నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందమూరి తారక రామారావు చలన చిత్ర కెరీర్ 1949 నుంచి మొదలుకొని 1994 వరకు దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు సాగింది. ప్రధానంగా కథానాయకుడు పాత్రల్లో నటునిగా కెరీర్ కొనసాగించిన ఎన్.టి.రామారావు నిర్మాణం, దర్శకత్వం వంటివి కూడా చేపట్టి నిర్వహించాడు.

తొలి అవకాశాలు

[మార్చు]
1949లో ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వెళ్తున్న రామారావుకు సహోద్యోగులు సన్మానించిన నాటి సన్నివేశం

1945-47లో రామారావు గుంటూరులో బి.ఏ. చదివేవాడు. పలుమార్లు ఫెయిలై ఎఫ్.ఏ. పూర్తిచేయడంతో ఊళ్ళో జనం అపహాస్యం చేయడంతో ఎలాగైనా పట్టుదలతో డిగ్రీ పూర్తిచేయాలని పూనుకున్న రామారావు ఆ దశలో వచ్చిన సినిమా అవకాశాలను తిరస్కరించాడు. ఎల్.వి.ప్రసాద్ అదే సమయంలో తాను తీస్తున్న "శ్రీమతి" సినిమాలో హీరో వేషం కోసం స్క్రీన్‌టెస్ట్ చేసి ఎంపిక చేశారు. ఐతే ఎన్నాళ్ళకూ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో ఎల్వీ ప్రసాద్ మన దేశం అన్న సినిమా మొదలుపెట్టారు. అందులో ఓ చిన్న వేషం ఆఫర్ చేస్తే ఈసారి హీరో కాదని రామారావు తిరస్కరించాడు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అన్న సంస్థ ఏర్పరిచి నాటకాలు ఆడుతూ, ఓ పరీక్ష పాసై సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించి, అక్కడి అవినీతిమయం అయిన వాతావరణం నచ్చక 11 రోజుల్లో వదిలేశాడు. మరో వైపు ఎల్వీ ప్రసాద్ సూచన మేరకు మరో దర్శకుడు బి.ఏ.సుబ్బారావు తాను తీస్తున్న పల్లెటూరు పిల్ల సినిమాలో హీరో పాత్రకి పరిశీలిస్తామని, మద్రాసు రమ్మని రామారావుకు ఉత్తరం రాశాడు. రామారావు రూపం, గొంతు చూసి మేకప్ టెస్ట్ కూడా లేకుండా సుబ్బారావు హీరో పాత్రకు ఎంపిక చేశాడు.[1]

పాతాళ భైరవి (1951)లో ఎన్.టి.రామారావు

బి.ఏ.సుబ్బారావు పల్లెటూరు పిల్లలో హీరోగా చేస్తూండగానే ఎల్.వి.ప్రసాద్ తన మన దేశం (1949) సినిమాలో ఇన్స్ పెక్టర్ పాత్రలో తీసుకున్నాడు. రెండింటిలో మనదేశం ముందు విడుదల కావడంతో అది రామారావు తొలి సినిమాగా నిలిచింది. పల్లెటూరి పిల్ల విడుదల అయ్యేలోపే రామారావు విజయా వారి షావుకారు సినిమాలో బుక్ కావడం, 1950లో అది రామారావు హీరోగా నటించిన తొలి చిత్రంగా విడుదల కావడం జరిగాయి. ఆ వెనుక 20 రోజులకు పల్లెటూరి పిల్ల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే ఏడాది డిసెంబరు నెలలో రామారావు హీరోగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన సంసారం సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించింది.1951లో రామారావు హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా వారి జానపద చిత్రం పాతాళ భైరవి, బి.ఎన్.రెడ్డి దర్శకునిగా వాహిని వారి చారిత్రక చిత్రం మల్లీశ్వరి సినిమాలు విడుదల అయ్యాయి. పాతాళ భైరవి సినిమా మాస్ వర్గాల్లో సంచలనాత్మక విజయం సాధించడమే కాక తోట రాముడిగా నటించిన రామారావుకు తొలి జానపదంగా, మంచి మాస్ ఇమేజ్ సాధించి పెట్టింది.

మూలాలు

[మార్చు]
  1. ప్రసాద్, ఎమ్బీయస్. "ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02". గ్రేటాంధ్ర. Archived from the original on 2020-06-06. Retrieved 2019-01-27.

ఆధారాలు

[మార్చు]