Jump to content

దీర్ఘ సుమంగళీ భవ

వికీపీడియా నుండి
దీర్ఘ సుమంగళీ భవ
దర్శకత్వంయస్వీ కృష్ణారెడ్డి
రచనఎస్. వి. కృష్ణారెడ్డి (కథ, స్క్రీన్ ప్లే), దివాకర్ బాబు (మాటలు)
నిర్మాతకె. అచ్చిరెడ్డి, కిషోర్ రాఠీ (సమర్పణ)
తారాగణంరాజశేఖర్,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంశరత్
కూర్పుకె. రాంగోపాల్ రెడ్డి
సంగీతంయస్వీ కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1998 డిసెంబరు 28 (1998-12-28)
భాషతెలుగు

దీర్ఘ సుమంగళీభవ ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1998లో విడుదలైన కుటుంబకథా చిత్రం. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.[1][2] పెళ్ళైన ఒక యువతి గ్లామర్ ప్రపంచం మీద వ్యామోహంతో భర్త బిడ్డలను వదిలేసి మరల తన పాత జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే కథ ఇది. దీనికి మూలకథ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డికి ఒక అనామక మహిళ రాసిన ఉత్తరం.

వాణి ఒక పదవీవిరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడి కూతురు. తండ్రి సత్యనారాయణ అలియాస్ సత్యం ఆమెను ఎంతో క్రమశిక్షణగా పెంచుతాడు. కుటుంబ సభ్యులందరూ అతని క్రమశిక్షణా విధానాల్ని, రాజీ పడని తత్వాన్ని బట్టి జేమ్స్ బాండ్ అనే మారుపేరు కూడా పెడతారు. రామారావు సత్యం స్నేహితుడి ఆఫీసులో పనిచేసే నిజాయితీయైన వ్యక్తి.

తండ్రి ఎంతో సరళమైన జీవన విధానాన్ని అలవాటు చేసినా వాణి మాత్రం ఆడంభరమైన జీవన విధానాన్ని కోరుకుంటుంది. తను పెళ్ళి చేసుకోబోయే వాడు ధనవంతుడుగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి సమయంలోనే రామారావు కారులో తిరుగుతూ కనిపిస్తాడు. మరోసారి నగల దుకాణంలో కనిపిస్తాడు. ఇవి చూసి వాణి అతన్ని ధనవంతుడిగా ఊహించుకుని అతణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. మరో వైపు రామారావు బాస్ సత్యనారాయణకి అతని గుణగణాల గురించి చెప్పి వాణికి తగిన సంబంధమని చెబుతాడు. సత్యం కూడా అందుకు అంగీకరిస్తాడు. వాణి కూడా తను నచ్చిన వ్యక్తిని పెళ్ళాడుతున్నానని ఆనందిస్తుంది. అయితే పెళ్ళి జరిగిన తర్వాత ఆమెకు తన భర్త సాధారణ ఉద్యోగి అని తెలుస్తుంది. కానీ ఎలాగోలా సర్దుకుని కాపురం చేస్తుంటుంది. వీరికి ఒక బిడ్డ కూడా పుడతాడు.

కొంతకాలానికి ఆమెకు తన కళాశాల స్నేహితుడు తారసపడి సినిమాలకు ఆర్గనైజరుగా పనిచేస్తున్నానని చెప్పి గ్లామర్ ప్రపంచం వైపు ఆకర్షితురాల్ని చేస్తాడు. ఆమె తన భర్త, కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అదంతా వదిలేసి తనతో రమ్మనీ పెళ్ళికి ముందు తాను కలలు కన్నట్టుగా ధనం, పేరు సంపాదించవచ్చనీ చెబుతాడు. ఇంట్లో చెబితే అంగీకరించరని వారికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది వాణి. ఆ సంఘటనతో కుటుంబం అవమానాల పాలవుతుంది. కానీ రామారావు మాత్రం ఆమెను తిరిగి రప్పించాలని ప్రయత్నిస్తుంటాడు, కానీ ఆమె అంగీకరించదు. వేరే దారి లేక వాణి తల్లిదండ్రుల ప్రోద్భలంతో సీత అనే మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాడు రామారావు.

కాలక్రమంలో కొత్తవాళ్ళ రాకతో సినిమా ప్రపంచంలో వాణి ప్రాభవం తగ్గుతుంది. చేతిలో పని లేకపోవడంతో, ఎవరూ తోడులేక పోవడంతో వాణి కుంగుబాటుకు లోనవుతుంది. తిరిగి తన కుటుంబం దగ్గరికి వెళదామంటే అక్కడ ఎవరికీ తాను అక్కరలేదని తెలుస్తుంది. తాను మునుపటి రోజుల్ని తలుచుకుంటూ చనిపోదామని నిశ్చయించుకుని తన జీవిత వివరాలతో ఒక లేఖ రాసి ఒక దర్శకుడికి పంపుతుంది. భర్త రామారావును కలిసి అతనికి క్షమాపణ చెప్పి అతని చేతిలోనే కన్నుమూస్తుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎస్.వి.కృష్ణారెడ్డి
  • కథ, చిత్రానువాదం: ఎస్.వి.కృష్ణారెడ్డి
  • సంగీతం: సత్తి వెంకట కృష్ణారెడ్డి
  • గీత రచయితలు: చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, సౌమ్య, నవీన్, కె.ఎస్.చిత్ర
  • నిర్మాతలు: కె.అచ్చిరెడ్డి, ఉషారాణి
  • నిర్మాణ సంస్థ: మనీషా ఫిలింస్
  • విడుదల:28:12:1998.

పాటలు

[మార్చు]
  • మా నాన్న జేమ్స్ బాండు , రచన: చంద్రబోస్, గానం. సౌమ్య
  • తాజా తాజా రోజాలన్నీ , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • నవ్వులు పువ్వులు , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె యస్ చిత్ర
  • నిదురపో నిదురపో, రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పందిరి మంచం పాడే రాగం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • సిల్వర్ జూబ్లీ వయసే నాది , రచన: చంద్రబోస్, గానం. నవీన్, సౌమ్య.

మూలాలు

[మార్చు]
  1. Admin. "Deergha Sumangali Bhava". thecinebay.com. The Cine Bay. Archived from the original on 10 ఆగస్టు 2016. Retrieved 20 July 2016.
  2. Admin. "Deergha Sumangali Bhava". naasongs.com. naasongs admin. Archived from the original on 14 జూలై 2016. Retrieved 20 July 2016.