు. హైరోడ్డు పక్కనే పూడ్చిపెట్టి మిగతావాళ్ళు ప్రయాణం కొనసాగిస్తారు. హైరోడ్డు మీద వందలవేల వాహనాలు రైతు కూలీలతో సాగుతూ ఉంటాయి.
పా జోడ్(తండ్రి) నిస్సహాయంగా నిలిచినపుడు, మా జోడ్ (తల్లి) ఆ బృందాన్ని ముందుకు నడిపిస్తుంది. గర్భవతి అయిన రోజ్‌ను ఆమెభర్త విడిచి వెళ్ళిపోతాడు. నాయనమ్మ కూడా చనిపోతుంది. ఎలాగో ఈ బృదం కాలిఫోర్నియా చేరుకొంటుంది. కానీ ఎస్టేట్ల యజమానులు శ్రామికుల నిస్సహాయతను ఆసరాగా తీసుకొని కూలీరేట్లు పూర్తిగా తగ్గించి వేస్తారు. రోజ్‌కు ప్రసవమై బిడ్డ చనిపోతుంది. నిస్సహాయ పరిస్థితుల్లో కుంభవృష్టిలో ఈ కుటుంబం ఒక బేరన్లో తలదాచుకొంటుంది. అక్కడ ఒక వృద్ధుడు, అతని కుమారుడు ఉంటారు. ఆ యువకుడు పస్తులతో చావబోతూ ఉంటాడు. మా జోడ్ ప్రోత్సాహంతో రోజ్ అతడికి తన స్తన్యాన్నిచ్చి కాపాడుతుంది. రోజ్ పెదవులమీద చిత్రమైన నవ్వు మెరుస్తుంది.
కార్మికులపై జరుగుతున్న అన్యాయం, సామాజిక అసమానతలు, మానవ గౌరవం కోసం జరిగే పోరాటం నవలలో ప్రధాన అంశాలుగా నిలుస్తాయి.
ప్రధాన పాత్రలు
[మార్చు]- టామ్ జోడ్ – కథానాయకుడు.
- మా జోడ్ – కుటుంబానికి ధైర్యం, ఐక్యతను అందించే తల్లి.
- పా జోడ్ – కుటుంబ పెద్ద.
- జిమ్ కేసి – మాజీ మతబోధకుడు; సామాజిక న్యాయానికి ప్రతీక.
- రోజ్ ఆఫ్ షరోన్ – టామ్ సోదరి.
ప్రధానాంశాలు
[మార్చు]సామాజిక న్యాయం
[మార్చు]ఈ నవలలో పేద రైతులు, వలస కార్మికులు ఎదుర్కొన్న అన్యాయాన్ని స్టెయిన్‌బెక్ స్పష్టంగా చిత్రించాడు. ఆర్థిక వ్యవస్థలోని అసమానతలు సాధారణ ప్రజల జీవితాలపై చూపే ప్రభావాన్ని వివరిస్తుంది.
కుటుంబ ఐక్యత
[మార్చు]ఎన్ని కష్టాలు ఎదురైనా కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు అండగా నిలబడటం నవలలో ప్రధానాంశంగా కనిపిస్తుంది.
ఆత్మాభిమానం
[మార్చు]ఆకలి, పేదరికం, నిరాశల మధ్య కూడా మానవ గౌరవాన్ని కాపాడుకోవాలనే సంకల్పాన్ని రచయిత ప్రాధాన్యంగా చూపించాడు.
సమూహ చైతన్యం
[మార్చు]వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామూహిక సంక్షేమం ముఖ్యమనే భావన నవల అంతటా ప్రతిఫలిస్తుంది.
ప్రచురణ, స్పందన
[మార్చు]నవల ప్రచురితమైన వెంటనే విస్తృత ప్రజాదరణ పొందింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో వివాదాలకు కూడా దారితీసింది. కాలిఫోర్నియాలోని కొన్ని వర్గాలు నవలలో తమ రాష్ట్ర పరిస్థితులను ప్రతికూలంగా చిత్రించారని విమర్శించాయి.[2] అయినప్పటికీ, విమర్శకులు దీనిని అమెరికన్ సాహిత్యంలో ఒక గొప్ప సామాజిక నవలగా ప్రశంసించారు.[3]
చలనచిత్ర రూపాంతరం
[మార్చు]1940లో ఈ నవల ఆధారంగా ది గ్రేప్స్ ఆఫ్ రాత్ అనే చిత్రం రూపొందించబడింది. దీనికి జాన్ ఫోర్డ్ దర్శకత్వం వహించాడు. టామ్ జోడ్ పాత్రలో హెన్రీ ఫోండా నటించాడు. ఈ చిత్రం రెండు అకాడమీ అవార్డులతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది.
సాహిత్య ప్రాధాన్యం
[మార్చు]ది గ్రేప్స్ ఆఫ్ రాత్ అమెరికన్ సమాజంలోని ఆర్థిక అసమానతలను శక్తివంతంగా ప్రతిబింబించిన నవలగా గుర్తింపు పొందింది. ఇది అమెరికన్ విద్యాసంస్థలలో విస్తృతంగా అధ్యయనం చేయబడుతున్న సాహిత్య కృతులలో ఒకటి. సామాజిక న్యాయం, ఆత్మాభిమానం, సమానత్వం వంటి అంశాలపై చర్చలకు ఈ నవల ఇప్పటికీ ప్రేరణనిస్తుంది.
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పన్నాలాల్ పటేల్ వ్రాసిన గుజరాతీ నవల "మానవీనీ భవాయ్"కు, ఈ నవలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Grapes of Wrath, a classic for today?". BBC News. April 14, 2009. ఒరిజినల్ నుండి December 29, 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: August 26, 2013.
- ↑ Cordyack, Brian. "20th-Century American Bestsellers: John Steinbeck, The Grapes of Wrath". Graduate School of Library and Information Science, University of Illinois, Urbana-Champaign. the original నుండి May 7, 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: February 18, 2007.
- ↑ Dana, Gioia. "The Grapes of Wrath Radio Show – Transcript". The Big Read. The National Endowment for the Arts. ఒరిజినల్ నుండి July 17, 2011 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2010-09-22. Writer Richard Rodriguez discussed The Grapes of Wrath as The Great American Novel: "There hasn't been anything like this novel since it was written. And this is the great American novel that everyone keeps waiting for but it has been written now."