నరసరావుపేట కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసరావుపేట రాజాగారి కోట ముఖ ద్వారం

నరసరావుపేట రాజాగారికోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలో ఉన్నకోట. రాష్ట్రంలో ఉన్న పురాతన స్వదేశీ సంస్థానాలలో నరసరావుపేట మల్రాజు సంస్థానం ఒకటి. 2015 నాటికి 300 సం.ల. క్రితం నుండే మల్రాజు వంశీయులు వినుకొండను ప్రధాన రాజధానిగా, బెల్లంకొండను ఉప రాజధానిగా చేసుకుని వినుకొండ, నరసరావుపేట, బెల్లంకొండ ఈ మూడు ప్రాంతాలను పరిపాలించారు.[1] ఆ సమయంలో వినుకొండ నుంచి పరిపాలన సాగించడం కష్టంగా మారడంతో పరిపాలన సౌలభ్యం కోసం రాజా మల్రాజు వెంకట గుండారావు 1797లో కోట, పేటలు నిర్మించి, కోటకు రాజావారికోట అని, పేటకు అతని తండ్రి మల్రాజు నరసరాయని పేరుపై నరసింహారావుపేట అని నామకరణం చేశాడు.[1] ఇది సత్తెనపల్లి వెళ్లు రోడ్డులో ఎడమ వైపు ఉండేది.ఇది ఆ కాలంలో మట్టితో నిర్మించబడింది.

నరసరావుపేటలో కోట శంకుస్థాపన, నిర్మాణ శైలి[మార్చు]

పురాతన కోటలు గానీ, వాటి శిథిలాలను గాని సందర్శించినప్పుడు వందల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఎలా నిలచి ఉంటాయో అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. సా.శ.1797 పింగళి నామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి, శుక్రవారం నాడు కోటకు శంకుస్థాపన జరిగింది. కోట విస్తీర్నం ఎ.11.13 సెంట్లు. ఆ విస్తీర్నంలో చతురస్రాకారంగా దుర్గం (కోట) నిర్మాణాన్ని ప్రారంభించారు. కోట నాలుగు ప్రహరీ గోడలు 15 అడుగుల వెడల్పులోతున పునాదులు త్రవ్వి అడుగు భాగం నుండి గండ శిలలతో, పుట్లకొలది నానవేసిన చింతగింజల్ని తడిపిన పాటిమట్టితో కలిపి ఏనుగులతో తొక్కించి పునాదులు పూడ్చుకుంటూ 20 అడుగుల ఎత్తుతో పై భాగానికి వచ్చేసరికి 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు నిర్మించారు.ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిలచి ఉన్న ఒకటో రెండో గోడల్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

కోటకు తూర్పు దిశగా సత్తెనపల్లి రోడ్డువైపు 24 అడుగుల ఎత్తు,16 అడుగుల వెడల్పు గల సింహద్వారాన్ని నిర్మించారు.కోట నిర్మాణం పూర్తి కాగానే పరిసర గ్రామాల్లోని అనేక చేతివృత్తులవారు కోట సమీపంలో మెరుగైన జీవనోపాధి కొరకు సమీపంలో స్థిరపడ్డారు.జమీందారు మల్రాజు వెంకట గుండా రాయణిం వారందరికీ ఉచితంగా నివాస స్థలాలు ఏర్పాటుగావించారు.కోట గోడలపై  మొత్తం 5 బురుజులుండేవి. సాయుధులైన సైనికులు నిరంతరం పహరా కాస్తుండేవారు. కోట ఉత్తర ప్రహరీ వెలుపల ఏనుగులు ఉండేవి.కోటకు సమీపంలోని ఇప్పటికీ  ఏనుగుల బజారు అనే పేరుగల వీధి ఉంది. అప్పట్లో కాలగతిలో కొన్ని ఏనుగులు మరణించినా, కొత్తగా జీవం పోసుకునే గున్నలతో కలిపి ఎప్పుడూ సంస్థానంలో 99 ఏనుగులే ఉండేవని అంటారు.

నాటి అట్లూరు, నేటి నరసరావుపేట[మార్చు]

నరసరావుపేటకు మూలమైన గ్రామం తొలుత అట్లూరు.అట్లూరులో మల్రాజు వంశీయులు కోట,పేటలు నిర్మించి, అట్లూరును నరసింహారావుపేటగా, కోటను రాజావారి కోటగా నామకరణం చేసారు.ఆ తరువాత ప్రజల వాడుకలో నాటి నరసింహారావుపేట కాల క్రమేణా నరసరావుపేటగా మారింది.[2] రాజావారికోట, రాజాగారి కోటగా మారింది.నరసరావుపేటలో దుర్గం, రాజసౌధం,అంతపురం నిర్మాణాలను పూర్తి చేసి వినుకొండ, బెల్లంకొండ, నరసరావుపేట ప్రాంతాలను నరసరావుపేట కేంద్రంగా చేసుకుని పరిపాలించారు.

కోట ఆనవాళ్లు[మార్చు]

కోట చారిత్రక ఛాయాచిత్రం ( శిథిల కట్టడం ఇప్పుడు లేదు)

నరసరావుపేట రాజాగారి కోట శిథిలాలు 1919 నాటికి సుమారు 30 సంవత్సరంల క్రిందట మౌన సాక్షులుగా ఉండేవి.ఆ ఆనవాళ్లు ఇప్పుడు ఒకటి, రెండు తప్పితే లేవు.జమీందారు వారసులు 1919 నాటికి సుమారు 50 సం.ల. క్రిందట ఈ కోటను వదలి చెన్నై వెళ్ళిపోయారు.దానితో కోటలోని భవనాలు శిథిలావస్థకు చేరువయ్యాయి. ఆ తరువాత కోట ప్రాంతాన్ని జమీందారీ వారసులు దఫాలవారీ ఇతరులకు విక్రయాలు జరిపారు.కొంత భాగం ఆక్రమణలకు గురి అవుతూ వచ్చింది.కాల క్రమేణా కోట ప్రదేశంలో కొత్త కట్టడాలు నిర్మాణం ప్రభావానికి లోనై కోటకు గుర్తుగా మిగిలిన శిథిల భవనాలు రూపుమాపి, ఆ ప్రాంతంలో అనేక ఆసుపత్రుల, వాణిజ్య గదుల నిర్మాణాలకు అనుమతించట జరిగింది.పట్టణంలోని వస్త్ర వ్యాపారులందరినీ ఒకే చోట చేర్చే ఉద్దేశంతో కోట ఆగ్నేయ భాగంలో 114 షాపులతో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కోట ప్రాంతంలోనే నిర్మించబడింది.

పెద్ద చెరువు[మార్చు]

పల్నాడు రొడ్డులో సత్యనారాయణ టాకీసు అనే సినిమాహాలు ఉండేది.ప్రస్తుతం ఆ స్థలంలో పువ్వాడ హాస్పటల్ నిర్మిచబడింది. దీని ప్రక్కనే 105 ఎకరాల విస్తీర్నంలో పెద్ద చెరువునొకదానిని సంస్థానంలోని ఏనుగులు ఈదులాడేందుకు రాజా గుండారావు నిర్మించాడు. రాజా మల్రాజు వెంకట నరసింహారావు నరసరావుపేట పురపాలక సంగం చైర్మెనుగా పనిచేసినకాలంలో పట్టణంలో త్రీవనీటి ఎద్దడి ఏర్పడగా, ఆ చెరువును పురపాలక సంఘానికి దానమిచ్చాడు.[3] ఆ తర్వాత కొంతకాలానికి ఆ చెరువులో నీరులేక చెరువు ఎండిపోవుటవలన దానిలో కళాశాలలు,కాలనీలు,కర్మాగారాలు,హాస్టళ్లు వగైరాలు నిర్మించబడ్డాయి.ఆ చెరువు రెడ్డినగర్ వరకు విస్తరించ ఉండేదని తెలుస్తుంది.

అద్దాలమేడ[మార్చు]

కోటలోని అద్దాల మేడ మరో విశేషం. కోటకు వాయవ్య దిశగా నిర్మించిన అయిదంతస్థుల రాజ భవనం గోడలు ఇటుకలతో నిర్మించి,అప్పటి కొత్త ప్రక్రియ ద్వారా తెల్లని పలుగురాళ్లను పొడిచేసి, అందులో మెత్తని ఇసుక, కోడిగుడ్లలోని తెల్లసొనను సమపాళ్లలో కలిపి,జిగురు వచ్చి తెల్లని పాలగచ్చుగా మారేవరకు గానుగవేసి, దీనిని గోడలకు మందంగా పట్టించి, నునుపు కోసం గుండ్రాళ్లతో రుద్దించారని తెలుస్తుంది.దానితో రాజభవనం గోడలు అద్దాలవలె తళతళ లాడుతుండటం వలన రాజభవనంలో ప్రవేశించిన సందర్శకులు తమ ప్రతిబింబాలను గోడల్లో చూసుకోవటం వలన ఈ భవనాన్ని అద్దాల మేడగా వ్యవహరించేవారని తెలుస్తుంది.

కోటప్పకొండ ధర్మకర్తలుగా మల్రాజు వంశస్థులు[మార్చు]

నరసరావుపేటకు సమీపంలోని శైవక్షేత్రమైన కోటప్పకొండ ఆలయ ధర్మకర్తలుగా ఇప్పటికీ మల్రాజు వంశంస్తులే కొనసాగుతున్నారు.[2] కొండపైకి సోపాన మార్గాన్ని నిర్మించారు.[4] ఆలయానికి 130 ఎకరాలు, అర్చకులకు 147 ఎకరాలు, పడితరానికి 57 ఎకరాల భూమిని మల్రాజు వంశీయులు ఈ విధంగా వందల ఎకరాలు విరాళంగా ఇచ్చారు.[1]

పురపాలక సంఘ చైర్మన్‌గా మల్రాజు వంశీయులు[మార్చు]

నరసరావుపేట పురపాలక సంఘం ఏర్పడిన అనంతరం 1927 నుండి 1965 వరకుగల మధ్యకాలంలో చైర్మెన్లుగా మల్రాజు వంశస్థులు సుమారు 13 ఏళ్లపాటు పనిచేశారు.[1]

వేంకట నరసింహారావు పని చేసిన కాలం[మార్చు]

 • 31.01.1927 నుండి 30.10.1929 వరకు
 • 11.11.1931 నుండి 31.08.1932 వరకు
 • 06.12.1932 నుండి 05.03.1935 వరకు

వేంకట రామకృష్ణకొండలరావు పని చేసిన కాలం[మార్చు]

 • 30.03.1935 నుండి 30.07.1937 వరకు
 • 28.09.1937 నుండి 03.03.1938 వరకు
 • 28.10.1959 నుండి 30.11.1959 వరకు
 • 31.12.1960 నుండి 31.10.1963 వరకు
 • 30.05.1964 నుండి 22.04.1965 వరకు.

మల్రాజు వంశీయులు పరిపాలన కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తిగావించబడ్డాయి.అందులో  వైద్యశాల నిర్మాణం, విద్యాభివృద్ధికి తొమ్మిది ఎలిమెంటరీ పాఠశాలలను మునిసిపల్‌ పాలన కిందకు తీసుకురావటం, ఉన్నత పాఠశాలలో ఆడియో విజువల్‌ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టడం, మునిసిపల్‌ హైస్కూల్‌ను హయ్యర్‌ సెకండరీ స్కూల్‌గా మార్పుచేయుట, మునిసిపల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయుట, తాగునీటి ఎద్దడి నివారణకు బావులు అభివృద్ధి పరుచుట,ఇలా పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రత్యేక గుర్తింపు పొంది, ప్రజల మన్ననలు అందుకున్నారు.[1] మల్రాజు వేంకట నరసింహారావు చైర్మెన్ గా పనిచేసిన కాలంలో పెద్దచెరువుగా పిలువబడుతున్న స్ధలాన్ని దానంగా ఇచ్చాడు.[3] మల్రాజు రామకృష్ణ కొండలరావును పదవీకాలంలో నరసరావుపేట రెండో గ్రేడు మునిసిపాలిటీగా ఎదిగింది.[1]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "నవరసాల తోట నరసరావుపేట". www.andhrajyothy.com. 2015-12-12. Retrieved 2019-09-19.
 2. 2.0 2.1 "నాటి నరసింహారావుపేటే నేటి నరసరావుపేట". www.andhrajyothy.com. 2015-12-04. Retrieved 2019-09-19.
 3. 3.0 3.1 "నరసరావుపేట పురపాలక సంఘానికి వందేళ్లు | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2019-10-08.
 4. Eenadu. "మహిమాన్విత క్షేత్రం.. కోటప్పకొండ - Guntur - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-08-12. Retrieved 2019-09-25.

వెలుపలి లంకెలు[మార్చు]

గమనిక:ఈ వ్యాసం కేవలం కోట నిర్మాణ విశేషాలను వివరించడానికే ఉద్దేశించింది. కాబట్టి రాజా వారి వంశ చరిత్రను ఇక్కడ ప్రస్తావించడం లేదు.