దేవదాస్ గాంధీ
దేవదాస్ గాంధీ | |
---|---|
1920లలో దేవదాస్ గాంధీ | |
జననం | దేవదాస్ మోహన్‌దాస్ గాంధీ 22 మే 1900 |
మరణం | 3 ఆగస్టు 1957 | (వయస్సు 57)
మరణ కారణం | కాలేయ వ్యాధి |
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వాములు | లక్ష్మీ గాంధీ[1][2] |
పిల్లలు |
|
తల్లిదండ్రులు | |
బంధువులు |
|
దేవదాస్ మోహన్‌దాస్ గాంధీ (22 మే 1900 – 3 ఆగష్టు 1957) మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, కస్తూరిబాయి గాంధీ దంపతుల నాలుగవ, చివరి సంతానము. ఇతడు దక్షిణ ఆఫ్రికా దేశంలోని డర్బన్‌లో జన్మించాడు[3]. ఇతడు యువకుడిగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో పాటు భారతదేశానికి తిరిగి వచ్చాడు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఇతడు విద్యాభ్యాసం చేశాడు. భారత దేశం తిరిగి వచ్చిన తర్వాత మొదట కాంగ్రా గురుకుల విద్యాలయంలో చేరాడు. పిమ్మట శాంతినికేతన్‌లో చదువుకున్నాడు.
స్వాతంత్రోద్యమం[మార్చు]
ఇతడు తన తండ్రితో పాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లాడు. 1918లో మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రారంభమైనప్పుడు ఇతడు ఆ సభ తొలి ప్రచారకునిగా హిందీ పాఠాలు చెప్పాడు. స్వదేశీ ఉద్యమసమయంలో ఆంధ్రప్రాంతంలో వాడుకలో ఉన్న సన్న నూలు వస్త్రం గాంధీజీ దృష్టికి వచ్చింది. ఆ నేత నాణ్యతకి అబ్బురపడ్డ గాంధీజీ దాని తయారీ విధానం పరిశీలించి రమ్మని తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరు పంపాడు. ఇతడు పొందూరులో తయారయ్యే సన్న ఖాధీ శ్రేష్టతనీ, నాణ్యతనీ, కార్మికుల నైపుణ్యాన్నీ పరిశీలించి గాంధీజీకి ఒక నివేదికని సమర్పించాడు. ఇతని నివేదికని ఆధారం వస్త్రాలని పరిశీలించిన గాంధీజీ పొందూరు ఖద్దరు కళావైభవాన్ని ప్రశంసిస్తూ యంగ్ ఇండియా పత్రికలో ఓ వ్యాసం వ్రాశాడు.
సినిమా, పత్రికా రంగాలు[మార్చు]
ఆర్. నటరాజ మొదలియార్ నిర్మించిన దక్షిణ భారత దేశపు తొలి మూకీ కీచకవధకు ఇతడు హిందీ భాషలో సబ్‌టైటిల్స్ వ్రాశాడు. మహాత్మాగాంధీపై తీసిన టెలివిజన్ డాక్యుమెంటరీ సీరియల్‌లో ఇతని పాత విడియో ఫుటేజీలను ఉపయోగించారు. ఇతడు పాత్రికేయుడిగాకూడా రాణించాడు."యంగ్ ఇండియా", "నవజీవన్" పత్రికలను నిర్వహించడంలో తండ్రికి సహకరించాడు. కొంతకాలం మోతీలాల్ నెహ్రూ నడిపిన "ఇండిపెండెంట్" పత్రిక సంపాదక వర్గంలో పనిచేశాడు. "హిందుస్తాన్ టైమ్స్" పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. అఖిల భారత వార్తాపత్రికా సంపాదకుల సంఘం, భారతీయ ప్రాచ్య వార్తాపత్రికా సంఘం, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి. చాలా పర్యాయాలు ఈ సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు[3]. రాయిటర్స్ వార్తా సంస్థ డైరెక్టర్ల బోర్డులో సభ్యుడిగా ఉన్నాడు[4].
కుటుంబం[మార్చు]
ఇతడు మహాత్మా గాంధీ అనుయాయి, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చక్రవర్తి రాజగోపాలాచారి కుమార్తె లక్ష్మిని ప్రేమించాడు. కానీ అప్పుడు లక్ష్మి పిన్నవయస్కురాలు – ఆమె వయసు 15 సంవత్సరాలు, దేవదాస్ గాంధీ వయసు 28 సంవత్సరాలు –
కావడంవల్ల రాజాజీ, గాంధీ ఇద్దరూ ఈ జంటను ఒకరినొకరు చూసుకోకుండా ఐదు సంవత్సరాలు వేచి ఉండాల్సిందిగా ఆంక్షలు విధించారు. ఐదేళ్ల తరువాత తమ తల్లిదండ్రుల అనుమతితో 1933లో వీరిద్దరి వివాహం జరిగింది.[5] దేవదాస్, లక్ష్మి దంపతులకు రాజమోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, రామచంద్ర గాంధీ అనే కుమారులు, తారా గాంధీ అనే కుమార్తె జన్మించారు.[6]
మరణం[మార్చు]
ఇతడు 1957, ఆగష్టు 3వ తేదీన కాలేయ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ, గుండెపోటుతో బొంబాయిలో తన 57వ యేట మరణించాడు[3][4].
మూలాలు[మార్చు]
- ↑ Hopley, Antony R. H. "Chakravarti Rajagopalachari". Oxford Dictionary of National Biography.
- ↑ Varma et al., p 52
- ↑ 3.0 3.1 3.2 విలేకరి (4 August 1957). "దేవదాస్ గాంధీ నిర్యాణం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 28 April 2018.
- ↑ 4.0 4.1 విలేకరి (4 August 1957). "శ్రీ దేవదాస్ గాంధీ హఠాన్మరణం". ఆంధ్రప్రభ దినపత్రిక (సంపుటి 19 సంచిక 29). Retrieved 28 April 2018.
- ↑ Tunzelmann, Alex Von (2008). Indian Summer: The Secret History of the End of an Empire. London, United Kingdom: Simon & Schuster. p. 78. ISBN 9781416522256.
- ↑ Ramachandra Guha (15 August 2009). "The Rise and Fall of the Bilingual Intellectual" (PDF). Economic and Political Weekly. Economic and Political Weekly. XLIV (33).
బయటి లింకులు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దేవదాస్ గాంధీ పేజీ
![]() |
Wikimedia Commons has media related to దేవదాస్ గాంధీ. |
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- 1900 జననాలు
- 1957 మరణాలు
- మహాత్మా గాంధీ కుటుంబం
- గాంధేయవాదులు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు
- సంపాదకులు
- భారత పాత్రికేయులు