ద్వాదశి నాగేశ్వరశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్వాదశి నాగేశ్వరశాస్త్రి
ద్వానాశాస్త్రి
జననంజూన్ 15, 1948
లింగాల
మరణం2019 ఫిబ్రవరి 26(2019-02-26) (వయసు 70)
హైదరాబాదు
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుద్వానాశాస్త్రి
విశ్వవిద్యాలయాలుసి.ఆర్.రెడ్డి కళాశాల
ప్రసిద్ధిసాహిత్య విమర్శకుడు, తెలుగు అధ్యాపకుడు
మతంహిందూమతం

ద్వాదశి నాగేశ్వరశాస్త్రి తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత. ద్వానాశాస్త్రి గా ఆయన పేరుపొందాడు. ఇతడు కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15 వ తేదీన జన్మించాడు తల్లి లక్ష్మీప్రసన్న. తండ్రి కృష్ణశాస్త్రి.

ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కాలేజిలో బి.ఎస్.సి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) చదివాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్, తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. ఇతని గురువులలో ప్రముఖులు తూమాటి దోణప్ప, చేకూరి రామారావు, బండ్లమూడి సత్యనారాయణ, కొత్తపల్లి వీరభద్రరావు. విశ్వవిద్యాలయంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి (శ్రీ శ్రీ కి, ఆరుద్రకు ఛందస్సు నేర్పిన గురువు) కవిత్వం మీద ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాడు. సాహిత్యసంస్థలపై చేసిన పరిశోధనకి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను స్వర్ణ పతకముతో పాటు పి.హెచ్.డి.తో సత్కరించింది. అటు పిమ్మట ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు.

1972 నుండి 2004 వరకు అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ కామర్సు (ఎస్.కె. బి. ఆర్.) కళాశాలలో తెలుగు శాఖలో రీడరుగా పనిచేసిన ఈయన ఐ.ఎ. ఎస్., గ్రూప్ 1 , గ్రూప్ 2 , జూనియర్ లెక్చరర్లు, తెలుగు పండిట్ మొదలయిన ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకి శిక్షణ ఇచ్చాడు.

2019 ఫిబ్రవరి 26 న హైదరాబాదులో శ్వాసకోశవ్యాధితో ద్వానాశాస్త్రి మరణించాడు.[1]

రచనలు

[మార్చు]

1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. వివిధ పత్రికలు, పుస్తకాల్లో వేలాది వ్యాసాలూ రాశాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ద్వానా సొంతం. కవి, పరిశోధకుడు, రచయిత, విమర్శకుడిగా ఎన్నో రచనలు చేసినప్పటికీ దర్పాన్ని ప్రదర్శించని నిగర్వి. గడిచిన 46 ఏండ్లుగా వేలాది వ్యాసాలు,కథలు[2], పుస్తకాలు ఆయన ప్రచురించాడు.

ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు, వెలుగులోకి తీసుకువచ్చాడు. ద్వానా రాసిన తెలుగు సాహిత్య చరిత్ర పది ముద్రణలు పొందింది[3]. సమాధిలో స్వగతాలు అనే వచన కవిత, వాజ్ఞ్మయ లహరి, సాహిత్య సాహిత్యం, వ్యాస ద్వాదశి అనే వ్యాస సంపుటిలు, అక్షర చిత్రాలు (అరుదైన ఛాయాచిత్రాలు), ద్వానా కవితలు, సాహిత్య నానీలు, బుష్ కాకి వంటి కవితా సంపుటాలు, ద్రావిడ సాహిత్య సేతువు, ఆంధ్ర సాహిత్యం, తెలుగు సాహిత్య చరిత్ర, మన తెలుగు తెలుసుకుందాం మొదలయినవి ఆయన రచనల్లో ముఖ్యమయినవి.

జనమంచి శేషాద్రి శర్మ, ఒడ్డిరాజు సోదరులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పింగళి కాటూరు కవులు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుఱ్ఱం జాషువా, అడివి బాపిరాజు, మొక్కపాటి నరసింహశాస్త్రి, అబ్బూరి రామకృష్ణారావు,సురవరం ప్రతాపరెడ్డి, గడియారం వేంకటశేషశాస్త్రి, భమిడిపాటి కామేశ్వర రావు, పింగళి లక్ష్మీకాంతం, దేవులపల్లి కృష్ణశాస్త్రి,గురుజాడ రాఘవశర్మ, గరికపాటి మల్లావధాని, నాయని, నోరి, వేదుల, తుమ్మల, ఆండ్ర శేషగిరిరావు, కందుకూరి రామభద్రరావు, పువ్వాడ శేషగిరిరావు, బులుసు వేంకటరమణయ్య, కొత్త సత్యనారాయణ చౌదరి, సుద్దాల హనుమంతు, ఖండవల్లి లక్ష్మీరంజనం, నార్ల, కొనకళ్ళ వెంకటరత్నం, సుంకర సత్యనారాయణ, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, రావూరు వెంకటసత్యనారాయణ రావు, దివాకర్ల వెంకటావధాని, జంధ్యాల పాపయ్య శాస్త్రి, వనమామలై, కొవ్వలి, తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, చాసో, పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి రామానుజరావు, మా గోఖలే, బోయి భీమన్న, మధునాపంతుల, తిలక్, రావి శాస్త్రి, అనిసెట్టి, కుందుర్తి, దాశరథి కృష్ణమాచార్య, తూమాటి దోణప్ప, బలివాడ కాంతారావు, ఉషశ్రీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, శశాంక, మధురాంతకం రాజారాం, నాగభైరవ కోటేశ్వరరావు, కేతవరపు రామకోటిశాస్త్రి మొదలైన అరవై రెండు మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలు, వారి వారి కుటుంబ విశేషాలు, వారు జీవించి ఉన్నప్పటి సామాజిక, సారస్వత పరిస్థితులను నాలుగువందల పుటలలో మా నాన్నగారు అనే పుస్తకంలో పొందుపరచాడు.

అరుదైన ఛాయాచిత్రాలు సాహిత్య సంస్థలు అనే పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం, నానీలలో సినారె, సినారె కవిత్వంలో ఉక్తులు, సూక్తులు ఇలా వందకు పైగా పుస్తకాలు ఆయన కలం నుంచి పురుడుపోసుకున్నాయి. ఆయన 800 పేజీల తెలుగు సాహిత్య చరిత్రతో సహా యాభైకి పైగా గ్రంథాలు, వెలకొద్దీ వ్యాసాలూ, రెండువేల సమీక్షలు రచించారు.

తెలుగు అక్షరాలలో ఋ ౠలు ఉండాలనీ, శకటరేఫం అవసరం వుందనీ, అరసున్న అర్థ భేదక సామర్థ్యం కలిగి ఉందనీ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.ప్రజలే శబ్దానుశాసనులు అన్నారు. నన్నయ్య మాత్రమే కాదు ప్రజల్లో వాగానుశాసనులున్నారని ఈయన చెప్పాడాయన.

ద్వానా శాస్త్రి తన రచనల్లో తెలంగాణ సాహిత్యానికి పెద్దపీట వేశారు. అసలైన తెలుగు పదాలు తెలంగాణ మాండలికంలోనే కనిపిస్తాయని, మిగిలిన తెలుగు ప్రాంతంలో సంస్కృత పదాలు కనిపిస్తాయని ద్వానా అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ సాహితీ మిత్రులను ఈ లోకానికి పరిచయం చేస్తూ తెలంగాణ సాహిత్య రత్నాల వీణ పేరుతో ద్వానాశాస్త్రి ప్రత్యేక సంచిక తీసుకువచ్చా రు. పాల్కురికి సోమన నుంచి నందిని సిధారెడ్డి వరకు సుమారు 110 మంది కవులు, రచయితలు, వారి రచనలను పరిచయం చేస్తూ ఈ పుస్తకాన్ని తీసుకురావడం విశేషం. దీన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు అంకితమిచ్చారు. నవ కవితాజలధి దాశరథి పేరుతో దాశరథి వ్యక్తిత్వం, రచనలు, ఉద్యమ నేపథ్యం తదితర అంశాలతో 2011లోనే ఆయన పుస్తకాన్ని తీసుకువచ్చారు.

ద్వాదశి నాగేశ్వర శాస్త్రి సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ద్వానా శాస్త్రి 2014లో శతక సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం అనే అంశం మీద 188 నిమిషాల పాటు ప్రసంగం జీనియస్ బుక్ రికార్డ్స్ లోను, 2015లో పలకరిస్తే ప్రసంగం పేరుతో 6 గంటల నిర్విరామ ప్రసంగంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నారు.


ప్రచురణలు

[మార్చు]
  • సమాధిలో స్వగతాలు - వచన కవిత
  • వాఙ్మయ లహరి - వ్యాస సంపుటి
  • సాహిత్య సాహిత్యం - వ్యాస సంపుటి
  • మారేపల్లి రామచంద్ర కవితా సమీక్ష - ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం
  • ద్రావిడ సాహిత్య సేతువు
  • వ్యాస ద్వాదశి - వ్యాస సంపుటి
  • అక్షర చిత్రాలు - అరుదైన ఛాయాచిత్రాలు
  • సాహిత్య సంస్థలు - పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం
  • ఆంధ్ర సాహిత్యం
  • మన తెలుగు తెలుసుకుందాం
  • ద్వానా కవితలు
  • శతజయంతి సాహితీమూర్తులు - సంపాదకత్వం
  • తెలుగు సాహిత్య చరిత్ర
  • మన తెలుగు తెలుసుకుందాం[4]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "తెలుగు సాహితీ సవ్యసాచి ద్వానా శాస్త్రి కన్నుమూత". Feb 27, 2019. Archived from the original on Mar 11, 2019. Retrieved 2019-03-11. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "కథానిలయంలో ద్వానాశాస్త్రి వివరాలు". Retrieved June 15, 2018.[permanent dead link]
  3. "సాహితీ సవ్యసాచి ద్వా.నా.శాస్త్రి". August 28, 2017. Archived from the original on Mar 11, 2019.
  4. శాస్త్రి, ద్వానా. మన తెలుగు తెలుసుకుందాం. Retrieved 13 January 2015.