దూస్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దూస్రా అనేది క్రికెట్ ఆటలో ఆఫ్ స్పిన్ బౌలర్ వేసే ప్రత్యేక రకమైన బంతి. పాకిస్థాన్ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ దీనిని కనిపెట్టాడు.[1] ఈ పదానికి అర్థం హిందీలో మరియు ఉర్దూలో ‘‘రెండోది లేదా మరోది’’.[2] సక్లైన్ ముస్తాక్ దూస్రాలోని మరో రకమైన బంతిని కూడా కనిపెట్టాడు. దీనికి ‘‘తీస్రా’’ అని పేరు పెట్టారు. దీని అర్థం ‘‘మూడోది’’.

అంతర్జాతీయ క్రికెట్లో అనేక మంది బౌలర్లు దూస్రాను చెప్పుకోదగిన విధంగా ఉపయోగించారు. దూస్రాను ఉపయోగించిన ఇతర పాకిస్థానీ బౌలర్లు షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్. ఈ బంతిని ఉపయోగించిన ఇతర దేశాల ఆటగాళ్ళలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండిస్, దక్షిణాఫ్రికాకు చెందిన జొహాన్ బోథా, భారతీయ ఆటగాడు హర్భజన్ సింగ్ ఉన్నారు.

చరిత్ర[మార్చు]

దూస్రాను కనుగొన్న సక్లైన్ ముస్తాక్ తాను విజయవంతం కావడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ అభివృద్ధి చెందేందుకు దోహదపడ్డాడు. దీనికంటే ముందు ఏ ఆఫ్ స్పిన్నర్ కూడా బంతిని లెగ్ సైడ్ నుంచి టర్న్ చేయలేదు.[3]

ఈ బంతికి దూస్రా అని పేరు పెట్టిన ఘనత మొయిన్ ఖాన్ కు దక్కుతుంది. ఈ పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ “దూస్రా” (మరొకటి) వేయమని సక్లైన్ ను కోరేవాడు. ఈ మ్యాచ్ లలో కామెంటేటర్ గా వ్యవహరించిన టోనీ గ్రేగ్ మ్యాచ్ తర్వాత బహుమతి ప్రదానోత్సవంలో సక్లైన్ తో చేసిన ఇంటర్వూలో ఈ ఘనత మొయిన్ ఖాన్ దే అని తేల్చాడు.[4] ఈ పదం ఇప్పుడు క్రికెట్ సంస్కృతిలో భాగమైంది. ఆఫ్ స్పిన్నర్ల ఆయుధ సంపత్తిలో ఇది భాగమైంది.

ఏదేమైనా, కొందరు మాత్రం దూస్రాను తొలుత కనిపెట్టింది సోనీ రామ్‌ధిన్ అని చెబుతారు. 1950ల్లో ఈయన వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించారు. తన బంతిని రెండు వైపులా మూవ్ చేసేవాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ లా బంతిని గ్రిప్ చేసినప్పటికీ ఇలా చేయగలిగారు.[5]

విధానం[మార్చు]

బౌలర్‌ బంతిని ఆఫ్‌ బ్రేక్‌ తరహాలోనే సాధారణ యాక్షన్‌తో అదే వేలితో బంతిని బౌల్‌ చేస్తాడు. కానీ రిస్ట్‌ను తిప్పుతాడు. దీనివల్ల చేతి వెనక భాగం బ్యాట్స్‌మెన్‌ వైపు ఉంటుంది. ఇది బంతిని వ్యతిరేక దిశలో తిప్పేందుకు ఉపకరిస్తుంది. సాధారణ ఆఫ్‌ బ్రేక్‌ కంటే ఇది భిన్నంగా స్పిన్‌ అవుతుంది. ఇది కుడి చేతి వాటం ఆటగాడికి లెగ్‌సైడ్‌ నుంచి ఆఫ్‌సైడ్‌కు తిరుగుతుంది.

ఆఫ్‌ స్పిన్నర్‌కు దూస్రా అనేది లెగ్‌ స్పిన్నర్‌కు గూగ్లీ లాంటిది. లెగ్‌స్పిన్నర్‌ యొక్క స్టాక్‌బాల్‌ ఇది. దీనితో బంతిని వ్యతిరేక దిశలో స్పిన్‌ చేయొచ్చు.

లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు (వీరి యాక్షన్‌ కూడా ఆఫ్‌ స్పిన్నర్ల తరహాలోనే ఉంటుంది) కూడా దూస్రాను బౌల్‌ చేయవచ్చు. వీరి విషయంలో బంతి ఆఫ్‌ నుంచి లెగ్‌కు తిరుగుతుంది. శ్రీలంకకు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రంగన్‌ హెరాత్‌ ఈ బంతి ద్వారానే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఎ జట్టు పర్యటన సందర్భంగా ఈ బంతిని విస్తృతంగా వాడాడు.[6] ఇంగ్లండ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ కూడా ఇంగ్లండ్‌ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఈ బంతిని బౌల్‌ చేసేవాడని సమాచారం.[7]

ఇతర బౌలర్లు[మార్చు]

ఇటీవల కాలంలో అనేక మంది ఆఫ్‌ స్పిన్నర్లు దూస్రా ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రమంగా వీరి సంఖ్య పెరుగుతోంది. రకరకాల డిగ్రీలతో ఈ బంతిని సంధించి విజయం సాధిస్తున్నారు. ఆసక్తికరంగా సక్లైన్‌ ముస్తాక్‌ మినహా ఈ బంతిని ఉపయోగించిన బౌలర్లంతా బంతిని విసురుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. (అయితే ఇందులో అధికశాతం ఆరోపణలు చెల్లలేదు). ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌, హర్భజన్‌ సింగ్‌, సయీద్‌ అజ్మల్‌, షోయబ్‌ మాలిక్‌ మరియు జొహాన్‌ బోథా ఉన్నారు. ఇందులో మరొక పద్ధతిని, వార్విక్‌షైర్‌ మాజీ బౌలర్‌ అలెక్స్‌ లౌడన్‌ ఉపయోగించారు. ఈయన బంతి వెనక మధ్యవేలిని ఉంచి, బంతిని వేసే ముందు ఫ్లిక్‌ చేసేవారు. దీంతో బంతి లెగ్‌ నుంచి ఆఫ్‌సైడ్‌కు తిరిగేది. ఈ పద్ధతిలో దూస్రా సక్సెస్‌ను ఇంకా నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే లైడన్‌ కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ 2006 జూన్‌ 24న శ్రీలంకపై ఆడాడు. ఇందులో తను ఒక్క వికెట్‌ కూడా తీసుకోలేదు. ఈ మ్యాచ్‌లో ఒక్క దూస్రా కూడా బౌల్‌ చేయలేదు. అయితే తనపై ఎలాంటి త్రోయింగ్‌ ఆరోపణలు కూడా రాలేదు. సౌత్‌ ఆస్ట్రేలియా ఆటగాడు డాన్‌కూలెన్‌ కూడా దూస్రాను బౌల్‌ చేయగలడనే పుకార్లు వినిపించారు. శ్రీలంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ కెరీర్‌ ఆరంభంలో మధ్య వేలితో బంతిని ఫ్లిక్‌ చేస్తూ దూస్రా స్టైల్‌ బంతులు వేసేవాడు.[8]

ముత్తయ్య మురళీధరన్‌[మార్చు]

2004లో ఆస్ట్రేలియాలో శ్రీలంక పర్యటించినప్పుడు ముత్తయ్య మురళీధరన్‌ దూస్రా పెద్ద వివాదమే సృష్టించింది. మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ తన అధికారిక నివేదికలో మురళీ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో మోచేయిని నిబంధనలను వ్యతిరేకంగా తిప్పుతున్నాడని రాశారు. దీంతో పెర్త్‌లోని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో మురళీకి బయోమెకానిక్స్‌ను ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో దూస్రాలు బౌలింగ్‌ చేస్తున్నప్పుడు మురళీ తన చేతిని పది డిగ్రీలకంటే ఎక్కువగా వంచుతున్నాడని తేలింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనలన ప్రకారం స్పిన్నర్లు 5 డిగ్రీల వరకూ చేతిని వంచొచ్చు. దీంతో మురళీధరన్‌ను దూస్రాలు వేయొద్దని శ్రీలంక క్రికెట్ ఆదేశించింది. 2004 నవంబరులో, ఐసీసీ మరింద పరిశోధనలు చేసింది. బౌలర్లు బంతులు విసిరే సమయంలో నిబంధనలను అతిక్రమించి చేతిని తిప్పడం గురించి పరిశీలించింది. 2005 ఆరంభంలో జరిగిని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో దీని గురించి చర్చించారు. ఏ బౌలర్‌ అయినా బంతిని వేసే సమయంలో చేతిని 15 డిగ్రీల వరకూ చేతిని వంచొచ్చు అని నిబంధనలను మార్చారు. దీంతో మురళీధరన్‌ దూస్రా మరోసారి చట్టబద్దమైన బంతిగా ఏర్పడింది.

ఫిబ్రవరి 2006లో ఆస్ట్రేలియాలో ప్రేక్షకుల అల్లరి, వరుసగా నోబాల్స్‌ ప్రకటించిన ఘటన తర్వాత మరోసారి మురళీధరన్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో పరీక్షలకు వెళ్లాడు. ఈసారి దూస్రాతో సహా మురళీ వేసే బంతులన్నీ చట్టబద్దమైనవే అని తేలింది.

హర్భజన్‌ సింగ్[మార్చు]

నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న హర్భజన్

2004లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సందర్భంగా భారత బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ శైలిపై వివాదం వచ్చింది. మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌, మైదానంలో అంపైర్లు అలీమ్‌ దార్‌, మార్క్‌ బెన్సన్‌ మరియు టీవీ అంపైర్‌ మహ్‌బూబుర్‌ రహ్మాన్‌ కలిసి నివేదిక రూపొందించారు. ఇందులో హర్భజన్‌ 10 డిగ్రీలకు మంచిన యాంగిల్‌తో ఆర్మ్‌ను ఉపయోగిస్తున్నాడని తేలింది. ఆ సమయంలో ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు డిగ్రీలకు మించకూడదు.[9]

షోయబ్‌ మాలిక్[మార్చు]

పాకిస్థానీ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్ కూడా డిసెంబరు 2004లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో దూస్రా బౌల్‌ చేసి చిక్కుల్లో పడ్డాడు. మురళీధరన్‌ తరహాలోనే మాలిక్‌కు పరీక్షలు నిర్వహించి తర్వాతి మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించారు. దూస్రా వేస్తున్నప్పుడు బంతిని విసురుతున్నారనే ఆరోపణలు వచ్చిన ఇతర క్రికెటర్ల మాదిరిగా కాకుండా షోయబ్‌ మాలిక్‌ చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్‌ కూడా. కొంతమంది విశ్లేషకులు ఒకవేళ దూస్రా వేయకుండా ఆపితే అతడు బౌలింగ్‌ ఆపి బ్యాటింగ్‌పై దృష్టి సారించడం మంచిదనే సలహా ఇచ్చారు. 2004లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన టెస్టులో మాలిక్‌ను ఆడించలేదు. అయితే దీనికి కారణం అతడి బౌలింగ్‌ వివాదం కాదు. వికెట్‌ స్వభావం దృష్ట్యా స్పిన్నర్‌ అవసరం లేదనే కారణంతో మాలిక్‌ను ఈ మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు.

2005 మేలో మాలిక్‌ తిరిగి బౌలింగ్‌కు వచ్చాడు. అయితే నవంబరు 2005లో ముల్తాన్‌లో జరిగిన టెస్టులో షబ్బీర్‌ అహ్మద్‌తో పాటు మాలిక్‌ కూడా దూస్రాలు వేశాడనే ఆరోపణలు వచ్చాయి.

2006 మేలో మాలిక్‌ మోచేతికి శస్రృచికిత్స చేయించుకున్నాడు. తనతో పాటు పాకిస్థాన్‌ బోర్డు కూడా 2003లో జరిగిన రోడ్‌ ప్రమాదం కారణంగా మాలిక్‌ యాక్షన్‌ వివాదాస్పదంగా మారిందని వాదించినా, ఉపయోగం లేకపోయింది. మాలిక్‌ 2006 జూన్‌లో తిరిగి బౌలింగ్‌కు వచ్చినా, అప్పటి నుంచి దూస్రాను బౌల్‌ చేయలేదు.[10]

జొహాన్‌ బోథా[మార్చు]

దక్షిణాఫ్రికా బౌలర్‌ జొహాన్‌ బోథా కూడా 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో దూస్రా బౌల్‌ చేసి వివాదాస్పదుడయ్యాడు. అది బోథాకు తొలి అంతర్జాతీయ టెస్టు. అందులో రెండు వికెట్లు తీసుకున్నాడు. బోథా బౌలింగ్‌ చట్టవ్యతిరేకమని తేల్చి అతడిపై నిషేధం విధించారు. అయితే ఈ నిషేధాన్ని నవంబరు 2006లో ఎత్తివేశారు.[11] ఏదేమైనా, 2009 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ తర్వాత తన బౌలింగ్‌ను పున:సమీక్షించుకునే అవకాశం ఇచ్చారు.[12] 2009 మేలో దూస్రా మినహా అన్ని రకాల బంతులు వేసేందుకు అతడిని అనుమతి ఇచ్చారు. దూస్రా వేస్తున్న సమయంలో అతడు 15 డిగ్రీల నిబంధనను అతిక్రమించడమే దీనికి కారణం.

ఆస్ట్రేలియాలో దూస్రా నేర్పడంపై నిషేధం[మార్చు]

2009 జూలైలో ఆస్ట్రేలియాలో, క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో జరిగిన స్పిన్‌ సమ్మిట్‌లో, యువ స్పిన్నర్లకు దూస్రా నేర్పకూడదని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు షేన్‌ వార్న్‌, స్టూవర్ట్‌ మెక్‌గిల్‌, జిమ్‌ హిగ్స్‌, గెవిన్‌ రాబర్ట్‌సన్‌, టెర్రీ జెన్నర్‌, పీటర్‌ ఫిలాప్ట్‌, ఆష్లే మాలెట్‌. వీరి అభిప్రాయం ప్రకారం దూస్రాను చట్టబద్దంగా బౌల్‌ చేయడానికి వీల్లేదు. ఐసీసీ అన్ని రకాల చకింగ్‌లను అనుమతిస్తే తప్ప ఆస్ట్రేలియాలో దీనిని నేర్పకూడదని ప్రతిపాదించారు.

ఒక ఇంటర్వ్యూలో విన్సెంట్‌ బార్నెస్‌ వాదించిన[13] దాని ప్రకారం, ఐసీసీ బయో మెకానిస్ట్ మరియు యుడబ్ల్యుఎ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఇలియట్‌ స్పిన్నర్ల వేళ్ల కదలికల గురించి ఆసక్తికరమైన అంశాలను కనుగొన్నారు. ఉపఖండంలోని చాలా మంది బౌలర్లు దూస్రాను చట్టబద్దంగా బౌలింగ్‌ చేయగలరని, కాకేసియన్‌ బౌలర్లు ఇలా చేయలేరని ఆయన చెప్పారు అని తెలిపారు.

ఇదిలా ఉండగా, జాసన్‌ క్రెజా చట్టబద్దమైన దూస్రాను ఉస్మాన్‌ ఖ్వాజాకు ఫస్ట్‌క్లాస్‌ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా బౌలింగ్‌ చేశాడు.[14]

తీస్రా[మార్చు]

దూస్రాను కనుగొన్న సక్లైన్ ముస్తాక్ 2004లో తీస్రా అని పిలువబడే కొత్త బంతిని అభివృద్ధి చేశాడు. ఈ బంతి ఆఫ్ స్పిన్నర్ లా కనిపించే ఒక టాప్ స్పిన్నర్.[15] ఈ బంతిని అతడు ఐసీఎల్ మ్యాచ్ లలో ఉపయోగించాల్సింది.

సూచనలు[మార్చు]

 1. ఐర్లాండ్ కు సంతకం చేసిన సక్లైన్ క్రిక్ఇన్ఫో.కామ్ ఏప్రిల్ 7, 2007న సేకరించబడింది.
 2. దూస్రా తేడా కావచ్చు – క్రికెట్ – స్పోర్ట్ – దిఏజ్.కామ్.ఏయూ
 3. సక్లైన్ ముస్తాక్ – ప్లేయర్ ప్రొఫైల్ : క్రిక్ఇన్పో.కామ్ 26 ఏప్రిల్ 2007న సేకరించబడింది.
 4. పదాన్ని మొయిన్ ఖాన్ మొదలుపెట్టాడు
 5. సోనీ రామ్ దిన్ దూస్రాని ప్రవేశపెట్టారు
 6. రంగన హెరాత్. క్రిక్ ఇన్ఫో.కామ్ 2009-06-15న పునరుద్ధరించబడింది.
 7. టైమ్స్ ఆన్ లైన్ : ది బిగ్ ఇంటర్వూ : మాంటీ పనేసర్
 8. అజంతా మెండిస్ ఫింగర్ ఫ్లిక్ దూస్రా
 9. క్రిక్ఇన్ఫో : హర్భజన్ కు బౌలింగ్ చేసేందుకు అనుమతి
 10. క్రిక్ ఇన్ఫో : షోయబ్ మాలిక్
 11. క్రిక్ ఇన్ఫో : బోథా యాక్షన్ కు అనుమతి ఇచ్చిన ఐసీసీ
 12. బోథా వివాదాస్పద యాక్షన్ తో బౌలింగ్ చేస్తున్నాడనే నివేదిక
 13. దూస్రా తర్వాత జీవితం స్పెషల్స్ క్రిక్ ఇన్ఫో మ్యాగజైన్ క్రిక్ఇన్ఫో.కామ్
 14. ఖ్వాజాకు లీగల్ దూస్రాను బౌల్ చేసిన క్రెజా
 15. తీస్రా’ను అభివృద్ధి చేస్తున్న సక్లైన్
"https://te.wikipedia.org/w/index.php?title=దూస్రా&oldid=2203424" నుండి వెలికితీశారు