Jump to content

నమి నంది ఆదిగల్

వికీపీడియా నుండి
నమి నంది అడిగల్
జననంఏమాప్పేరూర్, కాలక్రమేణా ఈ పేరు తిరునీపైర్‌గా మారింది
బిరుదులు/గౌరవాలునాయనార్ సన్యాసి,
తత్వంశైవం, భక్తి

నమి నంది అడిగల్ (నమినంది అడిగల్, నమినంది అడికల్, నమినంటి అతికల్, నమినంది, నమినంధి అని కూడా పిలుస్తారు), హిందూ మతంలో శైవ శాఖలో పూజలందుకున్న ఒక నాయనార్ సన్యాసి. 63 మంది నాయనార్ల జాబితాలో ఇతను సాధారణంగా 27వ వాడిగా పరిగణించబడతాడు.[1]

జీవితం

[మార్చు]

నమి నంది అడిగల్ జీవితాన్ని 12వ శతాబ్దానికి చెందిన సెక్కిళార్ రాసిన తమిళ గ్రంథం పెరియ పురాణంలో వివరించారు. ఇది 63 మంది నాయనార్ల జీవిత చరిత్రను తెలుపుతుంది.[2] నమి నంది అడిగల్ అప్పటి చోళ రాజ్యంలో భాగమైన తిరువారూర్ సమీపంలోని ఏమాప్పేరూర్ పట్టణంలో జన్మించాడు. ఏమాప్పేరూర్ ఇప్పుడు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇతను శైవ మత పోషకుడైన శివ భక్తుడు. ఇతను పూజారి కులానికి చెందిన ఒక బ్రాహ్మణుడు. రోజూ, ఇతను తిరువారూర్‌లోని శివుడికి అంకితం చేసిన అరణేరి క్షేత్రానికి ప్రయాణించేవాడు.[3][4] ఈ ఆలయాన్ని శ్రీ అచలేశ్వరార్ (వండార్‌కుళలి) ఆలయంగా గుర్తిస్తారు, ఇది త్యాగరాజ స్వామి దేవాలయ సముదాయంలో ఉంది.[5]

ఒకసారి, నమి నంది అడిగల్ అరణేరి క్షేత్రానికి చేరుకునేసరికి సాయంత్రం కావస్తోంది. ఇతను శివాలయంలో దీపాలు వెలిగించాలనుకున్నాడు. ఇతను సమీపంలోని ఇంటికి వెళ్లి దీపాల కోసం నెయ్యి అడిగాడు. ఆ ఇల్లు ఒక జైనుడిది. చేతిలో అగ్నిని ధరించే శివుడికి దీపాలు ఎందుకు వెలిగించాలనుకుంటున్నావని అక్కడి వారు నమి నంది అడిగల్‌ను ఎగతాళి చేశారు. తమ వద్ద నెయ్యి లేదని, అతనికి అంత ఆరాటంగా ఉంటే దీపాలు వెలిగించడానికి ఆలయ చెరువుల్లో తగినంత నీరు ఉందని వారు హేళన చేశారు. దుఃఖంతో, నమి నంది అడిగల్ ఆలయానికి తిరిగి వచ్చి తనకు సహాయం చేయమని దేవుడిని వేడుకున్నాడు. ఆలయ చెరువు నుండి నీటిని తీసుకువచ్చి దీపాలలో పోయమని ఒక ఆకాశవాణి అతనికి సూచించింది. ఇతను దీపాలు వెలిగించాడు, అవి తెల్లవారే వరకు ప్రకాశవంతంగా వెలిగాయి. సాయంత్రం తన ఇంటిలోని పూజా మందిరంలో శివుడిని పూజించడానికి ఇతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సన్యాసి ప్రతిరోజూ ఏమాప్పేరూర్ నుండి అరణేరి క్షేత్రానికి ప్రయాణించి, ఆలయంలో పూజలు చేసి, సాయంత్రం నీటితో దీపాలు వెలిగించిన తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చేవాడు. జైనులు ఈ అద్భుతాన్ని నమ్మలేక చూశారు. కొందరు తిరువారూర్ విడిచిపెట్టగా, మరికొందరు శైవ మతాన్ని స్వీకరించారు. చోళ రాజు నమి నంది అడిగల్ భక్తి గురించి విన్నాడు, అతనిని ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించాడు. ఇతను పండుగల వేడుకలలో కూడా ఆలయానికి సహాయం చేశాడు.[3][4][5] దీపపు అద్భుత కథ 13వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రాసిన తెలుగు గ్రంథం బసవ పురాణంలో కొన్ని వైవిధ్యాలతో గుర్తుచేసుకున్నారు.[6]

నమి నంది అడిగల్ జీవితంలో జరిగిన మరో సంఘటన పెరియ పురాణంలో నమోదైంది. పంగుని ఉత్తరం పండుగ వేడుకల్లో, శివుని విగ్రహాన్ని పొరుగు గ్రామమైన తిరుమనాలికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపులో అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారు. నమి నంది అడిగల్ ఇంటికి తిరిగి వచ్చాడు, ఇతర కులాల ప్రజలతో కలవడం వల్ల తాను ఆచారపరంగా అపవిత్రుడయ్యానని భావించి తన ఇంటిలోని పూజా మందిరంలో పూజ చేయలేదు. ఆచార స్నానం కోసం కొంచెం నీరు తీసుకురావాలని భార్యను ఆదేశించి ఇంటి బయట వేచి ఉన్నాడు. అలసిపోయిన పూజారి నిద్రలోకి జారుకున్నాడు. శివుడు అతని కలలో కనిపించి అతని ప్రవర్తనను మందలించాడు. తిరువారూర్‌లో జన్మించిన వారందరూ శివ-గణాలు (శివుని పరిచారకులు) అని, వారి స్పర్శ అతని ఆచార స్వచ్ఛతను అపవిత్రం చేయలేదని నమి నంది అడిగల్‌కు శివుడు గుర్తుచేశాడు. నమి నంది అడిగల్ నిద్ర నుండి మేల్కొన్నాడు. అతను తన చర్యలకు పశ్చాత్తాపపడ్డాడు, శివుని దర్శనం గురించి తన భార్యకు తెలియజేసిన తరువాత ఇంటి ఆచారాలను నిర్వహించాడు. ఇతను తన దినచర్య ప్రకారం మరుసటి రోజు తిరువారూర్ వెళ్ళాడు. ఇతను తిరువారూర్‌లోకి ప్రవేశించగానే, ప్రజలందరినీ శివుని రూపంలో చూశాడు. ఆ దృశ్యానికి ఆశ్చర్యపోయి, ఇతను వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇతను లేచి నిలబడగానే, ప్రజలు అప్పుడు అతనికి వారి సాధారణ రూపాల్లో కనిపించారు. నమి నంది అడిగల్ తన జీవితాన్ని శివుడికి, అతని భక్తులకు సేవ చేస్తూ గడిపాడు. మరణానంతరం శివుని నివాసమైన కైలాసం చేరుకున్నాడు.[3][7]

స్మరణ

[మార్చు]
తమిళనాడులోని అనేక శివాలయాలలో నాయనార్ల చిత్రాలు కనిపిస్తాయి.


దారాశురం (సుమారు 1150) లోని ఐరావతేశ్వర ఆలయంలో నమి నంది అడిగల్ నీటితో దీపాలు వెలిగించిన కథను వివరించే ఒక శిల్పం ఉంది.[8] అత్యంత ప్రముఖ నాయనార్లలో ఒకరైన అప్పర్ తిరునావుక్కరసర్ (7వ శతాబ్దం) కూడా నమి నంది అడిగల్ దీపపు అద్భుతాన్ని గుర్తుచేసుకున్నాడు, పద్యంలో అతనిని నంబి నమి అని పిలిచాడు. ఇతను నమి నంది అడిగల్‌ను "స్వచ్ఛమైన బంగారం" అని మరింతగా ప్రశంసించాడు.[3][9]

63 మంది నాయనార్లలో భాగంగా నమి నంది అడిగల్ సామూహిక ఆరాధనను అందుకుంటాడు. అతని విగ్రహాలు, అతని పనుల సంక్షిప్త కథనాలు తమిళనాడు లోని అనేక శివాలయాలలో కనిపిస్తాయి. పండుగలలో వారి చిత్రాలను ఊరేగింపుగా తీసుకువెళతారు. నమి నంది అడిగల్ చేతులు జోడించి (అంజలి ముద్ర) ఉన్నట్లుగా చిత్రీకరించబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  1. Roshen Dalal (2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. p. 281. ISBN 978-0-14-341421-6.
  2. T N Ramachandran. "The Puranam of Naminandi Adikal". Retrieved 12 December 2014.
  3. 3.0 3.1 3.2 3.3 Swami Sivananda (1999). Sixty-three Nayanar Saints (4 ed.). Sivanandanagar: The Divine Life Society.
  4. 4.0 4.1 Vidya Dehejia (1988). Slaves of the Lord: The Path of the Tamil Saints. Munshiram Manoharlal. pp. 27, 112. ISBN 978-81-215-0044-9.
  5. 5.0 5.1 "Sri Achaleswarar (Vandarkuzhali) temple". Dinamalar. Retrieved 12 December 2014.
  6. Siva's Warriors: The Basava Purana of Palkuriki Somanatha. Princeton University Press. July 2014. pp. 204–5. ISBN 978-1-4008-6090-6.
  7. Rajeshwari Ghose (1996). The Tyāgarāja Cult in Tamilnāḍu: A Study in Conflict and Accommodation. Motilal Banarsidass. p. 207. ISBN 978-81-208-1391-5.
  8. Vidya Dehejia (13 August 2013). Art of the Imperial Cholas. Columbia University Press. p. 108. ISBN 978-0-231-51524-5.
  9. Swami Parmeshwaranand (2004). Encyclopaedia of the Śaivism. Sarup & Sons. pp. 52. ISBN 978-81-7625-427-4.