Jump to content

ది లాస్ట్ వీకెండ్

వికీపీడియా నుండి

ఆస్కార్ ఉత్తమ చిత్రం, కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ బహుమతిని కూడా అందుకున్న మొదటి చిత్రం ‘ది లాస్ట్ వీకెండ్’. బిల్లీ విల్డర్ దర్శకత్వంలో 1945లో వచ్చిన సినిమా. “ది లాస్ట్ వీకెండ్”. 1944 లో చార్ల్స్ ఆర్ జాక్సన్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో నిర్మించిన చిత్రం ఏడు అకాడమీ అవార్డులకు నామినేట్ అయి, ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, నటుడు, స్క్రీన్ ప్లేలకు నాలుగు అకాడమీ అవార్డులు అందుకున్న ఈ సినిమా మానవ సమాజానికి ఉపయోగపడే గొప్ప చలనచిత్రం.

మనిషి బలహీనతలు అతని జీవితాన్ని నియంత్రించకూడదు. అదే జరిగితే మనిషి పతనావస్థకు చేరుకుంటాడు. కొన్ని బలహీనతలు గొప్పగా బైటికి చెప్పుకోవచ్చు మరి కొన్ని సిగ్గుతో కప్పెటుకోవాలి. ఈ రెండో స్థాయి బలహీనతలున్న మనిషి సమాజంలో హీనాతిహీనంగా చూడబడతాడు. మద్యానికి బానిసయిన వ్యక్తి సమాజంలో హీనమైన స్థాయికి నెట్టివేయబడతాడు. సారాయం వల్ల బాగు పడిన వారి కథల కన్నా నాశనం అయినవారి కథలె ఎక్కువ. ఆ వ్యసనంతో వినాశక స్థితికి చేరువైన మనిషి కథ “ది లాస్ట్ వీకెండ్.”

గురువారం మధ్యాహ్నం న్యూయార్క్ లో ఉండే డాన్ బిర్నామ్ అనే ముప్పై రెండేళ్ళ యువకుడు వారాంతపు సెలవులకు తన సోదరుడు విక్ తో పాటు ఊరికి వెళ్ళడం కోసం బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. డాన్ అప్పుడే మద్యం వల్ల సంక్రమించే ఓ అతి క్లిష్టమైన మానసిక, శారీరికస్థితి నుండి బైట పడివుంటాడు. విక్ అతనికి డబ్బు అందకుండా, ఎవరూ అతనికి సారా తాగించకుండా జాగ్రత్త తీసుకుంటూ తనతో డాన్ ని ఊరికి తీసుకెళ్లాలని అతనికి కావలి కాస్తూ ఉంటాడు. డాన్ ప్రేయసి హెలన్ వారిని కలవాలని వస్తుంది. డాన్ కు కొన్ని బహుమతులు ఇచ్చి తాను నాటకం చూడడానికి వెళుతున్నానని, తన దగ్గర రెండు టికెట్లున్నాయని చెబుతుంది. డాన్ కిటికీ అవతల తాడు కట్టి సారా బాటిల్ దాచుకుంటాడు. తమ్ముడి దృష్టి కాస్త పక్కకు మల్లితే ఆ మందు తీసుకుని సూట్ కేసులో భద్ర పరుచుకోవాలన్నది అతని ప్రయత్నం. విక్ అతన్ని ఒంటరిగా వదలకపోవడంతో హెలన్ తో అతన్ని నాటకానికి వెళ్ళమని, తరువాత ట్రైన్ కు తాము ఊరు వెళ్ళవచ్చని చెప్తాడు డాన్. విక్ డాన్ ని నమ్మడు. కాని అతన్ని మరింత కట్టడి చేయడం మంచిది కాదని,హెలన్ తో కలిసి నాటకం చూడడానికి అయిష్టంగానే వెళతాడు. అయితే వెళ్ళబోయే ముందు డాన్ దాచుకున్న సీసాను కనిపెట్టి ఆ ద్రవం పారబోసి, ఇక ఇంట్లో మందు లేదని నిశ్చింతగా వెళ్లిపోతాడు విక్. విక్ వెళ్ళాక డాన్ ఇల్లంతా వెతుకుతాడు. అతనికి డబ్బులుకాని, సారాకాని దొరకవు. మందు లేక అల్లాడుతున్న డాన్ కి పని మనిషి జీతం కోసం ఇంటికి రావడంతో కొత్త ఆలోచన వస్తుంది. ఆమెను అడిగి విక్ ఇంట్లో జీతం కోసం దాచిపెట్టిన డబ్బును కనిపెట్టి తీసుకుంటాడు. కాని ఆ డబ్బు ఆమెకి ఇవ్వకుండా దానితో మార్కెట్ కు వెళ్లి రెండు ఫుల్ బాటిల్ళు కొని, తానెప్పుడూ వెళ్ళే బార్ కి వెళ్లి తాగుతూ, ట్రైన్ సంగతి మర్చిపోతాడు. అతను ఇంటికి వెళ్ళేసరికి విక్ కోపంతో ఒంటరిగా ఊరికి వెళ్లిపోతూ ఉంటాడు. హెలెన్ అతన్ని ఆపాలని చూస్తుంది. విక్ అప్పటికే డాన్ ప్రవర్తనతో విసిగి ఇక అతనితో పడలేనని ఒక్కడే రైలు ఎక్కేస్తాడు. హెలెన్ డాన్ పై ప్రేమ చావక, అతనికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. డాన్ ఆమెను తప్పించుకుని ప్లాట్ కు చేరతాడు. తాను తెచ్చిన బాటిల్ ఒకటి దాచి పెట్టి మరొకటి ఖాళి అయ్యే దాక తాగుతూ రాత్రంతా గడెపేస్తాడు. మరుసటి రోజు, అంటే శుక్రవారం ప్రొద్దున తీవ్రమైన హాంగోవర్ తో నిద్ర లేచి, డాన్ అలవాటైన బారుకు వెళతాడు. అప్పుడే లోపలికి వహ్చిన యజమాని నాట్ అతన్ని చూసి రాత్రి హెలన్ వచ్చి డాన్ గురించి వాకబు చేసిందని, ఆమె లాంటి ఉత్తమ స్త్రీ అతనితో ఎలా స్నేహం చేస్తుందని అడుగుతాడు. పైగా ఆమె సున్నితంగా అతని గురించి అడిగిన విధానంలో అతనిపై ఉన్న గౌరవాన్ని కూడా నాట్ గుర్తిస్తాడు. అంతటి గౌరవానికి డాన్ అర్హుడు కాడని అతని నమ్మకం. ప్రొద్దున తల నెప్పితో ఆల్కహాల్ కోసం అల్లాడుతున్న డాన్ ను చూస్తే ప్రేక్షకులకు జుగుప్స కలుగుతుంది. అంతే హీనంగా డాన్ ని చూస్తూ ఆ మందుకు బానిస అయిన అతని అవస్థను గమనిస్తూ నాట్ డాన్ కు కావలసిన సారా పోస్తాడు. కాని డాన్ ఒక్క పెగ్ తో ఆపె రకం కాదు. ఒకటి తరువాత ఒకటిగా తాగుతూ తన గతాన్ని నాట్ కు వినిపిస్తాడు.

కొన్నేళ్ళ క్రితం డాన్ నాటకానికి వెళతాడు. నాటకంలో పాత్రలు మద్యం తాగే దృశ్యాన్ని చూస్తూ అతనికి తాను విప్పిన కోటు జేబులో బాటిల్ గుర్తుకు వస్తుంది. దానితో ఆగలేక నాటకం మధ్యలోనే బైటకు వచ్చి హాలు మొదట్లో అందరి కోట్లను, హాట్లను జమ చేసుకున్న గది ముందు నిలబడి తనకిచ్చిన చీటి ఇచ్చి తన కొటు తీసుకుంటాడు. కాని అతని కోటు బదులు మరొక స్త్రీ కోటుని అతనికిస్తాడు కోటులను జమ చేసుకున్న వ్యక్తి. అది తన కోటు కాదని, తన కోటు జేబులో తనకు కావలసిన వస్తువు ఉందని అది తనకు అవసరం అని చెప్తాడు డాన్. చీటీలు మారుపడ్డాయని, అందరూ వచ్చేదాకా డాన్ వేచి చూడవల్సిందే అని లేదా, రేపు వచ్చి కోటు తీసుకెళ్లమని చెప్తాడు ఆ పెద్దాయన. డాన్ కి ఆ బాటిల్ కావాలి. మందుకు బానిస అతను. లోపల నాటకం కోసం వెళ్లకుండా అక్కడే మెట్ల మీదే కూర్చుండిపోతాడు డాన్.

డాన్ చదువుకునే రోజుల్లో గొప్ప సృజనాత్మకత ప్రదర్శించేవాడు. అతను రాసిన కథలను స్నేహితులు ఇష్టంగా చదివేవాళ్ళు. దానితో తాను రచయిత కావాలని చదువు మానేస్తాడు. కొడుకులోని తపన గమనించిన తల్లి డాన్ కోసం ఓ టైప్ రైటర్ కొంటుంది. కథకు ఆలోచనలు రావట్లేదని మెల్లిగా మందుకు అలవాటు పడతాడు డాన్. అది అతన్ని పూర్తిగా లోబర్చుకుంటుంది. ఇక రాయడం పక్కన పెట్టి మందుతో రాత్రి పగలు మునిగి తేలుతుంటాడు. అతనిలోని ప్రతిభను నమ్మిన తమ్ముడు విక్ అన్న ఖర్చులు భరిస్తూ ఏదో రోజు అన్న మారతాడని ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడు.

అలాంటి సమయంలో ఇలా నాటకం కోసం వచ్చి స్టేజి మెట్లపై తన చేతికొచ్చిన కోటు యజమానురాలి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు డాన్. నాటకం అయిపోవడంతో అందరూ బైటికి వస్తారు. చివరకు తన కోటు హెలన్ చేతిలో ఉండగా చూస్తాడు డాన్. దాన్ని అసహనంగా లాక్కుంటాడు. అలా మొదటి సారి ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. డాన్ అందగాడు, మంచి మాటకారి. అతన్ని చూసి ఇష్టపడుతుంది హెలెన్. తాను ఓ పార్టీకి వెళుతున్నానని వస్తె డాన్ ను కూడా తీసుకు వెళతానని అంటుంది. కాని డాన్ తాను మరో చోటుకు వెళ్లలని చెప్తాడు. కోటు జేబులో ఉన్న మందు సీసా క్రింద పడి పగిలిపోతుంది. అది హెలెన్ చూస్తుంది. అది తనది కాదని, ఓ మిత్రుని కోసం తీసుకు వెళుతున్నానని బుకాయిస్తాడు. అతనిలోని అ తపన తగ్గదు. అతనికిప్పుడు అల్కహాల్ కావాలి. అందుకని హెలెన్ వెళ్తున్న పార్టీ ఎలాంటిదని అడుగుతాడు డాన్. కాక్టెయిల్ పార్టి అని చెబుతుంది ఆమె. సంతోషంతో ఆమెతో పార్టీకి వెళతాడు డాన్. కాని అక్కడ హెలెన్ ముందు తాగలేకపోతాడు. అందరూ తాగుతున్నా ఆశ్చర్యంగా అందరిని చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. అంత నిబ్బరంగా తాగకుండా నియంత్రణలో ఉండడం అతను ఎరుగడు. హెలెన్ ని తరచు కలుస్తూ ఉంటాడు. అతను క్రమంగా వ్యననానికి దూరం జరుగుతూ ఉంటాడు. హెలెన్ అతన్ని కలవాడనికి తన తల్లి తండ్రులను ఆ ఊరు రప్పిస్తుంది. వాళ్ళను కలవడానికి ముందుగా హోటల్ చేరిన డాన్ ఆ ముసలి తల్లి తండ్రులు కూతురి భవిష్యత్తు గురించి భయపడుతూ మాట్లాడుకోవడాన్ని వింటాడు. అతనికి తన స్థితి అప్పుడు గుర్తుకు వస్తుంది. వాళ్ళని కలవకుండా ఇంటికి చేరి మళ్ళీ తాగుతూ రాత్రంతా గడిపేస్తాడు. అదేంటి అని ప్రశ్నించిన విక్ తో తాను హెలెన్ ని పెళ్ళి చేసుకోలేనని చెబుతాడు. ఇంతలో అతన్ని వెతుక్కుంటూ హెలెన్ ఇంటికే వస్తుంది. డాన్ ని ఆ స్థితిలో దాచిపెట్టి అతను ఉద్యోగం కోసం బైటికి వెళ్ళాడని హెలెన్ కి సర్ధి చెప్పబోతాడు విక్. పైగా అక్కడ ఉన్న మందు తానే తాగుతున్నానని బుకాయించబోతాడు. తన కోసం తమ్ముడు చెప్తున్న అబద్దం డాన్ భరించలేకపోతాడు. డాన్ గది లోపలి నుండి బైటికి వచ్చి హెలెన్ కు తాను సారాయానికి బానిసనని, అప్పటి దాకా రాయాలనుకుంటూనే ఏమీ రాయలేక ఓడిపోయిన బలహీనమనస్కుడినని, తనలో రచయితను ఎప్పుడూ తాగుబోతు ఓడిస్తూనే ఉన్నాడని చెప్పి, హెలెన్ తనను మర్చిపోవడం మంచిదని సూచిస్తాడు. హెలెన్ మాత్రం తాను అతని బలహీతనతో పోరాడుతానని, అతనికి అండగా ఉండి అతన్ని ఆ అలవాటు నుండి దూరం చేస్తానని అంటుంది. ఇది జరిగి మూడు సంవత్సరాలయినా హెలెన్ తన ప్రయత్నాలు మానదు. అతన్ని వదిలి వెళ్లదు. తన కథ నాట్ కి చెప్పి ఇంటికి వెళ్లి మళ్ళీ నవల రాయాలని కూర్చుంటాడు డాన్. కాని అతనికి ఇంట్లో తానో బాటిల్ దాచానన్నది గుర్తుకు వస్తుంది. దానితో రాయడం మర్చిపోయి బాటిల్ ని వెతుక్కోవడం మొదలెడతాడు. అదెక్కడ దాచిపెట్టాడొ గుర్తుకురాదు, మద్యం తాగాలన్న కోరిక ఎక్కువవుతుంది. నైట్ క్లబ్ కు వెళ్లి కావల్సినంత తాగి, బిల్ కట్టడానికి పూర్తిగా డబ్బు లేకపోతే పక్కనే ఉన్న అమ్మాయి పర్సు దొంగలిస్తాడు. అది కనుక్కుని అతన్ని బైటికి గెంటేస్తారు. అవమానంతో ఇంటికి చేరిన తరువాత అతనికి ఇంట్లో దాచిన మందు దొరుకుతుంది. దాన్ని తాగుతూ ఉండిపోతాడు.

శనివారం ప్రొద్దున విపరీతమైన తలనొప్పితో నిద్రలేస్తాడు డాన్. తన టైప్ రేటర్ అమ్మేసి, లేదా తాకట్టు పెట్టాలని తాకట్టు దుకణానికి వెళతాడు. కాని ఏదో పండగ కారణంగా దుకాణాలు మూసేస్తారు. ఓపిక లేకపోయినా ఒకటి తరువాత మరొక దుకాణానికి వెతుక్కుంటూ వెళతాడు. ఏవీ తెరచి ఉండవు, మందులేక చచ్చిపోతానని అనిపిస్తుంది అతనికి. నాట్ ని మందు కోసం అడుక్కుంటాడు. అతని స్థితిని చూసి అసహ్యంతో ఓ పెగ్ పోస్తాడు నాట్. అంతకన్నా ఇచ్చేది లేదని వెళ్లిపొమ్మని చీదరించుకుంటాడు. నాట్ బార్ కి ఓ వేశ్య వస్తూ ఉంటుంది. ఆమెకు డాన్ అంటే ఇష్టం. కాని డాన్ ఆమెను పట్టించుకోడు. పైగా నీ దగ్గరకు వస్తానని ఆమెకు ఆశ కల్పించి, ఆమె వేరే విటులని కాదని చెప్పాక ఆమె దగ్గరకు వెళ్లడు. అలా ఆమెను ఏడిపిస్తాడు. కాని ఇప్పుడు డబ్బుకోసం ఆమె తలుపు తడతాడు. ఆమె నాట్ ని చూసి కోపంతో తిడుతుంది. ఆమెకు ముద్దు పెట్టి తనకు డబ్బు కావాలని అడుగుతాడు. తనను తాను సారాకోసం వేశ్యకు అమ్ముకోవడానికి సిద్దపడిన డాన్ అసహాయ స్థితి, ప్రేక్షకుల మనసులని అసహ్యంతో నింపేస్తుంది. ఈ సన్నివేశం చూసి భరించలేము.

ఆ వేశ్య డాన్ స్థితికి జాలి పడుతుంది. అతనికి కొంత డబ్బు ఇస్తుంది. అది తీసుకుని మెట్లు దిగుతున్న డాన్ తూలి క్రింద పడిపోతాడు. ఆదివారం ఉదయం డాన్ హాస్పిటల్ లో ఆల్కాహాలిక్ వార్డులో కళ్ళు తెరుస్తాడు. అక్కడ మగ నర్సు బిమ్ అతని స్థితిని చూసి అతనివ్యాధి పెద్ద రోగమని ఆ నిముషంలో బైటకి పంపితే మళ్ళీ తిరిగి అదే వార్డుకు మరల మరల వస్తాడని, అతనికి ట్రీట్మెంట్ అవసరమని చెప్తాడు. కాని డాన్ వినిపించుకోడు. అర్ధరాత్రి తోటి పేషంట్ల అరుపులను అతను భరించలేకపోతాడు. పక్క బెడ్ పేషంట్ చేసే గొడవను చూస్తూ అతనితో డాక్టర్లు బిజీగా ఉన్నప్పుడు, అదను చూసి డాక్టరు కోటు దొంగలించి హాస్పిటల్ నుంచి పారిపోతాడు డాన్. సోమవారం ప్రొద్దున బార్ ఓనర్ ను బెదిరించి బలవంతంగా ఓ బాటిల్ తస్కరించి ఇంటికి చేరి తాగుతూ ఉండిపోతాడు. హాస్పిటల్ లో నర్స్ చెప్పినట్లుగానే డెలిరియమ్ స్థితికి చేరుకుంటాడు. తన చుట్టు గుడ్లబూబలు, ఎలుకలు కిచకిచలాడుతున్నట్లు ఒకదానినొకటి తిని రక్తాలు కారుతున్నట్లు అతనికి దృశ్యాలు కనిపిస్తాయి. దీనితో విపరీతమైన భయానికి గురయి అరవడం మొదలెడతాడు, ఆ అరుపులు క్రింద ఉన్న ఇంటి ఓనరుకు విపిస్తాయి. ఆమె హెలెన్ కు ఫోన్ చేసి విషయం చెబుతుంది. హెలెన్ ప్రతి రోజు ఆ ఇంటి ముందు డాన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఫోన్ చేస్తూనే ఉంటుంది. కాని డాన్ ఆమెను తప్పించుకు తిరుగుతుంటాడు. ఫోన్లు ఎత్తడు. ఇంటి ఓనర్ చెప్పడంతో ఆమె పరుగున డాన్ ఇంటికి వస్తుంది. మారు చెవితో తలుపు తెరిపించి లోపలకు వెళుతుంది. ఇల్లు సర్ది అతనికి పరిచర్యలు చెసి నిద్రపుచ్చుతుంది. ఆ రాత్రి అక్కడే ఉండిపోతుంది. మంగళవారం ఉదయం నిద్రలేవగానే డాన్ హెలెన్ కోట్ తీసుకుని తనఖా పెట్టడానికి బయలుదేరతాడు. హెలెన్ అతన్ని వెంబడిస్తుంది. కాని ఆ దుకాణంలో అతను తన కోటు ఇచ్చి అంతకు ముందు తాకట్టు పెట్టిన తుపాకిని తీసుకుని వెళ్లాడని తెలిసి, తిరిగి ఇంటికి పరుగెత్తుకుని వస్తుంది. డాన్ తమ్ముడుకి ఉత్తరం రాసి ప్రాణం తీసుకోవాలనుకుంటుండగా హెలెన్ గదిలోకి వస్తుంది. గొప్ప సంయమనం పాటిస్తూ అతనితో మాట్లాడడం మొదలెడుతుంది. ఇక్కడ ఆ ఇద్దరి మధ్య జరిగే సంభాషణను ఎంతో సహజంగా రాసారు రచయిత. హెలెన్ పాత్రను ఎంతో ఉదాత్తంగా మారుస్తుంది. అతన్ని ఆపడానికి గ్లాసులో ఉన్న కొంత మందు ఇచ్చి తాగమని హెలెన్ డాన్ ను బతిమాలుతుంది. ఇదేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్న డాన్ తో నువ్వు తాగి పడి ఉన్న బతికే ఉన్నావనుకోవడం నువ్వు ప్రాణాలతో లేవనుకోవడం కన్నా బావుంటుంది అని జవాబిస్తుంది హెలెన్. డాన్ తాను జీవించి ఉండి ప్రయోజనం లేదని అంటుండగానే నాట్ వచ్చి డాన్ పోగొట్టుకున్న టైప్ రైటర్ ను తిరిగి ఇచ్చి వెళతాడు. ఇదే సంకేతంగా చూసి జీవితాన్ని మళ్లీ మొదలెట్టమని రాయడం గురించి ఆలోచించమని అడుగుతుంది హెలెన్. ఈ గడిచిన ఐదు రోజుల్లో అతను అనుభవించిన బలహీన క్షణాలనే కథగా మార్చి రాయమని చెబుతుంది. చేతిలోని సిగరెట్టుని మిగిలి ఉన్న విస్కీలో పారేసి టైప్ రైటర్ ముందు కూర్చుంటాడు తన బలహీనతతో యుద్దం చేయడానికి సిద్దపడిన రచయిత డాన్. సినిమాలో మద్యానికి బానిస అయిన వ్యక్తి పడే బాధ, అతను ఎన్ని విధాలుగా నాశనం కాగలడో, తనను తాను దిగజార్చుకోగలడో ఒకో మెట్టు అతను మనిషిగా దిగి మృగంగా మారుతున్నప్పుడు దాన్ని హాలులో కూర్చుని చూస్తున్నవాళ్లు భరించలేరు. మనసు పెట్టి ఈ సినిమాను చూస్తే ఎవరూ మందుకు బానిస అవలేరు. దొంగతనం చేసి తన్నులు తింటున్న డాన్, బార్ ఓనర్ ని కాస్త పోయమని దేబీరించి అడుగుతున్న డాన్, తాను ఒకప్పుడు చీదరించుకున్న వేశ్యకు ముద్దు పెడుతూ డబ్బులు కావాలని బతిమాలుకుంటున్న డాన్, ఈ మూడు సన్నివేశాలు ఈ సినిమాను మర్చిపోనివ్వవు. మందు బాబులందరూ చూడాల్సిన సినిమా. ఈ సినిమా తీసిన తరువాత లిక్కర్ కంపెనీలు అన్ని కలిసి మళ్ళీ ఆంటీ లిక్కర్ గ్రూపులు ఈ సినిమా ప్రభావంతో ప్రొహిబిషన్ తీసుకు రావచ్చని పారమౌంట్ సంస్థను సినిమా రిలీజ్ చేయవద్దని బెదిరించాయట. ఫిలిం నెగిటివ్ కొని కాల్చేయాలనీ ప్రయత్నించాయట. ఈ సినిమాలోని ఆల్కాహాలిక్ వార్డ్ సీన్ నిజంగా హాస్పీటల్ లో చిత్రీకరించినదే అట. ఈ సినిమా ఒక్కదానికే ఆ హాస్పిటల్ ఆ వార్డులో చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చిందట. పైగా డాన్ పాత్రలో నటించిన రే మిలాండ్ ఈ సినిమా కోసం ఒక రాత్రంతా ఆ వార్డులో అలాంటి పేషంట్ల మధ్య గడిపాడట. మందు అనే వ్యసనంలో పడి నియంత్రణ కోల్పోతే ఏ స్థితికి మనిషి చేరతాడొ అర్ధం చేసుకోవడానికి ఈ హాస్పీటల్ సన్నివేశాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కథను ఇంత హృద్యంగా రాసిన రచయిత జీవితాంతం తన బై సెక్ష్యువాలిటి తోనూ ఆల్కాహాలిజం తోనూ యుద్దం చేస్తూనే ఉన్నాడు. అతనికి మరణం ఆత్మహత్య అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా ఆల్కాహాలిక్ గా ఆయన పడిన నరకాన్ని నవలగా రాసారు చార్ల్స్ జాక్సన్. కాన్స్ ఫెస్టివల్ మొదలయిన మొదటి సంవత్సరం గ్రాండ్ ప్రిక్స్ బహుమతి అందుకుంది “ది లాస్ట్ వీకెండ్’ అలా ఆస్కార్ ఉత్తమ చిత్రంగానూ, కాన్స్ గ్రాండ్ ప్రిక్స్ బహుమతిని కూడా అందుకున్న మొదటి చిత్రంగా ఇది చరిత్ర కెక్కింది. ఆ తరువాత ఇప్పటి దాకా మరో రెండు చిత్రాలకే ఈ గౌరవం దక్కింది. అలాగే డాన్ పాత్రలో నటించిన రే మిల్లాండ్ ఈ చిత్రంతో కేన్స్ లో నూ ఉత్తమ నటుడి పురస్కారం, గోల్డన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డు సాధించి, ఒక సినిమాతో మూడు పతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్న ఏకైక వెల్ష్ నటుడిగా చరిత్ర సృష్టించారు. ఇక హెలెన్ గా నటించిన జేన్ వైమాన్ ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ మొదటి భార్య. ఈ చిత్రం ఆమెకు ఎంతో పేరును తీసుకొచ్చింది.

మూలాలు

[మార్చు]