Jump to content

దేకులి ధామ్

వికీపీడియా నుండి
దేకులి ధామ్
भुवनेश्वर नाथ महादेव मंदिर
మతం
అనుబంధంహిందూ మతం
జిల్లాశివ్‌హర్ జిల్లా
Regionమిథిల ప్రాంతం
దైవంశివుడు
ప్రదేశం
ప్రదేశందేకులి
రాష్ట్రంబీహార్
దేశంభారతదేశం
పటం
దేకులి ధామ్ యొక్క ఇంటరాక్టివ్ మ్యాప్
నిర్దేశాంకాలు26°30′44″N 85°20′48″E / 26.5122570°N 85.3465947°E / 26.5122570; 85.3465947
వాస్తుశిల్పం
స్థాపితంద్వాపర యుగం

దేకులి ధామ్ (మైథిలీ: देकुली धाम) బీహార్ రాష్ట్రం మిథిల ప్రాంతం లోని శివహర్ జిల్లా లో గల ఒక హిందూ తీర్థం. పురాణాల ప్రకారం ఇది ఇతిహాసాలు మహాభారతం, రామాయణం తో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. దేకులి ధామ్ ప్రాంగణంలో బాబా భువనేశ్వర్ నాథ్ మహాదేవ్ మందిరంగా పిలువబడే ఒక ప్రసిద్ధ శివాలయం ఉంది.[1][2][3][4] దేకులి ధామ్ ప్రాంగణాన్ని హిందూ తీర్థయాత్ర పర్యాటక కేంద్రంగా బీహార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఆలయ సముదాయ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించింది.[5] దేకులి ధామ్ ఒక పవిత్ర ప్రదేశం, ఈ ప్రాంతంలోని హిందూ భక్తులకు విశ్వాస కేంద్రం.

వివరణ

[మార్చు]

పొరుగు దేశం నేపాల్, సీతామఢీ జిల్లా, చంపారణ్ జిల్లా, శివహర్ జిల్లా నుండి భక్తులు ఏడాది పొడవునా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం జాతీయ రహదారి 104 ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. దేకులి ధామ్ ప్రాంగణంలో వివిధ హిందూ దేవతల ఆలయాలు అనేకం ఉన్నాయి. ప్రాంగణంలో ఉన్న బాబా భువనేశ్వర్ నాథ్ మహాదేవ్ మందిరం ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో చాలా ప్రాచీనమైనది. ఆలయ గోడల మందం సుమారు ముప్పై అంగుళాలు ఉంటుంది. ఆలయ గర్భగుడి సుమారు పదిహేను అడుగుల దిగువన ఉంటుంది, ఇక్కడికి మెట్లు నిర్మించారు.

శివాలయానికి ఎడమ, కుడి వైపులా వరుసగా పార్వతీ దేవి, కాలభైరవ స్వామి ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా, సముదాయం ఆగ్నేయ మూలలో మహావీర్ హనుమాన్ మందిరం ఉంది.

మహాశివరాత్రి, శ్రావణ పౌర్ణమి పండుగల సమయంలో బాబా భువనేశ్వర్ నాథ్ మహాదేవ్ మందిరం శివలింగం పై పవిత్రమైన జలాభిషేకం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి బారులు తీరుతారు. భక్తులు దుబ్బాఘాట్ వద్ద బాగ్మతి నది నుండి పవిత్ర జలాన్ని తీసుకుని దేకులి ధామ్ శివలింగంపై జలాభిషేకం చేస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆలయ ప్రాంగణంలో శ్రావణి మేళా అని పిలువబడే ప్రసిద్ధ మతపరమైన జాతర జరుగుతుంది.[6] అదేవిధంగా కార్తీక పౌర్ణమి స్నానాల పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ దేవతలను పూజించడానికి వస్తారు.[7]

చరిత్ర

[మార్చు]

1956లో ప్రచురించబడిన ఇంగ్లీష్ గెజిట్ ప్రకారం నేపాల్ పశుపతినాథ్, భారతదేశం హరిహర్ క్షేత్రం మధ్య దేకులి ధామ్ ఉంది. ఈ తీర్థం ప్రాంగణంలో బాబా భువనేశ్వర్ నాథ్ మహాదేవ్ మందిరం అని పిలువబడే శివాలయం ఉంది. గ్రామస్తుల కథనం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ చౌకీదారీ రసీదుపై కూడా ఆలయ ప్రస్తావన ఉంది. 1962లో ఛతౌని గ్రామానికి చెందిన ప్రేమ్ భిక్షు అనే సాధువు ఆలయం సమీపంలోని చెరువును తవ్వించాడు. తవ్వకాల్లో ద్వాపర యుగం నాటి పలు అరుదైన లోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ విగ్రహాలను ఆలయం సమీపంలోని ఒక పురాతన మౌల్ చెట్టు వద్ద ప్రతిష్టించారు. ఒకే రాయిని చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారు. కలకత్తా హైకోర్టు తీర్పు ప్రకారం ఈ ఆలయాన్ని ప్రాచీన ఆలయంగా పరిగణించారు.

స్థల పురాణం

[మార్చు]

దేకులి ధామ్ వద్ద ఒక పెద్ద చెరువు సమీపంలో సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక మట్టిదిబ్బ ఉంది, పురాణాల ప్రకారం ఇది ఇతిహాసం మహాభారతంలోని ద్రుపద మహారాజు కోట ఉన్న ప్రదేశంగా నమ్ముతారు. అదేవిధంగా మరొక పురాణం ప్రకారం గతంలో ఆలయ గర్భగుడిలో ఒక సొరంగం ఉండేదని, మహాభారతం లోని లక్క ఇంటి దహనం నుండి ఐదుగురు పాండవులు ఈ సొరంగం గుండా తప్పించుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారని చెబుతారు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "देकुली शिव मंदिर | शिवहर जिला, बिहार सरकार | भारत" (in హిందీ). Retrieved 2024-12-06.
  2. ↑ "द्रुपदकालीन है देकुली धाम का मंदिर -". Jagran (in హిందీ). Retrieved 2024-12-06.
  3. ↑ "देकुली धाम: बाबा भुवनेश्वर को किया जलार्पण". Hindustan.
  4. ↑ "जलाभिषेक को देकुली धाम में उमड़े श्रद्धालु". Prabhat Khabar (in హిందీ). 2024-05-10. Retrieved 2024-12-06.
  5. ↑ "ancient Dekuli Dham temple will be beautified". Prabhat Khabar (in హిందీ). 2023-11-23. Retrieved 2025-04-17.
  6. ↑ "देकुली धाम में आज उमड़ेगा आस्था का जनसैलाब, श्रावणी मेले का हुआ उद्घाटन - Mass of faith will gather in Dekuli Dham today, Shravani fair inaugurated - Bihar Sheohar General News". Jagran (in హిందీ). Retrieved 2025-04-17.
  7. ↑ "कार्तिक पूर्णिमा:शिवहर के प्रसिद्ध देकुली धाम स्थित बाबा भुवनेश्वर नाथ मंदिर में पूजा के लिए भक्तों की उमड़ी भीड़". Dainik Bhaskar.