నందికంది రామలింగేశ్వర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందికంది రామలింగేశ్వర దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సంగారెడ్డి జిల్లా
ప్రదేశం:నందికంది, సదాశివపేట మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు

నందికంది రామలింగేశ్వర దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో ఉన్న దేవాలయం.[1][2] కళ్యాణి చాళుక్యుల కాలంలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ దేవాలయలో అశుతోషుడైన శంకరుడు మృత్యుంజయ మహాశివలింగ స్వరూపంలో పూజలందుకుంటున్నాడు.

చరిత్ర[మార్చు]

పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల అంచనా ప్రకారం నందికంది శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని సా.శ.1014లో కళ్యాణి చాళుక్య రాజు విక్రమాదిత్య పాలనలో నిర్మించారు.[3]

శాసనాలు[మార్చు]

ఈ దేవాలయంలోని ఐదు శాసనాలు తెలంగాణ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. శాసన పాఠంలో నిర్మాణ సంవత్సరం లేదు. అయితే, దేవాలయ ధ్వజ స్తంభంపై ఉన్న శాసనంలో రెండో తైలపుడు (అహనమల్ల) కాలంలోనే దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరిగినట్టు రాయబడింది. అంతకుమందే చాలాకాలం క్రితం ఒకటో అయ్యన, నాలుగో విక్రమాదిత్యుని కంటే ముందే ఇక్కడి లింగ ప్రతిష్ఠాపన జరిగినట్టు చరిత్ర చెబుతుంది. రామలింగేశ్వరస్వామి దేవస్థానం ముందు భాగంలో ఉన్న శిలాశాసనంలో నాలుగు పక్కల శాసన పాఠంలో మహా మండలేశ్వరుడైన పంపవే నుంచి కోవూరు (నేటి కోహీర్) అనే గ్రామాన్ని రామలింగేశ్వరునికి బహూకరించినట్టుగా పేర్కొన్నారు. సెలయేరు బావి వద్ద పక్కన గల నేలపై ఉన్న మరో శాసనం త్రిభువనమల్ల బిరుదాకింతుడు ఆరో విక్రమాదిత్యుడి పరిపాలన కాలం 1086 కాలం నాటిదని ఉంది.[4]

దేవాలయం లోపల నంది శిల్పం

నిర్మాణం[మార్చు]

ఈ దేవాలయ భూ ప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది. శిఖరం, భూమిజ శైలితో నిర్మించబడింది. ఇక్కడి గర్భగుడి నక్షత్రాకారంలో ఉంటుంది.[3] ఈ దేవాలయంలో చాళుక్య శిల్పులు వివిధ దేవుళ్ళ విగ్రహాలను దేదీప్యమానంగా చెక్కించారు.[5] చతుర్థ శిలాస్తంభాలతో కూడిన నవరంగ మండపం ఉంది.

గర్భాలయంలోని నల్ల రాతిపై రామేశ్వరస్వామి, అతని భార్య చెక్కబడి ఉన్నారు. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ యోధుల శిల్పాలు ఉన్నాయి. గర్భాలయం ముందు నల్లరాయితో తయారు చేయబడిన నంది ఉంది.

దేవాలయం మొత్తం విమాన నక్షత్రాకారంలో ఉండి 16 కోణాల్లో ఉంది. 16 కోణాలకు షోడష ఉపచారాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ముఖమంటపం, అంతరాళం, గర్భగుడితో దేవాలయం ఉంది. గర్భగుడి లోపల ద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలకుల విగ్రహాలు, ఆ విగ్రహాలకు దక్షిణ దిశలో ఐదు అడుగుల ఎత్తులో మహాగణపతి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎడమ వైపు చూస్తున్నట్లుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత.

ఈ దేవాలయంలోని నవరంగ మండపానికి తూర్పు, ఉత్తరం, దక్షిణాన ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. దేవాలయంలో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపై ఆమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మ-విష్ణు-నరసింహ అవతారంలో హిరణ్యకశ్యపుడిని సహరించే దృశ్యాలు, వరాహావతారం, నటరాజు, శివుడు, కాళీమాత, మహిషాసురమర్ధిని, వాగ్దేవి, నృత్యగణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, అప్సరసలు, జంతువుల దృశ్యాలున్నాయి. క్రాస్‌ బీమ్‌ ఆధారంతో మలిచిన రాతి స్లాబ్‌ (మకర తోరణం) ఉంది. దీని అడుగు క్రాస్‌బీమ్‌పై పద్మపుష్ప మొగ్గులు, ప్రవేశ ద్వారంపై తూర్పు వైపు నటరాజు, పడమర గజలక్ష్మి విగ్రహం సర్వాంగ సుందరంగా చెక్కబడ్డాయి.[6]

సూర్యకిరణాలు గర్భగుడిలో కొలువైన శివలింగాన్ని తాకేలా ఈ మహా తోరణం నిర్మించబడింది. తోరణ పైకప్పు ఏడు తామర మొగ్గలు భూమిని చూస్తున్నట్టు ఉన్నాయి. వీటిమధ్యనున్న ఆరు రంధ్రాలు ద్వారా సూర్యు కిరణాలు ఒక్కో రుతువులో ఒక్కో రంధ్రం ద్వారా ప్రయాణిస్తూ మూలవిరాట్టు శివలింగంపై వెలుగులు ప్రసరింపజేస్తాయి.[7]

ప్రదేశం[మార్చు]

ఈ దేవాలయం జాతీయ రహదారి 65 నుండి కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉంది.[8]

మూలాలు[మార్చు]

  1. Iyer, Lalita (2018-02-11). "Ramalingeswara Temple: This small temple is big on grandeur". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-05-31.
  2. Avadhani, R. (2020-02-16). "Sans devotion and promotion, 11th century temple near Hyderabad lies in ruins". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-05-31.
  3. 3.0 3.1 Meister, Michael W.; Dhaky, Madhusudan. Encyclopaedia of Indian Temple Architecture, Volume 1, Part 3. American Institute of Indian Studies.
  4. telugu, NT News (2022-04-01). "Kalyani Chalukya | కళ్యాణి చాళుక్య నందికంది శాసనాలు". www.ntnews.com. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.
  5. krishna (2020-02-20). "మహదేవశంభో". Mana Telangana. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.
  6. "Sri Ramalingeswara swamy temple". heritage.telangana.gov.in. Archived from the original on 2022-08-03. Retrieved 2023-05-31.
  7. telugu, NT News (2023-02-23). "భళా.. కళ్యాణి చాళుక్యుల కళ!". www.ntnews.com. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.
  8. Avadhani, R. (2021-07-31). "Historical temples of old Medak district cry for attention". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-05-31.