దేశమును ప్రేమించుమన్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ఈ ప్రముఖ గేయానికి ద్వారం వెంకటస్వామి నాయుడు స్వరాలను కూర్చారు. దీనిని కృష్ణా పత్రిక 1913 ఆగస్టు 9 తేదీన ప్రచురించింది.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి

పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి

యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌


దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

ఈ గేయంలోని రెండు పంక్తులు చాలా ప్రాచుర్యాన్ని పొందినాయి

అవి చివరి రెండు పంక్తులు

దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

పూర్తి పాఠం[మార్చు]