దేశోపకారి
| సంపాదకులు | సత్తిరాజు సీతారామయ్య చిలుకూరి వీరభద్రరావు |
|---|---|
| తరచుదనం | వారపత్రిక (1893 ఏప్రిల్ - 1894 ఆగష్టు) అర్ధవారపత్రిక (1894 ఆగష్టు - 1906) |
| ప్రచురణకర్త | సత్తిరాజు సీతారామయ్య |
| మొదటి సంచిక | 1898 ఏప్రిల్ 2 |
| ఆఖరి సంచిక | 1906 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | ఏలూరు కంతేరు |
| భాష | తెలుగు |
దేశోపకారి, ఏలూరు నుండి ప్రచురితమైన వారపత్రిక. దీని స్థాపకుడు సత్తిరాజు సీతారామయ్య. ఇది 1893 ఏప్రిల్ రెండోతారీఖున అవతరించింది. తరువాత 1894 ఆగస్టు నుంచి అర్ధవారపత్రికగావెలువడింది. ఈ పత్రికకు 500 మంది చందాదారులుండేవారు.[1] ఏలూరులో మొదలైన ఈ పత్రిక ప్రచురణను సీతారామయ్య కంతేరు గ్రామానికి తరలించాడు. ఈ పత్రిక 1906 లో మూతబడి ఉండవచ్చు.
చరిత్ర
[మార్చు]చిలుకూరి వీరభద్రరావు దేశోపకారి లోను, విబుధరంజని లోనూ పనిచేసి, అనేక చారిత్రిక వ్యాసాలు రాసి ప్రచురించాడు. 1895 లో ఆయన 'దేశోపకారి' పత్రికకు సహాయ సంపాదకుడయ్యాడు. 1897 లో స్వంత ముద్రణాలయాన్ని కొని, దానికి “విద్యాసాగరమ'నే పేరు పెట్టి, దేశోపకారిని స్వయంగా నడిపాడు.[2]
1893 ఏప్రిల్ 2 నుంచి దేశోపకారి, వారపత్రికగా ఉద్భవించింది. ఈ సమాచార వారపత్రిక కొద్ది కాలంలోనే జనులకు ప్రీతిపాత్రమై 1200 చందాదారుల్ని సంతరించుకోగలిగింది. సంవత్సర కాలానికి మరింత పాఠకాదరణ పెంపొందించుకుని 1894 ఆగష్టు 26 నుండి అర్ధవారపత్రికగా వెలువడసాగింది. సమకాలీన వారపత్రికలలో కెల్లా ఎక్కువ ప్రజాదరణ పొందగలిగింది.[3]
దేశోపకారి, కృష్ణ, గోదావరి ప్రాంతాల్లోనే కాక కలకత్తా, కాశీ, నాగపూరు, బొంబాయి, బళ్లారి, బెంగళూరు, రంగూను, మోర్మిన్ లాంటి సుదూర ప్రాంతాల్లో కూడా పాఠకుల్ని సంపాదించుకోగలిగింది. లక్కవరం జమీందారు మంత్రిప్రెగడ భుజంగరావు అండదండలతో ‘దేశోపకారి’ అర్ధవార పత్రికగా మారింది. ".. అనుదినము నడుచుచున్న విశేషాంశ ములను ప్రచురించి, మా ప్రాంతపు జనుల కుపయుక్త అంశముల జూపి తద్ద్వారా దేశాభివృద్ధికై పాటుపడుటయే మా ముఖ్యోద్దేశము.’’ అని ప్రకటించుకుంది.[3]
మూసివేత
[మార్చు]పత్రిక మూతబడిన తేదీపై భిన్నమైన వార్తలున్నాయి. పత్ర్రిక ప్రచురణ ఆర్థికంగా భారమవడంతో 1902 లో దాని ప్రచురణను ఆపివేసానని సీతారామయ్య తన స్వీయచరిత్రలో రాసాడు. "దేశోపకారి పత్రిక ఇటుల 1902 సంవత్సరం జూన్ నెల 8 తేదీ వరకు ‘దేశోపకారి’ అర్ధవార పత్రికయు, వారపత్రికయు, ‘హిందూసుందరి’ పత్రికయు ప్రచురించితిని. శుష్కప్రియములు, శూన్యహస్తములు అన్నటుల మనదేశీయుల కుచితముగా పంపించినంతవరకు సంతోషమే గాని రొక్కమీయమని అడిగిన చేయి వదలుట కష్టము. అర్ధవార పత్రికకు అమితమైన రొక్కము వెచ్చించ వలసి వచ్చినది. దినదినము విశేషశ్రమకోర్చి, చేతిరొక్కము వెచ్చించుకొని ఇతర పనులు చెడి, ఆంధ్రవార్తా పత్రికలు ప్రచురించుటలో గల బుద్ధి తక్కువను గుర్తెరిగి, అర్ధ వారపత్రికకొక్క నమస్కారమును, ఇంతవరకు బాకీయెగరవేసిన చందాదారులకు అనేక శతసహస్ర వందనములతో తత్పత్రికా ప్రకటన ముగించితిని."[3]
అయితే దేశోపకారి పత్రిక 1906 లో కూడా వెలువడినట్లు ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ అనే బ్రిటిషు ప్రభుత్వ నివేదిక తెలుపుతోంది. పత్రిక కంతేరు నుండే ప్రచురితమౌతున్నట్లు, 1904 లో దాని సర్క్యులేషను 250 గాను, 1905 లో 250, 1906 లో 400 గానూ ఉన్నట్లు ఆ నివేదికలో ఉంది.[4] దీన్ని బట్టి బహుశా సీతారామయ్య పత్రికను వేరెవరికైనా అమ్మి ఉండవచ్చని భావించవచ్చు.
రచనలు
[మార్చు]పత్రికలో పూర్వాచారపరాయణులు, సంఘసంస్కరణాభిలాషులూ - ఇరు పక్షాల రచనలనూ ప్రచురించేవారు.[3] ఆనాటి స్థితిగతులకు అద్దం పట్టింది ఈ పత్రిక. అప్పట్లో ఈ పత్రికలో ప్రచురించిన ధరలు ఇలా ఉన్నాయి: 1893 ఏప్రిల్ 7న కందులు రూపాయికి 13 శేర్లు, పాతబియ్యం రూపాయికి 13శేర్లు, శనగలు 14 శేర్లు, బంగారం కాసు 16 రూపాయల 14 అణాలు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు. p. 25.
- ↑ ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఆరుద్ర. p. 264.
- ↑ 3.0 3.1 3.2 3.3 ఘట్టమరాజు (2022-08-01). "స్మరణీయ సంపాదకుడు". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2025-10-12. Retrieved 2025-10-12.
- ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1904-1906 (in English). Internet Archive. [Publishers vary]. 1904–1906. p. 687.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)