దేవాదుల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవాదుల ప్రాజెక్టుగా పేరొందిన జె.చొక్కారావు గోదావరీ జలాల ఎత్తిపోతల పధకం వరంగల్ జిల్లాలోని కరువు ప్రాంతాలలో సాగునీరు అందజేసేందుకు గోదావరి నదిపై రూపొందించిన నీటి పారుదల పధకం. ఇది వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం దేవాదుల మరియు గంగారం గ్రామల వద్ద నిర్మితమవుతున్నది. పారుదల ప్రాజెక్టులలో భాగంగా 238 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లడం భారత దేశంలో ఇదే మొదటిసారి.[1]

4,400 కోట్ల రూపాయల ఆస్ట్రియా ప్రభుత్వ ఋణసహాయముతో [2] మూడు దశలుగా నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టు తొలిదశ పనులు 2007లో జరుగుతున్నాయి.

940 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టు మొదటి దశకు 2001, జూన్ 16[3]న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈపీసీ పద్ధతిలో టెండర్లు ఖరారు కాగా 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక, 2 దశలుగా పనులు ప్రారంభమయ్యాయి.

మొదటి దశ[మార్చు]

మొదటి దశ ప్రణాళిక ధర్మసాగర్‌ వరకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకెళ్లి, అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయటం. ధర్మాసాగర్ చెరువులో నీరు చేరేసరికి ఆయకట్టుకు నీరు సరఫరా చేయడానికి డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు నిర్మిస్తున్నారు. ధర్మసాగర్‌ చెరువు సామర్థ్యం 0.78 టీఎంసీలు కాగా, దీనిని 1.5 టీఎంసీలకు విస్తరించే పనులు చేపట్టారు. రెండు పంపుల ద్వారా, రోజుకు 350 క్యూసెక్కుల చొప్పున, 170 రోజుల పాటు నీటిని మళ్లించి, 5.18 టీఎంసీలతో 1.23 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్నది తొలిదశ లక్ష్యం. హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ దశ పనులు 2007 జూన్ నాటికి ముగింపుకొచ్చాయి.

మొదటి దశలో భాగంగా గంగారం వద్ద ఎత్తిపోతల(ఇన్‌టేక్‌) కట్టడం, భీమ్‌ఘనపూర్‌, ధర్మసాగర్‌, పులకుర్తిల వద్ద పంప్‌హౌస్‌లు, 135 కిలోమీటర్ల దూరం పైపులైన్‌, కాలువ నిర్మాణం చేస్తున్నారు. ప్రాజెక్టు అవసరమైన 8.5 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లను బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఎత్తిపోతల కట్టడం వద్ద, భీమ్‌ఘనపూర్‌, ధర్మసాగర్‌ మరియు పులకుర్తిల వద్ద రెండేసి 8.5 మెగావాట్ మోటర్లను బిగిస్తున్నారు.

రెండవ దశ[మార్చు]

రెండవ దశ పనులు జరుగుతున్నాయి. 2008 కళ్లా పనిచేయటం ప్రారంభిస్తుందని అంచనా.

మూడవ దశ[మార్చు]

2007 ఏప్రిల్ నెలలో దేవాదుల ప్రాజెక్టు మూడవ దశ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రాజెక్టులో ఒక భాగంగా వరంగల్ జిల్లా 70 శాతం గ్రామాలకు త్రాగునీరు అందించడానికి అదనంగా 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది.[4]

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ, దీపిక (10 December 2015). "తెలంగాణలో అతి పొడవైన నీటి కాలువ ఏది?". www.navatelangana.com. మూలం నుండి 31 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 31 July 2019.
  2. http://www.hinduonnet.com/thehindu/2003/12/14/stories/2003121401760300.htm
  3. http://www.india-today.com/webexclusive/dispatch/20010613/menon.html
  4. http://www.hindu.com/2007/04/16/stories/2007041616610100.htm