దోస్తీ (1964 సినిమా)
దోస్తీ (తెలుగులోఅర్ధం - స్నేహం) 1964లో విడుదలైన హిందీ చలన చిత్రం. దీనికి సత్యేనబోస్ దర్శకత్వం వహించగా, తారాచంద్ బరత్యా నిర్మించారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ పంపిణీ చేసింది. ఇద్దరు బాలుర మధ్య స్నేహాన్ని ఈ చిత్రం ప్రధానంగా చూపిస్తుంది: ఒకరు అంధుడు (సుధీర్ కుమార్ సావంత్), మరొకరు శారీరక వైకల్యం ఉన్నవాడు (సుశీల్ కుమార్ సోమయా). సహాయ పాత్రల్లో సంజయ్ ఖాన్, ఫరీదా దాదీ, నానా పల్సికర్, లీలా మిశ్రా నటించారు.
దోస్తీ 1964లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది, బాక్సాఫీసు వద్ద “సూపర్ హిట్”గా ప్రకటించారు.[1] 4వ మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు.[2] 1977లో ఈ చిత్రాన్ని మలయాళం లో, తెలుగు భాషల్లో (స్నేహం పేరుతో) మళ్లీ నిర్మించారు.[3] దోస్తీ ఏడు నామినేషన్లలో ఆరు ఫిలిం ఫేర్ పురస్కారాలు గెలుచుకుంది.
కథ
[మార్చు]“రాము” రామ్‌నాథ్ గుప్తా తండ్రి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు; ఒక ప్రమాదంలో అతను మరణిస్తాడు. ఫ్యాక్టరీ చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకపోవడంతో, షాక్‌కు గురైన రాము తల్లి స్పృహతప్పి మెట్లపై నుంచి పడిపోతుంది. మరో ప్రమాదంలో రాము కూడా గాయపడి కుంటివాడవుతాడు.
పేదవాడైన రాము అంగ వైకల్యంతో ముంబై వీధుల్లో తిరుగుతాడు. అక్కడ అతనికి మోహన్ (సావంత్) అనే అంధ బాలుడు పరిచయమవుతాడు. మోహన్‌కి కూడా ఇలాంటి నేపథ్యమే. అతని సోదరి మీనా, తన అన్న చికిత్స కోసం డబ్బు సంపాదించడానికి నర్సుగా పని చేయాలనే ఉద్దేశంతో ముంబయికి వెళ్తుంది. అతని సంరక్షకుడు మరణించడంతో మోహన్ కూడా గ్రామాన్ని వదిలి వెళ్తాడు.
రాము హార్మోనికా వాయించడంలో నిపుణుడు, మోహన్ పాటలు పాడడంలో దిట్ట. ఇద్దరూ కలిసి రోడ్డుపై పాటలు పాడుతూ ప్రయాణికుల నుంచి డబ్బు సంపాదిస్తారు. రాము చదువు కొనసాగించాలని కోరుకుంటాడు. వారు ధనవంతుడైన అశోక్ సోదరి మంజులతో స్నేహం చేస్తారు. మంజులకు ర్యూమాటిక్ హార్ట్ వ్యాధి ఉంటుంది. ఆమె తమకు సహాయం చేస్తుందనే ఆశతో ఉంటారు.
రాము స్కూల్ ప్రవేశానికి అవసరమైన అయిన అరవై రూపాయల మొత్తం కోసం రాము, మోహన్ మంజుల ఇంటికి వెళ్లి అప్పు అడుగుతారు. కానీ మంజుల అన్న వారిని నిర్లక్ష్యంగా తిప్పికొట్టి ఐదు రూపాయలే ఇస్తాడు. అవమానంగా భావించిన మోహన్, పాటలు పాడి అవసరమైన డబ్బును సంపాదిస్తాడు. ప్రవేశ పరీక్షలో రాము మంచి ప్రతిభ చూపడంతో స్కూల్లో చేరుతాడు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నప్పుడు వారి సంపాదనను దొంగిలించే ప్రయత్నం జరగడంతో, వారు మురికి వాడ (స్లమ్)లోని ఒక కొత్త ఇంటికి మారతారు. అక్కడ వారి పొరుగున ఉన్న మౌసీ, తన కౌమారదశ కుమార్తె, కుమారుడితో కలిసి ఉంటుంది. రాము, మోహన్‌లను తన కొడుకుల్లా చూసుకుంటుంది.
పాఠశాలలో రాము చదువుల్లో రాణిస్తాడు. అయినా ధనిక విద్యార్థులు అతన్ని తమ సమానంగా భావించక, “వీధిలో భిక్షగాడు” అని తరచూ అవమానిస్తుంటారు. ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు రామును ఆదరిస్తారు. చివరకు ఉపాధ్యాయుడు శర్మాజీ తనను రాముకు సంరక్షకుడిగా ప్రకటిస్తాడు. రాము ఇంటికి వచ్చిన శర్మాజీ, ఆ పరిసరాలు చదువులకు అనుకూలంగా లేవని గమనించి, రాము తనతో ఉండాలని సూచిస్తాడు; కానీ మోహన్‌ను విడిచిపెట్టడానికి రాము ఇష్టపడడు. ఒకరోజు పాటలు పాడుతుండగా, అశోక్ మీనాను పిలుస్తున్న శబ్దం విని మోహన్ తన చాలాకాలం క్రితం విడిపోయిన సోదరిని ఆలింగనం చేసుకోవడానికి పరుగెత్తుతాడు. అయితే మోహన్ భిక్షగాడిగా మారడం చూసిన మీనా సిగ్గుపడి, అతన్ని గుర్తించడానికి నిరాకరిస్తుంది. మీనా మంజులను చూసుకుంటూ ఉంటుంది; ఆమెకు అశోక్‌తో ప్రేమ చిగురిస్తుంది. మీనా నిజం చెప్పగా, అశోక్ ఆమెను ఓదార్చి, త్వరలోనే ఆమె అన్నతో కలిసేలా చేస్తానని భరోసా ఇస్తాడు.
నిద్రలో మోహన్ మంజుల ఉనికిని అనుభూతి చెంది, రాముకి చెబుతాడు. ఇద్దరూ ఆమెను కలవడానికి వెళ్తారు; కానీ ఆమె మరణించినట్టు తెలుసుకుంటారు. ఒకరోజు అశోక్ మోహన్‌ను ఇంటికి తీసుకువచ్చి, మంజుల జ్ఞాపకంగా ఆమె గంటను ఇస్తాడు. మీనా విషయాన్ని చెప్పబోయేటంతలో మోహన్ కోపంతో విరుచుకుపడి, తనకు ఈ ప్రపంచంలో రాము తప్ప ఎవ్వరూ లేరని చెబుతాడు.
తర్వాత కొద్దికాలంలో రాము కొందరు దుండగులతో గొడవలో పడతాడు; దొంగతనం కేసులో పొరపాటున పోలీసులు అతన్ని ఖైదు చేస్తారు. శర్మాజీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బెయిల్‌పై రామును విడుదల చేయిస్తాడు, అయితే రాము తనతోనే ఉండాలి, మోహన్‌తో సంబంధాలు తెంచుకోవాలి అని షరతు పెడతాడు. హృదయవేదనకు గురైన మోహన్ రామును కలవాలని అనుకుంటాడు. కానీ శర్మాజీ అతన్ని అనుమతించడు. బాధతో మోహన్ వీధుల్లో విషాద గీతాలు పాడుతూ తిరుగుతాడు.
అనూహ్యంగా శర్మాజీ మరణిస్తాడు. రాము తీవ్రంగా కదిలిపోతాడు. ఫీజులు చెల్లించలేక చివరి పరీక్ష రాయలేనని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలిసిన మోహన్, అనారోగ్యంగా ఉన్నప్పటికీ వీధుల్లో పాటలు పాడి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అతను అవసరమైన డబ్బును సంపాదించి, రాముకు తెలియకుండా ఫీజులు చెల్లిస్తాడు; ఆపై అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతాడు. మోహన్ కోలుకునే సమయంలో మీనా, అతనికి తెలియకుండా అతన్ని చూసుకుంటుంది.
పరీక్షల్లో రాము మొదటి స్థానంలో నిలుస్తాడు, మోహన్ చేసిన త్యాగాన్ని తెలుసుకుంటాడు. క్షమాపణ కోరేందుకు రాము ఆసుపత్రికి పరుగెత్తుతాడు; అక్కడ మోహన్ తనకు ఎప్పుడూ కోపం లేదని చెబుతాడు. డాక్టరు మీనా గురించి మోహన్‌కు చెబుతాడు; మోహన్ ఆమెను క్షమిస్తాడు. చివరికి అందరూ ప్రేమతో ఆలింగనం చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది.
తారాగణం
[మార్చు]- సుశీల్ కుమార్ సోమయ – రామ్‌నాథ్ “రాము” గుప్త
- సుధీర్ కుమార్ సావంత్ – మోహన్
- బేబీ ఫరీదా – మంజుల “మంజు”
- సంజయ్ ఖాన్ – అశోక్
- లీలా మిశ్రా – మౌసీ
- లీలా చిట్నిస్ – రాము తల్లి, మిసెస్ గుప్త
- అభి భట్టాచార్య – హెడ్‌మాస్టర్
- ఉమా రాజూ – నర్స్ మీనా (మోహన్ సోదరి)
- నానా పల్షికర్ – స్కూల్ టీచర్ శర్మాజీ
- మూల్‌చంద్ – అశోక్ ఉద్యోగి
సంగీతం
[మార్చు]ఈ చిత్ర పాటల సాహిత్యాన్ని మజ్రూ సుల్తాన్‌పురి రాయగా, సంగీతాన్ని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సమకూర్చారు. సంగీత దర్శకుడు ఆర్. డి. బర్మన్ ఈ చిత్రం సంగీతం, సౌండ్‌ట్రాక్‌లలో హార్మోనికా వాయించారు. ఈ చిత్రం లక్ష్మీకాంత్–ప్యారేలాల్ జంట కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు; దీనివల్ల వారికి తొలి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించి, పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. పాటలకు ప్రధాన గాయకుడు మహమ్మద్ రఫీ.
| # | గీతం | గానం | రాగం |
|---|---|---|---|
| 1 | "చాహుంగా మైన్ తుజే సాంజ్ సవేరే" | మహమ్మద్ రఫీ | పహాడీ |
| 2 | "మేరా తో జో భీ కదమ్ హై" | మహమ్మద్ రఫీ | |
| 3 | "కోయి జబ్ రాహ్ నా పాయే" | మహమ్మద్ రఫీ | |
| 4 | "రాహీ మన్వా దుఖ్ కి చింతా" | మహమ్మద్ రఫీ | |
| 5 | "జానేవాలో జరా ముద్కే దేఖో ముఝే" | మహమ్మద్ రఫీ | పహాడీ |
| 6 | "గుడియా హంసే రూతీ రహోగీ" | లతామంగేష్కర్ | పహాడీ |
మూలాలు
[మార్చు]- ↑ "Box office 1964". Boxofficeindia.com. Archived from the original on 12 February 2010. Retrieved 21 Jan 2012.
- ↑ "4th Moscow International Film Festival (1965)". MIFF. Archived from the original on 16 January 2013. Retrieved 2012-12-02.
- ↑ "ఇద్దరు అనాధ దివ్యాంగ మిత్రుల స్నేహం సినిమా, బాపు - లోకం తీరు". AP Latest News. Retrieved 2026-01-31.