దొడ్డపనేని ఇందిర
దొడ్డపనేని ఇందిర | |
---|---|
జననం | దొడ్డపనేని ఇందిర జనవరి 7, 1937 |
మరణం | సెప్టెంబర్ 16, 1987 |
ఇతర పేర్లు | డి.ఇందిర |
ప్రసిద్ధి | ప్రముఖ రాజకీయవేత్త, మంత్రివర్యులు. |
భార్య / భర్త | దొడ్డపనేని లక్ష్మీ నారాయణ ప్రసాద్ |
పిల్లలు | వీరి కుమార్తె గోగినేని ఉమ |
తండ్రి | ఆలపాటి వెంకటరామయ్య |
తల్లి | సామ్రాజ్యమ్మ |
డి.ఇందిర గా ప్రసిద్ధిచెందిన దొడ్డపనేని ఇందిర (ఆంగ్లం: Doddapaneni Indira) (జనవరి 7, 1937 - సెప్టెంబర్ 16, 1987) రాజకీయవేత్త, మంత్రివర్యులు. ఈమె మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె జనవరి 7వ తేదీన తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నైలో బి.ఎస్.సి. (హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. 1955 జనవరి 7వ తేదీన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీ నారాయణ ప్రసాద్ గారిని వివాహమాడారు.
తండ్రి మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి గార్ల ప్రోత్సాహంతో ఈమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈమె తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు (1967, 1972, 1978) ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఇందులో మొదటిసారి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, రెండవసారి ఇండిపెండెంటుగా, మూడవసారి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి నెగ్గడం విశేషం. నాలుగవసారి అన్నాబత్తుని సత్యనారాయణపై పోటీచేసి ఓడిపోయారు. పదవి లేకపోయినా అందరికీ అందుబాటులో వుండి, కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజా సమస్యల సాధనకై పనిచేశారు[ఆధారం చూపాలి]. 1987లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలలో గుంటూరు జిల్లా పరిషత్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమె సెప్టెంబర్ 16వ తేదీన పరమపదించారు.
వీరి కుమార్తె గోగినేని ఉమ తిరిగి తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి 1999 సంవత్సరంలో ఎన్నిక కావడం విశేషం.
మూలాలు[మార్చు]
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.